హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల్లో భాగంగా చిన్న రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ కార్యక్రమాల్లో ఒకటైన ‘పరివర్తన్’ ద్వారా ఈ సాయం అందించనున్నట్లు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (డీఎండీ) కైజాద్ ఎం బారుచా తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్యాంకు గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. స్థిరమైన వృద్ధిని పెంపొందించడంతోపాటు అల్పాదాయ వర్గాలకు అండగా నిలుస్తోంది. 2014లో ప్రారంభమైన ‘పరివర్తన్’ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద సీఎస్‌ఆర్ ప్రోగ్రామ్‌ల్లో ఒకటి. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ద్వారా సేవలందిస్తున్నాం. గత పదేళ్ల కాలంలో రూ.5000 కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో ఈ నిధులు పెంచుతాం. ఇప్పటికే పరివర్తన్ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా నిలిచాం. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 25,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నాం. స్మార్ట్ తరగతులు, పాఠశాల ఫర్నిచర్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనను నిరోధించడానికి స్వచ్ఛ భారత్ అభియాన్‌కు అనుగుణంగా 25000 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను ఇప్పటికే నిర్మించాం’ అని చెప్పారు.
ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం 2013 తరువాత కంపెనీల చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అందులోని సెక్షన్ 135లో సీఎస్‌ఆర్ నిబంధనను చేర్చింది. దాని ప్రకారం కార్పొరేట్ సంస్థల నికర లాభంలో రెండు శాతం సీఎస్‌ఆర్‌కు కేటాయించాలి. ఆర్థిక సర్వేలోని వివరాల ప్రకారం గడిచిన ఎనిమిదేళ్లలో అన్ని దేశీయ కార్పొరేట్ కంపెనీలు సీఎస్‌ఆర్ కింద దాదాపు రూ.1.53 లక్షల కోట్లు ఖర్చు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment