csr policy
-
ఐదు లక్షల మంది రైతులకు సాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా చిన్న రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో ఒకటైన ‘పరివర్తన్’ ద్వారా ఈ సాయం అందించనున్నట్లు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (డీఎండీ) కైజాద్ ఎం బారుచా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్యాంకు గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. స్థిరమైన వృద్ధిని పెంపొందించడంతోపాటు అల్పాదాయ వర్గాలకు అండగా నిలుస్తోంది. 2014లో ప్రారంభమైన ‘పరివర్తన్’ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద సీఎస్ఆర్ ప్రోగ్రామ్‌ల్లో ఒకటి. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ద్వారా సేవలందిస్తున్నాం. గత పదేళ్ల కాలంలో రూ.5000 కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో ఈ నిధులు పెంచుతాం. ఇప్పటికే పరివర్తన్ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా నిలిచాం. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 25,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. స్మార్ట్ తరగతులు, పాఠశాల ఫర్నిచర్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనను నిరోధించడానికి స్వచ్ఛ భారత్ అభియాన్‌కు అనుగుణంగా 25000 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను ఇప్పటికే నిర్మించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటుకేంద్ర ప్రభుత్వం 2013 తరువాత కంపెనీల చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అందులోని సెక్షన్ 135లో సీఎస్ఆర్ నిబంధనను చేర్చింది. దాని ప్రకారం కార్పొరేట్ సంస్థల నికర లాభంలో రెండు శాతం సీఎస్ఆర్కు కేటాయించాలి. ఆర్థిక సర్వేలోని వివరాల ప్రకారం గడిచిన ఎనిమిదేళ్లలో అన్ని దేశీయ కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ కింద దాదాపు రూ.1.53 లక్షల కోట్లు ఖర్చు చేశాయి. -
సీఎస్ఆర్ విషయంలో కంపెనీలకు స్వేచ్ఛ!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమం విషయంలో కంపెనీలకు మరింత వెసులుబాటు కల్పిస్తూ కంపెనీల చట్టంలోని నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. సీఎస్ఆర్ కింద ఒకటికి మించి ఎక్కువ సంవత్సరాల పాటు పట్టే ప్రాజెక్టులను చేపట్టేందుకు అనుమతించింది. అదే విధంగా నిబంధనలకు మించి చేసిన అదనపు ఖర్చును తదుపరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో చూపించుకుని సర్దుబాటు చేసుకునే అవకాశం ఇచ్చింది. అదే విధంగా సీఎస్ఆర్ కింద లబ్ధిదారులు లేదా ప్రభుత్వం పేరిట మూలధన ఆస్తుల (క్యాపిటల్) కొనుగోలుకూ అనుమతించింది. కంపెనీల తరఫున సీఎస్ఆర్ కార్యక్రమాల అమలును చూసే ఏజెన్సీలకు 2021 ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ (నమోదును)ను తప్పనిసరి చేసింది. సీఎస్ఆర్ నిబంధనలను పాటించకపోవడాన్ని నేరపూరితం కాని చర్యగా మారుస్తూ.. దీని స్థానంలో పెనాల్టీని ప్రవేశపెట్టింది. ఒకవేళ సీఎస్ఆర్ కింద ఒక కంపెనీ చేయాల్సిన ఖర్చు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50లక్షల్లోపు ఉన్నట్టయితే సీఎస్ఆర్ కమిటీ ఏర్పాటు నుంచి మినహాయింపునిచ్చింది. వ్యాపార సులభ నిర్వహణ విషయంలో భారత్ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు.. నిబంధనలను పాటించకపోవడాన్ని నేరంగా చూడకపోవడం, సీఎస్ఆర్ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యాలతో తాజా సవరణలు చేపట్టినట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీల చట్టం 2013 కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖా సీఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లాభదాయక కంపెనీలు గడిచిన మూడేళ్ల కాల సగటు లాభంలో కనీసం 2% సీఎస్ఆర్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సంస్థలకు అనుమతి.. సీఎస్ఆర్ కార్యక్రమాలు లేదా ప్రాజెక్టుల రూపకల్పన, పర్యవేక్షణ, విశ్లేషణ పనులను చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతించడం కూడా కేంద్రం తీసుకువచ్చిన మార్పుల్లో భాగంగా ఉంది. కాకపోతే సీఎస్ఆర్ కార్యక్రమాలు లేదా ప్రాజెక్టుల అమలు బాధ్యతలను చూడ్డానికి వీల్లేదని స్పష్టం చేసింది. విదేశీ సంస్థలను అనుమతించడం వల్ల సీఎస్ఆర్ విభాగంలో అంతర్జాతీయంగా అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాలు, విధానాలను తీసుకొచ్చేందుకు వీలు పడుతుందని కార్పొరేట్ శాఖా తెలిపింది. 2014 ఏప్రిల్ 1 నుంచి సీఎస్ఆర్ నిబంధనలు అమల్లోకి రాగా.. 2014–15లో రూ.10,066 కోట్లను కంపెనీలు ఖర్చు చేశాయి. ఇది 2018–19లో రూ.18,655 కోట్లకు విస్తరించింది. ఐదేళ్లలో రూ.79,000 కోట్లను కంపెనీలు వెచ్చించాయి. -
స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి..
పాల్వంచ, న్యూస్‌లైన్: కాలుష్య ప్రభావిత గ్రామాల్లోని యువకులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పంచాలని, సీఎస్ఆర్ పాలసీని అమలుచేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక యువకులు ఆదివారం నవభారత్ వెంచర్స్, ఎనర్జీ ఇండి యా సంస్థ కార్యాలయం ఎదుట రిలే నిరాహా ర దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎండి.అక్బర్, రాంబాబులు మా ట్లాడుతూ నవభారత్ సంస్థ నుంచి వెలువడే కాలుష్యం వల్ల సమీపంలోని పాత పాల్వంచ, సంజయ్ నగర్, గాంధీనగర్, కేసీఆర్‌నగర్, రాజీవ్‌నగర్, సాయినగర్, శేఖరంబంజర, పాలకోయ తండా తదితర గ్రామాల ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారని అన్నారు. యాజ మాన్యం సీఎస్ఆర్ పాలసీని అమలు చేసి ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానికం గా ఉన్న నిరుద్యోగ యువతకు అర్హతను బట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షల్లో ఆనంద్, సాయి, వీరన్న, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. వారికి బీసీ సంఘం నాయకులు రేగళ్ల శ్రీను, టీఎన్టీయుసీ నాయకులు గొర్రె వేణుగోపాల్, ఎల్‌హెచ్‌సీఎస్ నాయకులు మాలోతు కోటి, కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు ఈ దీక్షలకు సంఘీభావం తెలిపారు.