Wipros Azim Premji
-
కోవిడ్-19లోనూ.. మన కుబేరులు భళా
ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తున్నప్పటికీ దేశీయంగా బిలియనీర్ల సంపద పెరుగుతూ వచ్చింది. 2020లో ఏడుగురు కుబేరుల సంపదకు 60 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి వీరి మొత్తం సంపద దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరింది. జనవరి 1 మొదలు డిసెంబర్ 11కల్లా దేశీయంగా 7గురు కుబేరుల సంపద మొత్తం 194.4 బిలియన్ డాలర్లను తాకినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం...(మార్క్ జుకర్‌బర్గ్ సమీపానికి ముకేశ్ అంబానీ) యమస్పీడ్.. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఈ ఏడాది దేశీ కుబేరుల సంపద 50 శాతం బలపడింది. తొలితరం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 21.1 బిలియన్ డాలర్లు పెరిగింది. వెరసి 32.4 బిలియన్ డాలర్లను తాకింది. ఇక 2020లో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం 18.1 బిలియన్ డాలర్ల వృద్ధితో 76.7 బిలియన్ డాలర్లయ్యింది. వ్యాక్సిన్ల కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైరస్ పూనావాలా సంపదకు 6.91 బిలియన్ డాలర్లు జమకావడంతో 15.6 బిలియన్ డాలర్లకు వ్యక్తిగత సంపద ఎగసింది. ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివనాడార్, విప్రో అధినేత ప్రేమ్‌జీ సంపద సంయుక్తంగా 12 బిలియన్ డాలర్లమేర పెరిగింది. దీంతో శివనాడార్ సంపద 22 బిలియన్ డాలర్లను తాకగా.. ప్రేమ్‌జీ వెల్త్ 23.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ బాటలో డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద సైతం 4.71 బిలియన్ డాలర్లు బలపడి 14.4 బిలియన్ డాలర్లయ్యింది. ఇదేవిధంగా హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ సంపద 2.23 బిలియన్ డాలర్లు పుంజుకుని 9.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. షేర్ల ర్యాలీ దేశీ పారిశ్రామిక దిగ్గజాల వ్యక్తిగత సంపద పుంజుకోవడానికి ఆయా కంపెనీ షేర్లు ర్యాలీ బాటలో సాగడం దోహదపడింది. గ్రూప్ కంపెనీలు అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పోర్ట్స్ 120-27 శాతం మధ్య దూసుకెళ్లడంతో గౌతమ్ అదానీకి కలసి వచ్చింది. అయితే అదానీ పవర్ 28 శాతం క్షీణించడం గమనార్హం. ప్రధానంగా ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 33 శాతం ఎగసి 13.56 లక్షల కోట్లను తాకడంతో ముకేశ్ సంపద జోరందుకుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు 52 శాతం, విప్రో 44 శాతం పురోగమించడంతో శివనాడార్, అజీమ్ ప్రేమ్‌జీ సంపదలు వృద్ధి చెందాయి. ఇదేవిధంగా సన్ ఫార్మా షేరు 31 శాతం లాభపడటంతో దిలీప్ సంఘ్వీ సంపద పుంజుకుంది. ఇదే సమయంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 12 శాతమే లాభపడటం ప్రస్తావించదగ్గ అంశం! -
డెలాపోర్ట్ లీడర్షిప్- విప్రో గెలాప్
బెంగళూరు, సాక్షి: కంపెనీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన డెలాపోర్ట్ ఐదు నెలల్లోనే సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రోను 100 మీటర్ల విభాగం (స్ప్రింట్)లో చేర్చారు. వెరసి ఐటీ బ్లూచిప్ కంపెనీ విప్రో అత్యంత వేగంగా పరుగు తీస్తోంది. నిజానికి డెలాపోర్ట్‌కు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ అంటే మక్కువకావడం ప్రస్తావించదగ్గ అంశం! ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ ఎస్ఈ నుంచి విప్రోకు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన 53ఏళ్ల థియరీ డెలాపోర్ట్ కేవలం ఐదు నెలల్లోనే కంపెనీని టర్న్అరౌండ్ బాటపట్టించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో విప్రో షేరు సైతం ఏకంగా 70 శాతం ర్యాలీ చేయడం విశేషం! వెరసి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఇతర నాలుగు ఐటీ దిగ్గజాల షేర్లకంటే అత్యధికంగా లాభపడింది! ఇతర వివరాలు చూద్దాం.. నాయకులను తగ్గిస్తూ కోవిడ్-19 నేపథ్యంలో విప్రో సీఈవోగా డెలాపోర్ట్ ప్యారిస్నుంచే కార్యకలాపాలను చక్కబెడుతున్నారు. వర్చువల్ సమావేశాల ద్వారా కస్టమర్లతోపాటు మేనేజర్లు, సిబ్బందితో చర్చలు నిర్వహిస్తూ వస్తున్నారు. విప్రోలో లీడర్షిప్ పొజిషన్ల సంఖ్యను 25 నుంచి 4కు తగ్గించారు. ఇతర కంపెనీల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. క్లయింట్లతో 130కుపైగా సమావేశాల ద్వారా యూరోప్, యూఎస్ నుంచి మల్టీఇయర్ కాంట్రాక్టులను సాధించారు. కాగా.. ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం కీలక పరిస్థితులు నెలకొన్నాయని ఒక ఇంటర్వ్యూలో డెలాపోర్ట్ ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విప్రోకు పట్టున్న విభాగాలలో వేగంగా వృద్ధి సాధించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదీ తీరు అజీం ప్రేమ్‌జీ ఐటీ దిగ్గజం విప్రో.. కొన్నేళ్లుగా సాఫ్ట్వేర్ సేవల రంగంలో ఇతర దేశీ బ్లూచిప్ కంపెనీలతో వెనుకబడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది(2019-20)లో స్థిరకరెన్సీ ప్రాతిపదికన ఆదాయం 3.9 శాతమే వృద్ధి చూపింది. ఇదేకాలంలో ఇన్ఫోసిస్ 9.8 శాతం, టీసీఎస్ 7.1 శాతం చొప్పున ఆదాయాన్ని పెంచుకున్నాయి. రెండేళ్ల క్రితం మూడో పెద్ద కంపెనీగా విప్రోను వెనక్కినెట్టిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సైతం గతేడాది 17 శాతం ప్రగతిని కనబరిచింది. నీముచ్వాలా నుంచి 2016లో విప్రో పగ్గాలు అందుకున్న అబిదలీ నీముచ్వాలా సైతం విప్రోను ఉన్నపళాన పట్టాలెక్కించే ప్రయత్నాలు చేశారు. అయితే నాలుగేళ్లపాటు ఆశించిన స్థాయిలో కంపెనీ పురోగతిని సాధించలేకపోయింది. 2020కల్లా విప్రోను 15 బిలియన్ డాలర్ల దిగ్గజంగా నిలిపే ప్రయత్నం ఫలించలేదు. మార్చితో ముగిసిన గతేడాదిలో విప్రో 8.1 బిలియన్ డాలర్లకు మాత్రమే చేరగలిగింది. ఈ నేపథ్యంలో నీముచ్వాలా నుంచి సీఈవో బాధ్యతలను డెలాపోర్ట్ స్వీకరించారు. విప్రోకు యూఎస్ అతిపెద్ద మార్కెట్‌కాగా.. యూరోప్, ఆసియా మార్కెట్లపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందుకు అనుగుణంగా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ అధ్యక్షతన కొత్త డీల్స్ కోసం టీమ్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా యూరోపియన్ పర్యావరణహిత ఇంధన రంగ కంపెనీల నుంచి ఇటీవల భారీ డీల్స్ సాధించగలిగారు. -
విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్ 1,125 కోట్లు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏర్పడిన ముప్పును అధిగమించేందుకు విప్రో కంపెనీ, విప్రో ఎంటర్ప్రైజెస్, ఆ సంస్థల ప్రమోటర్‌కు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సంయుక్తంగా రూ.1,125 కోట్లను ఖర్చు చేసేందుకు సంసిద్ధత ప్రకటించాయి. ఇందులో విప్రో కంపెనీ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్ప్రైజెస్ రూ.25 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1,000 కోట్లను ఖర్చు పెట్టనున్నాయి. విప్రో వార్షికంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద చేసే ఖర్చుకు అదనంగా ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. భారతీ ఎంటర్ప్రైజెస్ రూ.100 కోట్లు కరోనాపై పోరులో భారతీ ఎంటర్ప్రైజెస్ కూడా చేరిపోయింది. రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ప్రభుత్వరంగ పవర్‌గ్రిడ్ సంస్థ కూడా పీఎం కేర్స్‌కు తొలి విడతగా రూ.130 కోట్లను అందించింది. మరో రూ.70 కోట్లను 2020–21లో ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, ఇఫ్కో రూ.25 కోట్లు, క్రిబ్కో రూ.2 కోట్లు, ఎన్ఎఫ్ఎల్–కిసాన్ రూ.64 లక్షలు, కల్యాణి గ్రూపు రూ.25 కోట్లను పీఎంకేర్స్‌కు ప్రకటించాయి. ఎల్ఐసీ రూ.105 కోట్లు.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరోనాపై యుద్ధంలో పాలుపంచుకుంటోంది. పీఎం–కేర్స్ ఫండ్‌కు రూ.105 కోట్ల విరాళం ఇచ్చినట్టు ప్రకటించింది. మొత్తం విరాళంలో రూ.5 కోట్లు గోల్డెన్ జూబ్లీ ఫండ్ నుంచి సమకూర్చినట్టు ఎల్ఐసీ చైర్మన్ ఎం.ఆర్.కుమార్ తెలిపారు. ఎస్బీఐ రూ.100 కోట్లు.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సైతం రూ.100 కోట్లను పీఎంకేర్స్‌కు ప్రకటించింది. ఎల్జీ ఉచిత భోజన ఏర్పాట్లు.. లాక్డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలు, వలస కార్మికుల సహాయార్థం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ ఎల్జీ దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి భోజన ఏర్పాట్లను అందిస్తుంది. ఈ మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపిక చేసిన 50 రాష్ట్రాల్లోని ఆయా ఆసుపత్రుల్లో ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో వాటర్ ప్యూరిఫయర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లను అందించనున్నట్లు ఎల్జీ ఇండియా ఎండీ యంగ్ లాక్ కిమ్ తెలిపారు. పుణేలో మెర్సిడెజ్ బెంజ్ కోవిడ్ ఆసుపత్రి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ పుణేలో తాత్కాలిక కరోనా ఆసుపత్రిని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. చకాన్ ఖేడ్‌లోని మహలుంగే–ఇంగాలే గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఈ హాస్పటల్లో 1,500 మంది కరోనా రోగులకు చికిత్స అందించవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. రామ్‌కో ఐసోలేషన్ సెంటర్లు రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్ తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు, వలస కూలీలకు మాస్క్‌లు, బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందిస్తున్నట్లు తెలిపింది. తమిళనాడు, ఒడిశాలోని రామ్‌కో ప్లాంట్ వద్ద ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి కార్మికులకు, స్థానిక గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తుంది. రూ.3 కోట్ల వ్యయంతో వైద్య పరికరాలు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఓలెక్ట్రా రూ.17 లక్షలు.. కరోన కట్టడిలో భాగంగా ప్రభుత్వానికి సాయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ నడుం బిగించింది. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.17.26 లక్షల మొత్తాన్ని విరాళంగా అందించింది. ఇందులో ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.7.26 లక్షలు, కంపెనీ రూ.10 లక్షలు సమకూర్చిందని ఓలెక్ట్రా ఈడీ ఎన్.నాగసత్యం తెలిపారు. -
టెక్ కుబేరుల్లో మనోళ్లు ముగ్గురు
సింగపూర్: ఆసియా అగ్రశ్రేణి పది టెక్నాలజీ కుబేరుల్లో ముగ్గురు భారతీయులకు స్థానం దక్కింది. పరిశ్రమ వర్గాలు, ఇటీవల మార్కెట్ డేటా ప్రకారం... విప్రో అజిమ్ ప్రేమ్‌జీ 1,600 కోట్ల డాలర్ల సంపదతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. సింగపూర్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సింగపూర్ ఇన్నోవేషన్ లీగ్ అధినేత నీరజ్ గోయల్ 1,295 కోట్ల డాలర్ల సంపదతో ఆరో స్థానంలో ఉన్నారు. 45 ఏళ్ల వయసున్న నీరజ్ ఈ జాబితాలోని అత్యంత పిన్నవయస్కుడు. 2000 సంవత్సరాల నుంచి ఈయన సింగపూర్‌లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు చెందిన శివ్ నాడార్ 1,170 కోట్ల డాలర్లతో ఏడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలోని ముగ్గురు భారతీయుల మొత్తం సంపద 4,065 కోట్ల డాలర్లుగా ఉంది.