బెంగళూరు, సాక్షి: కంపెనీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన డెలాపోర్ట్ ఐదు నెలల్లోనే సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రోను 100 మీటర్ల విభాగం (స్ప్రింట్)లో చేర్చారు. వెరసి ఐటీ బ్లూచిప్ కంపెనీ విప్రో అత్యంత వేగంగా పరుగు తీస్తోంది. నిజానికి డెలాపోర్ట్‌కు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ అంటే మక్కువకావడం ప్రస్తావించదగ్గ అంశం! ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ ఎస్‌ఈ నుంచి విప్రోకు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన 53ఏళ్ల థియరీ డెలాపోర్ట్ కేవలం ఐదు నెలల్లోనే కంపెనీని టర్న్‌అరౌండ్ బాటపట్టించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో విప్రో షేరు సైతం ఏకంగా 70 శాతం ర్యాలీ చేయడం విశేషం! వెరసి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఇతర నాలుగు ఐటీ దిగ్గజాల షేర్లకంటే అత్యధికంగా లాభపడింది! ఇతర వివరాలు చూద్దాం..
నాయకులను తగ్గిస్తూ
కోవిడ్-19 నేపథ్యంలో విప్రో సీఈవోగా డెలాపోర్ట్ ప్యారిస్‌నుంచే కార్యకలాపాలను చక్కబెడుతున్నారు. వర్చువల్ సమావేశాల ద్వారా కస్టమర్లతోపాటు మేనేజర్లు, సిబ్బందితో చర్చలు నిర్వహిస్తూ వస్తున్నారు. విప్రోలో లీడర్‌షిప్ పొజిషన్ల సంఖ్యను 25 నుంచి 4కు తగ్గించారు. ఇతర కంపెనీల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. క్లయింట్లతో 130కుపైగా సమావేశాల ద్వారా యూరోప్, యూఎస్ నుంచి మల్టీఇయర్ కాంట్రాక్టులను సాధించారు. కాగా.. ఐటీ పరిశ్రమలో ప్రస్తుతం కీలక పరిస్థితులు నెలకొన్నాయని ఒక ఇంటర్వ్యూలో డెలాపోర్ట్ ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విప్రోకు పట్టున్న విభాగాలలో వేగంగా వృద్ధి సాధించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ తీరు
అజీం ప్రేమ్‌జీ ఐటీ దిగ్గజం విప్రో.. కొన్నేళ్లుగా సాఫ్ట్‌వేర్ సేవల రంగంలో ఇతర దేశీ బ్లూచిప్ కంపెనీలతో వెనుకబడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది(2019-20)లో స్థిరకరెన్సీ ప్రాతిపదికన ఆదాయం 3.9 శాతమే వృద్ధి చూపింది. ఇదేకాలంలో ఇన్ఫోసిస్ 9.8 శాతం, టీసీఎస్ 7.1 శాతం చొప్పున ఆదాయాన్ని పెంచుకున్నాయి. రెండేళ్ల క్రితం మూడో పెద్ద కంపెనీగా విప్రోను వెనక్కినెట్టిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సైతం గతేడాది 17 శాతం ప్రగతిని కనబరిచింది.
నీముచ్‌వాలా నుంచి
2016లో విప్రో పగ్గాలు అందుకున్న అబిదలీ నీముచ్‌వాలా సైతం విప్రోను ఉన్నపళాన పట్టాలెక్కించే ప్రయత్నాలు చేశారు. అయితే నాలుగేళ్లపాటు ఆశించిన స్థాయిలో కంపెనీ పురోగతిని సాధించలేకపోయింది. 2020కల్లా విప్రోను 15 బిలియన్ డాలర్ల దిగ్గజంగా నిలిపే ప్రయత్నం ఫలించలేదు. మార్చితో ముగిసిన గతేడాదిలో విప్రో 8.1 బిలియన్ డాలర్లకు మాత్రమే చేరగలిగింది. ఈ నేపథ్యంలో నీముచ్‌వాలా నుంచి సీఈవో బాధ్యతలను డెలాపోర్ట్ స్వీకరించారు. విప్రోకు యూఎస్ అతిపెద్ద మార్కెట్‌కాగా.. యూరోప్, ఆసియా మార్కెట్లపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందుకు అనుగుణంగా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ అధ్యక్షతన కొత్త డీల్స్ కోసం టీమ్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా యూరోపియన్ పర్యావరణహిత ఇంధన రంగ కంపెనీల నుంచి ఇటీవల భారీ డీల్స్ సాధించగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment