ముంబై, సాక్షి: ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తున్నప్పటికీ దేశీయంగా బిలియనీర్ల సంపద పెరుగుతూ వచ్చింది. 2020లో ఏడుగురు కుబేరుల సంపదకు 60 బిలియన్ డాలర్లు జమయ్యింది. వెరసి వీరి మొత్తం సంపద దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరింది. జనవరి 1 మొదలు డిసెంబర్ 11కల్లా దేశీయంగా 7గురు కుబేరుల సంపద మొత్తం 194.4 బిలియన్ డాలర్లను తాకినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం...(మార్క్ జుకర్‌బర్గ్ సమీపానికి ముకేశ్ అంబానీ)
యమస్పీడ్..
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఈ ఏడాది దేశీ కుబేరుల సంపద 50 శాతం బలపడింది. తొలితరం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 21.1 బిలియన్ డాలర్లు పెరిగింది. వెరసి 32.4 బిలియన్ డాలర్లను తాకింది. ఇక 2020లో ఆర్‌ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం 18.1 బిలియన్ డాలర్ల వృద్ధితో 76.7 బిలియన్ డాలర్లయ్యింది. వ్యాక్సిన్ల కంపెనీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ సైరస్ పూనావాలా సంపదకు 6.91 బిలియన్ డాలర్లు జమకావడంతో 15.6 బిలియన్ డాలర్లకు వ్యక్తిగత సంపద ఎగసింది. ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివనాడార్, విప్రో అధినేత ప్రేమ్‌జీ సంపద సంయుక్తంగా 12 బిలియన్ డాలర్లమేర పెరిగింది. దీంతో శివనాడార్ సంపద 22 బిలియన్ డాలర్లను తాకగా.. ప్రేమ్‌జీ వెల్త్ 23.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ బాటలో డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద సైతం 4.71 బిలియన్ డాలర్లు బలపడి 14.4 బిలియన్ డాలర్లయ్యింది. ఇదేవిధంగా హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ సంపద 2.23 బిలియన్ డాలర్లు పుంజుకుని 9.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
షేర్ల ర్యాలీ
దేశీ పారిశ్రామిక దిగ్గజాల వ్యక్తిగత సంపద పుంజుకోవడానికి ఆయా కంపెనీ షేర్లు ర్యాలీ బాటలో సాగడం దోహదపడింది. గ్రూప్ కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పోర్ట్స్ 120-27 శాతం మధ్య దూసుకెళ్లడంతో గౌతమ్ అదానీకి కలసి వచ్చింది. అయితే అదానీ పవర్ 28 శాతం క్షీణించడం గమనార్హం. ప్రధానంగా ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ 33 శాతం ఎగసి 13.56 లక్షల కోట్లను తాకడంతో ముకేశ్ సంపద జోరందుకుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు 52 శాతం, విప్రో 44 శాతం పురోగమించడంతో శివనాడార్, అజీమ్ ప్రేమ్‌జీ సంపదలు వృద్ధి చెందాయి. ఇదేవిధంగా సన్ ఫార్మా షేరు 31 శాతం లాభపడటంతో దిలీప్ సంఘ్వీ సంపద పుంజుకుంది. ఇదే సమయంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 12 శాతమే లాభపడటం ప్రస్తావించదగ్గ అంశం!
Comments
Please login to add a commentAdd a comment