ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) చివరి సమీక్షా సమావేశం వచ్చే వారం (8–10వ తేదీల్లో) జరగనుంది. ఈ సందర్భంగా కీలక రేట్లను పావు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేసింది. ‘‘ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ద్రవ్యోల్బణం దాదాపుగా ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోనే ఉంది. దీంతో వృద్ధికి మద్దతుగా ఆర్‌బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగించొచ్చు. రివర్స్ రెపో రేటును 0.20–0.25 శాతం వరకు పెంచొచ్చు’’ అని బార్‌క్లేస్ అంచనా వేసింది.
ప్రస్తుతం ఈ రేటు 3.35%గా ఉంది. ప్రభుత్వం ఊహించని విధంగా రుణ సమీకరణ పరిమాణాన్ని బడ్జెట్‌లో పెంచినందున ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్‌బీఐకి సంకేతం ఇచ్చినట్టేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌లో మూలధన వ్యయాలపై దృష్టి సారించడం ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిస్తుందని.. ద్రవ్యోల్బణం సహా స్థూల ఆర్థిక నేపథ్యాన్ని మార్చదని బార్‌క్లేస్ పేర్కొంది. చమురు ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు పెరగకపోవచ్చని అంచనా వేసింది. ఆర్‌బీఐ అప్రమత్తంగా ఉంటూ, ద్రవ్యోల్బణం అంచనాలను ఎగువవైపు పరిమితి (2–6) వద్ద కొనసాగించొచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment