ముంబై: విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలను మరింత పెంచుకోవడానికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మొగ్గుచూపుతుందని భావిస్తున్నట్లు ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బార్‌క్లేస్ ఇండియా తన తాజా నివేదికలో అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారత్ ఫారెక్స్ 655 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనావేసింది. అంతర్జాతీయంగా ఎటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురయినప్పటికీ తట్టుకుని నిలబడగలిగే అసాధారణ ద్రవ్య విధానానికి, దాని కొనసాగింపునకు మద్దతు నివ్వడానికి ప్రస్తుత పరిస్థితిలో ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడంవైపు ఆర్‌బీఐ దృష్టి సారించే వీలుందని విశ్లేషించింది. ఆగస్టు 6వ తేదీతో ముగిసిన వారంలో భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు జీవితకాల గరిష్టం 621.464 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.45 లక్షల కోట్లు తాకిన సంగతి తెలిసిందే. దాదాపు 16 నెలల దిగుమతులుకు సరిపోతాయి.
రూపాయి మరింత బలహీనత!
డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉందని కూడా బార్‌క్లేస్ అంచనావేయడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇందుకు కొంత సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నట్లు వివరించింది. రూపాయి విలువను మద్దతుగా హెడ్జింగ్ విధానాలకు వినియోగించడానికి ఉద్దేశించిన ‘ఫార్వర్డ్ డాలర్ హోల్డింగ్స్’ బుక్ పరిమాణాన్ని క్రమంగా తగ్గిస్తూ, స్పాట్ డాలర్ల నిల్వలను ఆర్‌బీఐ పెంచుకోడావడాన్ని ఈ సందర్భంగా బార్‌క్లేస్ ఇండియా ప్రస్తావించింది. బార్‌క్లేస్ వెలువరించిన గణాంకాల ప్రకారం ఆర్‌బీఐ ‘ఫార్వర్డ్ డాలర్ హోల్డింగ్స్’ బుక్ పరిమాణం 2021 మార్చి నాటికి 74.2 బిలియన్ డాలర్లు ఉంటే, ఈ విలువ జూన్ ముగింపునకు 49 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.
జూలై నాటికి మరింత తగ్గి 42 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇటీవలి వారాల్లో రిజర్వ్ భారీగా పెరగడానికి కారణం ఆర్‌బీఐ డాలర్లను ‘ఫార్వర్డ్ హోల్డింగ్స్’ నుంచి ‘స్పాట్ నిల్వల్లోకి’ మార్చడం కూడా ఒక కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే వరవడి మున్ముందూ కొనసాగే అవకాశం ఉందని బార్‌క్లేస్ అంచనావేసింది. ఈ పరిస్థితుల్లో 2022 మార్చి నాటికి డాలర్ మారకంలో రూపాయి విలువ 75.50 –80.70 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇం ట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). రూపాయి బలహీనత వల్ల భారత్‌కు ఎగుమతుల ద్వారా అధిక ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.
ఫారెక్స్ నిల్వల పెంపునకు ఆర్‌బీఐ మొగ్గు!
Published Tue, Aug 24 2021 6:19 AM | Last Updated on Tue, Aug 24 2021 6:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment