దేశంలోని వ్యాపార కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ హవా చాటింది. 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల జాబితా ప్రారంభ ఎడిషన్‌లో అగ్రస్థానాన్ని పొందింది. అంబానీ కుటుంబం విలువ 309 బిలియన్ డాలర్లు (రూ.25.75 లక్షల కోట్లు). ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం.
బార్‌క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్, హురున్ ఇండియా 2024 బార్‌క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాను విడుదల చేశాయి. ఈ లిస్ట్ విలువ పరంగా దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాలకు ర్యాంక్ ఇచ్చింది. వ్యవస్థాపక కుటుంబం నుంచి తదుపరి తరం సభ్యులు వ్యాపార నిర్వహణలో లేదా దాని బోర్డులో ఉంటున్న కుటుంబ వ్యాపారాలను మాత్రమే ఈ జాబితాలోకి తీసుకున్నారు. 2024 మార్చి 20 నాటికి ఈ విలువలను లెక్కించారు.
ఈ జాబితాలో బజాజ్ కుటుంబం మొత్తం రూ.7.13 లక్షల కోట్ల వ్యాపార విలువతో రెండో స్థానాంలో ఉండగా బిర్లా కుటుంబం రూ.5.39 లక్షల కోట్ల విలువతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఇక మొదటి తరం వ్యవస్థాపక కుటుంబాల ప్రత్యేక కేటగిరీలో అదానీ కుటుంబం రూ.15.45 లక్షల కోట్ల విలువతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.2.37 లక్షల కోట్ల విలువతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహణలో పేరుగాంచిన పూనావాలా కుటుంబం ఉంది.
2024 బార్‌క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూయబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల ఉమ్మడి విలువ రూ.130 లక్షల కోట్లు. ఇది స్విట్జర్లాండ్, యూఏఈ వంటి దేశాల జీడీపీ కంటే అధికం. ఈ లిస్ట్‌లో మొదటి మూడు కుటుంబ వ్యాపారాల విలువ మాత్రమే రూ.46 లక్షల కోట్లు. ఇది సింగపూర్ జీడీపీకి సమానం.
Comments
Please login to add a commentAdd a comment