ఎక్కువ ఆయుర్దాయం కావాలా? జపనీయుల టాప్‌ సీక్రెట్స్‌ ఇవే! | Want to live longer?check thesemost valuable Japanese tips | Sakshi
Sakshi News home page

ఎక్కువ ఆయుర్దాయం కావాలా? జపనీయుల టాప్‌ సీక్రెట్స్‌ ఇవే!

Published Sat, Mar 15 2025 10:42 AM | Last Updated on Sat, Mar 15 2025 10:42 AM

Want to live longer?check thesemost valuable Japanese tips

జపనీయుల దీర్ఘాయువు వెనక... స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల అనుకున్నంత కాలం జీవించలేకపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జపాన్‌? ప్రజలు మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయంతో ఎక్కువకాలం  పాటు జీవిస్తున్నారు. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.. మనం కూడా వారిని అనుసరిద్దాం.

డబ్ల్యుహెచ్‌. ఓ. అంచనాల మేరకు... జపాన్‌ ప్రజల సగటు ఆయుర్దాయం 83.7 సంవత్సరాలు (మహిళలకు 86.8 సంవత్సరాలు పురుషులకు 80.5 సంవత్సరాలు)గా ఉంది. జపాన్‌ ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, సంస్కృతి, జెనెటిక్స్‌? దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇకిగై (సంతోషంతో జీవించడం): జపనీయులు ‘ఇకిగై’ అనే సిద్ధాంతంతో సంతోషంగా జీవిస్తారు. ఆనందంతో జీవించాలని ఈ పురాతన తత్వశాస్త్రం బోధిస్తుంది. అంతేకాక, ఎందుకు జీవిస్తున్నామనే దానిపై స్పష్టతతో జీవితానికి లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, స్నేహితులు,  కుటుంబ సభ్యులతో ప్రేమతో కలిసి ఉండటం వంటి అంశాలు వారి ఆయుష్షును పెంచుతాయి. 

హరా హాచ్‌ బన్‌ మి. ఇది జపాన్‌లో ఒక సామెత. అంటే తగిన మోతాదులోనే ఆహారం తినాలని అర్థం. కడుపులో 80 శాతం నిండినంత వరకు మాత్రమే తింటే దీర్ఘాయువు కలిగి ఉంటామని జపనీయుల నమ్మకం. అంతేకాదు, పెద్ద పళ్లెంలో కాకుండా చిన్న చిన్న ప్లేట్లలో లేదా బౌల్స్‌లో నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి తింటారు. భోజనం చేసేటప్పుడు టీవీ, సెల్‌ ఫోన్‌ వంటి వాటికి దూరంగా ఉంటారు. కింద కూర్చునే తింటారు. 

సమతుల ఆహారం: జపనీస్‌ ఆహారం లో పండ్లు, ఒమేగా ఫాటీ ఆమ్లాలు అధికం గా ఉండే చేపలు, బియ్యం, తృణధాన్యాలు, టోఫు, సోయా, మిసో, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. ఇవన్నీ తక్కువ కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. తద్వారా కాన్సర్, గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చు. ఈ ఆహారం కారణంగానే జపాన్‌లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు.

హెర్బల్‌ టీ: జపనీస్‌ ప్రజలు టీ తాగడాన్ని ఇష్టపడతారు. అది వారి సంస్కృతిలో భాగంగా భావిస్తారు. జపాన్‌ ద్వీప సమూహంలో మాచా టీ చాలా ప్రాచుర్యం పొందింది. టీ తయారీలో ఉపయోగించే టీ ఆకులు అధిక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కాన్సర్‌తో పోరాడే శక్తినిస్తాయి. 

కాలి నడకకు ప్రాధాన్యం: జపాన్‌ ప్రజలు ఒకేచోట కూర్చుని పని చేసే జీవన శైలిని అంతగా ఇష్టపడరు. యువకుల నుంచి వృద్ధుల వరకు అంతా నడవడానికే ఇష్టపడతారు. విద్యార్థులు, ఉద్యోగులు సమీపంలోని రైల్వే స్టేషన్‌కు నడవడం లేదా సైక్లింగ్‌? చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ వారి ఆయుర్ధాయం పెరగ డానికి దోహదం చేస్తాయి.

జీన్స్‌  ఇవి వారు ధరించే జీన్స్‌ కాదు.. జపనీస్‌లో సహజసిద్ధంగా ఉండే జన్యువులు. ఇవే వారి ఆయుష్షును పెంచుతున్నాయి. టైప్‌ 2 డయాబెటిస్, స్ట్రోక్స్, గుండెపోటు, సెరెబ్రోవాస్కులర్, హృదయ సంబంధ వ్యాధులలను నిరోధించడానికి ఈ జన్యువులు సహాయపడతాయి.

వృద్ధుల సంరక్షణ: ఇతర దేశాలలా జపాన్‌ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఓల్డ్‌? ఏజ్‌?హోమ్‌లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం అక్కడి వారి సాంప్రదాయం. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని అక్కడి వారి నమ్మకం.  

చదవండి: #WomenPower :హంపీ టెంపుల్‌లోని ఈ సారథుల గురించి తెలుసా?

ఆరోగ్య సంరక్షణ: జపాన్‌లో అనారోగ్యాలను నివారించి, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

సామాజిక నిర్మాణం: బలమైన సామాజిక సంబంధాలు, సమాజ మద్దతు మెరుగైన మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి దారితీస్తుంది, ఇవి దీర్ఘాయువుకు ముఖ్యమైనవి.

చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!

చూశారుగా...పైన చెప్పుకున్న వాటిలో ఒక్క జన్యుపరమైన కారణాలు తప్ప మిగతావన్నీ మనం సులువుగా అనుసరించదగ్గవే. వీలయిన వాటిని వీలయినంత వరకు అనుసరించి ఆయురారోగ్యాలతో హాయిగా ఉందాం. దీర్ఘాయుష్మాన్‌ భవ! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement