న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లకు భారత్ అత్యంత కీలక మార్కెట్‌గా మారనుందని బ్రోకరేజ్ సంస్థ బార్‌క్లేస్ ఒక నివేదికలో పేర్కొంది. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్‌తో విమాన ప్రయాణాలు చేసే మధ్య తరగతి వర్గాల సంఖ్య పెరుగుతోందని వివరించింది. దీనితో పాటు మరికొన్ని సానుకూల అంశాలు భారత్‌ను కొత్త విమానాలకు కీలక కేంద్రంగా మారుస్తున్నాయని పేర్కొంది.
దేశీయంగా విమాన ప్రయాణాలకు సంబంధించి ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా ఉంది. ప్యాసింజర్ ట్రాఫిక్ విషయంలో ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధి రేటు నమోదు చేస్తోంది. కొత్త విమానాలకు ఆర్డర్లివ్వడంలో అమెరికా తర్వాత భారతీయ విమానయాన సంస్థలు రెండో స్థానంలో ఉన్నాయి. బోయింగ్, ఎయిర్‌బస్ డెలివరీ చేసే వాటిల్లో 7 శాతం విమానాలను భారతీయ ఎయిర్‌లైన్స్ దక్కించుకుంటున్నాయి.
మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఇండిగో, ఆకాశ ఎయిర్ తదితర సంస్థలు పోటీపడనున్న నేపథ్యంలో విమానాల కొనుగోళ్ల నిర్ణయాలు ప్రాధాన్యతాంశంగా ఉండనున్నాయని బార్‌క్లేస్ తెలిపింది. దేశీయంగా తయారు చేసుకున్న కొమాక్ సీ919 విమానాలను చైనా పూర్తి స్థాయిలో వాడటం మొదలుపెడితే అక్కడి నుంచి ఆర్డర్లు తగ్గగలవని పేర్కొంది. అదే సమయంలో భారత మార్కెట్లో ఆర్డర్లు దక్కించుకుంటే సుదీర్ఘకాలం పాటు పని లభించగలదని వివరించింది.
ఏటా 11 శాతం ట్రాఫిక్ వృద్ధి..
‘అంతర్జాతీయ ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమ భారత మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాయి. 2006–2019 మధ్య కాలంలో భారత్‌లో దేశీ ట్రాఫిక్ వార్షికంగా 11 శాతం వృద్ధి చెందింది. దీర్ఘకాలంలో అంతర్జాతీయ సగటుకన్నా 200 బేసిస్ పాయింట్లు అధికంగా ఉండవచ్చని అంచనా.
2009–22 మధ్య కాలంలో భారత ఎయిర్‌లైన్స్ 1,400 పైచిలుకు ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇచ్చాయి‘ అని బార్‌క్లేస్ వివరించింది. జీటీఎఫ్, లీప్ ఇంజిన్లు బిగించిన వాటిల్లో (ఏ320నియో, మ్యాక్స్ ఏరోప్లేన్లు) 10 శాతం విమానాలకు భారత్ కేంద్రంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఏరోస్పేస్ పరిశ్రమ ఆర్థిక పనితీరుకు కూడా భారత్ కీలకంగా ఉండనుందని వివరించింది.
ఎయిర్‌బస్‌కు సానుకూలం..
భారత ఎయిర్‌లైన్స్ ఎక్కువగా చిన్న (నారో బాడీ) విమానాల వైపు మొగ్గు చూపుతున్నాయి కనుక బోయింగ్‌తో పోలిస్తే ఎయిర్‌బస్‌కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని బార్‌క్లేస్ తెలిపింది. 2009 నుంచి చూస్తే దేశీ విమానయాన సంస్థలు ఇచ్చిన ఆర్డర్లలో 65 శాతం వాటా ఎయిర్‌బస్‌దే ఉన్నట్లు వివరించింది.
మరోవైపు, డిఫెన్స్ విషయానికొస్తే 81.4 బిలియన్ డాలర్ల కేటాయింపులతో అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. సౌదీ అరేబియా తర్వాత అత్యధికంగా రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంటోంది.2018–22 మధ్య కాలంలో ప్రపంచ దేశాల మిలిటరీ పరికరాల దిగుమతుల్లో భారత్ వాటా 11 శాతంగా ఉంది.
అటు చైనా తమ మిలిటరీపై వ్యయాలను పెంచుకుంటున్నందున డిఫెన్స్‌కు భారత్ కేటాయింపులు కూడా అధిక స్థాయుల్లోనే కొనసాగవచ్చని బార్‌క్లేస్ తెలిపింది. భారతీయ మిలిటరీ పరికరాల విశ్లేషణ బట్టి చూస్తే భారతీయ వైమానిక దళానికి మరిన్ని ఫైటర్ జెట్ల అవసరం ఉన్నట్లుగా తెలుస్తోందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment