మళ్లీ అపర కుబేరుడు అంబానీ!! | Mukesh Ambani Tops Barclays Hurun Rich List For 7th Time In A Row | Sakshi
Sakshi News home page

మళ్లీ అపర కుబేరుడు అంబానీ!!

Published Wed, Sep 26 2018 12:29 AM | Last Updated on Wed, Sep 26 2018 11:13 AM

Mukesh Ambani Tops Barclays Hurun Rich List For 7th Time In A Row - Sakshi

ముకేశ్‌ అంబానీ , భువనేశ్వరి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సంపన్న భారతీయుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దాదాపు రూ.3,71,000 కోట్ల సంపదతో బార్‌క్లేస్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌–2018లో కూడా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆయన టాప్‌–1 స్థానంలో ఉండటం ఇది వరసగా ఏడోసారి. సుమారు రూ.1,000 కోట్లకు పైగా సంపద గల సంపన్న భారతీయులతో బార్‌క్లేస్‌ ఈ జాబితా రూపొందించింది.

ఈ సారి లిస్టులో చోటు దక్కించుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు హురున్‌ రిపోర్ట్‌ ఇండియా ఎండీ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు. 2017లో ఈ సంఖ్య 617గా ఉండగా.. ఈసారి 831కి చేరినట్లు వెల్లడించారు. వీరందరి సంపద కలిపితే 719 బిలియన్‌ డాలర్లుగా ఉంటుంది. భారత్‌ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఇది పావు భాగం కావడం గమనార్హం. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం భారత జీడీపీ 2.85 ట్రిలియన్‌ డాలర్లు.

గతంలో ఎన్నడూ లేనంత వేగంగా భారత్‌లో సంపద సృష్టి జరుగుతోందని, ఇంతకు ముందుతో పోలిస్తే సంపద సమకూర్చుకోవడానికి పట్టే వ్యవధి తగ్గిపోతోందని జాబితాను విడుదల చేసిన సందర్భంగా బార్‌క్లేస్‌ ప్రైవేట్‌ క్లయింట్స్‌ సీఈవో ఎస్‌ఎన్‌ బన్సల్‌ పేర్కొన్నారు. ఓ వైపు విధానకర్తలు ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు మార్గాలు వెతుకుతుండగా.. మరోవైపు రూ. 1,000 కోట్ల పైబడి సంపద కలిగిన వారి భారతీయుల సంఖ్య 34 శాతం పెరగడం గమనార్హమని నివేదిక పేర్కొంది.  

ముంబై టాప్‌..
అత్యంత సంపన్నుల కేంద్రంగా ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రూ.1,000 కోట్లు పైగా సంపద గల వారు మొత్తం 233 మంది ఉన్నారు. 163 మంది సంపన్నులతో న్యూఢిల్లీ రెండో స్థానంలో, 70 మందితో బెంగళూరు మూడోస్థానంలో ఉంది.

2018 జాబితాలో కొత్తగా 306 మంది  చోటు దక్కించుకోగా.. గతేడాది లిస్టులో ఉన్న 75 మంది ఈ సారి స్థానం కోల్పోయారు. ఒరావెల్‌ స్టేస్‌ (ఓయో రూమ్స్‌) వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌ (24 ఏళ్లు).. ఈ లిస్టులో అత్యంత పిన్న వయస్కుడు కాగా.. ఎండీహెచ్‌ మసాలా వ్యవస్థాపకుడు ధరమ్‌ పాల్‌ గులాటి (95 సంవత్సరాలు) వయోధికుడు. ఫార్మా రంగానికి చెందిన వారు అత్యధికంగా సుమారు 14 శాతం మంది ఉండగా, సాఫ్ట్‌వేర్‌ .. సర్వీసుల విభాగానికి చెందినవారు 7.9 శాతం మంది ఉన్నారు.  

తెలుగు రాష్ట్రాల నుంచి 46 మంది...
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1,000 కోట్లకు పైబడిన సంపద గల వారి సంఖ్య 50కి పైగానే ఉంది. వీరిలో రూ.1,200 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉండటం గమనార్హం. హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటాదారుగా ఆమె సంపద రూ.1,200 కోట్లున్నట్లు బార్‌క్లేస్‌ తాజా జాబితా తెలియజేసింది.

ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ప్రమోటర్లు పి.పిచ్చిరెడ్డి, పి.వి.కృష్ణారెడ్డి, హెటెరో డ్రగ్స్‌ ప్రమోటరు బి.పార్థసారథి రెడ్డి టాప్‌–3 స్థానాల్లో నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో స్థానం పొందిన వారిలో ఎక్కువ మంది ఫార్మా సంస్థల అధిపతులే ఉండటం గమనార్హం.      
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement