wealthy
-
Wealth Report 2024: సంపన్నుల సంఖ్య పైపైకి..
న్యూఢిల్లీ: దేశంలో సంపన్నులు మరింతగా విస్తరిస్తున్నారు. గతేడాది (2023) అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ/) సంఖ్య 6 శాతం పెరిగి 13,263కు చేరుకుంది. అంతేకాదు, 2028 నాటికి వీరి సంఖ్య 20,000కు పెరుగుతుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. 30 మిలియన్ డాలర్లు (రూ.250 కోట్లు), అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తులను యూహెచ్ఎన్డబ్ల్యూఐ కింద నైట్‌ఫ్రాంక్ పరిగణనలోకి తీసుకుంది. ‘ద వెల్త్ రిపోర్ట్ 2024’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2022 చివరికి దేశంలో సంపన్నుల సంఖ్య 12,495గా ఉన్నట్టు తెలిపింది. 2028 నాటికి 19,908కి వీరి సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై భా రత్ సంపద సృష్టి, అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. సంపన్నుల జనాభా గణనీయంగా పెరగడం, వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య మరో 50 శాతం వృద్ధి చెందడం దీనికి సూచిక’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. 2024 సానుకూలం.. తమ సంపద 2024లో వృద్ధి చెందుతుందని 90 శాతం మంది సంపన్నులు అంచనా వేస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. మొత్తం మీద 63 శాతం మంది అయితే, తమ సంపద 10 శాతానికి పైగా పెరుగుతుందని భావిస్తున్నారు. -
ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళ..ఏకంగా 30 వేల కోట్ల..
భారతదేశంలో ఎంతో మంది నిష్టాతులైన మహిళలు బిలియన డాలర్ల కంపెనీలకు సీఈవోలుగా పనిచేసి తామేంటో ఫ్రూ చేసుకున్నారు. అంతేగాదు మహిళలు ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని అయినా చాలా సునాయాసంగా నడపగలరని చేసి చూపించారు. అలాంటి కోవకు చెందిందే అను అగా. అను అగా ప్రముఖ ఇంధన పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ అయిన థర్మాక్స్‌కు చైర్‌పర్సన్‌గా సేవలందించారు. ఆమె ఈ పదవిలో 1996 నుంచి 2004 వరకు కంపెనీ చైర్‌పర్సన్‌గా చాలా సమర్థవంతంగా పనిచేశారు. అంతేగాదు కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సరిగ్గా 2004లో ఆ పదవి నుంచి వైదొలగినప్పటికీ కంపెనీని పర్యవేక్షిస్తూనే ఉండేవారు. చివరి 2018లో తన కుమార్తె మెహర్ పుదుమ్జీకి పూర్తిగా బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్ 4, 2023 నాటికి కంపెనీ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ. 30,408 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. అను పదవీవిరమణ తర్వాత పూర్తి సమయాన్ని సామాజిక సేవకు అంకితం చేసింది. అందుకుగానూ భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఫోర్బ్స్ భారతీయు సంపన్నుల జాబితా ప్రకారం డిసెంబర్ 4,2023 నాటికి ఆమె సుమారు రూ. 20 వేల కోట్ల సంపదతో ఉన్నట్లు అంచనా వేసింది. అంతేగాదు భారతదేశంలో ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచింది. ఇక ఈ థర్మాక్స్‌లో అను అగ ప్రయాణం 1985 నుంచి ప్రారంభమయ్యింది. ఇక ఆమె భర్త మృతితో 1996 కంపెనీ బాధ్యతలు తీసుకోంది. ఎవ్వరూ ఊహించని రీతిలో కంపెనీని తనదైన చతురతో మంచి లాభాల బాటలోకి తీసుకుపోయింది. అంతేగాదు 2012లో అను రాజ్యసభకు నామినేట్ అయ్యారు కూడా. ఇక విద్యాపరంగా ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ నుంచి బీఏ ఎకనామిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సెస్(టీఐఎస్ఎస్) నుంచి మెడికల్ అండ్ సైక్రియాట్రిక్ సోషల్ వర్క్‌లో పీజీ చేసింది. ఆమె కంపెనీ బాధ్యలు తీసుకునే నాటికీ మహిళలు అంతగా ఆ రంగంలో లేరు. అలాంటి సమయంలో ధైర్యంగా కంపెనీ బాధ్యతలు తీసుకోవడమే గాక చైర్‌పర్స్‌గా సమర్థవంతంగా నిర్వహించి బావితరాలకు ప్రేరణగా నిలిచారు అను అగా.! (చదవండి: ఈసారి 'కర్తవ్య పథ్'లో దేశంలోని 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!) -
సంపన్నుల వలసబాట.. ఆ దేశాలకే ఎందుకు?
భద్రమైన జీవితాన్ని వెతుక్కుంటూ ఎంతోమంది భారతీయ సంపన్నులు విదేశాలకు పయనమవుతున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. మెరుగైన శాంతిభద్రతలు, కాలుష్యానికి తావులేని చక్కటి వాతావరణం, సంపదపై తక్కువ పన్నులు వారిని ఆకర్శిస్తున్నాయి. ఈ ఏడాది భారత్ నుంచి 6,500 మంది అత్యంత సంపన్నులు విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషించే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్–2023 తాజాగా వెల్లడించింది. 2022లో భారత్ నుంచి 7,500 మంది ధనవంతులు విదేశాలకు వెళ్లి స్థిరపడినట్లు అంచనా. ► మిలియన్ డాలర్లు(రూ.8.2 కోట్లు), అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల సంపద ఉన్నవారిని అల్ట్రా రిచ్(హెచ్ఎన్డబ్ల్యూఐ)గా పరిగణిస్తారు. ► శాశ్వతంగా స్థిరపడడానికి సంపన్నులను విశేషంగా ఆకర్షిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ► ఇక 2023లో చైనా, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్(యూకే), రష్యా, బ్రెజిల్ నుంచి ఎక్కువ మంది ధనవంతులు విదేశాలకు వెళ్తారని అంచనా వేస్తున్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధక సంస్థ చీఫ్ ఆండ్రూ ఆమోయిల్స్ చెప్పారు. ► భారత్ నుంచి మిలియనీర్లు వెళ్లిపోతున్నా పెద్దగా నష్టం లేదని, దేశంలో అంతకంటే ఎక్కువ మంది మిలియనీర్లు తయారవుతారని ఆమోయిల్స్ తెలిపారు. ► ఈ ఏడాది చైనా నుంచి 13,500 మంది ధనికులు వలస వెళ్తారని అంచనా. ► 2022 ఆఖరు నాటికి టాప్–10 ధనిక దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాలు మొదటి 9 స్థానాలో ఉన్నాయి. ► భారత్‌లో మొత్తం జనాభా 142 కోట్లు కాగా, వీరిలో 3,44,600 మంది అల్ట్రా రిచ్(మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అస్తి), 1,078 మంది సెంటి–మిలియనీర్లు(100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి), 123 మంది బిలియనీర్లు(బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి) ఉన్నారు. ► చైనా జనాభా 141 కోట్లు కాగా, వీరిలో 7,80,000 మంది అల్ట్రా రిచ్, 285 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా జనాభా 34 కోట్లు కాగా, వీరిలో 52,70,000 మంది అల్ట్రా రిచ్, 770 మంది బిలియనీర్లు ఉన్నారు. అనువైన దేశం కోసం అన్వేషణ ► విదేశాలకు వలస వెళ్లడానికి సంపన్నులు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాజకీయ స్థిరత్వం, తక్కువ పన్నుల విధానం, వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ► ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు అనువైన దేశం కోసం అన్వేషిస్తున్నారు. ► పిల్లలకు నాణ్యమైన చదువులు, వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందాలని కోరుకుంటున్నారు. ► తమ సంపదకు, ఆస్తులకు రక్షణ కల్పించే దేశాన్ని ఎంచుకుంటున్నారు. ► చట్టబద్ధ పాలన ఉండడంతోపాటు ఆర్థిక స్వేచ్ఛకు హామీ ఇచ్చే దేశాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ► ప్రైవేట్ సంపద వెళ్లిపోవడం దేశాలకు నష్టదాయకమేనని నిపుణులు చెబుతున్నారు. ► భారత్‌లో పన్ను నిబంధనలు కఠినంగా ఉండడంతో ధనవంతులు తమ డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పంచభూతాధికారి ఉదానవాయు ఆధిపత్యం–సంతానప్రాప్తి
ఎన్ని వాక్కులు సాయి పలికినవి సత్యాలయ్యాయో, ఎందరికి ఎందరెందరికి ప్రత్యక్షంగానూ–వచ్చి దర్శించుకోలేని వృద్ధాప్య బాధతో సంతానం చూడటం లేదనో దుఃఖంతో తల్ల్లడిల్లిపోతున్నవారికి పరోక్షంగానూ సాయి వాక్కు వజ్రాయుధంలా పనిచేసి కష్టాలనే కొండలని పిండి చేసేసిందో ఆ పద్ధతిని తెలుసుకుంటూ ఉంటే సమయం తెలియదు. ఆనందభారానికి శరీరం పట్టదు.పంచభూతాల్లోనూ ఒకటైన వాయువులో ఉన్న వాటిలో ఉదానవాయువుని సాయి ఎలా అదుపు చేసాడో ఓ వితండవాది విషయంలో తెలుసుకున్నాం. ఇప్పుడు అదే ఉదానవాయువుని ఎలా సాయి తన అదుపులో ఉంచుకున్నాడో మరో ప్రత్యక్ష ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం!అంతేనేమో జీవితం!!మహారాష్ట్రలో ‘నాందేడ్’ అనే ప్రసిద్ధ ప్రదేశం ఉంది. అది మంచి వ్యాపారాలకి నిలయం. ధనవంతులకి ఆ ఊరు ఆటపట్టు. అక్కడ నాస్తికులూ వితండవాదులూ లేరుగాని, భక్తిభావం మాత్రం సాధారణంగానే ఉంటూ ఉండేది. ఎంతమటుకూ ధర్మబద్ధమైన వ్యాపారం ఆర్జన కుటుంబసభ్యుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటం పనివాళ్లని తగుప్రేమతో చూడటం.. ఇంతే సంసారచక్రానికి సరైన జీవితాలుగా ఉంటూండేవి వాళ్ల ప్రవర్తనలన్నీ, ఎవరైనా పూనుకుని ఓ మంచిపని చేద్దామనుకుంటే ఆ పూనుకున్న వ్యక్తిని బట్టి పనికి సహకరిస్తూ ఉండేవారు. వాదవివాదాలు అనవసరమనే ధోరణే వాళ్లది. ‘మంచి అయినట్లయితే పది రూకలిచ్చి తెచ్చుకో! అదే చెడు అయినట్లయితే పది రూకలిచ్చి వదిలించుకో!’ అనే సామెత ప్రకారం ఉండేవాళ్లు తప్ప తమంత తాముగా ఏ పనికీ పూనుకునేవారు కాదు.. కారణం వ్యాపారాలు దెబ్బ తింటాయేమోనని.ఇలాంటి పట్టణంలో రుస్తుంజీ వాడియా అనే వర్తకుడు ఉంటూండేవాడు. సహజంగా వర్తకుడనగానే లాభసాటి పనుల్నే చేస్తాడనీ, మోసం చేయడంలో దిట్ట అనీ, పిల్లికి బిచ్చమైనా పెట్టడనీ, ఆ సొమ్ముతో మరో వ్యాపారానికి పెట్టుబడి పెట్టుకోవచ్చుగా! అనే దృక్పథంతో ఉండేవాడనీ మనలో ఓ అభిప్రాయం దృఢంగా పాతుకుపోయి ఉంది. అయితే రుస్తుంజీ వాడియా వృత్తికి వర్తకుడే అయినా, పైన అనుకున్న లక్షణాల్లో ఏ ఒక్కటీ (వ్యతిరేకం) కలవాడు కాడు. పెద్దలంటే గౌరవం, పిన్నలమీద వాత్సల్యం అనురాగం, శరీరం నిండుగా దైవభక్తి, దానధర్మాలు, సమయాన్ని వెచ్చిస్తూ దైవ ఉత్సవాల్లో పాల్గొనడం... వంటి అన్ని సత్కార్యాలనీ చేస్తుండేవాడు. అందరూ కూడా రుస్తుంజీని చూస్తూ వాళ్లంతట వాళ్లే ‘ఇతను చక్కగా ఉండితీరాలి కలకాలం. పూర్తిగా భగవంతుడి తీర్చిదిద్దిన వ్యక్తి ఇతను. ఎంత అదృష్టవంతుడో:’ అని హృదయపూర్వకంగా పొగుడుతూ ఉండేవారు. నిజానికి అవన్నీ వాస్తవాలే తప్ప స్తవాలు (పొగడ్తలు) కానేకావు.అంత విశాలమైన ఆకాశానికి సన్నని చిల్లుల్ని (వర్షించేందుకు వీలుగా) ఏర్పాటు చేసినట్లూ, అంత సువిశాలమైన భూమికి (ఏ వస్తువునైనా తనలో దాచేసుకునే) ఓ చిత్రమైన బుద్ధిని పెట్టినట్లూ, ఎంతో పెద్దదైన సముద్రానికి ఉప్పదనాన్ని తగిలించినట్లూ, భగవంతుడు ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్నో ఎన్నెన్నో ఆనందాలని కలిగించినా ఏదో ఒక్క లోపాన్ని కూడా తగిలించినట్లు ఆ రుస్తుంజీ దంపతులకి ఆయుష్షు, ఆరోగ్యం, భోగ, భాగ్యాలనే అన్నింటినీ పుష్కలంగా ఇచ్చినా అతి ముఖ్యమైన సంతానాన్ని మాత్రం ఇచ్చి ఉండలేదు.ఎదురుచూడని ధనాదాయం–వ్యాపారం ద్వారా తెగ వచ్చిపడుతూండేది. ఎదురుచూసే సంతాన లాభం మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చి ఉండలేదు. భార్యాభర్తలు మనస్తాప పడుతూండేవారు. ఒకసారి ఆమె అంది రుస్తుంజీతో నేను పడుతున్నంత మనోవ్య«థ మీలో కనిపించడం లేదు. ఎందుకని? అని.అతనామెని దగ్గరకి తీసుకుని.. ‘పిచ్చిదానా! మధ్యలో చిరిగిన విస్తరిలో భోజనాన్ని చేస్తున్నట్లూ, ఆరిపోబోతున్న దీపపు వెలుగులో అడవిలో నడుస్తున్నట్లూ, అన్నీ ఉండి కూడా అనుభవించలేని పేద ధనికుని లాగా నేనున్నాను. స్త్రీ–పురుషుల్లో భేదమేమిటో తెలుసునా? స్త్రీలు బయటపడిపోతారు. పురుషులు తన దుఃఖాన్ని లోలోపల అణుచుకుంటూ స్త్రీ (భార్య)కి ధైర్యాన్ని చెప్తాడు. తేనెతో నిండుగా ఉన్న కుండకి చిన్న రాతి దెబ్బ తగిలితే ఎలా మొత్తం తేనె నేలపాలవుతుందో అలా ఇలాంటి ప్రశ్నగాని వస్తే మొత్తం దుఃఖమంతా వెలికి వచ్చేస్తుంది’ అంటూ గొంతు పెగిలిన దుఃఖంతో బావురుమన్నాడు.దాంతో ఆమె అతడ్ని ఓదార్చింది. ఏదో ఒకసారి దైవాన్ని గురించిన ఉపన్యాసానికి వెళ్తే అక్కడ ‘అపుత్రస్య గతిర్నాస్తి’ సంతానం లేనివాళ్లకి ఉత్తమగతులుండవంటూ ఆ ప్రవచనకర్త ఉపన్యసించగానే దాదాపు రెండు మూడు రోజులు ఇద్దరికీ నిద్రలు లేవు. మనకీ జీవితంలో ‘సంతానంలేని దుఃఖమే– అంతేనేమో జీవితం!’ అనుకున్నారు. ఆ దంపతులు తిరగని క్షేత్రం లేదు. దర్శించని దేవాలయం లేదు. ఆచరించని పుణ్యస్నానాలు లేవు. మొక్కని చెట్టు లేదు. పాలు పోయని పుట్ట లేదు. ఔషధం తీసుకోని వైద్యుడు లేడు. శాంతి జప హోమాలు చేయించని గ్రహం లేదు. మానవ శక్తికి అనుగుణంగా చేయని ప్రయత్నం లేదు. ఎవరికీ దక్షిణలు ఇవ్యడంలో గాని, వైద్యులకు రుసుములు ఇవ్వడంలోగాని, తీర్థయాత్రల్లో దానధర్మాలు చేయడంలో గాని ఏ తీరు లోపమూ చేయలేదు వారు. గొప్ప విశేషమేమిటంటే ఈ దంపతుల గురించి మాట్లాడుతూ– దేవుడే ఉంటే ఇంత పుణ్యదంపతులకి సంతానాన్ని ఎందుకివ్వడంటూ ఉండేవారు గాని, ఈ దంపతులు మాత్రం ఏనాడూ అలా మనసులో కూడా అనుకోలేదు. తప్పక సంతానవంతులమవుతామనేదే వాళ్ల దృఢ భావన.ఈ కథ ఎందుకింత వివరంగా చెప్పబడింది సాయిచరిత్రలోనంటే– ఒకప్పటి రోజుల్లో పెళ్లయిన రెండు నెలల్లోనే గర్భవతులయ్యేవాళ్లు కాబట్టి వాళ్లకి సంతానలేమి గురించి వ్యథ తెలిసేది కాదు. అదే మరి వివాహమై దశాబ్దం, మళ్లీ మాట్లాడితే రెండు దశాబ్దాలు గడిచినా సంతానం లేని వాళ్లకి తెలుస్తుంది ఆ దుఃఖం, ఆ మనోవ్యథ కాబట్టి. పదిహేను రోజుల పాటు అమావాస్య చీకటిని అనుభవించాక ఇక శుక్లపక్షం వచ్చినట్టుగా కొద్ది రోజులు ఆగితే పూర్ణిమనాడు పదహారు కళలతోనూ చంద్ర దర్శనం అయినట్టుగా రుస్తుంజీకి ఓ ఆలోచన తట్టింది ఓ రోజున.దాస్‌గణు రుస్తుంజీకి గురువు. ఆధ్యాత్మికంగా వచ్చిన అన్ని ప్రశ్నలకీ సమాధానాలు ఇస్తుండటమే కాక, తలపట్టు సమస్యలు గాని వచ్చిన పక్షంలో చటుక్కున చిక్కుముడి విప్పేయగల శక్తిమంతుడు కూడా ఆయనే రుస్తుంజీకి. కొన్ని కొన్ని సందర్భాల్లో– ఉయ్యాలలోనే పిల్లను పడుకోబెట్టి ఆ ఇల్లాలు ఊరంతా వెదికిన చందంగా– అతి ముఖ్యమైన వ్యక్తే గుర్తుకి రాడు. దానికి ఈ దంపతులే ఉదాహరణ. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ దంపతులు దాస్‌గణు వద్దకు వెళ్లి మొత్తం గోడు వెళ్లబోసుకున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ధనవంతులకి ఏదో తోచిన మార్గాన్ని చెప్పి సొమ్ము కాజేస్తూ ఉండే కొందరు వెదుక్కుంటూ ఇలాంటి దీనుల వద్దకొచ్చేస్తారు. అయితే దాస్‌గణు అలాంటివాడు కాదు. అందుకే ఆయన సూటిగా వీళ్లని సాయి దర్శనానికి వెళ్లవలసిందిగా చెప్పాడు. ఇక్కడిదాకా ఈ వృత్తాంతాన్ని వింటున్న లేదా చదువుతున్న పాఠకులకి– ఇంకేముంది? సాయి దర్శనమయింది– సంతానం లభించింది– అనే ముగింపు వచ్చేస్తుంది– అనే ఆలోచన కలుగుతుంది. అలా తేలికగా ఆలోచించకూడదు. మనం అనుకుంటున్నది సాయికి ఉదానవాయువు మీద ఆధిపత్య శక్తిని గురించి కదా! ఇద్దరూ షిర్డీ చేరారు.గోసాయి రూపంలో సాయి కనిపించాడు. పూర్తి ఫకీరుగా ఒకవైపు చిరిగిన చేయి ఉన్న పెద్ద కఫ్నే (పెద్ద లాల్చీ)తో నలిగిపోయిన వస్త్రాలతో ఏమాత్రం మరమ్మతులకీ నోచుకోని పాతకాలపు భవంతిలా ఉన్న సాయి కనిపించాడు. ఇతడా మాకు సంతానాన్ని కలిగించగలవాడనే తీరు ఆలోచనే వాళ్లకి రాలేదు సరికదా ఇద్దరికీ కూడా ఆ సాయి ఎన్ని సంవత్సరాల నుంచో మహా పరిచితుడిగా ఉన్నట్లు అనిపించింది.ఇద్దరికీ ఒకే ఒక్కసారి సాయి శిరసు చుట్టూ దివ్యకాంతి వెలుగుతూ కనిపించినట్లయింది. శరీరం పులకలెత్తడమే కాక ఏదో చెప్పుకోబోయినా నోట మాట రానట్లయింది. ఇద్దరూ ఏకకాలంలో ఆయన పాదాల మీద తల పెట్టి మౌనంగా తమ మనోవ్యథ చెప్పుకోబోయారు. వాళ్లింకా చెప్పకుండానే ‘బిడ్డా! లే!’ అంటూ ఇద్దరినీ పైకి లేవమని చెబుతూ సాయి ఆ ఇద్దరి కళ్లలోకీ చూస్తూ మాట్లాడటం ప్రారంభించాడు. సాధారణంగా బాబా దగ్గరకి ఎవరైనా అదే మొదటిసారిగా దర్శనానికంటూ వస్తే అక్కడుండే భక్తులందరిలో ఓ భయం ఉంటూ ఉంటుంది. ఆ భక్తుడు గాని సాయి గురించి ఏవైనా వ్యతిరేక ప్రచారాలు చేసి ఉంటే నలుగురిలో బహిరంగంగా ఛీత్కారాలకి గురి కావాల్సిందే. ఇంకా దుర్మార్గపు పనులుగాని చేసి ఉన్నవాడై ఉంటే అతణ్ణి పరిచయం చేయడం కోసం తెచ్చిన సాయి భక్తుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ– ‘ఇలాంటి నీచుణ్ణి, మోసగాణ్ణి ఎందుకయ్యా తెచ్చావు’ అంటూ మాట్లాడే సాయి మాటలకి తలవంచుకోవాల్సిందే. పరిస్థితులు ఇలా ఉంటాయి. కాబట్టి ఈ దంపతులకి ఏ అదృష్టం/దురదృష్టం పట్టబోతుందోనని అలా చూస్తూ ఉండిపోయారు భయంతో అందరూ.సాయి ఆ ఇద్దరినీ ఆనందకర నేత్రాలతో చూస్తూ సుదీర్ఘోపన్యాసం ధర్మబోధగా చేయనారంభించాడు. ఇక్కడే ఉంది రహస్యం. కంఠంలో ఉండే ఉదాన వాయువు తన ధ్వని తరంగాలని అలా ప్రసరింపజేస్తూ ఎదుటి వ్యక్తిని పూర్తిగా మార్చేయగలుగుతుంది. ఆ మాట్లాడే వ్యక్తి కంఠంలో ఆ శక్తిని దైవధ్యానం కారణంగా గాని పొంది ఉండినట్లయితే! మృకండ మహర్షి పుత్రుడైన మార్కండేయుణ్ణి పుట్టుకకి పూర్వమే అల్పాయుష్కునిగా ఉండడానికి తప్పనిసరిగా మరో తోవ లేక ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. అయితే సప్తమహర్షులూ నడిచి వెళ్లే తోవలో మార్కండేయుణ్ణి నిలబెట్టి వాళ్లందరికీ ఒకరి పిమ్మట ఒకరికి సాష్టాంగ ప్రణామాలు చేయిస్తే సమస్య తీరిపోతుందని నారదుడు చెప్పాడు మృకండ మహర్షికి. అంతే. వస్తూండే అందరికీ క్రమంలో సాష్టాంగాన్ని చేయిస్తుండటమేమిటి? వాళ్లంతా నమస్కరిస్తే అందునా దండ ప్రణామం చేయని పక్షంలో రుణగ్రస్తులం పుణ్యక్షీణులం (సాష్టాంగ దండ ప్రణామాన్ని చేసిన వ్యక్తికి ఆశీర్వదించిన కారణంగా ఆ ఆశీర్వచనానికి సరిపడినంత పుణ్యం క్షీణిస్తుంది. పుణ్యనష్టం అవుతుంది కదా అని ఆశీర్వదించకపోతే నమస్కరించిన వ్యక్తికి రుణగ్రస్తుడవుతాడు నమస్కారాన్ని స్వీకరించిన వ్యక్తి) అవుతాం కదా! అనే దృష్టితో ఒక్కొక్కరూ ‘దీర్ఘాయుష్మాన్ భవ– చిరంజీవీ భవ– దీర్ఘాయుష్యమస్తు’ అని ఈ తీరుగా ఆశీర్వదించసాగారు. ఈ ఆశీర్వచనాలన్నీ ఆ అందరి మహర్షుల తపశ్శక్తిని నింపుకున్న ఉదానవాయువులు నిండిన కంఠాల నుంచి వచ్చినవి కనుకనే మార్కండేయుని వద్దకి యముడొచ్చినా మార్కండేయుడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. కాబట్టి ఉదానవాయువుకి ఆ శక్తి తపశ్శక్తి వల్నే వస్తుందనేది యదార్థం.అదే తీరుగా నిరంతరం ‘అల్లాహ్ హో మాలిక్’ మంత్ర జపాన్ని చేస్తుండే సాయికి, లోగడ పన్నెండేళ్లు మంత్ర మననాన్ని చేసి ఉన్న సాయికి ఉదానవాయు శక్తి పరమాధికంగా ఉంది. అందుకే ఈ దంపతులను చూస్తూ ఆ ఇద్దరిలోనూ ఏవిధమైన అసత్య– అధర్మ దోషమూ లేదని గ్రహించి వారి దుఃఖాన్ని పోగొట్టాలనుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘దంపతులారా! మరణాన్ని వెన్నంటి జననం, జననాన్ని వెన్నంటి మరణం అనేది ఉంటూనే ఉంటుంది. ప్రతి జీవి ఈ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉండాల్సిందే. పాప పుణ్యాల్లో పుణ్యఫలం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ చక్రానికి బరువు ఎక్కువై, ఇరుసు బిగిసిపోయి చక్రాన్ని తిరగనీయదు. దాంతో మరణానంతరం మరో జన్మ రాదు. తీర్థయాత్రలూ పవిత్ర నదీస్నానాలూ ఏవేవో పుణ్యకార్యాలు చేసి స్వర్గాన్ని ఆశించినా స్వర్గం దుర్లభం. అనేక కఠిన యజ్ఞయాగాదులు చేసిన మహర్షులంతటి వాళ్లు కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరింటిలో మొదటి పరీక్షలో ఓడిపోయిన వారే దాదాపుగా. మొదటి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారనుకునేంతలో రెండో పరీక్ష రానే వస్తుంది. దాంట్లో గెలిస్తే మూడవది సిద్ధం. ఏ మహర్షీ మూడో పరీక్షలో నెగ్గలేకపోయాడు. ఇది మహర్షులని తక్కువ చేసి నిందించే మాట కాదు. అంత అసాధ్యమని తెలియజేయడమే దీని లక్ష్యం. ఈ తీరుగా సాయి ఉపన్యసిస్తూ సాగిపోతుంటే సంతానప్రాప్తికి వచ్చిన వాళ్లకి సాయి పరమార్థ బోధ చేయడంలో లో అర్థమేమై ఉంటుందా అనేది ఎవరికీ అంతుబట్టలేదు. కారణం ఒక్కటే. పిల్లవాడు ఏదో కావాలని అడుగుతాడు. ఏడుస్తాడు. దాన్ని ఇస్తే వాని ఆరోగ్యం దెబ్బతింటుందనుకుందాం! అప్పుడు తల్లి ఏం చేస్తుంది? అతణ్ణి ఏమరుపాటుకి గురయ్యేలా చేస్తూ ఏవేవో సంబంధం లేని మాటలు చెబుతూ వాణ్ణి తనవైపు తిప్పుకుంటుంది. ఆ చెబుతున్నది తన తల్లి కదా! అందుకని వాడు వింటూనే ఉంటాడు. ఆ కావలసిందేదో దేనికోసం ఏడ్చాడో ఆ విషయాన్ని మర్చిపోతాడు. సరిగ్గా సాయిబోధ కూడా అలాంటిదే. సంతానం ఆపేక్షించే దంపతులకి కావలసినది మనశ్శాంతి తప్ప లోపల విరక్తీ నిరాశా నిస్పృహా సంతానం కలగదేమోననే దుఃఖాలోచనలూ కావు. ఈ విషయాన్ని సంతానాన్ని ఆపేక్షించే అందరూ గుర్తుంచుకోవాలి. మౌనంగా సాయి కళ్లలోకి చూస్తూ తమ దుఃఖాన్ని వెల్లడించుకుంటే ఆయన తప్పక తన కళ్ల నుంచి ఈ తీరు ప్రబోధాన్ని మనకి చేస్తూనే ఉంటాడన్నమాట. ఆ బోధ మనకి అర్థం కావచ్చు, కాకపోవచ్చు. మౌనంగా ఆ సాయి కళ్లలోకే చూస్తూ ఉండిపోవాలనేది ఇక్కడి అద్భుత రహస్యం.రుస్తుంజీ దంపతులు అలా వింటూనే ఉండిపోయారు. ఇంద్రుడున్నాడు. తూర్పు దిక్కుకి అధ్యక్షుడు. అంతేకాదు, దేవతలంతా ఆయనని తమ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పాల సముద్రంలోంచి వచ్చిన తెల్లని ఐరావతమనే ఏనుగుని ఆయనకి అయాచితంగా కట్టబెట్టారు. ఆయనకున్న భోగాన్ని తక్కువ లేదు. అందుకే ఇంద్రభోగమంటారు. ఆ భోగం ఇంద్రునికి మాత్రమే ఉందనుకోకూడదు. ఒక గాడిద ఉందనుకుందాం! దాని యజమాని చక్కగా దానికి స్నానం చేయిస్తే వెంటనే వెళ్లి ఒళ్లంతా దుమ్ము అంటుకునేలా దుమ్ములో పొర్లి పొర్లి ఆ స్నానం చేయించిన ఫలితం లేకుండా చేసుకుంటుంది. పోలిక సరికాదు గానీ అర్థమవుతుందని చెబుతున్నాను. ఇంద్రుడు తనకున్న భోగానికి ఎంత ఆనందపడతాడో, గార్దాభం కూడా దుమ్ములో పొర్లాడినప్పుడు అంత ఆనందాన్నీ పొందుతుంది. అంటే ఏమన్నమాట? ఆనందమనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకటే ఉండదు. ఎవరి ఆనందం వారిదే. ఎవరి ఆనంద స్థాయి వారిదే.అలాగే మీకున్న భోగభాగ్యాలు ఎందరికో లేవు. వాళ్లకున్న సంతాన సౌఖ్యం మీకు లేదు. అంటే– ఎవరికైనా ఏదో ఒక లోపం– తద్వారా దుఃఖం ఉండి తీరుతుందన్న మాట. ఏ జన్మలో ఎంత పాపం చేసుకున్నామో ఆ పాప క్షయమయ్యేంత వరకు వాళ్లకున్న లోపం లోటూ తీరదు. మీరు చేసిన దాన ధర్మాలూ పుణ్యకార్యాలూ పవిత్ర నదీస్నానాలూ గ్రహజపాలూ, అలాగే భౌతికంగా చేసిన వైద్య చికిత్సలూ.. ఇవన్నీ పాపక్షయానికి తోడ్పడినవే. అందుకే ద్వారకామాయికొచ్చారు. చివరి ప్రయత్నంగా– అంటూ ఆమె చేతికి నాలుగు ఫలాలనిస్తూ ‘తల్లీ! వీటిని నువ్వే భుజించు. నీకు పుత్రులెందరో తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు.. అన్నాడు. ఆ దంపతుల కన్నుల్లో ఆనందబాష్పాలు అలా స్రవించసాగాయి. ఆమె సాయినే దైవంగా భావిస్తూ ముమ్మారు ప్రదక్షిణం చేసింది. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే వారికి సంతానం లేదనే లోటుని సాయికి వాళ్లు విన్నవించుకోకుండానే సాయి సర్వాన్ని లోనేత్రంతో గ్రహించి ఫలాలనందించి, నలుగురు పుత్రులంటూ సంఖ్యతో సహా సంతానప్రాప్తిని చెప్పడం రుస్తుంజీకి ఒళ్లు తెలియని ఆనందం కలిగించింది. ‘తండ్రీ! దేవా!’ అంటూ కన్నుల నుంచి నిండుగా వస్తున్న ఆనందబాష్పాలతో సాయిని గట్టిగా కౌగిలించుకున్నాడు రుస్తుంజీ తన ఒళ్లు తనకి తెలియక అలా చేయవచ్చునో లేదో ఆలోచించే ఆలోచనే రాక.సాయి నోట వెలువడిన ఆ ఉదాయనవాయు శక్తి ఫలితంగా ఆమె సాయి అన్నట్లుగా నలుగురు పుత్రులను కన్నది. ఎంత ఆశ్చర్యం! ఇక సాయికి ఉన్న సమానవాయు ఆధిపత్యం గురించి తెలుసుకుందాం. –సశేషం -
సంపద సృష్టి, వినాశనం రెండూ ఫైనాన్షియల్ రంగంలోనే
ముంబై: ఆర్థిక సేవల రంగం గడిచిన ఐదేళ్ల కాలంలో సంపదను సృష్టించిన రంగంగానే కాకుండా, నాశనం చేసినదిగానూ నిలిచిందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ప్రైవేటు రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో పెట్టుబడులతో 2013– 2018 మధ్య అతిపెద్ద సంపద సృష్టించిన రంగమని పేర్కొంది. అయితే, ఎన్పీఏ సమస్యల కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు హరించుకుపోవడం, షేర్ల ధరలు పతనం కావడంతో... ఇదే రంగం అతిపెద్ద సంపదను తుడిచిపెట్టినదిగానూ నిలిచినట్టు అభివర్ణించింది. -
అహాన్ని వదిలేయాలి
అతను ఓ గొప్ప ధనవంతుడు. ఎందుకనో క్రమంగా అతని మనసులో ఏదో అసంతృప్తి ఆవరించింది. . దాంతో మనశ్శాంతికోసం రకరకాల గురువుల వద్దకు వెళ్లడం మొదలు పెట్టాడు. కానీ, వారు ఏదైనా చెప్పడం మొదలు పెట్టగానే ఇది తనకు తెలిసిందేగా, ఇందులో తెలుసుకోవలసింది ఏముంది? అనుకుంటూ ఏదో అత్యవసరమైన పని ఉన్నట్లు బయటకు వచ్చేసేవాడు. అయితే, మనశ్శాంతి లేక చివరకు ఓ గురువును కలిశాడు. తనలో తలెత్తిన అసంతృప్తి గురించి చెప్పి, తనకు సరైన మార్గం చూపెట్టమన్నాడు. అతని మాటలు విన్న ఆ గురువు ‘మీకు నేను పాఠాలు చెప్పేముందు మీరు వెళ్లి మూత్రవిసర్జన చేసిరండి’ అని చెప్పాడు.ఆయన మాట విన్న ధనవంతుడు ‘ఏమిటీయన ఇలా చెబుతాడు? బుద్ధుందా అసలు’ అని అనుకుంటూనే బయటకు వెళ్ళాడు. కాసేపటి తర్వాత మళ్ళీ లోపలికొచ్చి గురువుగారి ముందు కూర్చున్నాడు.‘ఏంటీ అర్థమైందా?’ అని అడిగారు గురువు.‘‘నాకేమీ అర్థం కాలేదు..’’ అన్నాడతను కాస్త వ్యంగ్యంగా.. దానికాయన ‘ఎంత పెద్ద ధనికుడైనా, గొప్పవాడైనా కావచ్చు లేదా వారి దగ్గర పని చేస్తున్న వారో లేదా పేదవాడు కావచ్చు. అందరూ కూడా ఇప్పుడు నువ్వు చేసొచ్చిన పనిని ఎవరికి వారు చేయాల్సిందే తప్ప ఒకరి తరఫున మరొకరు వెళ్ళి చేసొచ్చేది కాదు. అంతేకాదు, ఎవరి వద్దనైనా ఏమైనా తెలుసుకోవాలని అనుకునేముందు నీలో ఉన్న వ్యర్థాలను, నాకే తెలుసుననే అహంకారాన్ని విసర్జించాలి. తెలియని విషయాన్ని ఎంత చిన్నవారు చెప్పినా వినాలి. అడ్డుపడకూడదు’ అని అన్నారు. తనకు విషయం అర్థమైందన్నట్లుగా తలూపి, ఆయనకు నమస్కరించి, అక్కడినుంచి సంతృప్తితో బయటపడ్డాడా ధనవంతుడు. -
మళ్లీ అపర కుబేరుడు అంబానీ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపన్న భారతీయుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దాదాపు రూ.3,71,000 కోట్ల సంపదతో బార్క్లేస్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్–2018లో కూడా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆయన టాప్–1 స్థానంలో ఉండటం ఇది వరసగా ఏడోసారి. సుమారు రూ.1,000 కోట్లకు పైగా సంపద గల సంపన్న భారతీయులతో బార్క్లేస్ ఈ జాబితా రూపొందించింది. ఈ సారి లిస్టులో చోటు దక్కించుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ రెహ్మాన్ జునైద్ తెలిపారు. 2017లో ఈ సంఖ్య 617గా ఉండగా.. ఈసారి 831కి చేరినట్లు వెల్లడించారు. వీరందరి సంపద కలిపితే 719 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఇది పావు భాగం కావడం గమనార్హం. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం భారత జీడీపీ 2.85 ట్రిలియన్ డాలర్లు. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా భారత్‌లో సంపద సృష్టి జరుగుతోందని, ఇంతకు ముందుతో పోలిస్తే సంపద సమకూర్చుకోవడానికి పట్టే వ్యవధి తగ్గిపోతోందని జాబితాను విడుదల చేసిన సందర్భంగా బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ సీఈవో ఎస్ఎన్ బన్సల్ పేర్కొన్నారు. ఓ వైపు విధానకర్తలు ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు మార్గాలు వెతుకుతుండగా.. మరోవైపు రూ. 1,000 కోట్ల పైబడి సంపద కలిగిన వారి భారతీయుల సంఖ్య 34 శాతం పెరగడం గమనార్హమని నివేదిక పేర్కొంది. ముంబై టాప్.. అత్యంత సంపన్నుల కేంద్రంగా ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రూ.1,000 కోట్లు పైగా సంపద గల వారు మొత్తం 233 మంది ఉన్నారు. 163 మంది సంపన్నులతో న్యూఢిల్లీ రెండో స్థానంలో, 70 మందితో బెంగళూరు మూడోస్థానంలో ఉంది. 2018 జాబితాలో కొత్తగా 306 మంది చోటు దక్కించుకోగా.. గతేడాది లిస్టులో ఉన్న 75 మంది ఈ సారి స్థానం కోల్పోయారు. ఒరావెల్ స్టేస్ (ఓయో రూమ్స్) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (24 ఏళ్లు).. ఈ లిస్టులో అత్యంత పిన్న వయస్కుడు కాగా.. ఎండీహెచ్ మసాలా వ్యవస్థాపకుడు ధరమ్ పాల్ గులాటి (95 సంవత్సరాలు) వయోధికుడు. ఫార్మా రంగానికి చెందిన వారు అత్యధికంగా సుమారు 14 శాతం మంది ఉండగా, సాఫ్ట్వేర్ .. సర్వీసుల విభాగానికి చెందినవారు 7.9 శాతం మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 46 మంది... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1,000 కోట్లకు పైబడిన సంపద గల వారి సంఖ్య 50కి పైగానే ఉంది. వీరిలో రూ.1,200 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉండటం గమనార్హం. హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారుగా ఆమె సంపద రూ.1,200 కోట్లున్నట్లు బార్క్లేస్ తాజా జాబితా తెలియజేసింది. ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రమోటర్లు పి.పిచ్చిరెడ్డి, పి.వి.కృష్ణారెడ్డి, హెటెరో డ్రగ్స్ ప్రమోటరు బి.పార్థసారథి రెడ్డి టాప్–3 స్థానాల్లో నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో స్థానం పొందిన వారిలో ఎక్కువ మంది ఫార్మా సంస్థల అధిపతులే ఉండటం గమనార్హం. -
సంపన్నుల భారత్
* దేశంలోని ధనికుల సంఖ్య 2.36 లక్షలు * ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నాలుగవ స్థానం * అగ్రస్థానాల్లో జపాన్, చైనా, అస్ట్రేలియా * 2025 నాటికి 4.83 లక్షలకు దేశీ సంపన్నుల సంఖ్య! న్యూఢిల్లీ: భారత్‌లో సంపన్నులు పెరుగుతున్నారు. సంపన్నుల సంఖ్య ప్రామాణికంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారత్‌లో సంపన్నులు 2.36 లక్షల మంది ఉన్నారు. ఇక 12.60 లక్షల మంది సంపన్నులతో జపాన్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో చైనా (6.54 లక్షల మంది), ఆస్ట్రేలియా (2.90 లక్షల మంది) కొనసాగుతున్నాయి. ‘న్యూ వరల్డ్ వెల్త్’కు సంబంధించిన ‘ఆసియా పసిఫిక్-2016’ వెల్త్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 1 మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ నికర ఆస్తులను కలిగిన వ్యక్తులను సంపన్నులుగా పరిగణలోకి తీసుకుంటారు. కాగా టాప్ 10లో సింగపూర్ (2.24 లక్షల మంది, ఐదవ స్థానం), హాంకాంగ్ (2.15 లక్షల మంది, ఆరవ స్థానం), దక్షిణ కొరియా (1.25 లక్షల మంది, 7వ స్థానం), తైవాన్ (98,200 మంది, 8వ స్థానం), న్యూజిలాండ్ (89,000 మంది, 9వ స్థానం), ఇండోనేసియా (48,500, 10వ స్థానం) ఉన్నాయి. ఇక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 35 లక్షల మంది సంపన్నులు ఉన్నారు. వీరందరి సంపద విలువ 17.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 15 ఏళ్లలో 115 శాతం వృద్ధి ఆసియా పసిఫిక్ ప్రాంతలో సంపన్నుల సంఖ్య గత 15 ఏళ్లలో 115 శాతం వృద్ధి చెందింది. ఈ వృద్ధి అంతర్జాతీయంగా 82 శాతంగా ఉంది. ఇక వచ్చే పదేళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతపు సంపన్నుల సంఖ్య 50 శాతం వృద్ధితో 52 లక్షలకు చేరుతుందని అంచనా. ఇదే సమయంలో భారత్‌లో సంపన్నుల సంఖ్య 105 శాతం వృద్ధితో 2.36 లక్షల నుంచి 4.83 లక్షలకు చేరుతుందని పేర్కొంది. తలసరి ఆదాయంలో దిగువన తలసరి ఆదాయం ఆధారంగా చూస్తే.. భారత్‌లోని ఒక వ్యక్తి సగటు సంపద 3,500 డాలర్లుగా ఉంది. ఈ సంపద ఆస్ట్రేలియాలో అత్యధికంగా 2,04,000 డాలర్లుగా, పాకిస్తాన్లో అత్యల్పంగా 1,600 డాలర్లుగా ఉంది. భారత్‌లోని వ్యక్తిగత మొత్తం సంపద 4,365 బిలియన్ డాలర్లుగా ఉంటే, చైనాలోని వ్యక్తిగత మొత్తం సంపద అత్యధికంగా 17,254 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలోని అందరి ప్రజల వద్ద ఉన్న సంపదను మొత్తం వ్యక్తుల సంపదగా పరిగణిస్తాం. -
ఆ మహిళలకు భరణం అవసరం లేదట!
ముంబై : ముంబై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో (వెల్దీ) ఉన్న మహిళకు భర్త నుండి మనోవర్తిని గానీ, భరణాన్నిగానీ కోరే హక్కు లేదని ముంబై హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. తనను తాను పోషించుకోగల ఆర్థిక స్థోమత ఉన్న మహిళలకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. నారిమన్ పాయింట్ ఏరియాకు చెందిన మహిళకు ఫ్యామిలీ కోర్టు గతంలో భరణాన్ని మంజూరు చేసింది. అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ముంబై హైకోర్టు తీర్పుపై మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. -
మహాదాత
బౌద్ధవాణి వైశాలి నగరంలో సువర్ణదత్తుడనే వ్యాపారి ఉండేవాడు. ఆ నగరంలో అతనికంటే ధనవంతుడు లేడు. ఎన్నో దేశాలలో వ్యాపారం చేసేవాడు. ఎంత ధనవంతుడో అంత దాత కూడా. ఆయన చేసిన చిన్నచిన్న దానాలకు లెక్కేలేదు. భూరి దానాలూ అంతగానే చేశాడు. ప్రజలు సువర్ణదత్తుడిని గొప్పదాతగా చెప్పుకునేవారు. వారు పొగిడిన కొద్దీ దానాలు చేసేవాడు సువర్ణదత్తుడు. అతని దగ్గర ఎందరో నౌకర్లు ఉండేవారు. అతని వ్యక్తిగత పనులు చేసే సుదత్తుడనే పనివాడు వారిలో ఒకడు. సుదత్తుడు కూడా దానధర్మాలు చేసేవాడు. సువర్ణదత్తునిలా పెద్దపెద్ద దానాలు చేయకపోయినా తనకు తగినంతలోనే దానాలు చేసేవాడు. కొంతకాలానికి ఇద్దరూ చనిపోయారు. వారి వారి దానఫలాన్ని బట్టి ఇద్దరూ తుషిత స్వర్గంలో చేరారు. అక్కడ దేవతలు సువర్ణదత్తునికీ, సుదత్తునికీ సన్మానం ఏర్పాటు చేశారు. తనతో పాటు తన సేవకుడూ స్వర్గానికి రావడం చూసి సువర్ణదత్తుడు ఆశ్చర్యపోయాడు. పైగా తనతో కలిసి సన్మానం పొందడం చూసి మరింత అవాక్కయ్యాడు. ఇద్దరికీ సన్మానం జరిగింది. సువర్ణదత్తునికి ‘గొప్పదాత’ అనే బిరుదు ప్రదానం చేసి, బంగారు కిరీటం పెట్టారు. సుదత్తునికి ‘మహాదాత’ అనే బిరుదునిచ్చి వజ్రాలు పొదిగిన కిరీటం అలంకరించారు. ఈ సన్మానం తనకు అవమానంగా భావించాడు సువర్ణదత్తుడు. వెంటనే అక్కడివారిని అడిగాడు. అప్పుడు దేవరాజు - ‘‘సువర్ణదత్తా! నువ్వు భాగ్యశాలివి. నువ్వు ఎంత దానం చేసినా అది నీ సంపదలో కొద్ది మాత్రమే. కానీ సుదత్తుడు ఒక సేవకుడు. పనివాడు. తన సంపాదనలో అతను చేసిన పాలు చాలా ఎక్కువ. కాబట్టి నువ్వు గొప్పదాతవు, అతను మహాదాత అయ్యారు. ఇక కిరీటాలు అంటావా, దాతలుగా ఇద్దరూ బంగారు కిరీటాలకు అర్హులే. కానీ నువ్వు గొప్పదనం కోసం దానాలు చేశావు. సుదత్తుడు ఎదుటివారి కష్టాల్నీ, కన్నీటినీ చూసి కరిగిపోయి దానాలు చేశాడు.అతని మనసు కరిగి కన్నీరుగా మారేది. అతను ఎదుటివారి కష్టాలు చూసి కార్చిన ఒక్కో కన్నీటి బొట్టుకూ, ఒక్కొక్క వజ్రం దానఫలంగా అతని కిరీటంలో చేరింది’’ అన్నాడు. ‘‘సుదత్తా! నీలాంటి సేవకుణ్ణి పొందిన భాగ్యం నాది’’అంటూ సువర్ణదత్తుడు సుదత్తుణ్ణి ప్రేమతో కౌగిలించుకున్నాడు. - బొర్రా గోవర్థన్