6 శాతం వృద్ధితో 13,263కు చేరిక
2028 నాటికి 20,000కు
నైట్‌ఫ్రాంక్ ఇండియా అంచనా
న్యూఢిల్లీ: దేశంలో సంపన్నులు మరింతగా విస్తరిస్తున్నారు. గతేడాది (2023) అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ/) సంఖ్య 6 శాతం పెరిగి 13,263కు చేరుకుంది. అంతేకాదు, 2028 నాటికి వీరి సంఖ్య 20,000కు పెరుగుతుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా అంచనా వేసింది. 30 మిలియన్ డాలర్లు (రూ.250 కోట్లు), అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తులను యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ కింద నైట్‌ఫ్రాంక్ పరిగణనలోకి తీసుకుంది.
‘ద వెల్త్ రిపోర్ట్ 2024’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. 2022 చివరికి దేశంలో సంపన్నుల సంఖ్య 12,495గా ఉన్నట్టు తెలిపింది. 2028 నాటికి 19,908కి వీరి సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై భా రత్ సంపద సృష్టి, అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. సంపన్నుల జనాభా గణనీయంగా పెరగడం, వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య మరో 50 శాతం వృద్ధి చెందడం దీనికి సూచిక’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు.
2024 సానుకూలం..
తమ సంపద 2024లో వృద్ధి చెందుతుందని 90 శాతం మంది సంపన్నులు అంచనా వేస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. మొత్తం మీద 63 శాతం మంది అయితే, తమ సంపద 10 శాతానికి పైగా పెరుగుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment