పంచభూతాధికారి  ఉదానవాయు ఆధిపత్యం–సంతానప్రాప్తి | Being careful of business income and family members | Sakshi
Sakshi News home page

పంచభూతాధికారి  ఉదానవాయు ఆధిపత్యం–సంతానప్రాప్తి

Published Sat, Jan 12 2019 10:36 PM | Last Updated on Sun, Jan 13 2019 12:15 AM

Being careful of business income and family members - Sakshi

ఎన్ని వాక్కులు సాయి పలికినవి సత్యాలయ్యాయో, ఎందరికి ఎందరెందరికి ప్రత్యక్షంగానూ–వచ్చి దర్శించుకోలేని వృద్ధాప్య బాధతో సంతానం చూడటం లేదనో దుఃఖంతో తల్ల్లడిల్లిపోతున్నవారికి పరోక్షంగానూ సాయి వాక్కు వజ్రాయుధంలా పనిచేసి కష్టాలనే కొండలని పిండి చేసేసిందో ఆ పద్ధతిని తెలుసుకుంటూ ఉంటే సమయం తెలియదు. ఆనందభారానికి శరీరం పట్టదు.పంచభూతాల్లోనూ ఒకటైన వాయువులో ఉన్న వాటిలో ఉదానవాయువుని సాయి ఎలా అదుపు చేసాడో ఓ వితండవాది విషయంలో తెలుసుకున్నాం. ఇప్పుడు అదే ఉదానవాయువుని ఎలా సాయి తన అదుపులో ఉంచుకున్నాడో మరో ప్రత్యక్ష ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం!అంతేనేమో జీవితం!!మహారాష్ట్రలో ‘నాందేడ్‌’ అనే ప్రసిద్ధ ప్రదేశం ఉంది. అది మంచి వ్యాపారాలకి నిలయం. ధనవంతులకి ఆ ఊరు ఆటపట్టు. అక్కడ నాస్తికులూ వితండవాదులూ లేరుగాని, భక్తిభావం మాత్రం సాధారణంగానే ఉంటూ ఉండేది.

ఎంతమటుకూ ధర్మబద్ధమైన వ్యాపారం ఆర్జన కుటుంబసభ్యుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటం పనివాళ్లని తగుప్రేమతో చూడటం.. ఇంతే సంసారచక్రానికి సరైన జీవితాలుగా ఉంటూండేవి వాళ్ల ప్రవర్తనలన్నీ, ఎవరైనా పూనుకుని ఓ మంచిపని చేద్దామనుకుంటే ఆ పూనుకున్న వ్యక్తిని బట్టి పనికి సహకరిస్తూ ఉండేవారు. వాదవివాదాలు అనవసరమనే ధోరణే వాళ్లది. ‘మంచి అయినట్లయితే పది రూకలిచ్చి తెచ్చుకో! అదే చెడు అయినట్లయితే పది రూకలిచ్చి వదిలించుకో!’ అనే సామెత ప్రకారం ఉండేవాళ్లు తప్ప తమంత తాముగా ఏ పనికీ పూనుకునేవారు కాదు.. కారణం వ్యాపారాలు దెబ్బ తింటాయేమోనని.ఇలాంటి పట్టణంలో రుస్తుంజీ వాడియా అనే వర్తకుడు ఉంటూండేవాడు. సహజంగా వర్తకుడనగానే లాభసాటి పనుల్నే చేస్తాడనీ, మోసం చేయడంలో దిట్ట అనీ, పిల్లికి బిచ్చమైనా పెట్టడనీ, ఆ సొమ్ముతో మరో వ్యాపారానికి పెట్టుబడి పెట్టుకోవచ్చుగా! అనే దృక్పథంతో ఉండేవాడనీ మనలో ఓ అభిప్రాయం దృఢంగా పాతుకుపోయి ఉంది.

అయితే రుస్తుంజీ వాడియా వృత్తికి వర్తకుడే అయినా, పైన అనుకున్న లక్షణాల్లో ఏ ఒక్కటీ (వ్యతిరేకం) కలవాడు కాడు. పెద్దలంటే గౌరవం, పిన్నలమీద వాత్సల్యం అనురాగం, శరీరం నిండుగా దైవభక్తి, దానధర్మాలు, సమయాన్ని వెచ్చిస్తూ దైవ ఉత్సవాల్లో పాల్గొనడం... వంటి అన్ని సత్కార్యాలనీ చేస్తుండేవాడు. అందరూ కూడా రుస్తుంజీని చూస్తూ వాళ్లంతట వాళ్లే ‘ఇతను చక్కగా ఉండితీరాలి కలకాలం. పూర్తిగా భగవంతుడి తీర్చిదిద్దిన వ్యక్తి ఇతను. ఎంత అదృష్టవంతుడో:’ అని హృదయపూర్వకంగా పొగుడుతూ ఉండేవారు. నిజానికి అవన్నీ వాస్తవాలే తప్ప స్తవాలు (పొగడ్తలు) కానేకావు.అంత విశాలమైన ఆకాశానికి సన్నని చిల్లుల్ని (వర్షించేందుకు వీలుగా) ఏర్పాటు చేసినట్లూ, అంత సువిశాలమైన భూమికి (ఏ వస్తువునైనా తనలో దాచేసుకునే) ఓ చిత్రమైన బుద్ధిని పెట్టినట్లూ, ఎంతో పెద్దదైన సముద్రానికి ఉప్పదనాన్ని తగిలించినట్లూ, భగవంతుడు ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్నో ఎన్నెన్నో ఆనందాలని కలిగించినా ఏదో ఒక్క లోపాన్ని కూడా తగిలించినట్లు ఆ రుస్తుంజీ దంపతులకి ఆయుష్షు, ఆరోగ్యం, భోగ, భాగ్యాలనే అన్నింటినీ పుష్కలంగా ఇచ్చినా అతి ముఖ్యమైన సంతానాన్ని మాత్రం ఇచ్చి ఉండలేదు.ఎదురుచూడని ధనాదాయం–వ్యాపారం ద్వారా తెగ వచ్చిపడుతూండేది.

ఎదురుచూసే సంతాన లాభం మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చి ఉండలేదు. భార్యాభర్తలు మనస్తాప పడుతూండేవారు. ఒకసారి ఆమె అంది రుస్తుంజీతో నేను పడుతున్నంత మనోవ్య«థ మీలో కనిపించడం లేదు. ఎందుకని? అని.అతనామెని దగ్గరకి తీసుకుని.. ‘పిచ్చిదానా! మధ్యలో చిరిగిన విస్తరిలో భోజనాన్ని చేస్తున్నట్లూ, ఆరిపోబోతున్న దీపపు వెలుగులో అడవిలో నడుస్తున్నట్లూ, అన్నీ ఉండి కూడా అనుభవించలేని పేద ధనికుని లాగా నేనున్నాను. స్త్రీ–పురుషుల్లో భేదమేమిటో తెలుసునా? స్త్రీలు బయటపడిపోతారు. పురుషులు తన దుఃఖాన్ని లోలోపల అణుచుకుంటూ స్త్రీ (భార్య)కి ధైర్యాన్ని చెప్తాడు. తేనెతో నిండుగా ఉన్న కుండకి చిన్న రాతి దెబ్బ తగిలితే ఎలా మొత్తం తేనె నేలపాలవుతుందో అలా ఇలాంటి ప్రశ్నగాని వస్తే మొత్తం దుఃఖమంతా వెలికి వచ్చేస్తుంది’ అంటూ గొంతు పెగిలిన దుఃఖంతో బావురుమన్నాడు.దాంతో ఆమె అతడ్ని ఓదార్చింది. ఏదో ఒకసారి దైవాన్ని గురించిన ఉపన్యాసానికి వెళ్తే అక్కడ ‘అపుత్రస్య గతిర్నాస్తి’ సంతానం లేనివాళ్లకి ఉత్తమగతులుండవంటూ ఆ ప్రవచనకర్త ఉపన్యసించగానే దాదాపు రెండు మూడు రోజులు ఇద్దరికీ నిద్రలు లేవు. మనకీ జీవితంలో ‘సంతానంలేని దుఃఖమే– అంతేనేమో జీవితం!’ అనుకున్నారు.


ఆ దంపతులు తిరగని క్షేత్రం లేదు. దర్శించని దేవాలయం లేదు. ఆచరించని పుణ్యస్నానాలు లేవు. మొక్కని చెట్టు లేదు. పాలు పోయని పుట్ట లేదు. ఔషధం తీసుకోని వైద్యుడు లేడు. శాంతి జప హోమాలు చేయించని గ్రహం లేదు. మానవ శక్తికి అనుగుణంగా చేయని ప్రయత్నం లేదు. ఎవరికీ దక్షిణలు ఇవ్యడంలో గాని, వైద్యులకు రుసుములు ఇవ్వడంలోగాని, తీర్థయాత్రల్లో దానధర్మాలు చేయడంలో గాని ఏ తీరు లోపమూ చేయలేదు వారు. గొప్ప విశేషమేమిటంటే ఈ దంపతుల గురించి మాట్లాడుతూ– దేవుడే ఉంటే ఇంత పుణ్యదంపతులకి సంతానాన్ని ఎందుకివ్వడంటూ ఉండేవారు గాని, ఈ దంపతులు మాత్రం ఏనాడూ అలా మనసులో కూడా అనుకోలేదు. తప్పక సంతానవంతులమవుతామనేదే వాళ్ల దృఢ భావన.ఈ కథ ఎందుకింత వివరంగా చెప్పబడింది సాయిచరిత్రలోనంటే– ఒకప్పటి రోజుల్లో పెళ్లయిన రెండు నెలల్లోనే గర్భవతులయ్యేవాళ్లు కాబట్టి వాళ్లకి సంతానలేమి గురించి వ్యథ తెలిసేది కాదు. అదే మరి వివాహమై దశాబ్దం, మళ్లీ మాట్లాడితే రెండు దశాబ్దాలు గడిచినా సంతానం లేని వాళ్లకి తెలుస్తుంది ఆ దుఃఖం, ఆ మనోవ్యథ కాబట్టి.

పదిహేను రోజుల పాటు అమావాస్య చీకటిని అనుభవించాక ఇక శుక్లపక్షం వచ్చినట్టుగా కొద్ది రోజులు ఆగితే పూర్ణిమనాడు పదహారు కళలతోనూ చంద్ర దర్శనం అయినట్టుగా రుస్తుంజీకి ఓ ఆలోచన తట్టింది ఓ రోజున.దాస్‌గణు రుస్తుంజీకి గురువు. ఆధ్యాత్మికంగా వచ్చిన అన్ని ప్రశ్నలకీ సమాధానాలు ఇస్తుండటమే కాక, తలపట్టు సమస్యలు గాని వచ్చిన పక్షంలో చటుక్కున చిక్కుముడి విప్పేయగల శక్తిమంతుడు కూడా ఆయనే రుస్తుంజీకి. కొన్ని కొన్ని సందర్భాల్లో– ఉయ్యాలలోనే పిల్లను పడుకోబెట్టి ఆ ఇల్లాలు ఊరంతా వెదికిన చందంగా– అతి ముఖ్యమైన వ్యక్తే గుర్తుకి రాడు. దానికి ఈ దంపతులే ఉదాహరణ. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ దంపతులు దాస్‌గణు వద్దకు వెళ్లి మొత్తం గోడు వెళ్లబోసుకున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ధనవంతులకి ఏదో తోచిన మార్గాన్ని చెప్పి సొమ్ము కాజేస్తూ ఉండే కొందరు వెదుక్కుంటూ ఇలాంటి దీనుల వద్దకొచ్చేస్తారు. అయితే దాస్‌గణు అలాంటివాడు కాదు. అందుకే ఆయన సూటిగా వీళ్లని సాయి దర్శనానికి వెళ్లవలసిందిగా చెప్పాడు. ఇక్కడిదాకా ఈ వృత్తాంతాన్ని వింటున్న లేదా చదువుతున్న పాఠకులకి– ఇంకేముంది? సాయి దర్శనమయింది– సంతానం లభించింది– అనే ముగింపు వచ్చేస్తుంది– అనే ఆలోచన కలుగుతుంది.

అలా తేలికగా ఆలోచించకూడదు. మనం అనుకుంటున్నది సాయికి ఉదానవాయువు మీద ఆధిపత్య శక్తిని గురించి కదా! ఇద్దరూ షిర్డీ చేరారు.గోసాయి రూపంలో సాయి కనిపించాడు. పూర్తి ఫకీరుగా ఒకవైపు చిరిగిన చేయి ఉన్న పెద్ద కఫ్నే (పెద్ద లాల్చీ)తో నలిగిపోయిన వస్త్రాలతో ఏమాత్రం మరమ్మతులకీ నోచుకోని పాతకాలపు భవంతిలా ఉన్న సాయి కనిపించాడు. ఇతడా మాకు సంతానాన్ని కలిగించగలవాడనే తీరు ఆలోచనే వాళ్లకి రాలేదు సరికదా ఇద్దరికీ కూడా ఆ సాయి ఎన్ని సంవత్సరాల నుంచో మహా పరిచితుడిగా ఉన్నట్లు అనిపించింది.ఇద్దరికీ ఒకే ఒక్కసారి సాయి శిరసు చుట్టూ దివ్యకాంతి వెలుగుతూ కనిపించినట్లయింది. శరీరం పులకలెత్తడమే కాక ఏదో చెప్పుకోబోయినా నోట మాట రానట్లయింది. ఇద్దరూ ఏకకాలంలో ఆయన పాదాల మీద తల పెట్టి మౌనంగా తమ మనోవ్యథ చెప్పుకోబోయారు. వాళ్లింకా చెప్పకుండానే ‘బిడ్డా! లే!’ అంటూ ఇద్దరినీ పైకి లేవమని చెబుతూ సాయి ఆ ఇద్దరి కళ్లలోకీ చూస్తూ మాట్లాడటం ప్రారంభించాడు. 

సాధారణంగా బాబా దగ్గరకి ఎవరైనా అదే మొదటిసారిగా దర్శనానికంటూ వస్తే అక్కడుండే భక్తులందరిలో ఓ భయం ఉంటూ ఉంటుంది. ఆ భక్తుడు గాని సాయి గురించి ఏవైనా వ్యతిరేక ప్రచారాలు చేసి ఉంటే నలుగురిలో బహిరంగంగా ఛీత్కారాలకి గురి కావాల్సిందే. ఇంకా దుర్మార్గపు పనులుగాని చేసి ఉన్నవాడై ఉంటే అతణ్ణి పరిచయం చేయడం కోసం తెచ్చిన సాయి భక్తుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ– ‘ఇలాంటి నీచుణ్ణి, మోసగాణ్ణి ఎందుకయ్యా తెచ్చావు’ అంటూ మాట్లాడే సాయి మాటలకి తలవంచుకోవాల్సిందే. పరిస్థితులు ఇలా ఉంటాయి. కాబట్టి ఈ దంపతులకి ఏ అదృష్టం/దురదృష్టం పట్టబోతుందోనని అలా చూస్తూ ఉండిపోయారు భయంతో అందరూ.సాయి ఆ ఇద్దరినీ ఆనందకర నేత్రాలతో చూస్తూ సుదీర్ఘోపన్యాసం ధర్మబోధగా చేయనారంభించాడు. ఇక్కడే ఉంది రహస్యం. కంఠంలో ఉండే ఉదాన వాయువు తన ధ్వని తరంగాలని అలా ప్రసరింపజేస్తూ ఎదుటి వ్యక్తిని పూర్తిగా మార్చేయగలుగుతుంది.

ఆ మాట్లాడే వ్యక్తి కంఠంలో ఆ శక్తిని దైవధ్యానం కారణంగా గాని పొంది ఉండినట్లయితే! మృకండ మహర్షి పుత్రుడైన మార్కండేయుణ్ణి పుట్టుకకి పూర్వమే అల్పాయుష్కునిగా ఉండడానికి తప్పనిసరిగా మరో తోవ లేక ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. అయితే సప్తమహర్షులూ నడిచి వెళ్లే తోవలో మార్కండేయుణ్ణి నిలబెట్టి వాళ్లందరికీ ఒకరి పిమ్మట ఒకరికి సాష్టాంగ ప్రణామాలు చేయిస్తే సమస్య తీరిపోతుందని నారదుడు చెప్పాడు మృకండ మహర్షికి. అంతే. వస్తూండే అందరికీ క్రమంలో సాష్టాంగాన్ని చేయిస్తుండటమేమిటి? వాళ్లంతా నమస్కరిస్తే అందునా దండ ప్రణామం చేయని పక్షంలో రుణగ్రస్తులం పుణ్యక్షీణులం (సాష్టాంగ దండ ప్రణామాన్ని చేసిన వ్యక్తికి ఆశీర్వదించిన కారణంగా ఆ ఆశీర్వచనానికి సరిపడినంత పుణ్యం క్షీణిస్తుంది. పుణ్యనష్టం అవుతుంది కదా అని ఆశీర్వదించకపోతే నమస్కరించిన వ్యక్తికి రుణగ్రస్తుడవుతాడు నమస్కారాన్ని స్వీకరించిన వ్యక్తి) అవుతాం కదా! అనే దృష్టితో ఒక్కొక్కరూ ‘దీర్ఘాయుష్మాన్‌ భవ– చిరంజీవీ భవ– దీర్ఘాయుష్యమస్తు’ అని ఈ తీరుగా ఆశీర్వదించసాగారు.

ఈ ఆశీర్వచనాలన్నీ ఆ అందరి మహర్షుల తపశ్శక్తిని నింపుకున్న ఉదానవాయువులు నిండిన కంఠాల నుంచి వచ్చినవి కనుకనే మార్కండేయుని వద్దకి యముడొచ్చినా మార్కండేయుడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. కాబట్టి ఉదానవాయువుకి ఆ శక్తి తపశ్శక్తి వల్నే వస్తుందనేది యదార్థం.అదే తీరుగా నిరంతరం ‘అల్లాహ్‌ హో మాలిక్‌’ మంత్ర జపాన్ని చేస్తుండే సాయికి, లోగడ పన్నెండేళ్లు మంత్ర మననాన్ని చేసి ఉన్న సాయికి ఉదానవాయు శక్తి పరమాధికంగా ఉంది. అందుకే ఈ దంపతులను చూస్తూ ఆ ఇద్దరిలోనూ ఏవిధమైన అసత్య– అధర్మ దోషమూ లేదని గ్రహించి వారి దుఃఖాన్ని పోగొట్టాలనుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘దంపతులారా! మరణాన్ని వెన్నంటి జననం, జననాన్ని వెన్నంటి మరణం అనేది ఉంటూనే ఉంటుంది. ప్రతి జీవి ఈ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉండాల్సిందే. పాప పుణ్యాల్లో పుణ్యఫలం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ చక్రానికి బరువు ఎక్కువై, ఇరుసు బిగిసిపోయి చక్రాన్ని తిరగనీయదు. దాంతో మరణానంతరం మరో జన్మ రాదు.

తీర్థయాత్రలూ పవిత్ర నదీస్నానాలూ ఏవేవో పుణ్యకార్యాలు చేసి స్వర్గాన్ని ఆశించినా స్వర్గం దుర్లభం. అనేక కఠిన యజ్ఞయాగాదులు చేసిన మహర్షులంతటి వాళ్లు కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరింటిలో మొదటి పరీక్షలో ఓడిపోయిన వారే దాదాపుగా. మొదటి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారనుకునేంతలో రెండో పరీక్ష రానే వస్తుంది. దాంట్లో గెలిస్తే మూడవది సిద్ధం. ఏ మహర్షీ మూడో పరీక్షలో నెగ్గలేకపోయాడు. ఇది మహర్షులని తక్కువ చేసి నిందించే మాట కాదు. అంత అసాధ్యమని తెలియజేయడమే దీని లక్ష్యం. ఈ తీరుగా సాయి ఉపన్యసిస్తూ సాగిపోతుంటే సంతానప్రాప్తికి వచ్చిన వాళ్లకి సాయి పరమార్థ బోధ చేయడంలో లో అర్థమేమై ఉంటుందా అనేది ఎవరికీ అంతుబట్టలేదు. కారణం ఒక్కటే. పిల్లవాడు ఏదో కావాలని అడుగుతాడు. ఏడుస్తాడు. దాన్ని ఇస్తే వాని ఆరోగ్యం దెబ్బతింటుందనుకుందాం! అప్పుడు తల్లి ఏం చేస్తుంది? అతణ్ణి ఏమరుపాటుకి గురయ్యేలా చేస్తూ ఏవేవో సంబంధం లేని మాటలు చెబుతూ వాణ్ణి తనవైపు తిప్పుకుంటుంది. ఆ చెబుతున్నది తన తల్లి కదా! అందుకని వాడు వింటూనే ఉంటాడు.

ఆ కావలసిందేదో దేనికోసం ఏడ్చాడో ఆ విషయాన్ని మర్చిపోతాడు. సరిగ్గా సాయిబోధ కూడా అలాంటిదే. సంతానం ఆపేక్షించే దంపతులకి కావలసినది మనశ్శాంతి తప్ప లోపల విరక్తీ నిరాశా నిస్పృహా సంతానం కలగదేమోననే దుఃఖాలోచనలూ కావు. ఈ విషయాన్ని సంతానాన్ని ఆపేక్షించే అందరూ గుర్తుంచుకోవాలి. మౌనంగా సాయి కళ్లలోకి చూస్తూ తమ దుఃఖాన్ని వెల్లడించుకుంటే ఆయన తప్పక తన కళ్ల నుంచి ఈ తీరు ప్రబోధాన్ని మనకి చేస్తూనే ఉంటాడన్నమాట. ఆ బోధ మనకి అర్థం కావచ్చు, కాకపోవచ్చు. మౌనంగా ఆ సాయి కళ్లలోకే చూస్తూ ఉండిపోవాలనేది ఇక్కడి అద్భుత రహస్యం.రుస్తుంజీ దంపతులు అలా వింటూనే ఉండిపోయారు. ఇంద్రుడున్నాడు. తూర్పు దిక్కుకి అధ్యక్షుడు. అంతేకాదు, దేవతలంతా ఆయనని తమ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పాల సముద్రంలోంచి వచ్చిన తెల్లని ఐరావతమనే ఏనుగుని ఆయనకి అయాచితంగా కట్టబెట్టారు. ఆయనకున్న భోగాన్ని తక్కువ లేదు. అందుకే ఇంద్రభోగమంటారు. ఆ భోగం ఇంద్రునికి మాత్రమే ఉందనుకోకూడదు.

ఒక గాడిద ఉందనుకుందాం! దాని యజమాని చక్కగా దానికి స్నానం చేయిస్తే వెంటనే వెళ్లి ఒళ్లంతా దుమ్ము అంటుకునేలా దుమ్ములో పొర్లి పొర్లి ఆ స్నానం చేయించిన ఫలితం లేకుండా చేసుకుంటుంది. పోలిక సరికాదు గానీ అర్థమవుతుందని చెబుతున్నాను. ఇంద్రుడు తనకున్న భోగానికి ఎంత ఆనందపడతాడో, గార్దాభం కూడా దుమ్ములో పొర్లాడినప్పుడు అంత ఆనందాన్నీ పొందుతుంది. అంటే ఏమన్నమాట? ఆనందమనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకటే ఉండదు. ఎవరి ఆనందం వారిదే. ఎవరి ఆనంద స్థాయి వారిదే.అలాగే మీకున్న భోగభాగ్యాలు ఎందరికో లేవు. వాళ్లకున్న సంతాన సౌఖ్యం మీకు లేదు.

అంటే– ఎవరికైనా ఏదో ఒక లోపం– తద్వారా దుఃఖం ఉండి తీరుతుందన్న మాట. ఏ జన్మలో ఎంత పాపం చేసుకున్నామో ఆ పాప క్షయమయ్యేంత వరకు వాళ్లకున్న లోపం లోటూ తీరదు. మీరు చేసిన దాన ధర్మాలూ పుణ్యకార్యాలూ పవిత్ర నదీస్నానాలూ గ్రహజపాలూ, అలాగే భౌతికంగా చేసిన వైద్య చికిత్సలూ.. ఇవన్నీ పాపక్షయానికి తోడ్పడినవే. అందుకే ద్వారకామాయికొచ్చారు. చివరి ప్రయత్నంగా– అంటూ ఆమె చేతికి నాలుగు ఫలాలనిస్తూ ‘తల్లీ! వీటిని నువ్వే భుజించు. నీకు పుత్రులెందరో తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు.. అన్నాడు. ఆ దంపతుల కన్నుల్లో ఆనందబాష్పాలు అలా స్రవించసాగాయి. ఆమె సాయినే దైవంగా భావిస్తూ ముమ్మారు ప్రదక్షిణం చేసింది.

ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే వారికి సంతానం లేదనే లోటుని సాయికి వాళ్లు విన్నవించుకోకుండానే సాయి సర్వాన్ని లోనేత్రంతో గ్రహించి ఫలాలనందించి, నలుగురు పుత్రులంటూ సంఖ్యతో సహా సంతానప్రాప్తిని చెప్పడం రుస్తుంజీకి ఒళ్లు తెలియని ఆనందం కలిగించింది. ‘తండ్రీ! దేవా!’ అంటూ కన్నుల నుంచి నిండుగా వస్తున్న ఆనందబాష్పాలతో సాయిని గట్టిగా కౌగిలించుకున్నాడు రుస్తుంజీ తన ఒళ్లు తనకి తెలియక అలా చేయవచ్చునో లేదో ఆలోచించే ఆలోచనే రాక.సాయి నోట వెలువడిన ఆ ఉదాయనవాయు శక్తి ఫలితంగా ఆమె సాయి అన్నట్లుగా నలుగురు పుత్రులను కన్నది. ఎంత ఆశ్చర్యం! ఇక సాయికి ఉన్న సమానవాయు ఆధిపత్యం గురించి తెలుసుకుందాం.
–సశేషం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement