మహాదాత
బౌద్ధవాణి
వైశాలి నగరంలో సువర్ణదత్తుడనే వ్యాపారి ఉండేవాడు. ఆ నగరంలో అతనికంటే ధనవంతుడు లేడు. ఎన్నో దేశాలలో వ్యాపారం చేసేవాడు. ఎంత ధనవంతుడో అంత దాత కూడా. ఆయన చేసిన చిన్నచిన్న దానాలకు లెక్కేలేదు. భూరి దానాలూ అంతగానే చేశాడు. ప్రజలు సువర్ణదత్తుడిని గొప్పదాతగా చెప్పుకునేవారు. వారు పొగిడిన కొద్దీ దానాలు చేసేవాడు సువర్ణదత్తుడు. అతని దగ్గర ఎందరో నౌకర్లు ఉండేవారు. అతని వ్యక్తిగత పనులు చేసే సుదత్తుడనే పనివాడు వారిలో ఒకడు. సుదత్తుడు కూడా దానధర్మాలు చేసేవాడు. సువర్ణదత్తునిలా పెద్దపెద్ద దానాలు చేయకపోయినా తనకు తగినంతలోనే దానాలు చేసేవాడు.
కొంతకాలానికి ఇద్దరూ చనిపోయారు. వారి వారి దానఫలాన్ని బట్టి ఇద్దరూ తుషిత స్వర్గంలో చేరారు. అక్కడ దేవతలు సువర్ణదత్తునికీ, సుదత్తునికీ సన్మానం ఏర్పాటు చేశారు. తనతో పాటు తన సేవకుడూ స్వర్గానికి రావడం చూసి సువర్ణదత్తుడు ఆశ్చర్యపోయాడు. పైగా తనతో కలిసి సన్మానం పొందడం చూసి మరింత అవాక్కయ్యాడు.
ఇద్దరికీ సన్మానం జరిగింది. సువర్ణదత్తునికి ‘గొప్పదాత’ అనే బిరుదు ప్రదానం చేసి, బంగారు కిరీటం పెట్టారు. సుదత్తునికి ‘మహాదాత’ అనే బిరుదునిచ్చి వజ్రాలు పొదిగిన కిరీటం అలంకరించారు.
ఈ సన్మానం తనకు అవమానంగా భావించాడు సువర్ణదత్తుడు. వెంటనే అక్కడివారిని అడిగాడు. అప్పుడు దేవరాజు - ‘‘సువర్ణదత్తా! నువ్వు భాగ్యశాలివి. నువ్వు ఎంత దానం చేసినా అది నీ సంపదలో కొద్ది మాత్రమే. కానీ సుదత్తుడు ఒక సేవకుడు. పనివాడు. తన సంపాదనలో అతను చేసిన పాలు చాలా ఎక్కువ. కాబట్టి నువ్వు గొప్పదాతవు, అతను మహాదాత అయ్యారు.
ఇక కిరీటాలు అంటావా, దాతలుగా ఇద్దరూ బంగారు కిరీటాలకు అర్హులే. కానీ నువ్వు గొప్పదనం కోసం దానాలు చేశావు. సుదత్తుడు ఎదుటివారి కష్టాల్నీ, కన్నీటినీ చూసి కరిగిపోయి దానాలు చేశాడు.అతని మనసు కరిగి కన్నీరుగా మారేది. అతను ఎదుటివారి కష్టాలు చూసి కార్చిన ఒక్కో కన్నీటి బొట్టుకూ, ఒక్కొక్క వజ్రం దానఫలంగా అతని కిరీటంలో చేరింది’’ అన్నాడు.
‘‘సుదత్తా! నీలాంటి సేవకుణ్ణి పొందిన భాగ్యం నాది’’అంటూ సువర్ణదత్తుడు సుదత్తుణ్ణి ప్రేమతో కౌగిలించుకున్నాడు.
- బొర్రా గోవర్థన్