bank employe
-
Pooranam: చదువుల తల్లీ నీకు వందనం
కొందరు సంపాదించింది దాచుకుంటారు. కొందరు కొద్దిగా పంచుతారు. మరికొందరు ప్రతిదీ సమాజహితం కోసం ధారబోస్తారు. పేద పిల్లల స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని దానం చేసింది తమిళనాడుకు చెందిన పూరణం. గత నెలలో మొదటిసారి ఆ పని చేస్తే ఇప్పుడు మరో 3 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం చేసింది. సామాన్య క్లర్క్‌గా పని చేసే పూరణం ఎందరికో స్ఫూర్తి కావాలి. ప్రభుత్వం అన్నీ చేయాలని కోరుకోవడం సరికాదు. సమాజం తన వంతు బాధ్యత వహించాలి. ప్రజాప్రయోజన కార్యక్రమాలలో తన వంతు చేయూతనివ్వాలి. విమర్శించే వేయినోళ్ల కంటే సాయం చేసే రెండు చేతులు మిన్న అని నిరూపించింది తమిళనాడు మధురైకు చెందిన 52 సంవత్సరాల పూరణం అలియాస్ ఆయి అమ్మాళ్. ఆమె ఒక నెల వ్యవధిలో దాదాపు పది కోట్ల రూపాయల విలువైన భూమిని పేద పిల్లల చదువు కోసం దానం చేసింది. కెనెరా బ్యాంక్ క్లర్క్ మదురైలో కెనెరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేసే పూరణంలో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. మానవతా దృక్పథంతో అతని ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. నెలల బిడ్డగా ఉన్న కుమార్తెను చూసుకుంటూ, కొత్తగా వచ్చిన ఉద్యోగం చేస్తూ జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. కుమార్తె భవిష్యత్తు కోసం ఆమె కొని పెట్టిన స్థలాలు ఖరీదైనవిగా మారాయి. హటాత్ సంఘటన పూరణం కుమార్తె జనని రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మరణించింది. జననికి సమాజ సేవ చాలా ఇష్టం. అంతేకాదు పేదపిల్లల చదువుకు కృషి చేసేది. ఒక్కగానొక్క కూతురు మరణించడంతో కూతురు ఆశించిన విద్యావ్యాప్తికి తాను నడుం బిగించింది పూరణం. తన సొంతవూరు కొడిక్కులంలోని 1.52 ఎకరాల స్థలాన్ని ఆ ఊరి స్కూలును హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసి భవంతి కట్టేందుకు మొన్నటి జనవరి 5న దానం చేసింది. మదురై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు పట్టా అప్పజెప్పింది. దాంతో ఆమెకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రశంసలు దక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ మొన్నటి రిపబ్లిక్ డే రోజున ఆమెను సన్మానించాడు. అయితే రెండు రోజుల క్రితం పూరణం తనకున్న మరో 91 సెంట్ల భూమిని కూడా మరో స్కూల్ భవంతి నిర్మించేందుకు అప్పజెప్పింది. ఈ రెండు స్థలాల విలువ నేడు మార్కెట్లో పది కోట్లు ఉంటాయి. ‘బదులుగా నాకేమి వద్దు. ఆ స్కూల్ భవంతులకు నా కుమార్తె పేరు పెట్టండి చాలు’ అని కోరిందామె. ‘పల్లెటూరి పిల్లల చదువుల్లో వెలుగు రావాలంటే వారు బాగా చదువుకోవడమే మార్గం. పల్లెల్లో హైస్కూళ్లు చాలా అవసరం’ అందామె. -
బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!
JaggerCane CEO Navnoor Kaur: చదివిన తరువాత ఉద్యోగం వస్తే చాలు అనుకునే రోజులివి, అయితే మంచి శాలరీ వచ్చే ఉద్యోగం వదిలేసి సొంతంగా వ్యాపారం మొదలెట్టి లాభాలను ఆర్జిస్తున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు 'నవ్‌నూర్ కౌర్'. ఇంతకీ ఈమె ఏ ఉద్యోగం చేసింది? ఎందుకు వదిలేసింది? ఇప్పుడేం చేస్తోంది? ఎంత సంపాదిస్తోంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి. నవ్‌నూర్ కౌర్ ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్న ఒక వ్యాపారవేత్త, కానీ వారి కుటుంభంలో అంతకు ముందు ఎవరూ వ్యాపారవేత్తలు కాకపోవడం గమనార్హం. ఆమె తండ్రి ప్రొఫెసర్, తల్లి స్కూల్ ప్రిన్సిపాల్. కావున చదువులో బాగా రాణించింది, తల్లిదండ్రుల మాదిరిగా మంచి ఉద్యోగం చేస్తుందని ఆశించారు. నవ్‌నూర్ లూథియానాలో చదువుకుంది. ఆ తరువాత దేశంలోని అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్లలో ఒకటైన IMT ఘజియాబాద్‌లో MBA పూర్తి చేసి చదువు పూర్తయిన తరువాత తల్లిదండ్రుల మాదిరిగానే గుర్గావ్లోని కోటక్ బ్యాంక్‌లో మంచి ఉద్యోగం సంపాదించింది. ఇందులో మంచి జీతం కూడా వచ్చేది. కానీ ఈమెకు మొదటి నుంచి ఆహారానికి సంబంధించిన వ్యాపారం చేయాలని కోరిక ఉండేది. కొత్త ఆలోచన.. నవ్‌నూర్ కుటుంబ సభ్యుల్లో చాలా మందికి మధుమేహం (షుగర్) ఉండటంతో క్వాలిటీ బెల్లం అమ్మాలనే ఆలోచన వచ్చిందని, ఉద్యోగం చేస్తూనే పాటు టైమ్ మాదిరిగా ఈ వ్యాపారం చేయడం ప్రారంభించిందని ఒక సందర్భంలో తెలిపింది. వ్యాపారం మొదలైన కేవలం రెండు సంవత్సరాల్లో మంచి ఆదాయం రావడం కూడా ప్రారంభమైంది. దీంతో నవ్‌నూర్ ఉద్యోగం వదిలి పూర్తిగా తన వ్యాపారం మీదే ద్రుష్టి పెట్టింది. నిజానికి శుద్ధి చేసిన చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని కనుక్కోవడానికి ఆమె బెల్లంతో ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇందులో మరిన్ని ఉత్పత్తులు తయారు చేసింది. మొదట్లో ఆమె డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసింది. ప్రజలు వాటిని రుచి చూసిన తర్వాత పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించిన తర్వాత తన ఉత్పత్తిపై తనకు మరింత నమ్మకం కలిగింది. తన వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో పంజాబ్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నడుపుతున్న తన తండ్రి విద్యార్థి కౌశల్‌ను కలిసి వారిద్దరూ పనిచేయడం ప్రారంభించారు. ఇందులో కౌశల్ మ్యాన్యుఫ్యాక్షరింగ్ కార్యకలాపాలను చూసుకుంటాడు, ఆమె బ్రాండింగ్ ఇతర కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభించింది. వ్యాపార విస్తరణ.. నవ్‌నూర్ తన వ్యాపారం కోసం అనేక సవాళ్ళను ఎదుర్కొంది. చాలా మంది దుకాణదారులు మొదట్లో తక్కువ మార్జిన్లు, చిన్న షెల్ఫ్-లైఫ్ కారణంగా ఆమె ఉత్పత్తులను తిరస్కరించారు. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం నిరాశ చెందకుండా ముందడుగు వేసింది. మొత్తానికి అనుకున్న విజయం సాధించగలిగింది. (ఇదీ చదవండి: లక్షతో కంపెనీ ప్రారంభించి, రూ. 50 కోట్ల సంస్థగా.. 27ఏళ్ల యువతి సాహసమిది!) ప్రస్తుతం భారతదేశంలో తన వ్యాపారాన్ని 22 జిల్లాల్లో విస్తరించింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా తన ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం ఈమె 25 మందికి ఉద్యోగం కల్పిస్తోంది. ఇందులో ఎనిమిది మంది మహిళలే కావడం గమనార్హం. (ఇదీ చదవండి: 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ప్రారంభంలో ఉద్యోగం చేస్తూ వ్యాపారం మొదలు పెట్టిన నవ్‌నూర్ కౌర్ రోజంతా ఉద్యోగం చేసి రాత్రి వేళల్లో తన వ్యాపార కార్యకలాపాలను చూసుకునేది. తన జాగర్‌కేన్ సంస్థ గత ఏడాది రూ. 2 కోట్ల టర్నోవర్ సాధించింది. రానున్న మరో ఐదేళ్లలో కంపెనీ టర్నోవర్ రూ. 100 కోట్లు సాధించేలా లక్ష్యంగా పెట్టుకుని దానికోసం ముందడుగు వేస్తోంది. -
ఆన్లైన్ రమ్మీ వ్యసనానికి బ్యాంకు ఉద్యోగి బలి
చెన్నై: ఆన్లైన్ రమ్మీ ఉచ్చులో చిక్కుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు లో ఘటన జరిగింది. కోయంబత్తూరులో నివసించే మదన్‌కుమార్ (28) బ్యాంకు ఉద్యోగి. ఆన్లైన్ రమ్మీకి బానిసగా మారాడు. తొలుత బాగా డబ్బులు సంపాదించినప్పటికీ తర్వాత నష్టాలు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఒత్తిడి తట్టుకోలేక మదన్ మద్యానికి అలవాటు పడ్డాడు. శనివారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
లేకున్నా ఇవ్వొచ్చు
కష్టంలో చెయ్యి చాచలేని వారుంటారు. కష్టాన్ని చూసి మనమే చెయ్యి చాచాలి. ఇరవై ఉంటే పది ఇవ్వొచ్చు. రెండు గుప్పెళ్లుంటే గుప్పెడు ఇవ్వొచ్చు. కష్టంలో కాళ్లు లేని వారూ ఉంటారు. కష్టాన్ని చూసి మనమే దగ్గరికి వెళ్లాలి. మాలతి దగ్గర ఇరవై ఉన్నాయి. రెండు గుప్పెళ్లూ ఉన్నాయి. కష్టాన్ని చూడలేని మనసూ ఉంది. వెళ్లి ఇవ్వడానికే.. ఆమెకు కాళ్లు లేవు! అయినా ఆగలేదు. లాక్డౌన్ కష్టాల్లో ఉన్న ‘పీసీ’ మహిళల కోసం ఒక నెట్‌వర్క్‌నే నడిపిస్తున్నారు!! బ్యాంకు ఉద్యోగి మాలతీ రాజా. ‘బార్క్లేస్’ బ్యాంకు చెన్నై శాఖలో పర్సనల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్‌లో పని చేస్తుంటారు. బార్క్లేస్ లండన్ బ్యాంక్. 330 ఏళ్ల నుంచి ఉంది. చెన్నై శాఖను నిలదొక్కుకునేలా చేయడం కోసం ఆ బ్యాంక్ నియమించుకున్న మెరికల్లాంటి సిబ్బందిలో.. కాళ్లలో శక్తి లేని మాలతీ కూడా ఒకరు. అవును. వీల్ చెయిర్ లేకుండా ఆమె కదలలేరు. లాక్డౌన్ ముందు వరకు ఆఫీస్‌కి వెళ్లొచ్చేవారు. ఇప్పుడు ఇంట్లోంచే పని చేస్తున్నారు. బ్యాంకు పనితో పాటు.. ఇంట్లోంచి మాలతీ చేస్తున్న పని ఇంకొకటి కూడా ఉంది. చెన్నై కార్పోరేషన్ షెల్టర్‌లో పీసీ (ఫిజికల్లీ ఛాలెంజ్డ్) మహిళల చేత పని చేయించడం! వాళ్లు చేసే పని.. షెల్టర్ చుట్టు పక్కల ఉన్న తమ లాంటి వారి కనీస నిత్యావసరాలు తీరేలా చేయడం. వాళ్ల కోసం ఉతికి వాడుకోదగిన (రీయూజబుల్) మాస్క్‌లను, శానిటరీ ప్యాడ్స్‌ను తయారు చేయడం. పసిపిల్లల కోసం డైపర్స్ చేయడం. మాలతి చెబితే వాళ్లెందుకు చేస్తారు? మాలతి టీమ్ మేట్స్ మెటిల్డా, మేరీ, కలై, నదియా, కవిత.. ఇంకా కొందరు ఆ షెల్టర్‌లోనే ఉంటున్నారు. టీమ్ మేట్స్ అంటే బ్యాంక్ టీమ్ మేట్స్ కాదు. వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఉమెన్ టీమ్ మేట్స్. మాలతి నేషనల్ చాంపియన్. టోర్నమెంట్ ఉన్నప్పుడు బ్యాంకు ఆమెను డిస్టర్బ్ చేయదు. ప్రాక్టీస్ చేసుకోనిస్తుంది. ∙∙ తమిళనాడు మొత్తం మీద 150 మంది వీల్‌చెయిర్ మహిళా బాస్కెట్‌బాల్ ప్లేయర్లు ఉన్నారు. కోయంబత్తూరు, తిరుచ్చి, తిరువణ్ణామలై, విల్లుపురం, వెల్లూరు.. మరికొన్ని ప్రాంతాల నుంచి వారం చివరిలో వాళ్లంతా చెన్నై వస్తారు. మాలతితో కలిసి జె.జె. కిల్పాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారు. లాక్‌డౌన్‌తో ఇప్పుడు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. కొందరు చెన్నై షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ల చేతే మాలతి ఇప్పుడు నిరాశ్రయులైన పీసీ మహిళలకు చేయూతను ఇప్పిస్తున్నారు. షెల్టర్‌లో మాస్క్‌లు కుడుతున్న మాలతి టీమ్ మేట్ బాగా అవసరంలో ఉన్నవారికి ఉప్పు, పప్పులతో పాటు కొంత డబ్బు కూడా. ఆ డబ్బును మాలతే తన ఫేస్బుక్ నుంచి విరాళాల ద్వారా సేకరిస్తున్నారు. నిజానికి ఆమెకు పెద్ద సర్కిలే ఉంది. బ్యాంకుతో ఏర్పడింది కొంత. క్రీడాకారిణిగా సాధించుకున్నది కొంత. వాళ్లంతా మాలతికి అన్ని విధాలా సహాయంగా ఉన్నారు. ‘ఫలానా చోట.. ఫలానా మహిళ.. ఆమె కదల్లేదు.. ఆమె కుటుంబం కష్టంలో ఉంది’ అని మాలతి మెజేస్ ఇస్తే చాలు.. వెంటనే అక్కడి వెళ్లి చేయగలిగినంతా చేసి వస్తున్నారు. ఇటువైపు షెల్టర్‌లో మాలతి సూచనల ప్రకరాం.. ఆమె టీమ్ మేట్స్, మిగతా మహిళలు తాము చేయగలిగింది చేస్తున్నారు. మొత్తం ముప్పైమంది వరకు ఉంటారు షెల్టర్‌లో. వారంతా రోజుకు పది గంటల పాటు పని చేస్తూ కనీసం 300 సింగిల్, డబుల్ లేయర్ల మాస్క్‌లతో పాటు.. శానిటరీ నేప్కిన్స్, బేబీ డైపర్స్ కుడుతున్నారు. అవన్నీ కూడా ‘ఫిజికల్లీ ఛాలెంజ్డ్’ మహిళల కోసమే. వాళ్లలా రెడీ చెయ్యగానే ‘అందుబాటులో ఉన్నాయి. అవసరమైనవారు సంప్రదించవచ్చు’’ అని మాలతి ఇలా ఫేస్బుక్లో పెట్టేస్తారు. డబ్బు పెట్టగల ఎన్జీవోలు వాటిని కొని, వైకల్యం ఉన్న మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తాయి. ఆ డబ్బును మళ్లీ రేషన్ పంపిణీ చేసేందుకు ఖర్చు చేయిస్తారు మాలతి. ఈ లాక్డౌన్లో ఉన్నచోటు నుంచి కదలకుండా మాలతి ఇప్పటి వరకు 200 మంది వైకల్యం గల మహిళలకు డ్రై రేషన్ (వండుకోడానికి అవసరమైన దినుసులు), మందులు, ఇతర నిత్యావసరాలు పంపించగలిగారు. మాలతి కుటుంబానికి కూడా పూర్తిగా ఆమే ఆధారం. ఆమెతో కలిపి మొత్తం ఐదుమంది ఉంటారు. ‘‘లాక్‌డౌన్‌తో నేను పోషించవలసిన కుటుంబం మరింత పెద్దదైంది’’ అంటారు మాలతి.. చిరునవ్వుతో. చెన్నై కార్పోరేషన్ షెల్టర్‌లో మాలతీ టీమ్ మేట్స్, ఇతర మహిళలు. -
బ్యాంక్ ఉద్యోగిపై దారిదోపిడి దోంగలు దాడి
-
స్టేట్‌బ్యాంకు ఉద్యోగి నిజాయతీ
నెల్లూరు(క్రైమ్) : బ్యాంకు సమీపంలో ఓ ఖాతాదారుడు బంగారు గాజును పొగొట్టుకొన్నాడు. దానిని బ్యాంకు ఉద్యోగి తీసుకొని ఖాతాదారునికి అప్పగించి తన నిజాయతీని చాటుకొన్నాడు. నగరానికి చెందిన వై.నరేష్‌కు ఫత్తేఖాన్‌పేట స్టేట్‌బ్యాంకులో ఖాతా ఉంది. ఆయన అక్టోబర్ 31న బ్యాంకు బయట ఉన్న ఏటీఎం కేంద్రానికి వచ్చాడు. అక్కడ నగదు డ్రాచేసుకొని బ్యాంకు బయట బైక్‌పై వెళ్లే క్రమంలో అతని జేబులో ఉన్న 10 గ్రాముల బంగారు గాజు కిందపడిపోయింది. ఈ విషయాన్ని నరేష్ గమనించలేదు. ఇంటికి వెళ్లి జేబులో చూడగా గాజు కనిపించలేదు. దీంతో బాధితుడు బ్యాంకు వద్దకు వచ్చి గాలించాడు. జరిగిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేసి నిరాశతో వెనుదిరిగాడు. బ్యాంకు మెసెంజర్ ఆకుల చిట్టిబాబు తన పనులు ముగించుకొని 31వ తేదీ సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు బ్యాంకు బయటకు రాగా అక్కడ అతనికి గాజు కనిపించింది. దానిని తీసుకొని ఆయన బ్యాంకు అధికారులకు విషయం తెలియజేశారు. వారి సమక్షంలో చిట్టిబాబు మంగళవారం బాధితుడు నరేష్‌కు బంగారు గాజును అందజేశారు. మెసెంజర్ చిట్టిబాబు నిజాయతీని బ్యాంకు చీఫ్ మేనేజర్ రామకృష్ణ, డిప్యూటీ మేనేజర్ ప్రభుదాస్ కొనియాడారు. -
నేను వెళ్లిపోతున్నాను.. నన్ను క్షమించు
హైదరాబాద్: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడలో నివసించే అవుతు పున్నారెడ్డి (28) బ్యాంకు ఉద్యోగి. గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఏఎస్రావు నగర్‌లోని కరూర్ వైశ్యాబ్యాంకులో పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 6న పున్నారెడ్డి మానసిక స్థితి బాగోలేదని బ్యాంకు అధికారులు విధుల నుంచి తొలగించారు. దీంతో మనస్తాపానికి గురైన పున్నారెడ్డి నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నన్ను క్షమించు వెళ్లిపోతున్నానంటూ బార్య సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన భార్య శ్రీకళ్యాణి తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.