స్టేట్‌బ్యాంకు ఉద్యోగి నిజాయతీ
నెల్లూరు(క్రైమ్) : బ్యాంకు సమీపంలో ఓ ఖాతాదారుడు బంగారు గాజును పొగొట్టుకొన్నాడు. దానిని బ్యాంకు ఉద్యోగి తీసుకొని ఖాతాదారునికి అప్పగించి తన నిజాయతీని చాటుకొన్నాడు. నగరానికి చెందిన వై.నరేష్‌కు ఫత్తేఖాన్‌పేట స్టేట్‌బ్యాంకులో ఖాతా ఉంది. ఆయన అక్టోబర్ 31న బ్యాంకు బయట ఉన్న ఏటీఎం కేంద్రానికి వచ్చాడు. అక్కడ నగదు డ్రాచేసుకొని బ్యాంకు బయట బైక్‌పై వెళ్లే క్రమంలో అతని జేబులో ఉన్న 10 గ్రాముల బంగారు గాజు కిందపడిపోయింది. ఈ విషయాన్ని నరేష్ గమనించలేదు. ఇంటికి వెళ్లి జేబులో చూడగా గాజు కనిపించలేదు. దీంతో బాధితుడు బ్యాంకు వద్దకు వచ్చి గాలించాడు. జరిగిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేసి నిరాశతో వెనుదిరిగాడు. బ్యాంకు మెసెంజర్ ఆకుల చిట్టిబాబు తన పనులు ముగించుకొని 31వ తేదీ సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు బ్యాంకు బయటకు రాగా అక్కడ అతనికి గాజు కనిపించింది. దానిని తీసుకొని ఆయన బ్యాంకు అధికారులకు విషయం తెలియజేశారు. వారి సమక్షంలో చిట్టిబాబు మంగళవారం బాధితుడు నరేష్‌కు బంగారు గాజును అందజేశారు. మెసెంజర్ చిట్టిబాబు నిజాయతీని బ్యాంకు చీఫ్ మేనేజర్ రామకృష్ణ, డిప్యూటీ మేనేజర్ ప్రభుదాస్ కొనియాడారు.