
4న మందకృష్ణ కొత్త పార్టీ!
వేలాది మంది వికలాంగుల మధ్య ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తన కొత్త పార్టీని జనవరి 4న ప్రకటించాలని నిర్ణయించారు. అంధుల ఆరాధ్యుడు లూయి బ్రెయిలీ జన్మదినం సందర్భంగా పార్టీని ప్రకటించడం ద్వారా వికలాంగులకు కూడా రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తేవాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలతో పాటు వికలాంగులను కూడా రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో కొత్త పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నారు. హైదరాబాద్‌లో వేలాది మంది వికలాంగుల సమక్షంలో ‘రాయితీల నుంచి రాజ్యాధికారం వరకు’ అనే ప్రధాన నినాదంతో పార్టీని ప్రకటించేందుకు కృష్ణమాదిగ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్దఎత్తున వికలాంగులను సమీకరిస్తున్నారు. ఎవరికీ పట్టని సమస్యలే తన ఎజెండా అని గతంలో చెప్పిన మందకృష్ణ... అదే రీతిలో గతంలో ఎవ్వరూ చేయని విధంగా వికలాంగుల మధ్య పార్టీని ప్రకటిస్తుండడం గమనార్హం.