అదొక శారీరక వికలాంగుల బాలుర వసతి గృహం. దీనిని జిల్లా స్థాయిలో గత జూన్ 28న నర్సాపూర్‌లో ప్రారంభించారు. వంద మంది వికలాంగ విద్యార్థులకు వసతి కల్పించాలన్న సంకల్పంతో ఈ గృహాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఇద్దరే వికలాంగ బోర్డర్లు అందులో చేరారు. చేరిన 15 రోజులకే వారూ వెళ్లిపోయారు. అదేమని ఆరా తీస్తే వసతి గృహానికి పాఠశాల చాలా దూరంగా ఉండటమే.. ఇలా జూలై మొదటి వారం నుంచి వసతి గృహంలో బోర్డర్లు లేక వెలవెలపోతోంది.
నర్సాపూర్, న్యూస్‌లైన్:
వికలాంగ వసతి గృహం.. ప్రభుత్వ బాలుర పాఠశాలకు చాలా దూరంలో ఉండడం తో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవు తున్నం దున వికలాంగ విద్యార్థులు అందులో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. వసతి గృహం ప్రభుత్వ పాఠశాలలకు దగ్గరలో ఉంటే వారు పాఠశాలకు వెళ్లి వచ్చేందుకు అనుకూలంగా ఉండేది. పాఠశాలకు దూరంగా ఉండడంతో వెళ్లడం రావడం కష్టమై ఉన్న ఇద్దరు విద్యార్థులూ తమ ఇంటికి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా మరి కొంత మంది బోర్డర్లు వచ్చే అవకాశాలున్నా హాస్టల్ పాఠశాలలకు దూరంగా ఉందన్న కారణంతో ఎవరూ రావడం లేదని తెలిసింది. ఇప్పటికైన పాఠశాలలకు దగ్గర్లో హాస్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
నెలసరి వ్యయం యథాతథం
జిల్లాస్థాయి వికలాంగ హాస్టల్‌లో ఒక్క బోర్డరు లేకపోయినా ప్రైవేటు భవనం కావడంతో నెలనెలా వేల రూపాయలు అద్దెను ప్రభుత్వం చెల్లిస్తోంది. అంతేగాక వాచ్‌మన్‌తో పాటు మ్యాట్రిన్‌కు జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వానికి వేల రూపాయల వ్యయం అవుతున్నా పాఠశాలకు దగ్గరలోకి హాస్టల్‌ను మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఐదు నెలలైనా ప్రారంభంకాని పనులు
నర్సాపూర్‌లో శారీరక వికలాంగుల వసతి గృహం నిర్మించేందుకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. మంత్రి సునీతారెడ్డి గత జూలై 1న హాస్టల్ భవన నిర్మాణానికి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పక్కన గల ఖాళీ స్థలంలో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఐదు నెలలు దాటినా నిర్మాణ పనులు చేపట్టలేదు. భవనాన్ని సకాలంలో నిర్మిస్తే వికలాంగ విద్యార్థులకు మేలు జరగడంతో పాటు ప్రభుత్వానికి నెలనెలా అనవసర వ్యయం మిగులుతుంది.
త్వరలో మారుస్తాం:
పాఠశాలకు దూరంగా వికలాంగ హాస్టల్ ఉన్నందున పిల్లలు రావడం లేదని జిల్లా వికలాంగ సంక్షేమ విభాగం ఏడీ లక్ష్మణ్‌చారి చెప్పారు. పాఠశాలకు దగ్గరలో ఉన్న భవనంలోకి త్వరలో మారుస్తామన్నారు. కొత్త భవనం నిర్మాణ పనుల టెండర్లు పూర్తయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త భవనం పూర్తి కాగలదని ఆయన తెలిపారు.
ఇదేం ‘వసతి’
Published Thu, Dec 12 2013 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement