
యాసిడ్ దాడి బాధితులూ దివ్యాంగులే
కేంద్ర దివ్యాంగుల సాధికార విభాగ కార్యదర్శి నవ్‌రీత్ కాంగ్
దివ్యాంగులకు సౌకర్యాల్లేకుంటే కొత్త భవనాలకు సర్టిఫికెట్లు ఇవ్వం
సాక్షి, హైదరాబాద్: యాసిడ్ దాడి, తలసే మిమా బాధితులు, మేధోపరమైన, నేర్చుకో వడంలో సమస్యలు ఉన్నవారిని కూడా ఇకపై దివ్యాంగులుగానే పరిగణిస్తారని కేంద్ర దివ్యాంగుల సాధికార విభాగ కార్యదర్శి నవ్‌రీత్ కాంగ్ తెలిపారు. ఐటీ దిగ్గజం మైక్రో సాఫ్ట్ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహిం చిన తొలి ‘యాక్సెసబిలిటీ సమ్మిట్’లో పాల్గొ నేందుకు వచ్చిన నవ్‌రీత్ కాంగ్ విలేకరులతో మాట్లాడుతూ... యాక్సెస్‌బిలిటీæ ఇండియా పేరుతో కేంద్రం గత నెల 19 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త చట్టం ప్రకారం సినిమాహాళ్లు, మాల్స్ మొదలుకొని అన్ని పబ్లిక్ భవనాల్లోనూ దివ్యాంగులకు అనుకూలమైన ఏర్పాట్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయని కొత్త భవనాలకు స్థానిక ప్రభుత్వ సంస్థలు నిర్మాణం పూర్తయిందన్న సర్టిఫికెట్ జారీ చేయరాదని, ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వాటిల్లో వచ్చే ఐదేళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని ఆయన వివరించారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 2000 ప్రభుత్వ భవనాలను దివ్యాంగులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం నిధులు అందిస్తోందని చెప్పారు. లెర్నింగ్, ఇంటలెక్చువల్ డిసెబిలిటీలు ఉన్న వారిని దివ్యాంగులుగా పరిగణించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వచ్చే నెల చివరికల్లా దాదాపు ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
ఐటీ శక్తిని వాడుకోవాలి: మధు ఖత్రీ
టెక్నాలజీని దివ్యాంగుల చెంతకు చేర్చేందుకు భారత్ తన ఐటీ శక్తిని ఉపయోగించాలని మైక్రోసాఫ్ట్ ఇండియా అసోసియేట్ జనరల్ కౌన్సెల్ అండ్ యాక్సెసబిలిటీ లీడ్ మధు ఖత్రీ సూచించారు. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉందని, దివ్యాంగులకు సాయపడే చాలా ప్రాజెక్టుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ పాలుపంచుకుంటోందని ఆమె తెలిపారు. విండోస వర్డ్‌లోని స్క్రీన్‌రీడర్, మాగ్నిఫయర్, టెక్ట్స్‌ను మాటల్లోకి మార్చే నరేటర్ వంటివి ఇందులో భాగమేనని అన్నారు. వీటితోపాటు మైక్రోసాఫ్ట్ సిద్ధంచేసిన వన్‌నోట్ సాఫ్ట్‌వేర్‌లోని లెర్నింగ్ టూల్స్ ఆప్షన్ ద్వారా డిస్‌లెక్సియాతో బాధపడుతున్న పిల్లలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, దీని సాయంతో వారు మునుపటి కంటే ఎంతో వేగంగా పదాలను గుర్తించగలగుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.