ఉన్నది ఒకటే జీవితం ... కోరుకున్న విధంగా బతకాలన్నదే తాపత్రయం.. అడ్డుపడే వైకల్యం .. అడ్డంపడే కుటుంబ నిబంధనల నుంచి తమకంటూ ఓ కొత్త లోకాన్ని ఏర్పాటు చేసుకోవాలని తపించే వారికి అండగా ఉంటుంది కృష్ణప్రియ.
హైదరాబాద్ ఉప్పల్‌లో ఉంటున్న దివ్యాంగురాలైన కృష్ణప్రియ తను నిలదొక్కుకోవడమే కాకుండా తనలాంటి వారికి దగ్గరుండి మరీ పెళ్లిళ్లు చేస్తోంది. కష్టపడుతూనే ఇష్టమైన జీవన ఫలాలను అందుకోవడానికి తపిస్తున్న కృష్ణప్రియను కలిస్తే తమ గురించి ఇలా వివరించింది..
‘‘మూడేళ్ల వయసులో నరాల సమస్య వల్ల కాళ్లు రెండు చచ్చుబడిపోయాయి. అయినా, నా ఉత్సాహం చూసి స్కూల్ చదువు వరకు చెప్పించారు మా అమ్మానాన్న. ఇక చదువు వద్దు అంటే నేనే మొండికేసి ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లో సినిమాలు చూడటానికి కంప్యూటర్ తీసుకున్నారు నాన్న.
ఖాళీ సమయంలో యూ ట్యూబ్ చూసి డిజిటల్ వర్క్స్ నేర్చుకున్నాను. డిటిపీ వర్క్స్, ఆన్‌లైన్, సోషల్‌మీడియా వర్క్స్ చేస్తుండేదాన్ని. హాస్టల్‌లో ఉండి నన్ను నేను పోషించుకుంటాను అని ఓ రోజు చెప్పాను.
‘మేం నీకు ఇంత తిండి పెట్టలేమా? బయట అవస్థలు పడుతుంటే నలుగురు చూసి ఏమనుకుంటారు?’ అని అమ్మానాన్నా, ‘నడవడమే సరిగా రాదు, ఏం సాధిస్తావని, ఇంటి పట్టున ఉండక’ అని తెలిసినవాళ్లు.. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయాను. ప్రతిదానికి ఇంట్లో వారిపై ఆధారపడటం, భారంగా ఉండటం ఇష్టం లేక ఎనిమిదేళ్ల క్రితం బయటకు వచ్చేశాను. మూడేళ్లు ఒక్కదాన్నే రూమ్ తీసుకుని ఉన్నాను. వచ్చిన కంప్యూటర్ వర్క్స్ నాకు కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి.
ఒక్కొక్కరూ జతగా చేరి..
దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలను కలిశాను. అక్కడ నాలాంటి వారెందరో కలిశారు. వైకల్యం ఎలాగూ బాధిస్తుంది. మరొకరి మీద ఆధారపడటం మరింతగా బాధిస్తుంది. ఇంట్లో వారిమీద ఆధారపడటం ఇష్టలేని కొంతమంది దివ్యాంగ అమ్మాయిలు నాతో కలిశారు.
దీంతో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఇంటి యజమానులు మాకు అద్దెకు ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. ‘మీ పనులు మీరే సరిగా చేసుకోలేరు. ఇక ఇంటినేం శుభ్రంగా ఉంచుతారు’ అనేవారు. కొన్ని రోజుల ప్రయత్నంతో ఎలాగో ఇల్లు దొరికింది. మరో ఆరుగురు నాతో కలిశారు. చిన్న హాస్టల్‌లా ‘ఆద్య’ అనే పేరుతో దివ్యాంగుల కోసం హోమ్ ప్రారంభించాను. మాలాంటి వారి సమస్యల పట్ల మాకే అవగాహన ఉంటుంది కాబట్టి, అందరం ఒకింటి సభ్యుల్లా కలిసిపోయాం.
పెళ్లితో కొత్త జీవితం..
దివ్యాంగుల చదువు, ఉద్యోగం, పెళ్లి .. ప్రయత్నాల్లో ఉండేవారికి, తమ గురించి తాము ఆలోచించుకోవడానికి తగిన వాతావరణం గల ప్రత్యేక హోమ్స్ అంటూ ఏమీ లేవు. జీవితంలో నిలదొక్కుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించే సరైన వసతి మాకు ఎక్కడా కనిపించలేదు. దాంతో ఎక్కువ వైకల్యం ఉన్న వారికోసం నేనే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాను.
రెండేళ్ల క్రితం దివ్యాంగుడైన సత్తయ్యను పెళ్లి చేసుకున్నాను. అతను ఫ్లోర్‌వాకర్. ఎన్జీవోల సాయంతో చిన్న షాప్ నడుపుతున్నాడు. నాకంటూ ఓ జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నాతోపాటు ఉన్న అమ్మాయిలలో నలుగురికి దగ్గరుండి పెళ్లిళ్లు జరిపించాను. ఇందుకు అవసరమైన డబ్బులను పోగుచేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది.
అవమానకరంగా మాట్లాడినవారూ ఉన్నారు. కానీ, మాకూ ఓ జీవితం ఉందని తెలియజేయాలనుకున్నాను. దివ్యాంగులైన అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కొంచెం వెనకంజ వేసేవారు. తమనెవరు పెళ్లి చేసుకుంటారనే నిస్పృహ వారిలో ఉండేది. ఇందుకోసం చాలా కౌన్సెలింగ్ చేయాల్సి వచ్చింది.
మాకు ఇళ్లలో చదువు, కళలు, వ్యాపారాలు, వృత్తి విద్యలæపట్ల ఆసక్తి ఉన్నా పెద్దగా ప్రోత్సాహం ఉండదు. ఎంత టాలెంట్ ఉన్నా ఎంత వయసు వచ్చినా ఏళ్ళకేళ్లు ఇంటికే పరిమితమవ్వాలి. ఇక వివాహం .. కల్లో కూడా ఊహించలేం. ఈ పరిస్థితులన్నీ మనకు మనమే అధిగమించాలని చెబుతుంటాను.
మాకు మేమే పరిష్కారం
మాకు అసలు పెళ్లి భాగ్యం ఉందా అనుకున్న అమ్మాయిలు ఒకింటి వారై తమకు తాముగా కొత్త జీవితాన్ని గడుపుతుండటం చాలా ఆనందంగా ఉంటుంది. దివ్యాంగుల పెళ్ళిళ్లు, పోషణ నిమిత్తం మా స్నేహితులు, బంధువులు, ఎన్జీవోల సాయం తీసుకుంటున్నాను.
‘ఇవన్నీ ఎందుకు? మీరే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మళ్లీ పెళ్ళిళ్లు చేసుకొని ఎందుకు కష్టపడతారు’ అంటుంటారు. కానీ, మాకూ ఓ కుటుంబ జీవనం కావాలని, నలుగురిలో మేమూ గొప్పగా జీవించాలనీ ఉంటుంది కదా! అందుకే ఇంతగా తాపత్రయపడుతున్నాను. భార్యాభర్తలు ఇద్దరూ దివ్యాంగులే అయితే, మా సమస్యలు మాకు బాగా అర్ధం అవుతాయి.
ఒకరికొకరం తోడుగా ఉంటాం. దివ్యాంగ సమావేశాలు ఎక్కడ జరిగినా, మాకు అందే అవకాశాల గురించి ఎప్పటికప్పుడు మీటింగ్‌లు ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ అందరూ ఆప్యాయంగా అక్కా అని పిలుస్తుంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా చెప్పుకోవడానికి తోడున్నామనే భరోసా ఉంది. మరిన్ని అవకాశాలు లభిస్తే ఎవరి మీదా ఆధారరపడకుండా బతకాలన్నదే మా ఆలోచన’’ అని వివరించింది కృష్ణప్రియ. దివ్యంగా ఉన్న ఆమె ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment