krishna priya
-
ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్‌పై అలాంటి కామెంట్స్!
బాద్షా షారుక్ ఖాన్ లాంటి హీరోతో సినిమా చేయడమే గొప్ప. అలాంటిది తమిళం నుంచి బాలీవుడ్‌కి వెళ్లి మరీ దర్శకుడు అట్లీ 'జవాన్' తీశాడు. అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ రూ.1000 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించడం విశేషం. ఇప్పుడు అందరూ తెగ పొగిడేస్తున్న డైరెక్టర్ అట్లీ.. గతంలో తన రంగు విషయమై చాలా ట్రోల్స్ అనుభవించాడు. ఆ హీరోతో సినిమా వల్ల స్టార్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. 'రోబో', 'స్నేహితుడు' సినిమాలకు ఆయన దగ్గర పనిచేశాడు. 'రాజా రాణి' మూవీతో దర్శకుడు అయిపోయాడు. తమిళ, తెలుగులో ఈ మూవీ సూపర్‌హిట్ అయింది. దీని తర్వాత విజయ్‌తో తెరి (పోలీసోడు) అనే సినిమా తీశాడు. విజయ్ అంటే పడని కొందరు అట్లీని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!) కలర్ కామెంట్స్ అయితే 'తెరి' సినిమా చేస్తున్న సమయంలోనే నటి కృష్ణప్రియతో అట్లీకి పెళ్లయింది. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబం ఆమెది. సీరియల్స్‌లో హీరోయిన్గా నటిస్తూ పేరు తెచ్చుకున్న ఈమె.. సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే అట్లీకి పరిచయమైంది. అలా ఐదేళ్ల పాటు సాగిన వీళ్ల బంధం చివరకు పెళ్లి వరకు వెళ్లింది. అయితే పెద్దల్ని ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీళ్ల ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ తో సినిమా చేస్తున్నాడని పడని కొందరు.. అట్లీ కలర్‌ని ఉద్దేశిస్తూ.. కృష్ణప్రియతో ఉన్న ఫొటోలపై కామెంట్స్ చేశారు. 'కాకి ముక్కుకు దొండపండు' అని ఎగతాళి చేశారు. మొన్న 'జవాన్' రిలీజ్ టైంలోనే ఈ తరహా విమర్శలు వచ్చాయి. కానీ వాటిని పెద్దగా మనసులో పెట్టుకోని అట్లీ.. నవ్వుతూ ముందుగు సాగిపోతున్నాడు. (ఇదీ చదవండి: నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నా: కమల్ హాసన్) -
National Animal Rights Day: జంతువులను ప్రేమిద్దాం..
మన కాలనీలో ఓ కుక్క కాలు విరిగి ఈడ్చుకుంటూ వెళుతుంటుంది... చూసి, పట్టనట్టు వెళ్లిపోతుంటాం. ఓ చిన్న సందులో పిల్లి ఇరుక్కుని గిలగిల్లాడుతుంటుంది ... దానిని కాపాడటం మన పని కాదులే అని తప్పుకుంటాం. వాటికి ఆకలేసినా, ప్రమాదాలు జరిగినా మనసున్న మనుషులుగా మనమెంతవరకు పట్టించుకుంటున్నాం? మనతో పాటు మూగజీవాలకూ బతికే హక్కు ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిది అని అంటున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న జంతుప్రేమికులు సాయిశ్రీ, పంచ్, శారద, డాక్టర్ కృష్ణప్రియ. ప్రజలలో మూగ జీవాల పట్ల అవగాహన కలిగించేందుకు, సురక్షితంగా ఉంచేందుకు నార్డ్ గ్లోబల్ ఆర్గనైజేషన్‌తో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేషనల్ యానిమల్ రైట్స్ డే సందర్భంగా జంతు ప్రేమికులు చెబుతున్న విషయాలు. స్కూల్, కాలేజీలకు వెళ్లి.. జంతువులకు కూడా జీవించే హక్కు ఉంది అని చెప్పడానికి నార్డ్ అనే సంస్థ అంతర్జాతీయంగా వర్క్ చేస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్స్‌తో కలిసి వర్క్ చేస్తాం. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. మూడేళ్లుగా యానిమల్ సేవలో పాల్గొంటున్నాను. మనిషి కారణంగా ఏ జంతువూ బాధపడకూడదు. ఎవరూ వాటిని హింసించకూడదు. నేను ఒక స్ట్రీట్ డాగ్‌ను దత్తత తీసుకున్నా. అప్పటి నుంచి నాకు ఈ సేవ పట్ల ఆసక్తి పెరిగింది. స్కూల్, కాలేజీలకు వెళ్లి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాం. జంతు ఆధారిత ఉత్పత్తులను ఏవీ ఉపయోగించం. – పంచ్, యానిమల్ యాక్టివిస్ట్, సైనిక్‌పురి పూర్తి సమయం కేటాయింపు.. మన వీధిలో ఒక కుక్క ఉందంటే అది ఆ కాలనీవారందరి బాధ్యతగా ఉండాలి. దానికి ఏదైనా దెబ్బ తగిలినా, తిండి లేకుండా పడి ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అలాంటి కుక్కలు, పిల్లలు, గోవులు... వీధుల్లో తిరిగేవాటిని తీసుకొచ్చి, సేవ చేస్తాం. వీధుల్లో ఉండే కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయిస్తాం. ఐదేళ్లయ్యింది ఈ వర్క్ చేయబట్టి. ఎనిమిదేళ్ల క్రితం మా ఫ్రెండ్ అక్కవాళ్ల దగ్గర నుంచి ఒక కుక్కను తీసుకున్నాను. స్ట్రీట్ డాగ్స్‌కు దెబ్బలు తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేసేదాన్ని, చేయించేదాన్ని. ఆ తర్వాత షెల్టర్ స్టార్ట్ చేశాను. దీనికి మరొక ఫౌండర్ జత కలవడంతో ఇప్పుడు ఇక్కడ రెండు వందల వరకు యానిమల్స్ ఉన్నాయి. గోవులు ఆరున్నాయి. ఇప్పటి వరకు నాలుగు వేల స్ట్రీట్ యానిమల్స్‌కి సేవలందించాను. నేషనల్ బాక్సర్‌గా ఉన్న నేను ఈ వైపుగా ఆసక్తి పెరగడంతో పూర్తి సమయాన్ని జంతువుల సేవకే కేటాయిస్తున్నాను. వీగన్ పదార్థాల తయారీ, ప్రొడక్ట్స్ బిజినెస్ కూడా చేస్తుంటాను. వీటి వల్ల వచ్చే ఆదాయంలో 15 శాతం జంతు సేవలకే ఉపయోగిస్తుంటాను. – సాయి శ్రీ, బోరంపేట్, దుండిగల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది.. మా అపార్ట్మెంట్ దగ్గర 20 కుక్కలను సేవ్ చేసి, వాటికి షెల్టర్ ఏర్పాటు చేశాను. ఇందుకు చాలా మందితో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కుక్కలకు ఆహారం పెడుతుంటే, పై నుంచి బాటిల్స్ వేసినవారున్నారు. అవే కుక్కల మీద పడితే, వాటికి ఎంత ప్రమాదం జరిగేదో అస్సలు ఆలోచించరు. న్యూసెన్స్ అవుతుందని కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. యానిమల్ రైట్స్ గురించి చెప్పినప్పుడు, అందరూ తగ్గారు. మొదట్లో స్ట్రీట్ డాగ్‌ని దత్తత తీసుకొని, పెంచేదాన్ని. ఆ తర్వాత ఆ కాలనీలో తిరుగుతున్నవాటిని రెస్క్యూ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఫ్రెండ్ షెల్టర్‌కి పంపిస్తుంటాను. – శారద, యానిమల్ యాక్టివిస్ట్, ప్రగతినగర్ బ్లడ్ అవసరమైతే.. నేను డెంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. అలాగే, అవసరమైన డాగ్స్‌కి బ్లడ్ అందేలా చూస్తుంటాను. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ల కుక్కకు ప్రమాదం జరిగి, బ్లడ్ అవసరమైంది. ఆ సమయంలో మరో కుక్క నుంచి బ్లడ్ తీసి, మ్యాచ్ చేసి ప్రమాదం నుంచి గట్టెక్కించారు. అప్పటి నుంచి కుక్కలకు కూడా బ్లడ్ అవసరం అని భావించి, రికార్డ్ చేస్తున్నాను. ఇందుకు సంబంధించి వెటర్నరీ డాక్టర్స్‌ని, వారి ద్వారా అవసరమైన కుక్కలకు మరో పెట్ పేరెంట్ ద్వారా బ్లడ్ అందేలా చూస్తుంటాను. – డాక్టర్ కృష్ణప్రియ, మలక్‌పేట – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అదిగో నవలోకం.. వారికి అండగా ఆమె! దగ్గరుండి మరీ పెళ్లిళ్లు చేస్తూ..
ఉన్నది ఒకటే జీవితం ... కోరుకున్న విధంగా బతకాలన్నదే తాపత్రయం.. అడ్డుపడే వైకల్యం .. అడ్డంపడే కుటుంబ నిబంధనల నుంచి తమకంటూ ఓ కొత్త లోకాన్ని ఏర్పాటు చేసుకోవాలని తపించే వారికి అండగా ఉంటుంది కృష్ణప్రియ. హైదరాబాద్ ఉప్పల్‌లో ఉంటున్న దివ్యాంగురాలైన కృష్ణప్రియ తను నిలదొక్కుకోవడమే కాకుండా తనలాంటి వారికి దగ్గరుండి మరీ పెళ్లిళ్లు చేస్తోంది. కష్టపడుతూనే ఇష్టమైన జీవన ఫలాలను అందుకోవడానికి తపిస్తున్న కృష్ణప్రియను కలిస్తే తమ గురించి ఇలా వివరించింది.. ‘‘మూడేళ్ల వయసులో నరాల సమస్య వల్ల కాళ్లు రెండు చచ్చుబడిపోయాయి. అయినా, నా ఉత్సాహం చూసి స్కూల్ చదువు వరకు చెప్పించారు మా అమ్మానాన్న. ఇక చదువు వద్దు అంటే నేనే మొండికేసి ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లో సినిమాలు చూడటానికి కంప్యూటర్ తీసుకున్నారు నాన్న. ఖాళీ సమయంలో యూ ట్యూబ్ చూసి డిజిటల్ వర్క్స్ నేర్చుకున్నాను. డిటిపీ వర్క్స్, ఆన్లైన్, సోషల్‌మీడియా వర్క్స్ చేస్తుండేదాన్ని. హాస్టల్లో ఉండి నన్ను నేను పోషించుకుంటాను అని ఓ రోజు చెప్పాను. ‘మేం నీకు ఇంత తిండి పెట్టలేమా? బయట అవస్థలు పడుతుంటే నలుగురు చూసి ఏమనుకుంటారు?’ అని అమ్మానాన్నా, ‘నడవడమే సరిగా రాదు, ఏం సాధిస్తావని, ఇంటి పట్టున ఉండక’ అని తెలిసినవాళ్లు.. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయాను. ప్రతిదానికి ఇంట్లో వారిపై ఆధారపడటం, భారంగా ఉండటం ఇష్టం లేక ఎనిమిదేళ్ల క్రితం బయటకు వచ్చేశాను. మూడేళ్లు ఒక్కదాన్నే రూమ్ తీసుకుని ఉన్నాను. వచ్చిన కంప్యూటర్ వర్క్స్ నాకు కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి. ఒక్కొక్కరూ జతగా చేరి.. దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలను కలిశాను. అక్కడ నాలాంటి వారెందరో కలిశారు. వైకల్యం ఎలాగూ బాధిస్తుంది. మరొకరి మీద ఆధారపడటం మరింతగా బాధిస్తుంది. ఇంట్లో వారిమీద ఆధారపడటం ఇష్టలేని కొంతమంది దివ్యాంగ అమ్మాయిలు నాతో కలిశారు. దీంతో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఇంటి యజమానులు మాకు అద్దెకు ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. ‘మీ పనులు మీరే సరిగా చేసుకోలేరు. ఇక ఇంటినేం శుభ్రంగా ఉంచుతారు’ అనేవారు. కొన్ని రోజుల ప్రయత్నంతో ఎలాగో ఇల్లు దొరికింది. మరో ఆరుగురు నాతో కలిశారు. చిన్న హాస్టల్లా ‘ఆద్య’ అనే పేరుతో దివ్యాంగుల కోసం హోమ్ ప్రారంభించాను. మాలాంటి వారి సమస్యల పట్ల మాకే అవగాహన ఉంటుంది కాబట్టి, అందరం ఒకింటి సభ్యుల్లా కలిసిపోయాం. పెళ్లితో కొత్త జీవితం.. దివ్యాంగుల చదువు, ఉద్యోగం, పెళ్లి .. ప్రయత్నాల్లో ఉండేవారికి, తమ గురించి తాము ఆలోచించుకోవడానికి తగిన వాతావరణం గల ప్రత్యేక హోమ్స్ అంటూ ఏమీ లేవు. జీవితంలో నిలదొక్కుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించే సరైన వసతి మాకు ఎక్కడా కనిపించలేదు. దాంతో ఎక్కువ వైకల్యం ఉన్న వారికోసం నేనే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాను. రెండేళ్ల క్రితం దివ్యాంగుడైన సత్తయ్యను పెళ్లి చేసుకున్నాను. అతను ఫ్లోర్వాకర్. ఎన్జీవోల సాయంతో చిన్న షాప్ నడుపుతున్నాడు. నాకంటూ ఓ జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నాతోపాటు ఉన్న అమ్మాయిలలో నలుగురికి దగ్గరుండి పెళ్లిళ్లు జరిపించాను. ఇందుకు అవసరమైన డబ్బులను పోగుచేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. అవమానకరంగా మాట్లాడినవారూ ఉన్నారు. కానీ, మాకూ ఓ జీవితం ఉందని తెలియజేయాలనుకున్నాను. దివ్యాంగులైన అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కొంచెం వెనకంజ వేసేవారు. తమనెవరు పెళ్లి చేసుకుంటారనే నిస్పృహ వారిలో ఉండేది. ఇందుకోసం చాలా కౌన్సెలింగ్ చేయాల్సి వచ్చింది. మాకు ఇళ్లలో చదువు, కళలు, వ్యాపారాలు, వృత్తి విద్యలæపట్ల ఆసక్తి ఉన్నా పెద్దగా ప్రోత్సాహం ఉండదు. ఎంత టాలెంట్ ఉన్నా ఎంత వయసు వచ్చినా ఏళ్ళకేళ్లు ఇంటికే పరిమితమవ్వాలి. ఇక వివాహం .. కల్లో కూడా ఊహించలేం. ఈ పరిస్థితులన్నీ మనకు మనమే అధిగమించాలని చెబుతుంటాను. మాకు మేమే పరిష్కారం మాకు అసలు పెళ్లి భాగ్యం ఉందా అనుకున్న అమ్మాయిలు ఒకింటి వారై తమకు తాముగా కొత్త జీవితాన్ని గడుపుతుండటం చాలా ఆనందంగా ఉంటుంది. దివ్యాంగుల పెళ్ళిళ్లు, పోషణ నిమిత్తం మా స్నేహితులు, బంధువులు, ఎన్జీవోల సాయం తీసుకుంటున్నాను. ‘ఇవన్నీ ఎందుకు? మీరే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మళ్లీ పెళ్ళిళ్లు చేసుకొని ఎందుకు కష్టపడతారు’ అంటుంటారు. కానీ, మాకూ ఓ కుటుంబ జీవనం కావాలని, నలుగురిలో మేమూ గొప్పగా జీవించాలనీ ఉంటుంది కదా! అందుకే ఇంతగా తాపత్రయపడుతున్నాను. భార్యాభర్తలు ఇద్దరూ దివ్యాంగులే అయితే, మా సమస్యలు మాకు బాగా అర్ధం అవుతాయి. ఒకరికొకరం తోడుగా ఉంటాం. దివ్యాంగ సమావేశాలు ఎక్కడ జరిగినా, మాకు అందే అవకాశాల గురించి ఎప్పటికప్పుడు మీటింగ్‌లు ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ అందరూ ఆప్యాయంగా అక్కా అని పిలుస్తుంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా చెప్పుకోవడానికి తోడున్నామనే భరోసా ఉంది. మరిన్ని అవకాశాలు లభిస్తే ఎవరి మీదా ఆధారరపడకుండా బతకాలన్నదే మా ఆలోచన’’ అని వివరించింది కృష్ణప్రియ. దివ్యంగా ఉన్న ఆమె ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
ఆహాలో రిలీజవుతోన్న 'అర్ధ శతాబ్దం'
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ ప్రియ, సుహాస్, పవిత్రా లోకేష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించారు. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26 నుంచి ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది. రవీంద్ర పుల్లే మాట్లాడుతూ– జాతి, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేమ కోసం జరిగే పోరాటంతో పాటు రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003లో జరిగిన కథే ‘అర్ధ శతాబ్దం’. 1950 నుండి 2003 వరకు ఈ కథ జరుగుతుంది’’ అన్నారు. ‘‘మా ‘అర్ధ శతాబ్దం’’ చిత్రాన్ని ఆదరించి సపోర్ట్‌గా నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తాం’’ అన్నారు చిట్టి కిరణ్. రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘22ఏళ్లుగా నటుడిగా ఉన్నాను. ‘అర్ధ శతాబ్దం’ కథ నచ్చడంతో రవీంద్ర, కిరణ్‌లతో భాగస్వామ్యం అయ్యాను. ‘ఆహా’ ద్వారా ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళితో ఆ తర్వాత మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని భావించి ‘ఆహా’లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి, అష్కర్, ఇ.జె వేణు, సంగీతం: నోఫెల్ రాజ. చదవండి: ‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్, దర్శిలకు రాహుల్ వార్నింగ్ -
కృష్ణప్రియ ఆత్మహత్య: కీలక విషయాలు వెలుగులోకి
సాక్షి, జగద్గిరిగుట్ట: అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఐదునెలల గర్భిణి కృష్ణప్రియకేసులో వాట్సప్ చాట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... 'ఆత్మహత్యకు ముందు కృష్ణప్రియ తన స్నేహితురాలితో సంభాషించింది. ఈ సందర్భంగా తన భర్త శ్రావణ్ బంగారం కోసం కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నిండు గర్భిణి అని చూడకుండా తిట్టడం, కొట్టడం చేస్తున్నాడని కృష్ణప్రియ బాధపడింది. నా జీవితం ఇలా అయిపోయిందని నిరాశ చెందింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇక ఎవరికి చెప్పుకోవాలి తప్పదు కదా అంటూ స్నేహితురాలితో ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకున్నందున తల్లికి చెప్పుకున్నా ఫలితం లేదు' అంటూ వారివురి మధ్య సంభాషణ సాగింది. అనంతరం బుధవారం రాత్రి కృష్ణప్రియ అత్తింట్లో ఆత్మహత్య చేసుకుంది. కాగా.. భర్త శ్రావణ్ ఐడీపీఎల్‌లో జిమ్ నిర్వహణకు కృష్ణప్రియ 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. అత్తింటి వేధింపులు భరించలేక గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సంజీవరావు కుమార్తె కృష్ణప్రియ (24)కు సందీప్ అనే వ్యక్తితో వివాహం కాగా విడాకులు తీసుకున్నారు. తర్వాత కృష్ణప్రియ మొదటి నుంచి తాను ప్రేమిస్తున్న పాపిరెడ్డినగర్‌కు చెందిన వరుసకు మేనబావ శ్రవణ్‌కుమార్‌ను రెండో వివాహం చేసుకుంది. (కరోనాతో భర్త.. బంగ్లాపై నుంచి దూకి భార్య!) అయితే, పెళ్లయిన నాటినుంచి అత్త మీనా, భర్త శ్రవణ్ అదనపు కట్నం, బంగారం తేవాలంటూ వేధిస్తున్నారు. ఐదు నెలల గర్భిణి అయిన కృష్ణప్రియకు సీమంతం కోసం తమ ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చినా అత్తమామలు పంపలేదు. తాము అడిగిన బంగారం, బైక్ ఇస్తేనే పంపిస్తామన్నారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన కృష్ణప్రియ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల వల్లే తమ కుమార్తె చనిపోయిందని మృతురాలి తల్లి లీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వర్మ తేడా
ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సైకో వర్మ’ (వీడు తేడా). కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ కథానాయికలు. గతంలో నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ ‘సైకో వర్మ’ను తెరకెక్కిస్తున్నారు. శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నట్టి కరుణ కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ ఫిల్మ్ ఎడిటర్ గౌతంరాజు క్లాప్ ఇచ్చారు. ‘‘ఈ చిత్రంలో రామ్‌గోపాల్ వర్మ అభిమానిగా కనిపిస్తాడు హీరో. రామ్‌గోపాల్ వర్మ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు’’ అన్నారు నట్టికుమార్. ‘‘డిసెంబర్లో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నట్టి కరుణ. ఈ చిత్రానికి కెమెరా: జనార్ధననాయుడు, సంగీతం: ఎస్.ఏ.ఖుద్దూస్, లైన్ ప్రొడ్యూసర్స్: ప్రేమ్ సాగర్, రమణా రెడ్డి. -
కొటేషన్లలోనే కొట్టేశారు!
సాక్షి, యాదాద్రి : కొటేషన్ల ద్వారా కొనుగోళ్లు చేశారు.. వారు చూపిన చోటనే కొనుగోళ్లు చేయాలని లబ్ధిదారులను పురమాయించారు. అధికారులు చెప్పిన చోటకు వెళ్లి సరుకులు తెచ్చుకున్నారు. రూ.2లక్షల మంజూరులో వారికి వచ్చింది కేవలం రూ.1.50లక్షల వస్తువులే. ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అధికారులతో గొడవ ఎందుకని సర్దుకుపోయారు ఇదీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గుడుంబా పునరావాసం పథకం అమలుపై ‘సాక్షి’ నిర్వహించిన గ్రౌండ్‌రిపోర్ట్‌లో వెల్లడైన వాస్తవాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించారు. ప్రభుత్వం గుడుంబా అమ్మకందారులకు కల్పించిన పునరావాస పథకం అమలులో అధికారులు అత్యంత చాకచాక్యంగా అవినీతికి పాల్పడినట్లు తేటతెల్లమైంది. బ్యాంకుల కాన్సంట్‌తో సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేస్తారు. మార్గదర్శకాల ప్రకారం ఎక్సైజ్ శాఖ లబ్ధిదారులను గుర్తించాలి. ఈ లబ్ధిదారుల జాబితాను సంక్షేమ శాఖల ద్వారా ఎంపీడీఓలకు పంపించి లబ్ధిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించిన తదనంతరం యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో గుడుంబా పునరావాసం పొందిన లబ్ధిదారులను కలిసినప్పుడు వారి మాటల్లో అధికారులు అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు. చాలా మంది తమ పేరు రాయడానికి ఇష్టపడలేదు. నిజం చెప్పితే మళ్లీ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతారని భయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేటగిరిలో 704 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఒక యూనిట్ విలువ రూ.2లక్షలు. మొత్తంగా 14.08 కోట్లు కేటాయించారు. జిల్లాల వారీగా చూస్తే..యాదాద్రి భువనగిరి జిల్లాలో 81 మంది లబ్ధిదారులను గుర్తిస్తే 76 మందికి గ్రౌండింగ్‌చేశారు. నల్లగొండ జిల్లాలో 229 మందికి 229మందికి మంజూరు చేశారు. అత్యధిక తండాలు కలిగిన సూర్యాపేట జిల్లాలో 394 మంది గుడుంబా తయారీ, విక్రయదారులను గుర్తించగా 391 మందికి పునరావాస పథకం కింద నగదు మంజూరు చేశారు. చేతికి చిల్లిగవ్వ ఇవ్వలేదు పునరావాసం కింద మంజూరైన మొత్తంతో కొనుగోళ్లన్నీ కోటేషన్లతో నడిపించారని, చేతికి ఒక్క రూపాయి ఇవ్వలేదని పలువురు లబ్ధిదారులు వాపోయారు. పునరావాసం పథకంలో పాడి పశువులు, గొర్రెలు, కిరాణం, జనరల్‌స్టోర్, లేడిస్ ఎంపోరియం, వస్త్ర దుకాణం, ఆటోమొబైల్, టెంట్‌హౌస్‌లు లబ్ధిదారుల కోరిక మేరకు ఇప్పించారు. అయితే ఎక్కడా కూడా లబ్ధిదారులకు చేతికి డబ్బులు ఇవ్వలేదు. అదే సమయంలో వారు కోరిన చోట కూడా ఇప్పించలేదు. ముందుగానే అధికారులు ఎంపిక చేసుకున్న దుకాణాల పేరు మీద కొటేషన్లు తీసుకుని వారి వద్ద సరుకులు కొనుగోలు చేశారు. దీంతో అధికారులు ముందుగానే కమీషన్లు మాట్లాడుకుని వారినుంచి కొటేషన్లను స్వీకరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరంలో ప్రతి యూనిట్ వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయి. లబ్ధిదారులు తాము ఇతర చోట్ల కొనుగోలు చేస్తామంటే అధికారులకు అందుకు అంగీకరించకపోవడం వెనుక అంతర్యంలోనే అక్రమాలు జరగాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి కొనుగోలులో రూ.50వేల వరకు అవినీతి జరిగిందని తెలుస్తోంది. జరిగిన అవినీతి బయటపెడితే తమను కేసుల పేరుతో వేధిస్తారని పేరు రాయడానికి ఇష్టపడని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలానికి చెందిన గిరిజన లబ్ధిదారుడొకరు ‘సాక్షి’తో చెప్పారు. ‘‘నాకు రూ.2లక్షలు మంజూరైది. వచ్చిన పేరే కానీ నాకు ఇచ్చింది రూ.1.40లక్షల సరుకులు మాత్రమే. అన్ని వారే ఇప్పించారు. హోల్‌సేల్ దుకాణానికి వెళ్లి తెచ్చుకోమంటే తెచ్చుకున్నాను. ఓ లెక్కా లేదు, ఓ పత్రం లేదు. ప్రభుత్వం ఇచ్చింది బతుకుదామని కిరాణ దుకాణం నడుపుకుంటున్నాను. ఇప్పుడు ఎవరి మీద చెప్పిపా ఏం లాభం’’ అంటూ దాటవేశాడు. అంతా పారదర్శకంగా చేశాం గుడుంబా పునరావాస పథకంలో యాదాద్రి జిల్లావ్యాప్తంగా 76మంది లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండ్ చేశాం. వారంతా ఇప్పుడు గుడుంబా అమ్మకాలు నిలిపివేసి వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నారు. మూడు సంవత్సరాల వరకు వారిపై నిఘా కొనసాగుతుంది. ఈ మేరకు సారా అమ్మకాలు చేయమని బాండ్ రాయించుకున్నాం. ఎలాంటి అక్రమాలు జరగకుండా కోటేషన్ల ద్వారా లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశాం. ఎక్కడా అవినీతి జరగలేదు. – కృష్ణప్రియ, యాదాద్రి జిల్లాఎక్సైజ్ శాఖ అధికారి డబ్బులు సగమే ఇచ్చారు.. నాది మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామం. పునరావాస పథకం కింద రూ. రెండు లక్షల విలువచేసే గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా అధికారులు కేవలం రూ. లక్ష విలువ చేసే గొర్రెలే ఇచ్చారు. రూ. లక్షకు 16 గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా ఒకటి కోతపెట్టారు. మిగిలిస రూ.లక్ష ఎప్పుడు ఇస్తారంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. సారా విక్రయించుకుంటూ ఉన్నంతలో పూట వెళ్లదీసుకునేది. ఇప్పుడు తిండికి ఇబ్బందులు పడుతున్నా. అధికారులను మిగిలిన డబ్బులు అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. మిగిలిన రూ. లక్ష అయినా చేతికందిస్తే చిన్నపాటి కిరాణ దుకాణం పెట్టుకుంటా. – భిక్షాల నాగయ్య, కందిబండ, మేళ్లచెరువు రూ.50 వేలకు మించి సరుకుల్లేవ్ ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన రాగటి పార్వతమ్మ ఐదేళ్ల నుంచి సారా విక్రయిస్తుంది. సారానిర్మూలనలో భాగంగా పార్వతమ్మకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తామని చెప్పింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఆమెకు భువనగిరిలో కిరాణా సరుకులు ఇప్పించారు. అయితే రూ. 2లక్షల విలువ గల సామగ్రి ఇప్పించాల్సి ఉండగా అధికారులు ఇప్పించిన సరుకులు రూ. 50 వేలకు మించి కూడా లేవని పార్వతమ్మ వాపోతోంది. సరుకులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తోంది. – రాగటి పార్వతమ్మ, ఆత్మకూరు(ఎం) -
శశికళ కుటుంబంలో ‘ఆర్కేనగర్’ చిచ్చు!
ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ గెలుపు శశికళ కుటుంబంలో ఆధిపత్య పోరుకు దారితీసింది. శశికళ సోదరి కుమారుడైన దినకరన్, ఆయన సోదరుడు భాస్కరన్.. శశికళ మేనకోడలు కృష్ణప్రియల మధ్య రాజకీయ వారసత్వం కోసం అంతర్గత కుమ్ములాట మొదలైనట్టు తెలిసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలనే కాదు, శశికళ కుటుంబంలో సైతం కలకలం రేపాయి. రాజకీయ వారసులు ఎవరనే అంశంలో కలతలు సృష్టించాయి. కుటుంబసభ్యులతో శశికళ భర్త నటరాజన్ ఇటీవల నిర్వహించిన వారసత్వ పంచాయితీ... పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు దినకరన్ సిద్ధపడేవరకు వెళ్లింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ అధిక్యతతో దినకరన్ గెలుపొందిన సమయంలో జయలలిత, శశికళకు తానే అసలైన రాజకీయ వారసుడినని దినకరన్ ప్రకటించడం వారి కుటుంబంలో చిచ్చు రేపింది. ఆర్కేనగర్లో దినకరన్‌ను గెలిపించడం ద్వారా ప్రజలు, ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేకు తామే వారసులమని రుజువైందని దినకరన్ తమ్ముడు భాస్కరన్ ప్రచారం మొదలుపెట్టారు. పార్టీ నడిపించే హక్కు తమకు మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వద్ద రెండాకుల చిహ్నం మాత్రమే ఉంది, అది వారికి ఎలా వచ్చిందో అందరికీ తెలుసు, అయితే పార్టీ, కార్యకర్తలు తమవైపు ఉన్నారని భాస్కరన్ చేసిన వ్యాఖ్యలు దినకరన్‌కు ఆగ్రహం తెప్పిం చాయి. తమ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మాటలు లేవు, నేడు ఈ వాఖ్యానాలు ఏమిటని దినకరన్ ప్రశ్నించారు. పార్టీ, ప్రభుత్వం ఏదైనా నా మాటే చెల్లుబాటని దినకరన్ చేసిన ప్రకటనను శశికళ కుటుంబ సభ్యులు స్వాగతించడం లేదు. జయలలిత మరణానికి శశికళే కారణమని ప్రజలు ఆరోపించినా ఆమె మౌనంగా భరించారని, అయితే ఎన్నికల కోసం అపోలో దృశ్యాలను విడుదల చేసి జయలలితను దినకరన్ అవమానపరిచారని ఫేస్బుక్, మీడియా వద్ద కృష్ణప్రియ విరుచుకుపడ్డారు. దినకరన్ అనుచరుడు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తానే శశికళ వారసురాలినని కృష్ణప్రియ ప్రకటించుకోవడం దినకరన్ అనుచరుల్లో ఆగ్రహం తెప్పించింది. దినకరన్, దివాకరన్, భాస్కరన్, వివేక్, కృష్ణప్రియల మధ్య చోటుచేసుకున్న విభేదాలు విశ్వరూపం దాల్చడంతో చెన్నై అడయారులోని శశికళ భర్త నటరాజన్ ఇంట రెండురోజుల క్రితం పంచాయితీ పెట్టారు. ఈ సమయంలో దినకరన్ మాట్లాడుతూ శశికళనో, మన కుటుంబాన్నో చూసి ఆర్కేనగర్ ప్రజలు ఓటువేయలేదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, తటస్థ ఓట్లే తనను గెలిపించాయని దినకరన్ వారి ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మీరంతా ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే మేమే వారసులమని మీడియా ముందు ప్రకటించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కృష్ణప్రియ సీమంతం నాటి ఫొటోలు (ఫైల్) కృష్ణప్రియకు రాజకీయాల గురించి ఏమి తెలుసు, జయలలిత సమక్షంలో పోయెస్‌గార్డెన్‌లో ఏనాడో జరిగిన తన సీమంతం ఫొటోను కృష్ణప్రియ ఇప్పుడు విడుదల చేయాల్సిన అవసరం ఏమిటని దినకరన్ రెట్టించి ప్రశ్నించారు. సీమంతం ఫొటో ద్వారా జయలలిత రాజకీయ, కుటుంబ వారసురాలిగా ప్రయత్నిస్తున్నారా అని కృష్ణప్రియను నిలదీశారు. మీడియాతో మాటలు, ఫేస్బుక్లో పోస్టింగులు ఇకనైనా నిలిపివేయాలని వారిని దినకరన్ హెచ్చరించినంత పనిచేశారు. అందరం ఇలా వ్యవహరిస్తే మళ్లీ చిక్కుల్లో ఇరుక్కుంటామని హితవు పలికారు. శశికళ చెబితేనే పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, ఆమె ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని దినకరన్ కుటుంబ సభ్యులతో స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ ఈ దినకరన్ ఎక్కడున్నారు, ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడని కృష్ణప్రియ వ్యాఖ్యానించడంతో వారసత్వపోరు తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. -
నేనూ రాజకీయాల్లోకి వస్తా..!
‘నేనూ రాజకీయాల్లోకి వస్తా.. ఎలా వస్తాను.. ఏ మార్గంలో వస్తానో వచ్చే ఏడాది వరకు వేచి చూడండి’ అంటున్నారు శశికళ వదిన ఇళవరసి కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను దినకరన్ విడుదల చేయడం బాహ్యప్రపంచంలోనే కాక శశికళ కుటుంబంలో సైతం వివాదాస్పదమైంది. మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కృష్ణప్రియ ఓ వారపత్రిక ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేశారు. సాక్షి, చెన్నై: శశికళ కుటుంబం నుంచి ఏకైక నేతగా చక్రం తిప్పుతున్న టీటీవీ దినకరన్‌కు చెక్‌పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ్రçకమంలో ఇళవరసి కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలు కెళ్లేముందు తన ప్రతినిధిగా అక్క కుమారుడైన టీటీవీ దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జయలలిత రాజకీయాలకు పరోక్ష వారసులుగా శశికళ కుటుంబం నుంచి దినకరన్ మాత్రమే రంగంలో ఉన్నారు. ఆర్కేనగర్ నుంచి పోటీ చేయడం ద్వారా చురుకైన రాజకీయ పాత్ర పోషిస్తున్నారు. అయితే జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను దినకరన్ విడుదల చేయడం వల్ల శశికళ కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయి. ఎవరికీ తెలియకుండా, శశికళ అనుమతి తీసుకోకుండా తన స్వార్థం కోసం విడుదల చేయడంపై శశికళ వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ బహిరంగంగా మీడియా వద్దనే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపధ్యంలో కృష్ణప్రియ ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటరŠూయ్వ శనివారం మాలైమురసు సాయంకాల దినపత్రికలో ప్రచురితమైంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నపుడు సెల్‌ఫోన్ ద్వారా శశికళ చిత్రీకరించిన దృశ్యాలను పెరోల్‌పై వచ్చినపుడు మాకు అందజేశారు. అవసరమైన పక్షంలో ఆ దృశ్యాలను జయ విచారణ కమిషన్‌కు చూపాలని ఆమె కోరారు. ఆ వీడియోను కాపీ చేసి దినకరన్, వివేక్‌లకు అప్పగించాం. ఆ దృశ్యాలనే వెట్రివేల్ ద్వారా దినకరన్ ఇటీవల విడుదల చేయించారు. ఒరిజినల్ వీడియో ఇంకా చాలా సమయం చిత్రీకరించి ఉంది. జయలలిత, శశికళ మాట్లాడుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అయితే జయలలిత, శశికళ మాట్లాడుకునే దృశ్యాలను కత్తిరించి కొన్ని సెకన్లు వీడియోను మాత్రమే దినకరన్ విడుదల చేశారు. జయ వీడియో విడుదలైన సంగతి శశికిళకే తెలియదు. ఆమెపై హత్యానేరం ఆరోపణలు వచ్చినపుడు సైతం విడుదల చేయడం ఇష్టంలేని వీడియోను దినకరన్ కోసం విడుదల చేయడాన్ని శశికళ అంగీకరించి ఉండరు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎన్నికయినపుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆమె అనుకునే ఉంటే ఆనాడే విడుదల చేసేవారు. అయితే ఒకే ఒక నియోజకవర్గంలో గెలుపుకోసం, పార్టీ చిహ్నం తమవద్ద లేని సమయంలో వీడియో విడుదల చేయడానికి దినకరన్‌కు ఎలా బుద్ధిపుట్టిందో. తమ వద్ద వేలకొలదీ వీడియోలు ఉన్నాయని దివాకరన్ కుమారుడు జయంత్ చేసిన ప్రకటననే ఆనాడు శశికళ ఖండించారు. ఆ వీడియోను ప్రజల ముందు ఉంచడానికి తీయలేదని శశికళ స్పష్టంగా చెప్పారు. ఆమె ఆదేశాలను కాదని విడుదల చేయడం, దానిపై అభిప్రాయాలను వెలిబుచ్చడం ధర్మసమ్మతం కాదు. రాజకీయాల్లోకి కొందరు ఎంతో ఆసక్తిగా వస్తారు. దాన్ని తప్పు అని చెప్పలేం. నాకు రాజకీయాలపై ఆసక్తి ఉందా అంటే లేదనే చెబుతాను. అయితే రావాలనే ఆలోచన రాగానే కచ్చితంగా వచ్చి తీరుతాను. ఎలా వస్తాను, ఏ మార్గంలో వస్తాను అనేదానికి వచ్చే ఏడాది వరకు ఓపిగ్గా వేచి చూడండి. రాజకీయాల్లోకి వచ్చేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయకుండా లేను. నాకు పదేళ్ల వయసున్నపుడు కుటుంబంతో సహా పోయెస్ గార్డెన్‌లోని జయ ఇంటికి చేరుకున్నాం. మా అమ్మ ఇళవరసి, అత్త శశికళ రాజకీయ క్రీడల్లో చిక్కుకుని పడిన అవస్థలు, వారు ఎదుర్కొన్న ఒత్తిడులను చూస్తూనే ఎదిగాం. అలాంటి పరిస్థితులు నా పిల్లలకు రాకూడదనే కొంతకాలం మౌనంగా ఉన్నాను’’ అని కృష్ణప్రియ అన్నారు. వెట్రివేల్ అరెస్ట్‌కు లైన్‌క్లియర్ అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను విడుదల చేసిన నేరంపై బహష్కృత ఎమ్మెల్యే వెట్రివేల్ అరెస్ట్‌కు లైన్‌క్లియర్ అయింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేస్తున్న పిటిషన్‌ను చెన్నై జిల్లా మేజిస్ట్రేటు శనివారం కొట్టివేసింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్‌కు మరో 24 గంటలు ఉండగా వీడియో విడుదల చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఈసీ పోలీసుకేసు పెట్టింది. అలాగే, జయ మరణంపై కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలో వీడియో విడుదల చేయడాన్ని తప్పుపడుతూ కమిషన్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులతో వెట్రివేల్‌పై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించడంతో వెట్రివేల్ అరెస్ట్‌కు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, శశికళ అనుమతితోనే వీడియో విడుదల చేశానని దినకరన్ వాదిస్తున్నారు. వీడియో విడుదల బాహ్యప్రపంచలోనే కాక శశికళ కుటుంబలో సైతం వివాదాస్పదమైంది. దీంతో జనవరి మొదటి వారంలో దినకరన్ బెంగళూరుకు వెళ్లి శశికళను కలుసుకుంటున్నారు. అలాగే కృష్ణప్రియ సైతం శశికళను, తల్లి ఇళవరసిని బెంగళూరు జైల్లో కలిసి దినకరన్‌పై ఫిర్యాదు చేసేం దుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
దినకరన్‌పై శశికళ మేనకోడలు ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ మేనకోడలు డాక్టర్ కృష్ణప్రియ తాను వచ్చేఏడాది రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆర్కేనగర్లో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ జయ వీడియో దృశ్యాలను విడుదల చేయడం వారి కుటుంబాల్లో మనస్పర్ధలకు దారితీసింది. శశికళ వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘జయలలిత, శశికళ మాట్లాడుకునే దృశ్యాలను కత్తిరించి కొన్ని సెకన్ల వీడియోనే విడుదల చేశారు. జయ వీడియో విడుదలైన సంగతి శశికళకే తెలియదు. ఆమెపై హత్యానేరం ఆరోపణలు వచ్చినపుడు విడుదల చేయడం ఇష్టంలేని వీడియోను దినకరన్ కోసం విడుదల చేయడాన్ని శశికళ అంగీకరించి ఉండదు. ఒకే ఒక నియోజకవర్గంలో గెలుపుకోసం, పార్టీ చిహ్నం తమవద్ద లేనప్పుడు వీడియో విడుదల చేయడానికి దినకరన్‌కు ఎలా బుద్ధిపుట్టిందో..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఐటీ అల్టిమేటం
ఐటీ దాడుల్లో ఆధారాలు లభించినా, కొన్ని కీలకరికార్డులు, దస్తావేజుల ఒరిజినల్స్ తమ చేతికి చిక్కని దృష్ట్యా, వాటన్నింటిని రెండ్రోజుల్లోపు సమర్పించాల్సిందే అని చిన్నమ్మ కుటుంబం, సన్నిహితులకు ఐటీ వర్గాలు అల్టిమేటం ఇచ్చాయి ఆరుగురికి సమన్లు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక, విచారణ నిమిత్తం చిన్నమ్మ శశికళ అన్న జయరామన్ కుమార్తెలు కృష్ణప్రియ, షకీల బుధవారం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం మెట్లను ఎక్కారు. ఐటీ దాడులు సహజమేఅని, ఇందులో రాజకీయం లేనే లేదంటూ కృష్ణప్రియ వ్యాఖ్యానించడం గమనించ దగ్గ విషయం. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి సాగిన ఐటీ దాడులు, సోదాలు ముగియడంతో విచారణల వేగం పెరిగింది. అధికారుల పరిశీలనలో అక్రమార్జన బండారం బయటపడుతోంది. అదే సమయంలో కొన్ని సంస్థల్లో పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల వివరాలు లభించినా, ఒరిజినళ్లు దాడుల్లో తమకు చిక్కకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డట్టు సమాచారం. ప్రధానంగా కీలక ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్స్ ఎక్కడ దాచారన్న చర్చ బయలుదేరింది. దాచి పెట్టిన వాళ్లే వాటిని బయటకు తీసి, తమకు అప్పగించే రీతిలో ఐటీ వర్గాలు గడువును నిర్ణయిస్తూ అల్టిమేటం ఇవ్వడం గమనార్హం. వివేక్ చుట్టూ ఉచ్చు చిన్నమ్మ శశికళ అన్నయ్య జయరామన్, ఇళవరసి దంపతుల కుమారుడు వివేక్ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తున్న విషయం తెలిసిందే. వివేక్ పేరిట అత్యధికంగా ఆస్తులు, పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించి, ఆ దిశలో విచారణ వేగం పెరిగింది. తమకు లభించిన ఆధారాలను పరిశీలించే క్రమంలో కొన్ని ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు లభించని దృష్ట్యా, వాటన్నింటిని రెండు రోజుల్లో తమకు స్వయంగా సమర్పిస్తే సరి..! అన్న హెచ్చరికతో వివేక్‌కు సమన్లు వెళ్లినట్టు సమాచారం. ఇక, వివేక్ సన్నిహితులుగా భావిస్తున్న సురానా ఫైనాన్స్, శ్రీలక్ష్మి జువలరీస్ తెన్నరసు, సునీల్, సెంథిల్, విండ్ ఎనర్జీ సుబ్రమణ్యంలకు సైతం ఒరిజినల్స్ సమర్పించే విధంగా హెచ్చరికతో కూడిన సమన్లు వెళ్లినట్టు సమాచారం. జాస్ సినిమాస్ కొనుగోలు వ్యవహారంతో పాటు, అనేక డాక్యుమెంట్లు జిరాక్స్‌లుగా తేల్చిన అధికారులు , దాచిపెట్టిన వాటిని బయటకు తీస్తారా..? లేదా, రిజిష్ట్రేషన్ల శాఖను ఆశ్రయించి, వివరాల్ని రాబట్టి, కఠినంగా వ్యవహరించమంటారా.? అన్న హెచ్చరికతో ఈ సమన్లు జారీ చేసినట్టు ఐటీ కార్యాలయంలో చర్చ. మనో వేదనలో చిన్నమ్మ, ఇళవరసి ఈ దాడులు, విచారణల పుణ్యమా అని పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశి కళ, ఇళవరసిలకు మనశ్శాంతి కరువైనట్టు సమాచారం. ఈ ఇద్దరు తీవ్ర మనోవేదనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, దినకరన్‌కు చిన్నమ్మ లేఖ రాసినట్టు సమాచారం. ఆ లేఖలో ఐటీ దాడులు, వాటిని ఎదుర్కొనేందుకు తగ్గ వ్యూహాలు, ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానాల గురించి వివరించిన ట్టు తెలిసింది. ఈ లేఖ బుధవారం దినకరన్‌కు అందించినట్టుంది. అందుకే కాబోలు, ఆయన తరఫున ప్రతినిధులు ఓ ప్రకటన వెలువరించడం గమనార్హం. గత రెండు రోజులుగా మౌనంగా ఉన్న దినకరన్, తాజాగా జారీచేసిన ప్రకటనలో చిన్నమ్మ కుటుంబంలో ఉన్న వాళ్లంతా చదువుకున్న వాళ్లేనని, బాధ్యత గల సంస్థల్ని నిర్వర్తిస్తున్నారని, మోసాలతో, పన్ను ఎగవేతతో కాలం నెట్టుకు రావాల్సినంత దిగజారే పరిస్థితిలో లేదన్నట్గుగా ఆ ప్రకటన ఉండడం గమనార్హం. జీవనానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి నుంచి రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికి ఉన్నారు. విచారణకు కృష్ణ ప్రియ, షకీల చిన్నమ్మ శశికళకు తోడుగా పరప్పన అగ్రహార చెరలో ఇళవరసి కూడా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈమె కుమారుడు వివేక్‌ను ఐటీ గురిపెట్టింది. ఇక, ఆమె కుమార్తెలు కృష్ణప్రియ, షకీలలను కూడా ఐటీ వర్గాలు విచారణకు పిలిచాయి. బుధవారం ఆ ఇద్దరు తమ భర్తలతో కలిసి నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చారు. ఈ ఇద్దర్ని వేర్వేరుగా కూర్చోబెట్టి ఐటీ వర్గాలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. ప్రధానంగా కృష్ణప్రియ ఆధీనంలోని సంస్థలతో పాటు ఆమె నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున నగదు బదిలీలు సాగి ఉండడాన్ని పరిగణించి, అందుకు తగ్గ ప్రశ్నల్ని సంధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అనేక ప్రశ్నలకు ఆమె దాటవేత ధోరణి అనుసరించగా, షకీల అయితే, సమాధానాలు ఇవ్వకుండా మౌనం వహించినట్టు సమాచారం. ఈ విచారణ అనంతరం మీడియాతో కృష్ణప్రియ మాట్లాడుతూ, ఐటీ విచారణకు పూర్తి సహకారం అందించామన్నారు. తన ఇంట్లో నుంచి ఎలాంటి రికార్డులు పట్టుకు వెళ్ల లేదని స్పష్టం చేశారు. ఐటీ దాడులు సహజమేనని, దీనిని వ్యతిరేకించడం, ఖండించడం అనవసరంగా పేర్కొన్నారు. ఈ దాడులు, విచారణల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారని, ఎప్పుడు పిలిచినా సంపూర్ణ సహకారం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, జయ టీవీ మేనేజర్ నటరాజన్ సైతం విచారణకు హాజరు అయ్యారు. కొడనాడు చుట్టూ ఐటీ విచారణ చిన్నమ్మ కుటుంబంతో పాటు నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్, గ్రీన్ టీ ఎస్టేట్ల చుట్టూ సాగుతోంది. ఇక్కడ సోదాలు ముగిసినా, ఐటీ అధికారులు విచారణ మాత్రం ముగించలేదు. తమ విచారణను ముమ్మరం చేశారు. కొడనాడు ఎస్టేట్ మేనేజర్ నటరాజన్, పక్కనే ఉన్న గ్రీన్ టీ ఎస్టేట్ మేనేజర్ పళనికుమార్లతో పాటు 20 మందిని ఒకరి తర్వాత మరొకరు చొప్పున విచారించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ పాత నోట్లు బయటపడడమే కాకుండా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నోట్ల కట్టలు ఓట్ల కొనుగోలుకు పంపించినట్టు ఓ జాబితా అధికారులకు చిక్కినట్టు సమాచారం. అందుకే ఆ జాబితా ఆధారంగా విచారణ ముమ్మరంగా సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ములాఖత్‌కు వివేక్ మేనత్త శశికళ, తల్లి ఇళవరసిలతో ములాఖత్‌కు వివేక్ కసరత్తుల్లో ఉన్నారు. ఇందుకు తగ్గట్టు న్యాయవాదులు పరప్పన అగ్రహార చెరలో వినతి పత్రాన్ని సమర్పించారు. పరప్పన అగ్రహార చెరలో శశికళ, ఇళవరసిలతో న్యాయవాదులు మూర్తి రావు, కృష్ణప్ప సమావేశం కావడం వెలుగు చూసింది. తాజా, పరిణామాల నేపథ్యంలోనే ఈ భేటీ సాగి ఉంటుందని, చట్టపరంగా ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఆ న్యాయవాదుల్ని మీడియా ప్రశ్నించగా, తల్లి ఇళవరసిని కలిసేందుకు వివేక్ సమయం కోరి ఉన్నారని, అందుకు తగ్గ వినతి పత్రం, వివేక్ రాసిన లేఖ జైలు వర్గాలకు సమర్పించామని పేర్కొన్నారు. కాగా పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ దీనిపై మాట్లాడుతూ ఐటీ దాడుల్లో వెలుగుచూసిన అన్ని వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. శశికళ కుటుంబానికి సంబంధించిన కేసులన్నీ ప్రత్యేక న్యాయమూర్తిని నియమించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
మెయిన్ ‘డ్రా’కు కృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్: థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కుదరవల్లి శ్రీ కృష్ణప్రియ మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫయి0గ్ పోటీల్లో 18 ఏళ్ల కృష్ణప్రియ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. తొలి రౌండ్లో కృష్ణప్రియ 21-13, 21-12తో తసమోన్ సంగ్కవతానా (థాయ్‌లాండ్)పై, రెండో రౌండ్లో 21-15, 21-18తో బంతిటా ఖామ్సరుుతోంగ్ (థాయ్‌లాండ్) పై గెలిచింది. మరో తెలుగు అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో 13-21, 10-21తో ఒర్నిచా జాంగ్సతాపోర్న్పార్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయి0ది. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో సుసాంతో (ఇండోనేసియా)తో కృష్ణప్రియ ఆడుతుంది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో శ్రేయాన్‌ష జైస్వాల్ 17-21, 12-21తో కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో, హైదరాబాద్ ప్లేయర్ రోహిత్ యాదవ్ 16-21, 15-21తో పాంజీ అహ్మద్ మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. -
క్వార్టర్ఫైనల్లో కృష్ణప్రియ
హైదరాబాద్: వి.వి.నటూ మెమోరియల్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి కె.శ్రీకృష్ణప్రియ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహారాష్ట్రలోని పుణేలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్స్‌లో 21-19, 21-8తో వైష్ణవి బాలీ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందిన కృష్ణప్రియ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో చెన్నై ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
సెమీస్‌లో కృష్ణప్రియ
సెమీస్‌లో కృష్ణప్రియ కాకినాడ: ఆలిం డియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన కె. శ్రీకృష్ణప్రియ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కృష్ణప్రియ 21-7, 21-15తో ముద్ర ధనంజే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. -
సంప్రదాయ రీతిలో అట్లి పెళ్లి
వర్ధమాన దర్శకుడు అట్లి, నటి ప్రియల వివాహం ఆదివారం ఉదయం సంప్రదాయ రీతిలో జరిగింది. దర్శకుడు శంకర్ శిష్యుడైన అట్లి రాజా రాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే విజయం సాధించి చిత్ర పరిశ్రమను తన వైపు తిప్పుకున్న అట్లి తన రెండో చిత్రాన్ని ఇళయదళపతి విజయ్ హీరోగా చేయనున్నారు. చాలాకాలంగా బుల్లితెర, వెండితెర నటి ప్రియ, అట్లి ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ జంట ఆదివారం పెళ్లిపీటలె క్కింది. స్థానిక అన్నాశాలైలోని నక్షత్ర హోటల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. దర్శకుడు శంకర్ సతీసమేతంగా విచ్చేసి ఆహుతులకు ఏర్పాటు చేసిన పెళ్లి వేదిక స్థలంలో ముందు వరసలో కూర్చొని పెళ్లి వేడుకను ఆద్యంతం తిలకించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు మధ్య తన చేతులతో మంగళసూత్రాలను తన శిష్యుడు అట్లీకి అందించగా ఆయన వధువు ప్రియ మెడలో మాంగల్య ధారణ చేశారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల బంధుమిత్రులతోపాటు దర్శకుడు బాలా, నటుడు శివకార్తికేయన్, నాజర్ తదితర పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. సాయంత్రం జరిగిన వివాహ రిసెప్షన్‌కు పలువురు చిత్ర ప్రముఖులు తరలి వచ్చి శుభాకాంక్షలు అందించారు. -
మెయిన్ ‘డ్రా’కు శ్రీకృష్ణప్రియ, వైష్ణవి
న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.శ్రీకృష్ణప్రియ, కె.వైష్ణవి, చేతన్ ఆనంద్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లోని చివరి రౌండ్లో శ్రీ కృష్ణప్రియ 21-14, 21-17తో వైశాలి బరియా (గుజరాత్)పై, వైష్ణవి 21-11, 24-26, 24-22తో లలితా దహియా (హర్యానా)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో మూడుసార్లు జాతీయ చాంపియన్ చేతన్ ఆనంద్ 21-11, 21-13తో ఎన్వీఎస్ విజేత (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గాడు. మరోవైపు రాష్ట్రానికే చెందిన సి.రాహుల్ యాదవ్ 21-23, 18-21తో రోహన్ కాస్టెలినో (కర్ణాటక) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ విభాగం క్వాలిఫయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి పది మంది బరిలోకి దిగారు. చివరి రౌండ్లో జి.వృశాలి, సంతోషి హాసిని, వి.ప్రమద, వి.హారిక, ఎం.పూజ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయి త్రుటిలో మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. చివరి రౌండ్లో చిత్రలేఖ (రైల్వేస్) 25-23, 13-21, 21-17తో వృశాలిపై, కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర) 21-8, 13-21, 21-19తో సంతోషి హాసినిపై, రసిక రాజె (మహారాష్ట్ర) 21-9, 21-10తో ప్రమదపై, వైష్ణవి అయ్యర్ (కర్ణాటక) 21-13, 16-21, 21-15తో వి.హారికపై, ధన్య నాయర్ (రైల్వేస్) 21-10, 18-21, 21-6తో పూజపై నెగ్గి మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో సృజన్ నందలూరి-వినయ్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) జోడి 11-21, 21-11, 24-22తో సంతోష్ రావూరి-చైతన్య రెడ్డి (ఆంధ్రప్రదేశ్) జంటను ఓడించి మెయిన్ ‘డ్రా’కు చేరింది. బుధ, గురువారాల్లో ఇంటర్ స్టేట్, ఇంటర్ జోనల్ టీమ్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయి. శుక్రవారం నుంచి సోమవారం వరకు వ్యక్తిగత విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు ఉంటాయి.