‘నేనూ రాజకీయాల్లోకి వస్తా.. ఎలా వస్తాను.. ఏ మార్గంలో వస్తానో వచ్చే ఏడాది వరకు వేచి చూడండి’ అంటున్నారు శశికళ వదిన ఇళవరసి కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను దినకరన్ విడుదల చేయడం బాహ్యప్రపంచంలోనే కాక శశికళ కుటుంబంలో సైతం వివాదాస్పదమైంది. మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కృష్ణప్రియ ఓ వారపత్రిక ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేశారు.
సాక్షి, చెన్నై: శశికళ కుటుంబం నుంచి ఏకైక నేతగా చక్రం తిప్పుతున్న టీటీవీ దినకరన్‌కు చెక్‌పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ్రçకమంలో ఇళవరసి కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలు కెళ్లేముందు తన ప్రతినిధిగా అక్క కుమారుడైన టీటీవీ దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జయలలిత రాజకీయాలకు పరోక్ష వారసులుగా శశికళ కుటుంబం నుంచి దినకరన్ మాత్రమే రంగంలో ఉన్నారు.
ఆర్కేనగర్ నుంచి పోటీ చేయడం ద్వారా చురుకైన రాజకీయ పాత్ర పోషిస్తున్నారు. అయితే జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను దినకరన్ విడుదల చేయడం వల్ల శశికళ కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయి. ఎవరికీ తెలియకుండా, శశికళ అనుమతి తీసుకోకుండా తన స్వార్థం కోసం విడుదల చేయడంపై శశికళ వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ బహిరంగంగా మీడియా వద్దనే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపధ్యంలో కృష్ణప్రియ ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటరŠూయ్వ శనివారం మాలైమురసు సాయంకాల దినపత్రికలో ప్రచురితమైంది.
ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్నపుడు సెల్‌ఫోన్ ద్వారా శశికళ చిత్రీకరించిన దృశ్యాలను పెరోల్‌పై వచ్చినపుడు మాకు అందజేశారు. అవసరమైన పక్షంలో ఆ దృశ్యాలను జయ విచారణ కమిషన్‌కు చూపాలని ఆమె కోరారు. ఆ వీడియోను కాపీ చేసి దినకరన్, వివేక్‌లకు అప్పగించాం. ఆ దృశ్యాలనే వెట్రివేల్ ద్వారా దినకరన్ ఇటీవల విడుదల చేయించారు. ఒరిజినల్ వీడియో ఇంకా చాలా సమయం చిత్రీకరించి ఉంది.
జయలలిత, శశికళ మాట్లాడుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అయితే జయలలిత, శశికళ మాట్లాడుకునే దృశ్యాలను కత్తిరించి కొన్ని సెకన్లు వీడియోను మాత్రమే దినకరన్ విడుదల చేశారు. జయ వీడియో విడుదలైన సంగతి శశికిళకే తెలియదు. ఆమెపై హత్యానేరం ఆరోపణలు వచ్చినపుడు సైతం విడుదల చేయడం ఇష్టంలేని వీడియోను దినకరన్ కోసం విడుదల చేయడాన్ని శశికళ అంగీకరించి ఉండరు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎన్నికయినపుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆమె అనుకునే ఉంటే ఆనాడే విడుదల చేసేవారు. అయితే ఒకే ఒక నియోజకవర్గంలో గెలుపుకోసం, పార్టీ చిహ్నం తమవద్ద లేని సమయంలో వీడియో విడుదల చేయడానికి దినకరన్‌కు ఎలా బుద్ధిపుట్టిందో.
తమ వద్ద వేలకొలదీ వీడియోలు ఉన్నాయని దివాకరన్ కుమారుడు జయంత్ చేసిన ప్రకటననే ఆనాడు శశికళ ఖండించారు. ఆ వీడియోను ప్రజల ముందు ఉంచడానికి తీయలేదని శశికళ స్పష్టంగా చెప్పారు. ఆమె ఆదేశాలను కాదని విడుదల చేయడం, దానిపై అభిప్రాయాలను వెలిబుచ్చడం ధర్మసమ్మతం కాదు. రాజకీయాల్లోకి కొందరు ఎంతో ఆసక్తిగా వస్తారు. దాన్ని తప్పు అని చెప్పలేం. నాకు రాజకీయాలపై ఆసక్తి ఉందా అంటే లేదనే చెబుతాను. అయితే రావాలనే ఆలోచన రాగానే కచ్చితంగా వచ్చి తీరుతాను.
ఎలా వస్తాను, ఏ మార్గంలో వస్తాను అనేదానికి వచ్చే ఏడాది వరకు ఓపిగ్గా వేచి చూడండి. రాజకీయాల్లోకి వచ్చేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయకుండా లేను. నాకు పదేళ్ల వయసున్నపుడు కుటుంబంతో సహా పోయెస్ గార్డెన్‌లోని జయ ఇంటికి చేరుకున్నాం. మా అమ్మ ఇళవరసి, అత్త శశికళ రాజకీయ క్రీడల్లో చిక్కుకుని పడిన అవస్థలు, వారు ఎదుర్కొన్న ఒత్తిడులను చూస్తూనే ఎదిగాం. అలాంటి పరిస్థితులు నా పిల్లలకు రాకూడదనే కొంతకాలం మౌనంగా ఉన్నాను’’ అని కృష్ణప్రియ అన్నారు.
వెట్రివేల్ అరెస్ట్‌కు లైన్‌క్లియర్
అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను విడుదల చేసిన నేరంపై బహష్కృత ఎమ్మెల్యే వెట్రివేల్ అరెస్ట్‌కు లైన్‌క్లియర్ అయింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేస్తున్న పిటిషన్‌ను చెన్నై జిల్లా మేజిస్ట్రేటు శనివారం కొట్టివేసింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్‌కు మరో 24 గంటలు ఉండగా వీడియో విడుదల చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఈసీ పోలీసుకేసు పెట్టింది. అలాగే, జయ మరణంపై కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలో వీడియో విడుదల చేయడాన్ని తప్పుపడుతూ కమిషన్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులతో వెట్రివేల్‌పై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు.
ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించడంతో వెట్రివేల్ అరెస్ట్‌కు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, శశికళ అనుమతితోనే వీడియో విడుదల చేశానని దినకరన్ వాదిస్తున్నారు. వీడియో విడుదల బాహ్యప్రపంచలోనే కాక శశికళ కుటుంబలో సైతం వివాదాస్పదమైంది. దీంతో జనవరి మొదటి వారంలో దినకరన్ బెంగళూరుకు వెళ్లి శశికళను కలుసుకుంటున్నారు. అలాగే కృష్ణప్రియ సైతం శశికళను, తల్లి ఇళవరసిని బెంగళూరు జైల్లో కలిసి దినకరన్‌పై ఫిర్యాదు చేసేం దుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment