ఐటీ అల్టిమేటం | Vivek's sisters appear before I-T for questioning | Sakshi
Sakshi News home page

ఐటీ అల్టిమేటం

Published Thu, Nov 16 2017 7:41 AM | Last Updated on Thu, Sep 27 2018 3:37 PM

Vivek's sisters appear before I-T for questioning  - Sakshi

మీడియాతో కృష్ణప్రియ

ఐటీ దాడుల్లో ఆధారాలు లభించినా, కొన్ని కీలకరికార్డులు, దస్తావేజుల ఒరిజినల్స్‌ తమ చేతికి చిక్కని దృష్ట్యా, వాటన్నింటిని రెండ్రోజుల్లోపు సమర్పించాల్సిందే అని చిన్నమ్మ కుటుంబం, సన్నిహితులకు ఐటీ వర్గాలు అల్టిమేటం ఇచ్చాయి ఆరుగురికి సమన్లు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక, విచారణ నిమిత్తం చిన్నమ్మ శశికళ అన్న జయరామన్‌ కుమార్తెలు కృష్ణప్రియ, షకీల బుధవారం ఆదాయ పన్ను శాఖ కార్యాలయం మెట్లను ఎక్కారు. ఐటీ దాడులు సహజమేఅని, ఇందులో రాజకీయం లేనే లేదంటూ కృష్ణప్రియ వ్యాఖ్యానించడం గమనించ దగ్గ విషయం.

సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి సాగిన ఐటీ దాడులు, సోదాలు ముగియడంతో విచారణల వేగం పెరిగింది. అధికారుల పరిశీలనలో అక్రమార్జన బండారం బయటపడుతోంది. అదే సమయంలో కొన్ని సంస్థల్లో పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల వివరాలు లభించినా, ఒరిజినళ్లు దాడుల్లో తమకు చిక్కకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డట్టు సమాచారం. ప్రధానంగా కీలక ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్స్‌ ఎక్కడ దాచారన్న చర్చ బయలుదేరింది. దాచి పెట్టిన వాళ్లే వాటిని బయటకు తీసి, తమకు అప్పగించే రీతిలో ఐటీ వర్గాలు గడువును నిర్ణయిస్తూ అల్టిమేటం ఇవ్వడం గమనార్హం.

వివేక్‌ చుట్టూ ఉచ్చు
చిన్నమ్మ శశికళ అన్నయ్య జయరామన్, ఇళవరసి దంపతుల కుమారుడు వివేక్‌ చుట్టూ ఐటీ ఉచ్చు బిగుస్తున్న విషయం తెలిసిందే. వివేక్‌ పేరిట అత్యధికంగా ఆస్తులు, పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించి, ఆ దిశలో విచారణ వేగం పెరిగింది. తమకు లభించిన ఆధారాలను పరిశీలించే క్రమంలో కొన్ని ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు లభించని దృష్ట్యా, వాటన్నింటిని రెండు రోజుల్లో తమకు స్వయంగా సమర్పిస్తే సరి..! అన్న హెచ్చరికతో వివేక్‌కు సమన్లు వెళ్లినట్టు సమాచారం. ఇక, వివేక్‌ సన్నిహితులుగా భావిస్తున్న సురానా ఫైనాన్స్, శ్రీలక్ష్మి జువలరీస్‌ తెన్నరసు, సునీల్, సెంథిల్, విండ్‌ ఎనర్జీ సుబ్రమణ్యంలకు సైతం ఒరిజినల్స్‌ సమర్పించే విధంగా  హెచ్చరికతో కూడిన సమన్లు వెళ్లినట్టు సమాచారం. జాస్‌ సినిమాస్‌ కొనుగోలు వ్యవహారంతో పాటు, అనేక డాక్యుమెంట్లు జిరాక్స్‌లుగా తేల్చిన అధికారులు , దాచిపెట్టిన వాటిని బయటకు తీస్తారా..? లేదా, రిజిష్ట్రేషన్ల శాఖను ఆశ్రయించి, వివరాల్ని రాబట్టి, కఠినంగా వ్యవహరించమంటారా.? అన్న హెచ్చరికతో ఈ సమన్లు జారీ చేసినట్టు ఐటీ కార్యాలయంలో చర్చ.

మనో వేదనలో చిన్నమ్మ, ఇళవరసి
ఈ దాడులు, విచారణల పుణ్యమా అని పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశి కళ, ఇళవరసిలకు మనశ్శాంతి కరువైనట్టు సమాచారం. ఈ ఇద్దరు తీవ్ర మనోవేదనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, దినకరన్‌కు చిన్నమ్మ లేఖ రాసినట్టు సమాచారం. ఆ లేఖలో ఐటీ దాడులు, వాటిని ఎదుర్కొనేందుకు తగ్గ వ్యూహాలు, ప్రశ్నలకు  ఇవ్వాల్సిన సమాధానాల గురించి వివరించిన ట్టు తెలిసింది. ఈ లేఖ బుధవారం దినకరన్‌కు అందించినట్టుంది. అందుకే కాబోలు, ఆయన తరఫున ప్రతినిధులు ఓ ప్రకటన వెలువరించడం గమనార్హం. గత రెండు రోజులుగా మౌనంగా ఉన్న దినకరన్, తాజాగా జారీచేసిన ప్రకటనలో చిన్నమ్మ కుటుంబంలో ఉన్న వాళ్లంతా చదువుకున్న వాళ్లేనని, బాధ్యత గల సంస్థల్ని నిర్వర్తిస్తున్నారని, మోసాలతో, పన్ను ఎగవేతతో కాలం నెట్టుకు రావాల్సినంత దిగజారే పరిస్థితిలో లేదన్నట్గుగా ఆ ప్రకటన ఉండడం గమనార్హం. జీవనానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి నుంచి రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికి ఉన్నారు.

విచారణకు కృష్ణ ప్రియ, షకీల
చిన్నమ్మ శశికళకు తోడుగా పరప్పన అగ్రహార చెరలో ఇళవరసి కూడా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈమె కుమారుడు వివేక్‌ను ఐటీ గురిపెట్టింది. ఇక, ఆమె కుమార్తెలు కృష్ణప్రియ, షకీలలను కూడా ఐటీ వర్గాలు విచారణకు పిలిచాయి. బుధవారం ఆ ఇద్దరు తమ భర్తలతో కలిసి నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయానికి వచ్చారు. ఈ ఇద్దర్ని వేర్వేరుగా కూర్చోబెట్టి ఐటీ వర్గాలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. ప్రధానంగా కృష్ణప్రియ ఆధీనంలోని సంస్థలతో పాటు ఆమె నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున నగదు బదిలీలు సాగి ఉండడాన్ని పరిగణించి, అందుకు తగ్గ ప్రశ్నల్ని సంధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అనేక ప్రశ్నలకు ఆమె దాటవేత ధోరణి అనుసరించగా, షకీల అయితే, సమాధానాలు ఇవ్వకుండా మౌనం వహించినట్టు సమాచారం. ఈ విచారణ అనంతరం మీడియాతో కృష్ణప్రియ మాట్లాడుతూ, ఐటీ విచారణకు పూర్తి సహకారం అందించామన్నారు. తన ఇంట్లో నుంచి ఎలాంటి రికార్డులు పట్టుకు వెళ్ల లేదని స్పష్టం చేశారు. ఐటీ దాడులు సహజమేనని, దీనిని వ్యతిరేకించడం, ఖండించడం అనవసరంగా పేర్కొన్నారు.  ఈ దాడులు, విచారణల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారని, ఎప్పుడు పిలిచినా సంపూర్ణ సహకారం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, జయ టీవీ మేనేజర్‌ నటరాజన్‌ సైతం విచారణకు హాజరు అయ్యారు.

కొడనాడు చుట్టూ
ఐటీ విచారణ చిన్నమ్మ కుటుంబంతో పాటు నీలగిరి జిల్లాలోని కొడనాడు ఎస్టేట్, గ్రీన్‌ టీ ఎస్టేట్‌ల చుట్టూ సాగుతోంది. ఇక్కడ సోదాలు ముగిసినా, ఐటీ అధికారులు విచారణ మాత్రం ముగించలేదు. తమ విచారణను ముమ్మరం చేశారు. కొడనాడు ఎస్టేట్‌ మేనేజర్‌ నటరాజన్, పక్కనే ఉన్న గ్రీన్‌ టీ ఎస్టేట్‌ మేనేజర్‌ పళనికుమార్‌లతో పాటు 20 మందిని ఒకరి తర్వాత మరొకరు చొప్పున విచారించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ పాత నోట్లు బయటపడడమే కాకుండా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నోట్ల కట్టలు ఓట్ల కొనుగోలుకు పంపించినట్టు ఓ జాబితా అధికారులకు చిక్కినట్టు సమాచారం. అందుకే ఆ జాబితా ఆధారంగా విచారణ ముమ్మరంగా సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

ములాఖత్‌కు వివేక్‌
మేనత్త శశికళ, తల్లి ఇళవరసిలతో ములాఖత్‌కు వివేక్‌ కసరత్తుల్లో ఉన్నారు. ఇందుకు తగ్గట్టు న్యాయవాదులు పరప్పన అగ్రహార చెరలో వినతి పత్రాన్ని సమర్పించారు. పరప్పన అగ్రహార చెరలో శశికళ,  ఇళవరసిలతో న్యాయవాదులు మూర్తి రావు, కృష్ణప్ప సమావేశం కావడం వెలుగు చూసింది. తాజా, పరిణామాల నేపథ్యంలోనే ఈ భేటీ సాగి ఉంటుందని, చట్టపరంగా ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఆ న్యాయవాదుల్ని మీడియా ప్రశ్నించగా, తల్లి ఇళవరసిని కలిసేందుకు వివేక్‌ సమయం కోరి ఉన్నారని, అందుకు తగ్గ వినతి పత్రం, వివేక్‌ రాసిన లేఖ జైలు వర్గాలకు సమర్పించామని  పేర్కొన్నారు. కాగా పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ దీనిపై మాట్లాడుతూ ఐటీ దాడుల్లో వెలుగుచూసిన అన్ని వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. శశికళ కుటుంబానికి సంబంధించిన కేసులన్నీ ప్రత్యేక న్యాయమూర్తిని నియమించి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement