చిన్నమ్మ శశికళ కుటుంబీకులు చిక్కుల్లో పడ్డారు. వారి మెడకు ఐటీ ఉచ్చు బిగియనుంది. సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ఒక్కొక్కర్ని వేర్వేరుగా విచారించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ కుటుంబానికి చెందిన వారందరికీ సమన్లు జారీచేస్తున్నారు. జయ టీవీ, జాస్ సినిమాస్ సీఈవో వివేక్‌ను తమ కార్యాలయంలో ఉంచి ఐటీ వర్గాలు విచారించే పనిలో పడ్డాయి. దివాకరన్‌ను విచారించేందుకు రంగం సిద్ధం అయింది. ఇక, ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పుహలేంది, డాక్టర్ శివకుమార్, పూంగుండ్రన్‌ల వద్ద విచారణ సాగుతోంది.
ఐటీ అధికారులకు లభించిన రికార్డులు, బ్యాంక్ లావాదేవీల వివరాల మేరకు చిన్నమ్మ కుటుంబీకులు, సన్నిహితులు పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.250 కోట్ల మేరకు పాత కరెన్సీని కొత్తవిగా మార్చినట్టుగా పరిశీలనలో తేలింది. కొన్నిచోట్ల పాత నోట్లను మార్చ లేక అలాగే, వదిలి పెట్టి ఉండటాన్ని గుర్తించారు. తన కుటుంబాన్ని ఐటీ చుట్టుముట్టడంతో పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ కలవరంలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ దాడులపై మాట్లాడితే ఎక్కడ తమను టార్గెట్ చేస్తారో అనే భయంతో చిన్నమ్మ ప్రతినిధి దినకరన్ మద్దతు అన్నాడీఎంకే వర్గాలు ఐటీ దాడుల గురించి నోరు మెదపడం లేదు.
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి ఐటీ అధికారులు గురువారం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఐదో రోజుగా సోమవారం కూడా సోదాలు సాగాయి. జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక కార్యాలయాలు, జాస్ సినిమాస్, ఈ సంస్థల సీఈఓ వివేక్ నివాసం, ఆయన సోదరి కృష్ణ ప్రియ నివాసం మిడాస్ స్పిరిట్స్ అండ్ లిక్కర్‌లతో పాటు ఎనిమిది చోట్ల తాజాగా తనిఖీలు సాగాయి. అలాగే, రాయపేటలోని ఓ ప్రైవేటు భవన నిర్మాణ సంస్థలో హఠాత్తుగా తనిఖీలు చేసి, కొన్ని రికార్డులను ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకు న్నాయి. సాయంత్రానికి అన్ని చోట్ల తనిఖీలు ముగియడంతో చిన్నమ్మ కుటుంబీకుల్ని, సన్నిహితుల్ని విచారణ వలయంలోకి తీసుకొ చ్చే పనిలో ఐటీ వర్గాలు నిమగ్నం అయ్యాయి.
పరిశీలనలో 500మంది అధికారులు
1800మంది అ«ధికారులు ఏకకాలంలో ఐటీ దాడులకు దిగి స్వాధీనం చేసుకున్న రికార్డులు, దస్తావేజులు, నగదు, నగలు, ఇతర ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన వివరాల డాక్యుమెంట్లు, ఇలా అన్నింటినీ చెన్నైలోని ఐటీ కార్యాలయానికి తరలించారు. నుంగంబాక్కంలో ఉన్న ఐటీ కార్యాలయంలో సూట్ కేసుల్లో, బాక్సుల్లో, గోనె సంచుల్లో ఉన్న వాటన్నింటిని సమగ్రంగా పరిశీలించేందుకు అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఐదు వందల మందితో కూడిన అధికారుల బృందాలు క్షుణ్ణంగా డాక్యుమెంట్లను పరిశీలించే పనిలో నిమగ్నం అయ్యాయి. ఆ మేరకు చిన్నమ్మ శశికళ పెరోల్ మీద బయటకు వచ్చిన సమయంలో ఆస్తులను బంధువులు, సన్నిహితులు, నమ్మిన బంటుల వలే ఉన్న పనివాళ్లు, కారు డ్రైవర్లు తదితరుల బినామీల పేరిట డాక్యుమెంట్లను మార్చి ఉండడం పరిశీలనలో వెలుగు చూసినట్టు సమాచారం.
కొడనాడులో పాత నోట్లు
తమకు లభించిన రికార్డులు, బ్యాంక్ లావాదేవీల వివరాల మేరకు చిన్నమ్మ కుటుంబీకులు, సన్నిహితులు పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.250 కోట్ల మేరకు పాత కరెన్సీని కొత్తవిగా మార్చినట్టుగా పరిశీలనలో తేలింది. అలాగే, కొన్ని చోట్ల ఆ నోట్లను మార్చ లేక అలాగే, వదిలి పెట్టి ఉండడాన్ని గుర్తించారు. ప్రధానంగా కొడనాడు ఎస్టేట్‌లో పెద్ద ఎత్తున పాత నోట్లు, మూడు కేజీల బంగారం బయటపడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అక్కడి మేనేజర్ చంద్రశేఖర్‌ను రహస్య ప్రదేశంలో ఉంచి ఐటీ వర్గాలు విచారిస్తున్నాయి. ఇక, ఈ ఎస్టేట్‌ను తన తండ్రి వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నట్టు ఇంగ్లాండ్‌కు చెందిన గ్రేక్ జాన్స్ కుమారుడు పీటర్ గ్రేక్ జాన్స్ అమ్మ జయలలిత మరణం తదుపరి ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఐటీ దాడుల నేపథ్యంలో చట్టవిరుద్ధంగా తమ ఆస్తిని శశికళ కుటుంబం దోచుకుందని, ఇక చట్టపరంగా తాను మళ్లీ స్వాధీనం చేసుకుంటానన్న పీటర్ ధీమా వ్యక్తం చేశారు.
355 మంది విచారణకు రంగం సిద్ధం
సోదాలు ముగియడంతో చిన్నమ్మ కుటుంబీకులు ఒక్కొక్కర్ని విచారించేందుకు రంగం సిద్ధం అయింది. మొత్తంగా 355 మందికి సమన్లు రెడీ అయ్యాయి. వీటిలో తొలి సమన్‌ను దినకరన్ మద్దతుదారుడు పుహలేంది, అమ్మ జయలలిత వైద్యుడు డాక్టర్ శివకుమార్, అమ్మ సహాయకుడు పూంగుండ్రం అందుకున్నారు. ఈ ముగ్గురు సోమవారం ఐటీ కార్యాలయం మెట్లు ఎక్కారు. వీరి వద్ద ప్రత్యేక బృందం అధికారులు గుచ్చి గుచ్చి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే యత్నం చేసినట్టు తెలిసింది. పుహలేందిని మరోమారు బుధవారం విచారణకు రావాలని ఆదేశించడం గమనార్హం. ఇక, చిన్నమ్మ సోదరుడు దివాకరన్ సమన్లు అందుకున్నారు. మన్నార్‌గుడి నుంచి చెన్నైకి పయనం అయ్యారు. ముందుగా తన రూపంలో ఐటీ దాడుల్ని ఎదుర్కొని తనయుడి వివాహ సమయంలో కష్టాలు పడ్డ మిత్రుడు కృష్ణమీనన్‌ను దివాకరన్ కలిశారు.
ఆయన కుమారుడ్ని, కోడల్ని ఆశీర్వదించిన అనంతరం చెన్నైకి బయలుదేరారు. ప్రధానంగా దివాకరన్ చుట్టూ డొనేషన్ల పేరిట నగదు మార్పిడి, తన కళాశాల ద్వారా పెద్ద నోట్ల రద్దు సమయంలో సాగిన వ్యవహారాలు, ఇతర ఆస్తులతో పాటుచిన్నమ్మను గురి పెట్టి ప్రశ్నల వర్షం కురిపించేందుకు ఐటీ సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. తదుపరి ఒక్కొక్కర్ని వేర్వేరు సమయాల్లో తమ ముందు హాజరయ్యే విధంగా సమన్ల జారీలో మరో బృందం నిమగ్నం అయింది. ఇక, కాంచీపురం జిల్లా పడప్పైలోని ఆ కుటుంబానికి చెందిన మిడాస్ లిక్కర్స్‌ను తాత్కాలికంగా సీజ్ వేయడానికి తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో వివేక్‌ను ఐటీ వర్గాలు తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లడంతో చిన్నమ్మ కుటుంబీకుల మెడకు ఉచ్చు బలంగానే బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జయ టీవీ వద్ద హాడావుడి (ఇన్‌సెట్) విచారణకు హాజరై వస్తున్న పుహలేంది
వివేక్ వద్ద విచారణ
శశికళ అన్న జయరామన్, ఇలవరసి దంపతుల కుమారుడు వివేక్(27) అమ్మ జయలలిత ఇంట పెరిగిన వివేక్ ఆమె రేషన్ కార్డులోనూ చోటు దక్కించుకుని ఉండడం గమనార్హం. ఆర్థిక శాస్త్రం అభ్యసించిన వివేక్ కొంత కాలం ఓ జాతీయ సంస్థలో పనిచేశారు. తదుపరి పరిణామాల నేపథ్యంలో జాస్ సినిమాస్‌కు డైరెక్టర్ అయ్యారని చెప్పవచ్చు. గత ఏడాది కీర్తనను వివాహం చేసుకున్న వివేక్, అమ్మ మరణం తదుపరి ఆ కుటుంబంలోనే ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షిస్తూ కీలక వ్యక్తిగా మారాడని చెప్పవచ్చు. పది సంస్థలకు డైరెక్టర్‌గా, జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక, జాస్ సినిమాస్‌లకు సీఈఓగా అవతరించారు. అందుకే కాబోలు ఆయన ఇంట ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మరీ సోదాలు సాగించారు. అన్నిచోట్లా విచారణ ముగించిన ఐటీ వర్గాలు చిట్టచివరగా, సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో వివేక్‌ను తమ వాహనంలో ఎక్కించుకుని ఐటీ కార్యాలయానికి తీసుకెళ్లడంతో చిన్నమ్మ కుటుంబంలో ఆందోళన రెట్టింపు అయింది. కీర్తన, ఆమె సోదరుడు ప్రభుల్ని సైతం అధికారులు ప్రశ్నించడం గమనార్హం.
ఓ సినీ నటుడికి వాటా
పుదుచ్చేరిలో దినకరన్ సన్నిహితుడిగా ఉన్న తెన్నరసుకు చెందిన శ్రీలక్ష్మి జ్యెవెలరీస్‌లో లభించిన ఆధారాల మేరకు రూ.160కోట్ల నగదును కొత్త నోట్లుగా మార్చి ఉండడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే, ఈ జ్యువెలరీస్‌లో లెక్కలోకి రాని బంగారం బయటపడడమే కాకుండా, ఇందులో ఓ సినీ నటుడికి వాటా కూడా ఉన్నట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. దీంతో ఆ నటుడి కోసం ఆరా తీస్తున్నారు. అలాగే, అంబత్తూరు సమీపంలో ఆదివారం రాత్రి సాగిన సినిమా తరహా చేజింగ్‌లో ఓ ఇన్నోవాను గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు వదిలి పెట్టి ఉడాయించారు. అందులో ఐదు బాక్స్‌లు ఉన్నట్టు, వాటిని ఐటీ అధికారులు తమ గుప్పెట్లోకి తీసుకుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. చిన్నమ్మ కుటుంబం అమ్మ జయలిత గొడుగు నీడలో బాగానే అక్రమార్జన సాగించినట్టు రికార్డుల పరిశీలనలో వెలుగులోకి వస్తున్నట్టుగా ఐటీ కార్యాలయ పరిసరాల్లో చర్చ ఊపందుకుంది.
దినకరన్ శిబిరం గప్‌చుప్
చిన్నమ్మ ప్రతినిధి దినకరన్ మద్దతు అన్నాడీఎంకే వర్గాలు ఐటీ దాడుల గురించి నోరు మెదపడం లేదు. ఇందుకు కారణం, నోరు తెరిస్తే, ఎక్కడ తమను టార్గెట్ చేస్తారనో అని వారిలో ఆందోళన నెలకొనడమే. ఇప్పటికే దినకరన్‌కు సన్నిహితంగా ఉన్న ముఖ్య నాయకుల్ని గురిపెట్టి ఉన్న దృష్ట్యా, మౌనంగా ఉంటే మంచిదనే నిర్ణయంతో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలతో పాటు, ఆ శిబిరం జిల్లాల కార్యదర్శులు అనేకమంది ఉన్నారు. దినకరన్‌కు మద్దతుగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చుతూ వచ్చిన పుహలేంది ఐటీ కార్యాలయం మెట్లు ఎక్కడం గమనార్హం. ఇక, దినకరన్ సన్నిహితుడు , అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ ఒక్కరే స్పందిస్తుండగా, మిగిలిన వారెవరూ నోరు మెదపడం లేదు. ఇక, సోమవారం దినకరన్ సైతం గప్‌చుప్ అన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం. కాగా, చిన్నమ్మ ఫ్యామిలీ ఆస్తులన్నీ ప్రజల నుంచి కొల్లగొట్టినవేనని, వాటన్నింటినీ స్వాధీనం చేసుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ డిమాండ్ చేశారు.
కలవరంలో చిన్నమ్మ
పరప్పన అగ్రహార చెరలో శశికళ, ఇలవరసి శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తన కుటుంబాన్ని టార్గెట్ చేసి ఐటీ సోదాలు సాగడంతో చిన్నమ్మ కలవరంలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అర్ధరాత్రి వరకు ఆమె జైల్లోని టీవీ వద్ద వార్తల్ని చూస్తున్నట్టు, ఉదయాన్నే పత్రికల్ని తెప్పించుకుని సమాచారాల్ని తెలుసుకుంటున్నట్టు తెలిసింది. తనయుడు వివేక్‌ను ఐటీ వర్గాలు వాహనంలో ఎక్కించుకు వెళ్లిన సమాచారంతో ఇళవరసి తీవ్ర మనో వేదనలో పడ్డట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment