
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ అధికారులు.. సోదాలు చేపట్టారు. ప్రముఖ బంగారం షాపు యాజమానుల ఇళ్లలో బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలులో ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో, 15 బృందాలు రంగంలోకి దిగి.. సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ నగరాల్లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున క్యాప్స్ గోల్డ్ కంపెనీ బంగారం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే, బంగారం కొనుగోలు చేసి క్యాప్స్ గోల్డ్ కంపెనీ.. రిటైల్ గోల్డ్ దుకాణాలకు బంగారం అమ్ముతున్నారు. ఈ క్రమంలో సదరు కంపెనీకి అనుబంధంగా ఉన్న హెల్‌సేల్ సంస్థలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టి సోదాలు నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో బంజారాహిల్స్‌లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, సదరు కంపెనీ.. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో బంగారం బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు.
