అత్యధిక ఆస్తులు ఆ ముగ్గురి పేర్లలోనే.. | IT raids not politically motivated: Sasikala nephew Jayaraman | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురే

Published Wed, Nov 15 2017 7:32 AM | Last Updated on Thu, Sep 27 2018 3:37 PM

IT raids not politically motivated: Sasikala nephew Jayaraman - Sakshi

వివేక్, దివాకరన్, కృష్ణప్రియ

చిన్నమ్మ శశికళ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఐటీ వర్గాలకు కీలకం అయ్యారు. ఆ ముగ్గురి చుట్టే వేల కోట్ల ఆస్తుల రికార్డులు తిరుగుతున్నట్టు సమాచారం. ఆ ముగ్గురు ఎవరో కాదు.. చిన్నమ్మ తమ్ముడు దివాకరన్, అన్న జయరామన్‌ కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణప్రియ కావడం గమనార్హం. రూ.30 వేల కోట్ల మేరకు చిన్నమ్మ ఫ్యామిలీకి ఆస్తులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెలుగుచూసినట్టుగా ఓ నివేదిక ఢిల్లీకి పంపించడం చర్చకు దారితీసింది. ఇక, వివేక్‌ ఇంట మూడు తుపాకులు బయటపడ్డట్టు తెలిసింది. కొడనాడులో మంగళవారం ఆరో రోజు కూడా సోదాలు జరిగాయి. అక్కడున్న అమ్మ, చిన్నమ్మ గదుల్ని తనిఖీ చేయడం లక్ష్యంగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలకోసం ప్రత్యేక బృందం వేచి చూస్తుండడంతో అక్కడ మరెన్ని రికార్డులు వెలుగులోకి వస్తాయో అని ఉత్కంఠమొదలైంది.

సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని గురిపెట్టి సాగిన ఐటీ దాడుల్లో బయటపడ్డ రికార్డుల్ని పరిశీలించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఆ మేరకు ముఫ్పై వేల కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు సమాచారం. అలాగే, ఏడు కోట్ల మేరకు నగదు, ఐదు కోట్ల మేరకు బంగారం ఉన్నట్టు తేల్చారు. వజ్రాల విలువను తేల్చేందుకు ఐటీ వర్గాలు ప్రత్యేక నిపుణుల్ని రంగంలోకి దించే పనిలో ఉన్నాయి. 1,400 కోట్ల మేరకు పన్ను ఎగవేతతో పాటుగా 16 బ్యాంక్‌ లాకర్లను సీజ్‌ చేసినట్టు, అందులో ఉన్న తనిఖీలు జరపాల్సి ఉన్నట్టుగా పేర్కొంటూ, సమగ్ర వివరాలతో ఓ ప్రాథమిక నివేదిక ఢిల్లీకి చెన్నై నుంచి పంపించి ఉండడం గమనార్హం. అలాగే, వివేక్‌ ఇంట మూడు తుపాకులు బయటపడ్డట్టు, ఇందులో రెండింటికి మాత్రమే లైసెన్స్‌ ఉన్నట్టుగా, విదేశీ వాచ్‌లు, ఇతర వస్తువులు తదితర వివరాల్ని సైతం పొందుపరిచి ఉన్నట్టు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా త్వరలో సీబీఐ, ఈడీ వర్గాలు రంగంలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

వారే కీలకం
చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి దినకరన్‌ మీద కన్నా ఆ కుటుంబంలోని ముగ్గురి మీద ఐటీ వర్గాల గురి కీలకంగా పడి ఉంది. వారి పేర్ల మీదే అత్యధికంగా ఆస్తులు ఉన్నట్టు, పెట్టుబడులు, సంస్థలు ఉన్నట్టు విచారణలో తేల్చి ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒకరు చిన్నమ్మ తమ్ముడు దివాకరన్‌ కాగా, మరో ఇద్దరు అన్నయ్య జయరామన్‌ కుమారుడు వివేక్, కుమా ర్తె కృష్ణ ప్రియ కావడం గమనార్హం. ఇందులో వివేక్‌ తొలి టార్గెట్‌లో ఉంచిన ట్టు సమాచారం. తదుపరి బంధువులు  డాక్టర్‌ శివకుమార్, విక్రమ్, జయ ఆనందన్, షకీలా, కార్తికేయన్‌ పేరిట ఆస్తులు అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. వీరందరూ విదేశాలకు చెక్కేయకుండా ముందస్తుగా విమానాశ్రయాలకు సమాచారం పంపించి ఉన్నారు. అలాగే, ఆ ముగ్గురు కీలక వ్యక్తులు పాస్ట్‌ పోర్టుల్ని సీజ్‌చేసినట్టు తెలిసింది.

వివేక్, జాస్‌ ప్రతినిధుల విచారణ
వివేక్‌ వద్ద కొన్ని గంటల పాటుగా ఐటీ వర్గాలు విచారించాయి. పట్టుబడ్డ రికార్డులు, నగలు, నగదు, పెట్టుబడుల గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఐటీ వర్గాలు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానాలు ఇచ్చినట్టు మీడియాకు వివేక్‌ వివరించారు. నుంగంబాక్కంలోని ఇంటి వద్ద వర్షంలో తడుస్తూ మరీ మీడియాతో ఆయన మాట్లాడారు. అనేక ప్రశ్నలకు సమాధానం దాటవేయగా, కొన్నింటికి మాత్రం సమాధానం ఇచ్చారు. సంస్థల్లో పెట్టుబడులు, రికార్డుల గురించి ప్రశ్నించారని, అలాగే, వివాహ సమయంలో తన భార్యకు ఇచ్చిన నగల గురించి అడిగినట్టు వివరించారు. తమ సంస్థ తర్వాత సినిమా పంపిణీల వ్వవహారం గురించి ప్రశ్నించారని పేర్కొన్నారు.

తమ సంస్థల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని, ఆదాయ పన్ను సక్రమంగానే చెల్లించామన్నారు. ఆదాయ పన్ను తనిఖీల్లో లోగుట్టు ఉన్నట్టు తాను భావించడం లేదన్నారు. తాను అన్ని సక్రమంగానే చెల్లించానని, తప్పుచేస్తే తానైనా, మంత్రి అయినా, మీరైనా శిక్షించబడుతారని, తనవైపు ఎలాంటి తప్పు లేదని ధీమా వ్యక్తంచేశారు. దయచేసి తప్పుడు ప్రచారం మాత్రం చేయవద్దని, ఐటీ ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్లి సంపూర్ణ సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇక, జాస్‌ సినిమాస్‌కు చెందిన ముగ్గురు ప్రతినిధుల వద్ద ఐటీ వర్గాలు కొన్ని గంటల పాటుగా విచారించారు. బుధవారం దివాకరన్‌ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొడనాడులో ఆరో రోజు తనిఖీలు
అన్నిచోట్లా ఐటీ దాడులు ముగిసినా కొడనాడులో మాత్రం ఆరో రోజు మంగళవారం కూడా కొనసాగింది. గ్రీన్‌ టీ ఎస్టేట్‌ ఎలా చిన్నమ్మ గుప్పెట్లోకి వచ్చిందో అన్న విషయంగా తాజా పరిశీలన, తనిఖీలు సాగాయి. ఆరుగురు అధికారుల బృందం అక్కడే తిష్ట వేశారు. తేయాకు పతనం సమయంలో గ్రీన్‌టీ ఎస్టేట్‌ వేలంకు వచ్చినట్టు, దానిని బలవంతంగా చిన్నమ్మ తన గుప్పెట్లోకి తీసుకున్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. ఇక, కొడనాడు ఎస్టేట్‌లో అమ్మ జయలలిత, చిన్నమ్మ శశికళకు ప్రత్యేక గదులున్నాయి. ఈ రెండింటిలో తనిఖీలకు ఐటీ వర్గాలు నిర్ణయించాయి. అయితే, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం ఇక్కడ తనిఖీలు సాగనున్నాయి. ఈ దృష్ట్యా, ఈ రెండు గదుల్లో ఎలాంటి రికార్డులు బయటకు వస్తాయోనన్న ఉత్కంఠ బయలుదేరింది.

తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు
తప్పుచేసి, అక్రమ మార్గంలో ఆస్తుల్ని గడించిన వారికి శిక్ష తప్పదని కేంద్ర సహాయ మంత్రి పొన్‌ రా«ధాకృష్ణన్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేను వాళ్లే సర్వనాశనం చేసుకుంటున్నారని, ఇందులో తలదూర్చాల్ని అవసరం కేంద్రానికి లేదన్నారు. చిన్నమ్మ ఆస్తులు గడించడం వెనుక అమ్మ ప్రమేయం ఉండవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, వెనుక ఎవరు ఉన్నారు.. ముందు ఎవరు నడిపిస్తున్నారు..! అన్న విషయాలన్నీ విచారణలో నిగ్గుతేలుతాయని సమాధానం ఇచ్చారు. ఇక, తమిళనాడు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈవీకే ఎస్‌ ఇళంగోవన్‌ పేర్కొంటూ, పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళను బయటకు తీసుకు వచ్చి ఐటీ దాడులపై విచారణ చెన్నైలో జరగాలని, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ పేర్కొంటూ, అన్నాడీఎంకేను తమ గుప్పెట్లోకి తీసుకోవడం, ఓ శిబిరాన్ని పూర్తిగా తమలో కలుపుకోవడం లక్ష్యంగానే ఐటీని కేంద్రం ఉసిగొల్పిందని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement