కొటేషన్లలోనే కొట్టేశారు! | The Gudumba Rehabilitation Scheme has been scammed in the quotation | Sakshi
Sakshi News home page

కొటేషన్లలోనే కొట్టేశారు!

Published Sat, Jan 27 2018 2:49 PM | Last Updated on Thu, Jul 11 2019 8:44 PM

The Gudumba Rehabilitation Scheme has been scammed in the quotation - Sakshi

సాక్షి, యాదాద్రి : కొటేషన్‌ల ద్వారా కొనుగోళ్లు చేశారు.. వారు చూపిన చోటనే కొనుగోళ్లు చేయాలని లబ్ధిదారులను పురమాయించారు. అధికారులు చెప్పిన చోటకు వెళ్లి సరుకులు తెచ్చుకున్నారు. రూ.2లక్షల మంజూరులో వారికి వచ్చింది కేవలం రూ.1.50లక్షల వస్తువులే. ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అధికారులతో గొడవ ఎందుకని సర్దుకుపోయారు ఇదీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గుడుంబా పునరావాసం పథకం అమలుపై ‘సాక్షి’ నిర్వహించిన గ్రౌండ్‌రిపోర్ట్‌లో వెల్లడైన వాస్తవాలు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించారు. ప్రభుత్వం గుడుంబా అమ్మకందారులకు కల్పించిన పునరావాస పథకం అమలులో అధికారులు అత్యంత చాకచాక్యంగా అవినీతికి పాల్పడినట్లు తేటతెల్లమైంది.

బ్యాంకుల కాన్సంట్‌తో సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేస్తారు. మార్గదర్శకాల ప్రకారం ఎక్సైజ్‌ శాఖ లబ్ధిదారులను గుర్తించాలి. ఈ లబ్ధిదారుల జాబితాను సంక్షేమ శాఖల ద్వారా ఎంపీడీఓలకు పంపించి లబ్ధిదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన తదనంతరం యూనిట్లు గ్రౌండింగ్‌ చేశారు.  ఉమ్మడి జిల్లాలో గుడుంబా పునరావాసం పొందిన లబ్ధిదారులను కలిసినప్పుడు వారి మాటల్లో అధికారులు అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు.

చాలా మంది తమ పేరు రాయడానికి ఇష్టపడలేదు. నిజం చెప్పితే మళ్లీ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతారని భయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేటగిరిలో 704 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఒక యూనిట్‌ విలువ రూ.2లక్షలు. మొత్తంగా 14.08 కోట్లు కేటాయించారు. జిల్లాల వారీగా చూస్తే..యాదాద్రి భువనగిరి జిల్లాలో 81 మంది లబ్ధిదారులను గుర్తిస్తే 76 మందికి గ్రౌండింగ్‌చేశారు. నల్లగొండ జిల్లాలో 229 మందికి 229మందికి మంజూరు చేశారు. అత్యధిక తండాలు కలిగిన సూర్యాపేట జిల్లాలో 394 మంది గుడుంబా తయారీ, విక్రయదారులను గుర్తించగా 391 మందికి పునరావాస పథకం కింద నగదు మంజూరు చేశారు.

చేతికి చిల్లిగవ్వ ఇవ్వలేదు
పునరావాసం కింద మంజూరైన మొత్తంతో కొనుగోళ్లన్నీ కోటేషన్‌లతో నడిపించారని, చేతికి ఒక్క రూపాయి ఇవ్వలేదని పలువురు లబ్ధిదారులు వాపోయారు. పునరావాసం పథకంలో పాడి పశువులు, గొర్రెలు, కిరాణం, జనరల్‌స్టోర్, లేడిస్‌ ఎంపోరియం, వస్త్ర దుకాణం, ఆటోమొబైల్, టెంట్‌హౌస్‌లు లబ్ధిదారుల కోరిక మేరకు ఇప్పించారు. అయితే ఎక్కడా కూడా లబ్ధిదారులకు చేతికి డబ్బులు ఇవ్వలేదు. అదే సమయంలో వారు కోరిన చోట కూడా ఇప్పించలేదు. ముందుగానే అధికారులు ఎంపిక చేసుకున్న దుకాణాల పేరు మీద కొటేషన్‌లు తీసుకుని వారి వద్ద సరుకులు కొనుగోలు చేశారు. దీంతో అధికారులు ముందుగానే కమీషన్‌లు మాట్లాడుకుని వారినుంచి కొటేషన్‌లను స్వీకరించినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహరంలో ప్రతి యూనిట్‌ వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయి. లబ్ధిదారులు తాము ఇతర చోట్ల కొనుగోలు చేస్తామంటే అధికారులకు అందుకు అంగీకరించకపోవడం వెనుక అంతర్యంలోనే అక్రమాలు జరగాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి కొనుగోలులో రూ.50వేల వరకు అవినీతి జరిగిందని తెలుస్తోంది. జరిగిన అవినీతి బయటపెడితే తమను కేసుల పేరుతో వేధిస్తారని పేరు రాయడానికి ఇష్టపడని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండలానికి చెందిన గిరిజన లబ్ధిదారుడొకరు ‘సాక్షి’తో చెప్పారు. ‘‘నాకు రూ.2లక్షలు మంజూరైది. వచ్చిన పేరే కానీ నాకు ఇచ్చింది రూ.1.40లక్షల సరుకులు మాత్రమే. అన్ని వారే ఇప్పించారు. హోల్‌సేల్‌ దుకాణానికి వెళ్లి తెచ్చుకోమంటే తెచ్చుకున్నాను. ఓ లెక్కా లేదు, ఓ పత్రం లేదు. ప్రభుత్వం ఇచ్చింది బతుకుదామని కిరాణ దుకాణం నడుపుకుంటున్నాను. ఇప్పుడు ఎవరి మీద చెప్పిపా ఏం లాభం’’ అంటూ దాటవేశాడు. 

అంతా పారదర్శకంగా చేశాం
గుడుంబా పునరావాస పథకంలో యాదాద్రి జిల్లావ్యాప్తంగా 76మంది లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండ్‌ చేశాం. వారంతా ఇప్పుడు గుడుంబా అమ్మకాలు నిలిపివేసి వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నారు. మూడు సంవత్సరాల వరకు వారిపై నిఘా కొనసాగుతుంది. ఈ మేరకు సారా అమ్మకాలు చేయమని బాండ్‌ రాయించుకున్నాం. ఎలాంటి అక్రమాలు జరగకుండా కోటేషన్‌ల ద్వారా లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశాం. ఎక్కడా అవినీతి జరగలేదు.   – కృష్ణప్రియ, యాదాద్రి జిల్లాఎక్సైజ్‌ శాఖ అధికారి
 
డబ్బులు సగమే ఇచ్చారు..
నాది మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామం. పునరావాస పథకం కింద రూ. రెండు లక్షల విలువచేసే గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా అధికారులు కేవలం రూ. లక్ష విలువ చేసే గొర్రెలే ఇచ్చారు. రూ. లక్షకు 16 గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా ఒకటి కోతపెట్టారు. మిగిలిస రూ.లక్ష ఎప్పుడు ఇస్తారంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. సారా విక్రయించుకుంటూ ఉన్నంతలో పూట వెళ్లదీసుకునేది. ఇప్పుడు తిండికి ఇబ్బందులు పడుతున్నా. అధికారులను మిగిలిన డబ్బులు అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. మిగిలిన రూ. లక్ష అయినా చేతికందిస్తే చిన్నపాటి కిరాణ దుకాణం పెట్టుకుంటా. – భిక్షాల నాగయ్య, కందిబండ, మేళ్లచెరువు

  రూ.50 వేలకు మించి సరుకుల్లేవ్‌    
ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన రాగటి పార్వతమ్మ ఐదేళ్ల నుంచి సారా విక్రయిస్తుంది. సారానిర్మూలనలో భాగంగా పార్వతమ్మకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తామని చెప్పింది. ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఆమెకు భువనగిరిలో కిరాణా సరుకులు ఇప్పించారు. అయితే రూ. 2లక్షల విలువ గల సామగ్రి ఇప్పించాల్సి ఉండగా అధికారులు ఇప్పించిన సరుకులు రూ. 50 వేలకు మించి కూడా లేవని పార్వతమ్మ వాపోతోంది. సరుకులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేదని ఆరోపిస్తోంది. – రాగటి పార్వతమ్మ, ఆత్మకూరు(ఎం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement