న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.శ్రీకృష్ణప్రియ, కె.వైష్ణవి, చేతన్ ఆనంద్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లోని చివరి రౌండ్‌లో శ్రీ కృష్ణప్రియ 21-14, 21-17తో వైశాలి బరియా (గుజరాత్)పై, వైష్ణవి 21-11, 24-26, 24-22తో లలితా దహియా (హర్యానా)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో మూడుసార్లు జాతీయ చాంపియన్ చేతన్ ఆనంద్ 21-11, 21-13తో ఎన్‌వీఎస్ విజేత (ఆంధ్రప్రదేశ్)పై నెగ్గాడు. మరోవైపు రాష్ట్రానికే చెందిన సి.రాహుల్ యాదవ్ 21-23, 18-21తో రోహన్ కాస్టెలినో (కర్ణాటక) చేతిలో ఓడిపోయాడు.
మహిళల సింగిల్స్ విభాగం క్వాలిఫయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి పది మంది బరిలోకి దిగారు. చివరి రౌండ్‌లో జి.వృశాలి, సంతోషి హాసిని, వి.ప్రమద, వి.హారిక, ఎం.పూజ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయి త్రుటిలో మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. చివరి రౌండ్‌లో చిత్రలేఖ (రైల్వేస్) 25-23, 13-21, 21-17తో వృశాలిపై, కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర) 21-8, 13-21, 21-19తో సంతోషి హాసినిపై, రసిక రాజె (మహారాష్ట్ర) 21-9, 21-10తో ప్రమదపై, వైష్ణవి అయ్యర్ (కర్ణాటక) 21-13, 16-21, 21-15తో వి.హారికపై, ధన్య నాయర్ (రైల్వేస్) 21-10, 18-21, 21-6తో పూజపై నెగ్గి మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌లో సృజన్ నందలూరి-వినయ్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్) జోడి 11-21, 21-11, 24-22తో సంతోష్ రావూరి-చైతన్య రెడ్డి (ఆంధ్రప్రదేశ్) జంటను ఓడించి మెయిన్ ‘డ్రా’కు చేరింది. బుధ, గురువారాల్లో ఇంటర్ స్టేట్, ఇంటర్ జోనల్ టీమ్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయి. శుక్రవారం నుంచి సోమవారం వరకు వ్యక్తిగత విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు ఉంటాయి.
మెయిన్ ‘డ్రా’కు శ్రీకృష్ణప్రియ, వైష్ణవి
Published Wed, Dec 18 2013 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement
Advertisement