సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) క్రీడాకారులతో పాటు సామాన్యుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి బుధవారం పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఉచిత ఫిజియో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని ఫిజియోథెరపీ కేంద్రంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సీనియర్ ఫిజియో పర్యవేక్షణలో కార్పొరేట్ స్థాయి చికిత్స అందించనుంది.
అత్యాధునిక వైద్య పరికరాలు
అత్యాధునిక వైద్య పరికరాల సాయంతో శాప్ ఆధ్వర్యంలోని ఫిజియోథెరపీ కేంద్రం ఇప్పటి వరకు క్రీడాకారులకు మాత్రమే వైద్య సేవలందించింది. అనారోగ్యంతో బాధపడుతూ ఖర్చుతో కూడుకున్న ఫిజియో వైద్యం చేయించుకోలేని వారి కోసం ఒక రోజు ఉచిత సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ కేంద్రంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని వెన్నుముక సంబంధిత నొప్పుల చికిత్సకు వినియోగించే కేడీటీ ట్రాక్షన్ పరికరం అందుబాటులో ఉంది. దీనిని అమెరికా నుంచి క్రీడాకారుల కోసం ప్రత్యేక తీసుకొచ్చారు. కండర గాయాలను తగ్గించే షాక్‌వేవ్ థెరపీ పరికరాన్ని స్విజ్జర్‌లాండ్ నుంచి రప్పించారు. శీతల వైద్యం (క్రయో థెరపీ) యూనిట్, ఎముకలు, నరాల చికిత్స కోసం బీటీఎల్ – ఎలక్ట్రోథెరపీ, కీళ్ల నొప్పులు, క్రయో, ఐస్ వాక్స్ థెరపీ, వాటర్, ఎలక్ట్రిక్ హీట్, స్టిములైజర్స్, అల్ట్రా సౌండ్, జిమ్ పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం 98764 17999, 85558 47798 నంబర్లతో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
ఇవి వైద్య సేవలు: ఎముకలు, కీళ్ల నొప్పులు, నరాలు, స్పోర్ట్స్ ఇంజ్యూరీస్, కండర, అన్ని రకాల కార్డియో రెస్పిరేటరీ చికిత్సలు అందించనున్నారు.
సమాజ ఆరోగ్యం దృష్ట్యా..
ఫిజియోథెరపీ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. నిరుపేదలు ఫిజియో వైద్యం చేయించుకోవాలంటే ఆలోచిస్తారు. ఏళ్లు తరబడి వ్యాధులతో బాధపడుతుంటారు. శాప్‌కు క్రీడాకారుల ఆరోగ్యంతో పాటు సమాజ ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందుకే శాప్ ఆధ్వర్యంలోని అత్యాధుని ఫిజియోథెరపీ సెంటర్‌లో వారంలో ఒక రోజు ఉచిత సేవలను అందిస్తున్నాం. అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలి.
– ఎన్.ప్రభాకరరెడ్డి, శాప్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment