జయ ఫిజియోథెరపీకి సింగపూర్ రోబో?
అపోలో ఆసుపత్రికి చేరుకున్న యంత్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫిజియోథెరపీ ఇచ్చేందుకు సింగపూర్ నుంచి రోబోను తెప్పించినట్లు సమాచారం. చెన్నై అపోలో ఆసుపత్రిలో 65 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి ప్రకటించారు. మైకు సహాయంతో చిన్నగా మాట్లాడుతున్నారని, 90 శాతం వరకు సహజరీతిలో శ్వాసను తీసుకుంటున్నారని తెలిపారు. ఇక నడవడమే తరువారుుగా పేర్కొన్నారు. ఇందుకోసం కొంత ఫిజియోథెరపీ చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అపోలో ఆసుపత్రికి ఒక రోబోను తీసుకువచ్చారు. ఈ రోబో సీఎం జయకు చికిత్స కోసమేనని చెబుతున్నారు. సింగపూర్‌లోని మౌంట్ ఎలిజిబెత్ ఆసుపత్రి రోబోటిక్ ఫిజియోథెరపీకి ప్రపంచ ప్రసిద్ధి. గతంలో ఇదే ఆసుపత్రి నుంచే ఇద్దరు మహిళా ఫిజియోథెరపిస్టులు సీఎం జయ కోసం సింగపూర్ నుంచి వచ్చారు.
జయ ఆప్తురాలు శశికళకు అస్వస్థత!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత ఆప్తురాలైన శశికళ అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విరామం లేకుండా ఆసుపత్రిలో అమ్మను కనిపెట్టుకుని ఉన్న కారణంగా శశికళ అనారోగ్యం పాలుకాగా ఈనెల 23న ఆమె అపోలోలోనే చేరినట్లు తెలుస్తోంది.