ఈ ఆసుపత్రి అందరికీ స్ఫూర్తి... | This inspires everyone to the hospital | Sakshi
Sakshi News home page

ఈ ఆసుపత్రి అందరికీ స్ఫూర్తి...

Published Mon, Feb 2 2015 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

ఈ ఆసుపత్రి అందరికీ స్ఫూర్తి...

ఈ ఆసుపత్రి అందరికీ స్ఫూర్తి...

విధివశాత్తూ... రోడ్డు పక్కన చెత్తకుప్పల్లోకి, ముళ్లపొదల్లోకి విసిరేయబడిన విత్తనాలకు కాస్త నీరు పోసి ఆపై కాస్త రక్షణ కల్పించి ఎదగనిస్తే చాలు, ఆ విత్తే చెట్టై ఆ ఊరికి నీడనివ్వడమే కాదు ఫలసాయాన్ని అందిస్తుంది అనేందుకు ఉదాహరణ.. ‘మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ విద్యార్థులు. తమ వెన్నుతట్టి ఆదరించిన సమాజానికి ఇప్పుడు తామే వెన్నుదన్నుగా నిలిచారు..
 
 
‘విధి చేతిలో ఓడిపోవాల్సిన మేము, ఈ సమాజం ఇచ్చిన చేయూత వల్లే విజేతలుగా నిలచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆపదలో ఉన్న మాకు వెన్నుదన్నుగా నిలిచిన ఈ సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే లక్ష్యంతో ఉచిత వైద్యసేవలను అందిస్తున్నాం’ అంటూ గర్వంగా చెబుతున్నారు... మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం పిల్లలు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ఆల నాపాలనకు దూరమైన ఈ అనాథలు ఇప్పుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ జిల్లా జఫర్‌గడ్ మండలం రేగడితండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ‘మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం’లో వైద్యవిద్య అనుబంధ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులంతా కలిసి ఆశ్రమం ఆవరణలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.

అంతా ఇక్కడి వారే...

అనాథ పిల్లలకు అన్నీ తానైంది మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం. 2006 మే 28లో గాదె ఇన్నారెడ్డి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ప్రస్తుతం 300 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో ఫిజియోథెరపీ పూర్తి చేసిన డాక్టర్ స్నేహ, నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న థరంసోతు కల్పన, బానోతు స్వర్ణ, నలుగురు ల్యాబ్‌టెక్నీషియన్స్, ఇద్దరు ఫార్మసిస్టులతో పాటు వైద్యవిద్యకు అనుబంధ విద్యలను చదువుతున్న మరికొందరు విద్యార్థులు మొత్తంగా 15 మంది కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి 2013 నవంబరు 10 నుంచి ఆశ్రమం ఆవరణలో ఉచిత వైద్యసేవలను అందిస్తున్నారు. ఇక్కడ ఔట్ పేషెంట్ విభాగం, పది పడకలతో ఇన్‌పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇదే ఆశ్రమంలో పీజీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ ఆస్పత్రి రోజువారీ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు.
 
అన్ని సేవలు ఉచితమే

రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య డాక్టర్, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల ఆధ్వర్యంలో ఆస్పత్రి పని చేస్తుంది. ఈ సమయంలో వచ్చే రోగులను పరీక్షించి వైద్య సహాయం (ఓపీ) అందిస్తారు. రోగి అవసరాన్ని బట్టి రక్త, మూత్రం, కళ్ళె వంటి రోగ నిర్థారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. వ్యాధి నయం కావడానికి అవసరమైన మందులు ఉచితంగానే అందిస్తారు. ఈ అంశంపై ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ స్నేహ మాట్లాడుతూ ‘గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు రోగాలు వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు వెనకాడతారు. ఎందుకంటే అక్కడ చేసే టెస్టుల కారణంగా తాము దాచుకున్న డబ్బులన్నీ అయిపోతాయని భయపడతారు. రోగం ముదిరే వరకు చూస్తారు. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లి అప్పులపాలవుతారు. దీన్ని నివారించాలనే ఉద్దేశంతోనే మా దగ్గరికి వచ్చే రోగులకు ఉచితంగా రోగనిర్థారణ పరీక్షలు చేయడంతో పాటు మందులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. దీనికోసం ఇప్పటికే వివిధ మెడికల్ ఏజెన్సీలు, ఎన్జీవోలు, ఔషధ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. వ్యవసాయ పనుల కారణంగా కీళ్లు, నడుం నొప్పులతో బాధపడేవారికి ఉపశమనం కలిగించేందుకు మధ్యాహ్నం వేళలో ఫిజియోథెరపీకి సంబంధించిన ఎక్సర్‌సైజులు సైతం చేయిస్తారు. ఇందుకోసం ఐఎఫ్‌టీ, ట్రాక్షన్ వంటి పరికరాలను సమకూర్చుకున్నారు. పరిసర ప్రాంత రైతులు ఫిజియోథెరపీ చికిత్స కోసం ఈ ఆస్పత్రికి తప్పనిసరిగా వస్తున్నారు.

పక్కా ప్రణాళిక

రోగం వచ్చిన తర్వాత మందుబిళ్ల, సూదిమందు ఇవ్వడం వంటి సాధరణ సేవలకే పరిమితం కావడం లేదు. రోగాలకు మూల కారణాలను వెతికి పట్టుకుని వాటికి సైతం మందు వేసేలా పక్కాగా ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా సేవలను మూడు రకాలుగా విభజించారు. ఒకటి రోగిని పరీక్షించడం, రెండు రోగనిర్థారణ పరీక్షలు, మందుబిళ్లలు ఇవ్వడం అయితే అసలు రోగాలకు గురికాకుండా ప్రజల్లో అవగాహన కలిగించడం మూడోది. జఫర్‌గడ్ మండలంలో ఉన్న 19 గ్రామపంచాయితీల్లో గ్రామాన్ని ఈ వైద్యబృందంలో సభ్యులు(ఫీల్డ్ విజిట్) సందర్శిస్తారు. అక్కడి ప్రజల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుంటారు. ఆ గ్రామాల్లో పరిశుభ్రత, అంటువ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మద్యపానం, పొగతాగడం, గుట్కాలు నమలడం వంటి చెడు అలవాట్ల వల్ల కలిగే నష్టాల వంటి సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలను చేపడతారు. దీనికోసం ప్రొజెక్టర్‌ను సైతం సమకూర్చుకున్నారు. ఇప్పటి వరకు యాభైకి పైగా హెల్త్‌క్యాంపులు నిర్వహించారు.అంధత్వ నివారణ సంస్థ (బ్లైండ్ కంట్రోల్ సొసైటీ) సహకారంతో నిర్వహించిన హెల్త్ క్యాంపుల ద్వారా 354 మందికి కంటి ఆపరేషన్లు, 400 మందికి కళ్లద్దాలు అందించారు.

‘మా అవసరం తీరింది కదా, ఈ సమాజం ఎటుపోతే ఏం’ అనుకోలేదు ఈ విద్యార్థులు... తిరిగి సమాజానికే సాయం చేసే స్థాయికి ఎదిగారు. తమలాంటి ఎందరికో ఆసరాగా ఉంటున్నారు. మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
 
 మాకు ఆస్పత్రి ఉన్నట్లే: డాక్టర్ స్నేహారెడ్డి

ప్రస్తుతం మా ఆశ్రమంలో 300 మంది విద్యార్థులం ఉన్నాం. ఈ ఉచిత వైద్యశాల వల్ల ఆశ్రమానికి ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు ఉచిత వైద్యసేవలతో మాకు సాయం చేసిన ఈ సమాజానికి తిరిగి సాయం చేస్తున్నామనే సంతృప్తి కూడా ఉంది. మేము చేస్తున్న కృషికి ప్రభుత్వ సహకారం తోడైతే మా సేవలు విస్తరిస్తాం.

బాధ్యతగా భావిస్తున్నాను
 - పబ్బతి హరీశ్ (బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజియోథెరపీ విద్యార్థి)
 బాల్యంలోనే తలిదండ్రులను కోల్పోయిన నేను లలితా టీచర్ సాయంతో టెంత్ పాసయ్యాను. ఆమే నన్ను అప్పటి జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా దగ్గరికి తీసుకెళ్లి సాయం చేయాలని కోరారు. అప్పుడు కలెక్టర్ గారు నన్ను ప్రజాదరణ ఆశ్రమంలో చేర్పించారు. మా టీచర్ చేసిన సహాయం వల్లే నేను ఈ రోజు నా పేరు ముందు డాక్టర్ అని పెట్టుకునే స్థాయికి చేరుకున్నాను. అందుకే మరికొందరికి సాయం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను.
 
 అరవై పడకలకు విస్తరిస్తాం


 - ఇన్నారెడ్డి (ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు)
 మా ఆశ్రమంలో చదువుకున్నవారిలో కొద్దిమంది తమ చదువును పూర్తిచేసి ఉద్యోగాలు చేసే స్థాయికి వచ్చారు. అంతా కలిసి ఓ జట్టుగా ఏర్పడి తమకు సాయం చేసిన సమాజానికి తిరిగి సహాయ పడేందుకు సిద్ధమై ఉచిత వైద్యసేవలు ప్రారంభించారు. 2013లోపదిపడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని ప్రారంభించాం. క్రమంగా 60 పడకల ఆస్పత్రి స్థాయికి తీసుకెళ్తాం.
 
- తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, హన్మకొండ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement