ఎలక్ట్రానిక్ యంత్రం ద్వారా వృద్ధులకు వైద్యం చేస్తున్న దృశ్యం
మోతీనగర్: ప్రస్తుత కాలంలో కాస్త అనారోగ్యానికి గురైనా రూ. వేలల్లో మొదలుకొని లక్షల్లో ఖర్చు అవుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే వివిధ రకాల వైద్య పరీక్షలు, స్కానింగ్‌ల పేర్లతో ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తమకు వంతు సాయంగా ఫిజియోథెరపీ అందిస్తున్నారు ఎన్‌ఆర్‌ఐ సేవా ఫౌండేషన్ సభ్యులు.
సుమారు దశాబ్దంన్నర క్రితం కూకట్‌పల్లి వివేకానందనగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్, ప్రస్తుత అధ్యక్షుడు కొలసాని రాథా మోహన్‌రావు ఎన్‌ఆర్‌ఐ సేవా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఎన్‌ఆర్‌ఐ సేవా ఫౌండేషన్, అమెరికా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మురికి వాడల్లో నివసిస్తున్న పేద బడుగు వర్గాల వారికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకూ ఫిజియోథెరపీ చేస్తున్నారు.
♦ సంచార ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా, ఫిజియోకేర్, రీహాబిలేషన్ కేంద్రం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. అంతేకాక అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి సైతం ఫిజియోథెరపీ చేస్తున్నారు.
♦ సహజంగానే ఎదుర్కొనే వ్యాధులలో ప్రధానంగా వెన్ను, అరికాళ్లు, పిక్కలు, మోకాళ్లు, భుజాలతో పాటు ఇతర నొప్పుల నివారణకు నిపుణులైన వైద్యులతో ఫిజియోథెరపీతో పాటు ప్రముఖ యోగా గురువుతో ఆసనాలు వేయిస్తున్నారు.
♦ రోగులు సూచించిన నొప్పిని బట్టి దాని నివారణకు వివిధ రకాల వ్యాయామాలతో పాటు పలువురు ప్రముఖ యోగా గురువులు ఆసనాలు చేయిస్తున్నారు.
♦ అంతేకాక వ్యాధి తగ్గిన తర్వాత కూడా వైద్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు యోగక్షేమాలు తెలుసుకుని సలహాలు, సూచనలు చేస్తుంటారు.
♦ కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలోని మురికి వాడల్లో నివసించే వారితో పాటు నగరంలోని పలు వృద్ధాశ్రమాల్లోనూ ఉచితంగా సేవలు అందిస్తున్నారు.
♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆదివారం మినహాయించి ఒక్కో ప్రాంతంలో రెండు వారాల పాటు శిబిరాలు నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లి సాయికృప ప్లాట్ నెంబర్ 332, శ్రీవివేకానందనగర్, డీఏవీ స్కూల్ రోడ్డులో శిబిరాలు నిర్వహిస్తున్నారు.
♦ మూసాపేట డివిజన్ మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో గత నాలుగేళ్ల నుంచి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు.
♦ కోవిడ్ కారణంగా గత కొన్ని రోజుల నుంచి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే వైద్యులు అందుబాటు ఉంటున్నారు. అదే విధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ఆవరణలోనూ వైద్య సేవలు కొనసాగుతున్నాయి.
♦ హ్యాండ్ గ్రిప్పర్, టెన్స్, ఐఎఫ్‌టీ, ఆల్ట్రాసౌండ్, స్విస్ బాల్, షోల్డర్ పుల్లీ, షోల్డర్ వీల్, డెలాయిడ్ మైల్ స్టోన్స్, సైక్లింగ్ వంటి సామగ్రితో వైద్యం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
చిన్నారికి ఫిజియో థెరపీ చేస్తున్న సిబ్బంది
ఉచితంగా చేయడం సంతోషం.. : ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకున్న నయం కాలేదు. మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ కేంద్రం కొనసాగుతుందని నా మిత్రుల ద్వారా తెలుసుకొని వచ్చిన తర్వాత వివిధ రకాల నొప్పులు తగ్గుముఖం పట్టాయి. వైద్యం అందని ద్రాక్షగా ఉన్న ఈ రోజుల్లో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించటం సంతోషం -టి.నారాయణ
చదవండి : రికార్డు కొట్టేసిన వంటలక్క, లక్కీ చాన్స్!
అర్థమయ్యే రీతిలో కౌన్సెలింగ్..
చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి విసుగు చెంది మా వద్దకు వస్తుంటారు. అలాంటి వారికి ముందుగా అర్థమైన రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చి వారికి ఏయే నొప్పులకు ఏ రకంగా వైద్యం చేయాలో పరిశీలిస్తాం. ఆ తర్వాత సుమారు వారం రోజుల నుంచి నెల పాటు నిత్యం క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేస్తాం. – డాక్టర్ కె. కామాక్షి, ఎంపీటీ న్యూరాలజీ
ఆరోగ్యంగా ఇంటికెళ్లడమే మాకు ఆనందం..
చాలా మంది వివిధ నొప్పులతో బాధపడుతూ తమ కేంద్రానికి వస్తుంటారు. వయస్సు పై బడిన వారు నొప్పులతో బాధపడుతూ రావటం చూసి మాకే ఒక్కోసారి బాధ కలుగుతోంది. వారి సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం ప్రారంభిస్తాం. వారు వ్యాధి తగ్గిన తర్వాత సంతోషంగా వెళ్లటమే మాకు ఆనందం. మాకు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అమోఘం. – డాక్టర్ బి. కృష్ణకుమారి, ఎంపీటీ స్పోర్ట్స్
Comments
Please login to add a commentAdd a comment