మాట్లాడుతున్న మూర్తిరాజు
నెల్లిమర్ల : వైద్యరంగంలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యత పెరుగుతోందని మిమ్స్ చైర్మన్ అల్లూరి మూర్తిరాజు అన్నారు. పట్టణంలోని మిమ్స్ క్యాంపస్‌లో ఉన్న అల్లూరి లక్ష్మీకాంతమ్మ మెమోరియల్ ఆడిటోరియంలో ఆదివారం ఫిజియోథెరపీ కళాశాలకు సంబంధించిన పట్టాల ప్రధానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మూర్తిరాజు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఫిజియోథెరపీకి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు.
ఈ ప్రక్రియ వైద్యంలో ఒక భాగమైందన్నారు. మందులతో నయంకాని రోగాలు సైతం ఫిజియోథెరపీతో నయమవుతున్నాయని పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ విధానానికి విదేశాల్లో సైతం మంచి అవకాశాలు లభ్యమవుతున్నాయని మూర్తిరాజు చెప్పారు. డీన్ టీఏవీ నారాయణరాజు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఫిజియోథెరపీతో అన్ని రోగాలు నయమవుతాయని తెలిపారు.
గతంతో పోల్చితే ఈ విధానానికి రోగుల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ కళాశాల ప్రగతిని వివరించారు. 2013–14 బ్యాచ్ శతశాతం ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రారంభం నుంచి సరాసరి 85 శాతం ఫలితాలు సాధించామని వివరించారు. క్రీడల్లో సైతం ఫిజియోథెరపీ కళాశాల విద్యార్థులు రాణిస్తున్నారని రవికుమార్ వివరించారు.
ఈ సందర్భంగా కళాశాల టాపర్ దీపా శర్మను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్, మిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీలలిత, హోమియో కళాశాల డైరెక్టర్ పివి.నర్సింహరావు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీఆర్‌ఎస్ బేగం, సంక్షేమాధికారి గిరిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment