mims hospital nellimarla
-
ఫిజియోథెరపీకి పెరుగుతున్న ప్రాధాన్యత
నెల్లిమర్ల : వైద్యరంగంలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యత పెరుగుతోందని మిమ్స్ చైర్మన్ అల్లూరి మూర్తిరాజు అన్నారు. పట్టణంలోని మిమ్స్ క్యాంపస్‌లో ఉన్న అల్లూరి లక్ష్మీకాంతమ్మ మెమోరియల్ ఆడిటోరియంలో ఆదివారం ఫిజియోథెరపీ కళాశాలకు సంబంధించిన పట్టాల ప్రధానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మూర్తిరాజు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఫిజియోథెరపీకి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఈ ప్రక్రియ వైద్యంలో ఒక భాగమైందన్నారు. మందులతో నయంకాని రోగాలు సైతం ఫిజియోథెరపీతో నయమవుతున్నాయని పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ విధానానికి విదేశాల్లో సైతం మంచి అవకాశాలు లభ్యమవుతున్నాయని మూర్తిరాజు చెప్పారు. డీన్ టీఏవీ నారాయణరాజు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఫిజియోథెరపీతో అన్ని రోగాలు నయమవుతాయని తెలిపారు. గతంతో పోల్చితే ఈ విధానానికి రోగుల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ కళాశాల ప్రగతిని వివరించారు. 2013–14 బ్యాచ్ శతశాతం ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రారంభం నుంచి సరాసరి 85 శాతం ఫలితాలు సాధించామని వివరించారు. క్రీడల్లో సైతం ఫిజియోథెరపీ కళాశాల విద్యార్థులు రాణిస్తున్నారని రవికుమార్ వివరించారు. ఈ సందర్భంగా కళాశాల టాపర్ దీపా శర్మను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్, మిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీలలిత, హోమియో కళాశాల డైరెక్టర్ పివి.నర్సింహరావు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీఆర్ఎస్ బేగం, సంక్షేమాధికారి గిరిబాబు పాల్గొన్నారు. -
మిమ్స్ ‘కన్నతల్లి’ పథకం భేష్
నెల్లిమర్ల: మిమ్స్ ఆసుపత్రిలో అమలుచేస్తున్న కన్నతల్లి పథకం నిరుపేద మహిళలకు వరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సీవీరావు అన్నారు. నెల్లిమర్ల పట్టణంలోనున్న మిమ్స్ వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రిని బుధవారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో అమలుచేస్తున్న పథకాలు, వైద్యసేవలు గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద గర్భిణులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే ఉన్నత ఆశయంతో అమలుచేస్తున్న కన్నతల్లి పథకం తనకు ఎంతగానో నచ్చిందన్నారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం యాజమాన్యం ఉదారతకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా కన్నతల్లి పథకంద్వారా చిన్నారులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు, డీన్ టీఏవీ నారాయణరాజు, ప్రిన్సిపాల్ లక్ష్మీకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్, సంక్షేమాధికారి గిరిబాబు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా: 14మందికి గాయాలు
గుర్ల: మండలంలోని గుర్ల పెద్దకానాల వద్ద మంగళవారం ఉదయం ఆటో బోల్తాపడడంతో 14మందికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని గూడేం, గుజ్జంగివలస గ్రామాలకు చెందిన విద్యార్థులు నెల్లిమర్లలో ఉన్న ఆదిత్య పబ్లిక్ స్కూలుకు ప్రతి రోజూ వెళ్తుంటారు. అదే క్రమంలో మంగళవారం కూడా ఆటోలో వెళ్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 13 మంది విద్యార్థులు, డ్రైవరు గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారిలో సిరిడి భవాని, కె. వాసవి, బి. లోకేష్, ఎమ్. తేజ, ఎమ్, కుమారి, బి. దుర్గాప్రసాధ్,ఎస్. భవాని, సోము అఖిల్, ఎమ్. వరుణ్ సందేష్, కె. రాంబాబు, టి.మంగ, టి. అభిషేక్ తదితరులున్నారని గుర్ల ఎస్సై నీలకంఠం తెలిపారు. క్షతగాత్రులకు నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. గుజ్జంగివలస గ్రామానికి చెందిన సిరిడి భవాని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ మిమ్స్‌కు తీసుకువచ్చారు.