కార్డు పని చేయదు..వైద్యం అందదు | Tdp Government Neglect On Health Cards | Sakshi
Sakshi News home page

కార్డు పని చేయదు..వైద్యం అందదు

Published Wed, Mar 21 2018 12:08 PM | Last Updated on Wed, Mar 21 2018 12:08 PM

Tdp Government Neglect On Health Cards - Sakshi

ఉద్యోగులకు నగదురహిత వైద్యంప్రకటనలకే పరిమితమైంది.వారికిచ్చిన హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మారాయి.నెలనెలా ప్రీమియం వసూలుచేస్తున్నా వైద్యం అందించే విషయంలోసర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్‌ ఆసుపత్రులు నగదు రహితవైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి.దీంతో తప్పని పరిస్థితిలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ చేతిలో నుంచి డబ్బులు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది.  

కడప ఎడ్యుకేషన్‌: నగదు రహిత వైద్యం అమలుకు నోచుకోవడం లేదు.   ఉద్యోగ, ఉపాధ్యాయ, òపెన్షనర్లకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత వి«ధానంలో వైద్యం అందుతుందని సీఎం చంద్రబాబునాయుడు 2014 నవంబర్‌లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అట్టహాసంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు, పెన్షనర్లకు కార్డులను కూడా జారీచేశారు. ఇవన్నీ ఇచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ హెల్త్‌కార్డుల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. 2014కు ముందు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ విధానం కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల నుంచి ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా ముందుగా నగదు చెల్లించి ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తర్వాత ఆయా శాఖలకు బిల్లులు సమర్పించి గరిష్టంగా రూ.2లక్షల వరకూ పొందేవారు. అయితే ఈ విధానం కాదని ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత విధానంలో వైద్యం అందించడానికి హెల్త్‌కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

నెలనెలా ప్రీమియం వసూలు
2014 నవంబర్‌ నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల వేతనాల నుంచి ప్రతి నెల రూ.90 రూ.120లను వారి వేతన శ్రేణిని బట్టి ప్రీమియం రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి వసూలు చేసిన మొత్తం ద్వారా దాదాపు రూ.350 కోట్లు ప్రభుత్వానికి జమవుతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయబట్టి మూడేళ్‌లైనా కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలలు హెల్త్‌కార్డుల ద్వారా వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లోని చిన్న చిన్న ఆసుపత్రుల్లో కొన్ని చిన్న వ్యాధులకు మాత్రమే వైద్యం అందుతుంది. దంత, కంటి సమస్యలతోపాటు చిన్నచిన్న శస్త్రచికిత్సలు చేస్తున్నారు తప్ప పెద్దవ్యాధులకు వైద్యం చేయడం లేదు. క్యాన్సర్, గుండె, కిడ్నీ మార్పిడి, కాలేయ సంబంధిత వ్యాధులకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకూ ఉద్యోగులకు ఖర్చవుతుంది. హైదరాబాద్‌లోని కార్పొరేట్, సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలల్లో హెల్త్‌కార్డులు చెల్లుబాటు కాకపోవడంతో పెన్షనర్లు ఉద్యోగులు ముందుగా డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురై అప్పులపాలవుతున్నారు.

జిల్లాలో ఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్లుఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జిల్లావ్యాప్తంగా 35వేలమంది దాకా ఉన్నారు. వీరందరూ నెలకు ఒకొక్కరు రూ.90, 120 ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా గత మూడేళ్ల నుంచి తాము ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నామని, అయినా నగదు రహిత వైద్యం అందడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

డబ్బులు కట్టి వైద్యం చేయించుకున్నా..
ప్రస్తుతం హెల్త్‌కార్డులు అమలుకాకపోవడంతో చాలామంది డబ్బులు కట్టి  వైద్యం చేయించుకుంటున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత మెడికల్‌ రీయింబర్స్‌ విధానం ద్వారా బిల్లులను సమర్పిస్తే ఒక్కో బిల్లుకు గరిష్టంగా రూ.2లక్షలను చెల్లిస్తున్నారు. ఆ మొత్తాలు కూడా ఏ ఆరునెలలకో ఏడాదికో మంజూరవుతున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ గడువును కూడా రాష్ట్రప్రభుత్వం ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తూ ఉంది. ఆ గడువు కూడా మార్చి 31కి ముగియనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement