రెనోవా కేన్సర్ సెంటర్ ప్రారంబోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
ఆ కార్డులో రోగి పూర్వ చికిత్సలు, వైద్య పరీక్షల సమాచారం
పేదలకు అతితక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
సమర్థుడైన వ్యక్తి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని కితాబు
నల్లకుంట: రాష్ట్రంలోని తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మరో 30 రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (ఎఫ్‌డీహెచ్‌పీ) కార్డులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నల్లకుంట ఓయూ రోడ్డులోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి ఆవరణలో కొత్తగా నిర్మించిన రెనోవా కేన్సర్ సెంటర్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం రేవంత్ గురువారం ప్రారంభించారు.
అనంతరం అక్కడి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డులో రోగి గత చికిత్సల వివరాలన్నీ ఉంటాయని.. తద్వారా భవిష్యత్తులో ఆ వ్యక్తి ఏదైనా జబ్బు బారినపడితే పూర్వ చికిత్సలు, రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల వివరాలను వైద్యులు కేవలం ఒక క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుందని వివరించారు. పేదలకు అతితక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చును రూ. 10 లక్షలకు పెంచిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. సమర్థుడైన వ్యక్తి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని.. ప్రజలకు సేవ చేసేందుకు గుర్తింపు పొందిన ఎన్జీవోలతో త్వరలో మంత్రి దామోదర సమావేశం ఏర్పాటు చేస్తారన్నా రు. పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేయడం అభినందనీయమని కొనియాడారు.
కేన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని.. రెనోవా గ్రూప్ ఆఫ్ ఆసుపత్రులు ప్రజాసేవ చేసేందుకు ముందడుగు వేయడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు.
డీడీఎంఎస్ స్పోర్ట్స్ స్కూల్‌కు అనుమతి ఇస్తాం..
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే ఓయూ ఆవరణలోని డీడీఎంఎస్ విద్యాసంస్థ స్థలంలో కొంతభాగం రోడ్డు విస్తరణలో పోయిందని ట్రస్ట్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని.. ఆ పక్కనే ఓయూ స్థలం ఉంటే డీడీఎంఎస్‌కు ఇవ్వడానికి వీలవుతోందో లేదో అధికారులతో మాట్లాడతానని చెప్పారు. గతంలో కాసు బ్రహా్మనందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డీడీఎంఎస్‌కు నాటి ఎంసీహెచ్ ద్వారా ఇచి్చన పన్ను మినహాయింపులను తిరిగి కొనసాగించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు.
జిల్లాల్లో త్వరలో కేన్సర్ సెంటర్లు: దామోదర
రాష్ట్రంలో కేన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని.. కానీ చివరి దశలోనే కేసులు బయటపడుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. తొలి దశలోనే కేన్సర్ వ్యాధిని నిర్ధారించి చికిత్సలు అందించేందుకు వీలుగా త్వరలో జిల్లా స్థాయిలో దశలవారీగా కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ శ్రీధర్‌రెడ్డి పెద్దిరెడ్డి, డీడీఎంఎస్ చైర్మన్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment