ఈ అంశంపై అధికారులతో ప్రత్యేక భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
ఒకే కార్డులో రేషన్, ఆరోగ్యశ్రీ, ఇతర పథకాల వివరాలు
ప్రస్తుతం అందుబాటులోని సమాచారం ఆధారంగా కుటుంబాల నిర్ధారణ
వచ్చే నెల 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని నిర్దేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళలనే ఇంటి యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలను కార్డుల వెనుకభాగంలో ముద్రించాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు (ఎఫ్‌డీసీ)లపై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశంపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్తాన్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారుల బృందం... తమ అధ్యయనానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచి్చంది.
కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను సీఎంకు వివరించింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు సీఎం పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ప్రస్తుతమున్న రేషన్, ఆరోగ్యశ్రీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలన్నారు. ఇతర రాష్ట్రాల కార్డు ల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి సమాచారం సేకరించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గం పరిధిలోని రెండు ప్రాంతాల్లో...
ఎఫ్‌డీసీ కోసం సమాచార సేకరణ, వాటిల్లో ఏయే అంశాలు పొందుపరచడంతోపాటు మార్పుచేర్పుల వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరతో కూడిన మంత్రివర్గ ఉప సంఘానికి అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు అందు లో జత చేయాల్సిన లేదా తొలగించాల్సిన అంశాల సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండేసి ప్రాంతాలను (ఒక గ్రామీణ, ఒక పట్టణ) పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని వచ్చే నెల 3 నుంచి కుటుంబాల నిర్ధారణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర్, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment