తల్లిదండ్రుల నిరక్ష్యం.. చిన్నారికి శాపం
మూడేళ్ల క్రితం బస్టాండ్‌లో వదిలేసిన కన్నతల్లి
ఎస్‌కేవీ ట్రస్టులో ఆశ్రయం పొందిన చిన్నారి
ఇటీవలే తండ్రి చెంతకు చేర్చిన ట్రస్ట్ సభ్యులు
కొడుకు తిరిగొచ్చాడనే సంతోషం కనిపించని తండ్రి
తల్లిదండ్రుల నిర్లక్ష్యం అభంశుభం తెలియని బాలుడికి శాపంగా మారింది. అమ్మానాన్నల సంరక్షణలో ఆనందంగా గడవాల్సిన బాల్యం.. ఎవరూ లేని అనాథలా వెక్కిరించింది. కనిపెంచిన పేగుబంధమే.. వదిలించుకోవాలని చూసింది.. అన్నీతానై వ్యవహరించాల్సిన తండ్రి తనకేం సంబంధం లేదు.. అన్నట్లుగా వ్యవహరించాడు. ఫలితంగా మూడేళ్ల పాటు ట్రస్టులో ఆశ్రయం పొంది, రెండు రోజుల క్రితమే సొంతూరు చేరుకున్న ఓ బాలుడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
దోమ: మండల కేంద్రానికి చెందిన బొక్క బాబు, యాదమ్మ దంపతులకు భరత్ అనే కు ఏడేళ్ల కుమారుడున్నాడు. అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలో అనుకోని కలహాలు చెలరేగాయి. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న యాదమ్మ కొడుకును నీవద్దే పెంచుకో.. అని భర్తకు సూచించింది. ఇందుకు బాబు అంగీకరించలేదు. చేసేదేమి లేక ఎనిమిదేళ్ల భరత్‌ను తీసుకుని బతుకుదెరువు కోసం బయలుదేరింది.
హైదరాబాద్ చేరుకుని రెండేళ్ల పాటు కూలీనాలీ పనులు చేసుకుంటూ కొడుకును సాకింది. ఆతర్వాత విజయవాడకు చేరుకుంది. ఈ సమయంలో ఆ తల్లి హృదయం పాశానంగా మారింది. నాకే దిక్కు లేదు.. వీడిని ఎలా చూసుకోవాలి అనుకుందో ఏమో.. పదేళ్ల పసి బాలుడిని వదిలించుకోవాలని డిసైడైంది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో కొడుకును వదిలేసి, తన దారిన తాను వెళ్లిపోయింది. అమ్మ జాడ తెలియక వెక్కివెక్కి ఏడుస్తున్న ఆ బాలుడు భయంభయంగా రైల్వే స్టేషన్‌లోని ఓ మూలన కూర్చుండిపోయాడు. ఏడ్చిఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.. అమ్మకు ఏమైందో..? ఎటు వెళ్లిపోయిందో తెలియని పరిస్థితి. ఏవైపు నుంచి వస్తుందోనని ఆత్రుతగా చూడటమే తప్ప.. అమ్మ రాలేదు.. ఏడుపు ఆగలేదు.
ఇది గమనించిన ప్రయాణికులు స్టేషన్‌లో ఓ బాలుడు ఒంటరిగా ఏడుస్తున్నాడని విజయవాడ చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి.. మీది ఏ ఊరు, మీ అమ్మానాన్నల పేర్లు ఏంటి అని ప్రశ్నించినా.. బాలుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చిన్నారిని తీసుకెళ్లిన చైల్డ్‌లైన్ సిబ్బంది విజయవాడలోని ఎస్‌కేవీ ట్రస్ట్‌లో చేర్పించారు. ఇది జరిగి మూడేళ్లు గడిచింది. ఈ మధ్యకాలంలో ట్రస్టు ప్రతినిధులు ఎన్నిసార్లు అడిగినా భరత్ మాత్రం తన ఊరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు. వారం రోజుల క్రితం భరత్‌తో మాట్లాడిన ట్రస్టు సభ్యులకు.. వికారాబాద్ దగ్గర దోమ గ్రామమని చెప్పాడు. దీంతో పూర్తి వివరాలు తెలుసుకున్న ట్రస్టు ప్రతినిధులు శుక్రవారం బాలుడిని తీసుకుని దోమకు చేరుకున్నారు.
కన్నకొడుకు తిరిగొచ్చినా..
ప్రస్తుతం భరత్ వయసు పదమూడేళ్లు.. ఐదేళ్ల తర్వాత కన్నకొడుకును చూసిన ఆ తండ్రిలో ఏమాత్రం చలనం కనిపించలేదు. భార్య, కొడుకు ఇంటినుంచి వెళ్లిపోయిన రోజునుంచి ఒక్కసారి కూడా వారిని వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం వారు బతికే ఉన్నారా..? లేదా..? అనే సమాచారం కూడా తెలియదు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లోనూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఇవన్నీ పక్కన పెట్టినా.. నా కొడుకు తిరిగొచ్చాడు.. అని బాలుడిని చేరదీయలేదు.. ముద్దాడలేదు. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు బాబుకు సర్దిచెప్పి.. భరత్‌ను అప్పగించారు. దీంతో తప్పదు అన్నట్లు కొడుకును దగ్గరకు తీసుకున్నాడు.
తన దారిన వెళ్లిపోయిన తల్లి
కుటుంబ కలహాలతో భర్తకు దూరమై, కొడుకును వదిలేసిన యాదమ్మ తనదారి తాను చూసుకుంది. ఆమె ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నట్లు తెలిసింది.
ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్
అటు తల్లి దూరమై.. ఇటు తండ్రి ఆలనాపాలనా కరువైన భరత్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక నాయకులు, ఎస్‌కేవీ ట్రస్ట్ ప్రతినిధుల సహకారంతో బాలుడిని వికారాబాద్‌లోని గురుకుల పాఠశాలలో చేర్పించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ముందుకు వచ్చి భరత్ బాధ్యతలు తీసుకోవాలని, లేదా ప్రభుత్వం తరఫున చేయూత అందేలా చూడాలని సర్పంచ్‌ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, గ్రామస్తులు కోరారు.
బాగా చదువుకుంటా
నా చిన్నప్పుడు అమ్మానాన్నా నన్ను బాగా చూసుకునేవారు. ఇప్పుడు వారికి నాపై ఎలాంటి ప్రేమ లేదు. ఇద్దరూ నన్ను దూరం పెట్టేందుకే ప్రయతి్నస్తున్నారు. అమ్మ నన్ను వదిలి వెళ్లిన రోజు గుర్తొస్తేనే భయమేస్తోంది. చైల్డ్‌లైన్ వారు వచ్చి వివరాలు అడిగినా భయంతో ఏమీ చెప్పలేకపోయా. ఇప్పుడు కొంత ధైర్యం వచ్చి నా వివరాలు తెలియజేశా. దీంతో నన్ను నాన్న దగ్గరకు తీసుకువచ్చారు. కానీ ఆయనేమో నన్ను ఆదరించడం లేదు. అందరూ వచ్చి వికారాబాద్‌లోని రెషిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. ఇకనుంచి బాగా చదువుకునేందుకు ప్రయతి్నస్తా.
– భరత్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment