18 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరి కన్‌సెంట్ , కన్‌సెంట్ ఇచ్చేవారూ పెద్దోళ్లమని నిర్ధారించాలి
భారతీయుల డేటా భారత్‌లోనే నిల్వచేయాలి
డీపీడీపీ చట్ట ముసాయిదాలో పేర్కొన్న ఐటీశాఖ.. ఫిబ్రవరి 18 వరకు అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై ఇకపై మైనర్లు ఇష్టంవచ్చినట్లు ఖాతాలు తెరిచేందుకు వీలు పడదు. వారి తల్లిదండ్రుల అనుమతి (వెరిఫయబుల్ కన్‌సెంట్) ఉంటేనే ఖాతా తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర సమాచార శాఖ విడుదల చేసిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్ట ముసాయిదాలో నిబంధన చేర్చా రు. 18 ఏళ్లలోపు పిల్లలకు ఈ నిబంధన వర్తిస్తుంద ని పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే తల్లి దండ్రులు లేదా గార్డియన్ అనుమతి ఇచ్చిన తర్వాతే మైనర్లు సోషల్ మీడియా ఖాతాలు, ఈ–కామర్స్, గేమింగ్ యాప్‌లు వాడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో కొందరు తమ పుట్టిన తేదీ, వయస్సును తప్పుగా నమోదు చేసి సోషల్‌మీడియా ఖాతాలు తెరుస్తున్నారు. ఇకపై అది కూడా కుదరదు. పిల్లలకు తల్లిదండ్రులుగా సమ్మతి తెలిపేవారు కూడా తప్పకుండా పెద్దవాళ్లే అని నిర్ధారించాల్సి ఉంటుందని ముసాయిదాలో పేర్కొన్నారు. దివ్యాంగులకు సైతం వారి చట్టబద్ధమైన గార్డియన్ ద్వారా సమ్మతి ఉంటేనే సోషల్ మీడియా వాడేలా నిబంధనలు తీసుకొచ్చారు.
మన డేటా మనదేశంలోనే
డీపీడీపీ ముసాయిదాలో మరో కీలక నిబంధన కూడా చేర్చారు. మనదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సోషల్‌మీడియా సంస్థలు.. వారివద్ద ఉన్న భారతీయుల డేటాను ఇక్కడే నిల్వచేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు. దేశం బయటకు తరలించేందుకు వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముసాయిదాలో నిబంధనలు చేర్చింది.
,యితే ఈ కొత్త నిబంధనలు మెటా, గూగుల్, యాపిల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి టాప్ సోషల్ మీడియా, ఇంటర్నెట్ కంపెనీలకు చికాకు కల్గించే అవకాశం ఉంది. ఈ ముసాయిదాపై అభిప్రాయాలు తెలిపేందుకు ఫిబ్రవరి 18 వరకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. అందువల్ల సదరు కంపెనీలు ఈ నిబంధనలు వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
Comments
Please login to add a commentAdd a comment