బ్యాటరీ, సెల్ లైట్ల వెలుగులో పాము కుట్టిన రోగికి వైద్యం చేస్తున్న సిబ్బంది (ఫైల్) ,ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న బాత్ రూమ్‌కు తలుపులు లేకపోవడంతో చాటు కోసం కట్టిన కర్టెన్
కోటనందూరు: తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో సుమారుగా లక్షమంది ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంధకారంలో కొట్టు మిట్టాడుతోంది. ఆస్పత్రి లోపల, వెలుపల ఎక్కడా ఒక్క లైటు కూడా లేని దయనీయ పరిస్థితి ఉంది. బ్యాటరీ లైట్ల వెలుగుల్లోనే ప్రసవాలు చేస్తూ, రాత్రి వేళల్లో వచ్చే రోగులకు సెల్, బ్యాటరీ లైట్ల వెలుగులో వైద్యం అందిస్తున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు వేయించిన ఎల్‌ఈడీ వెలుగు మాత్రమే రాత్రి వేళల్లో అక్కడి సిబ్బందికి దిక్కు.
ఇక పోతే ఆపరేషన్ థియేటర్‌లో కనీసం ప్రసవ సమయంలో వెలువడే వ్యర్థాలను బయటకు పంపే సింక్‌లు లేకపోవడంతో గదిలో వాతావరణం దుర్గంధభరితంగా తయారవుతోంది. ప్రసవానంతరం వినియోగించే బాత్‌రూంకు ఏడాదిగా తలుపులు లేకపోయినా చిన్న కర్టెన్ కట్టి గడిపేస్తున్నారు. ఈ ఆస్పత్రికి లక్షల రూపాయలు ఆస్పత్రి అభివృద్ధి నిధులున్నా వాటిని ఖర్చు చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ గాని, స్థానిక పాలకులు గాని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి
1962 సంవత్సరంలో సాధారణ ఆస్పత్రిగా ఏర్పడిన ఈ పీహెచ్‌సీని 1998లో నూతన భవనం నిర్మించి ఆరు పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. అవసరాలకు అనుగుణంగా భవనం లేకపోవడంతో ఆరు నెలల క్రితం వరకూ పాత భవనంలోనే వైద్య సేవలు నడిచాయి. పాత భవనం ఏ సమయంలోనైనా కూలిపోయే పరిస్థితిలో ఉండడంతో ఆరు నెలల క్రితం వైద్య సేవలను నూతన భవనంలోకి మార్చారు. ఇన్‌పేషెంట్లు, ఓపీ, మందుల పంపిణీ, వైద్యులు, సిబ్బంది విశ్రాంతి, ఇతర అవసరాలకు చాలినన్నీ గదులు లేకపోవడంతో రోగులతో పాటు సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
అరకొరగా వైద్య సేవలు
♦ పీహెచ్‌సీలో ఇద్దరు కాంట్రాక్టు వైద్య సిబ్బంది ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విధులు నిర్వహించాల్సిన వీరు రోజు విడిచి రోజు ఒకరు చొప్పున వస్తున్నారని రోగులు అంటున్నారు. పది గంటల తరువాత వచ్చి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని వారంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని వారు ఆరోపిస్తున్నారు.
డిప్యుటేషన్‌పై సిబ్బంది
♦ ఆస్పత్రిలో పని చేయాల్సిన కొందరు సిబ్బంది డిప్యుటేషన్‌పై వారికి అనువుగా ఉన్న చోటకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారులను ప్రభా వితం చేసి విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
30 పడకల ప్రతిపాదన పడకేసినట్టే
♦ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామంటూ పదేళ్లుగా ప్రకటనలు చేయడం తప్ప పాలకులు పట్టించుకోవడం లేదు.
ఆస్పత్రి అధ్వానంగా ఉంది
ఇక్కడి పీహెచ్‌సీ పరిస్థితి అధ్వానంగా ఉంది. పాము కుట్టిందని మా బందువుని తీసుకొస్తే బ్యాటరీ లైట్ల వెలుగులో వైద్య చేశారు. ఒక్క ఫ్యానుగాని, తాగడానికి మంచినీళ్లు గానీ, కూర్చోడానికి బల్ల లు గాని లేవు. జన సంచారం లేని అడవిలో ఉన్న ఆస్పత్రిగా ఉంది. అధికారులు స్పందించి కనీస వసతులు ఏర్పాటు చేయాలి. – కోడి నానాజీ, రోగి బంధువు,ఎంబీపట్నం, నాతవరం మండలం, విశాఖజిల్లా.
సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం
ఇటీవలే ఆసుపత్రికి వచ్చాను. గతంలో పని చేసిన ఆస్పత్రితో సంబంధం ఉన్న విషయాల పరిష్కారానికి అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. 15 రోజులుగా రోజు ఆస్పత్రికి వచ్చి నిర్ణీత సమయం వరకూ విధి నిర్వహణలో ఉంటున్నాను. సొంత డబ్బులు ఇచ్చి ఆస్పత్రిలో బల్బుల ఏర్పాటు చేయమని చెప్పాను. కాని ఎలక్ట్రీషియన్ దొరకలేదని సిబ్బంది చెబుతున్నారు. సమస్యల పరిష్కారానికి ఇటీవల జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశం దృష్టికి తీసుకువెళ్లాం. రూ.2.24 లక్షలతో వివిధ ఉపకరణాల కొనుగోలుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం
– డాక్టర్ సందీప్, వైద్యాధికారి,కోటనందూరు పీహెచ్‌సీ
Comments
Please login to add a commentAdd a comment