మాతాశిశు విభాగం భవనం ప్రహరీ గోడను ఆనుకుని జెరాక్స్ సెంటర్ పేరుతో ఉన్న గది వద్ద గర్భిణుల వివరాలు నమోదు చేసుకుంటున్న మహిళ
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రైవేటు ఆస్పత్రుల్లో తొమ్మిది నెలలపాటు ఓపీ ఫీజులు, పరీక్షల పేరుతో చేస్తున్న దోపిడీని తట్టుకోలేక ప్రభుత్వాస్పత్రులకు వస్తున్న పేద, దిగువ మధ్య తరగతి గర్భిణులను ఇక్కడ తిష్టవేసిన రాబందులు పీక్కుతింటున్నాయి. ఓపీ ఫీజు నుంచి పరీక్షలు, మందులన్నీ ఉచితంగా లభిస్తాయన్న ఆశతో ఓపీ రాయించుకునేందుకు, ఆ తర్వాత వైద్యం, స్కానింగ్ చేయించుకునేందుకు కడుపులో బిడ్డను మోస్తూ గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్న కాబోయే తల్లుల వద్ద రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాస్పత్రి మాతాశిశు విభాగంలోని ల్యాబ్ సిబ్బంది డబ్బులు గుంజుతున్నారు. అన్ని పరీక్షలూ ఉచితంగా చేయాల్సి ఉన్నా హెపటైటిస్ సి వైరస్ (హెచ్‌సీవీ) వ్యాధి నిర్ధారణ పరీక్ష ఇక్కడ చేయడానికి లేదంటూ, బయట ప్రైవేటు ల్యాబుల్లో చేయించుకోవాలంటూ ఒక్కొక్కరి వద్ద రూ.250 వసూలు చేస్తున్నారు. ల్యాబ్‌లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది సుభాష్‌తోపాటుఏటీసీ సెంటర్‌లోని సిబ్బంది ఈ దందాకు పాల్పడుతున్నారు.
మభ్యపెట్టి.. మాయ చేస్తూ...
జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రధాన భవనంలో వివిధ రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. దాని పక్కనే రెండేళ్ల క్రితం నిర్మించిన మాతాశిశు విభాగంలో గర్భిణులు, పిల్లలకు వైద్యం చేస్తున్నారు. పాత భవనంలో ప్రధాన ల్యాబ్‌తోపాటు, మెడ్‌ఆల్ సాంపిల్స్ సేకరణ కేంద్రం ఉన్నాయి. మాతాశిశు విభాగ భవనంలోనూ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రం ఉంది. ఇక్కడ గర్భిణులు, పిల్లలకు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. గర్భిణులకు అవసరమైన పలు పరీక్షలు డాక్టర్లు రాస్తుండగా అందులో హెచ్‌సీవీ పరీక్ష ఇక్కడ చేయడంలేదని, బయట చేయించుకోవాలంటూ ల్యాబ్‌లో పని చేస్తున్న సుభాష్ అనే ఉద్యోగి గర్భిణులకు చెబుతున్నారు. రక్త నమూనాలను సేకరించిన తర్వాత ఆస్పత్రి భవనం పక్కనే జిరాక్స్ పాయింట్ అనే బోర్డు ఉన్న గది వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఆ పరీక్షకు ఇక్కడ తీసిన రక్త నమూనాలనే పంపిస్తామని, అక్కడ మళ్లీ ఇవ్వాల్సిన పనిలేదని చెబుతూ కిట్లు తెచ్చి ఇక్కడే పరీక్షలు చేస్తున్నారు. జిరాక్స్ పాయింట్ అనే బోర్డు ఉన్నగదిలోని వ్యక్తి గర్భిణుల వద్ద డాక్టర్ రాసిన ఓపీ తీసుకుని వారి పేరు నమోదు చేసుకుంటున్నారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు లోపల పరీక్షలతోపాటు ఇది కూడా ఇస్తామని, వచ్చేటప్పుడు రూ.250 తీసుకురావాలని చెబుతున్నారు.
నెల వసూళ్ల మొత్తం రూ.4 లక్షలు...
ఈ ఆస్పత్రికి ఏజెన్సీతోపాటు రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా గర్భిణులు వస్తున్నారు. రోజుకు ఓపీ సరాసరి 200 దాటుతోంది. ఇందులో ప్రతిరోజూ సరాసరి 50 మందికిపైనే పరీక్షలు రాస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరికీ హెచ్‌సీవీ పరీక్ష తప్పనిసరి. ఈ పరీక్షను పాత భవనంలోని ప్రధాన ల్యాబ్‌లో చేస్తున్నారు. అయినా ప్రభుత్వాస్పత్రిలో ఈ పరీక్ష చేయడంలేదంటూ గర్భిణుల వద్ద రూ.250 చొప్పున తీసుకుంటున్నారు. రూ.250 చొప్పున రోజుకు రూ.12,500 మాతాశిశు విభాగంలోని ల్యాబ్‌లో ఉంటున్న సుభాష్ బృందం దోపిడీ చేస్తోంది. పేదల వద్ద నెలకు దాదాపు రూ.4 లక్షలు ఈ బృందం దోచుకుంటోంది. రెండేళ్లుగా ఈ దందా సాగుతోందని ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. గతంలో రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు హెచ్చరికలతో వదిలేశారు. గత నెలాఖరున ఆర్‌ఎంవో లక్ష్మీపతికి ఫిర్యాదులు రావడంతో తనిఖీ చేయగా బండారం బట్టబయలైంది. స్థానిక పోలీస్ ఔట్‌పోస్టులో మౌఖికంగా ఫిర్యాదు చేసిన ఆర్‌ఎంవో ఆ తర్వాత మిన్నకుండిపోయారని సమాచారం. ఔట్‌పోస్టులో ఆరా తీయగా ఆర్‌ఎంవో రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని, మౌఖికంగా ల్యాబ్‌లోని సుభాష్ చేసిన దందా చెప్పారని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి గర్భిణుల వద్ద ల్యాబ్ సిబ్బంది చేస్తున్న దోపిడీని ఇప్పటికైనా నిలువరించాలని పేద ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
అక్కడ లేదని ఇక్కడకు పంపారు
ఆస్పత్రిలోపల రక్తం తీసుకున్నారు. ఒక పరీక్ష ఇక్కడ లేదని చెప్పి పక్కనే జిరాక్స్ పాయింట్ వద్దకు వెళ్లాలని చెప్పారు. ఇక్కడ మళ్లీ రక్తం ఇవ్వాల్సిన పనిలేదని, ఇక్కడ తీసిన రక్తం వారికి పంపిస్తామంటున్నారు. జిరాక్స్ బోర్డు వద్ద ఉన్న రూములోని వ్యక్తి ఓపీ తీసుకుని మా పేరు రాసుకున్నారు. రేపు ఆ పరీక్షలతోపాటు ఇది కూడా ఇస్తామని, వచ్చేటప్పుడు రూ.250 పట్టుకురమ్మన్నారు. నేను రావాల్సిన అవసరంలేదని, ఎవరినైనా పంపినా ఇస్తామని చెప్పారు.– లీలావతి, గర్భిణి, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment