విద్యుత్ సరఫరా నిలిచిపోతే అంధకారం రాజ్యమేలే అడ్డతీగల సీహెచ్‌సీ
సాక్షి, అడ్డతీగల(తూర్పుగోదవరి) : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలైంది.అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కమిటీల చైర్మన్ గిరీలను వదలడం లేదు. రంపచోడవరం డివిజన్‌లోని ఏడు మండలాల్లో 18 పీహెచ్‌సీలు, ఒక ఏరియా ఆసుపత్రి, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. విలీన మండలాల్లోను కొన్ని పీహెచ్‌సీలు, రెండు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజకీయ నిరుద్యోగులకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. వీరందరూ ఆ పదవులను అడ్డుపెట్టుకుని జేబులు నింపుకోవడం తప్పించి ఏ రోజూ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేసింది లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల వైద్యులు ఎప్పటికప్పుడు ఆసుపత్రి అభివృద్ధి కమిటీల సభ్యులతో సమావేశాలు నిర్వహించి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పన, అత్యవసర మందుల కొనుగోలు వంటి విధులు చేపట్టాలి.
కానీ ఇవేమీ జరపకుండానే పాలకవర్గాలు ఐదేళ్లూ గడిపేశాయి. ఆసుపత్రుల్లో సాధారణ మందుల దగ్గర నుంచి అత్యవసరమైన మందులు నిండుకున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఈ అవసరాలు తీర్చడానికి సమావేశాల్లో తీర్మానాలు చేసి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులను ఖర్చు చేయవచ్చు. ఏజెన్సీలో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయాలు కలగడమే కాదు, గంటల తరబడి సరఫరా నిలిచిపోతుంటుంది.అలాంటపుడు రోగులు, ఆసుపత్రి సిబ్బంది చీకట్లోనే అల్లాడిపోతున్నారు. బ్యాటరీ లైట్ల వెలుగులో సైతం రోగులకు, క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అడ్డతీగల ఆసుపత్రినే తీసుకుంటే, ఈ ఆసుపత్రికి జనరేటర్ కొనుగోలు చేయమని ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు ఐటీడీఏ పీఓ నిషాంత్‌కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. ఇంత వరకూ చర్యలు శూన్యం.
2014కి ముందు ఎమ్మెల్యే చైర్మన్‌గా ఆసుపత్రులకు అభివృద్ధి కమిటీలు నడిచేవి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ నేతలకు ఆ పదవులు కట్టబెట్టింది. విశేషమేమంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ దేశం నేతలే ఆయా పీహెచ్‌సీలు, ఇతర ఆసుపత్రుల్లో చైర్మన్‌ల పదవులు వెలగబెడుతున్నారు. అధికారులు సైతం కొత్త చైర్మన్‌ల ఎంపికకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రజారోగ్యం కోసం మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆçసుపత్రుల అభివృద్ధి కమిటీలకు అత్యవసరంగా చైర్మన్ల నియామకాలు చేపట్టవలసిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment