Diagnostic tests
-
దోపిడి దోమ
రాయదుర్గంలోని నేసేపేటకు చెందిన సిద్ధన్న అనారోగ్యానికి గురై ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. అతడి సలహా మేరకు ఓ సీనియర్ వైద్యుడి దగ్గరకు వెళితే.... రోగి చెబుతున్నది వినకుండానే రక్తపరీక్షలు చేయించుకుని రమ్మంటూ ఓ చీటి రాసి చేతిలో పెట్టాడు. దీంతో సిద్ధన్న ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు వెళితే.. రోగ నిర్ధారణ పరీక్షకు అక్షరాల రూ.950 బిల్లు అయింది. ల్యాబ్ నిర్వాహకుడు ఇచ్చిన రిపోర్టు తీసుకుని తిరిగి సదరు డాక్టర్ వద్దకు వెళితే... సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపి మందులు రాసిచ్చాడు. ఈ తరహా దోపిడీతో వైద్యులు, ల్యాబ్ నిర్వాహకులు కలిసి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. రాయదుర్గం: జిల్లాల్లో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. దోమ కాటుతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. దీనికి తోడు రోగ నిర్ధారణకు సంబంధించి ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకుల వైఖరి మరీ దారుణంగా మారింది. రక్తాన్ని పీల్చే దోమ కాటుతో కోలుకోవచ్చు కానీ, నగదు కొల్లగొడుతున్న దోపిడీ దోమల దెబ్బకు రోగులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. భయాన్ని సొమ్ము చేసుకుంటూ.. సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ వైద్యుడి దగ్గరకు వెళ్లినా.. రోగ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి అంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షకు సంబంధించి రిపోర్టులు లేకుంటే వైద్యం చేయలేని అసహాయ స్థితికి వైద్యులు చేరుకున్నారంటే పొరబడినట్లే. కన్సల్టెంట్ ఫీజు రూపంలో కొంత దండుకునే వైద్యుడు... రోగ నిర్ధారణ పరీక్షలకు రెఫర్ చేయడం ద్వారా మరికొంత కమీషన్ దక్కుతుండడమే ఇందుకు కారణం. విష జ్వరాలపై ప్రజల్లో ఉన్న భయాన్ని తెలివిగా దోపిడీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన ల్యాబ్‌లు 79 ఉండగా... అనధికారికంగా నిర్వహిస్తున్నవి దీనికి రెట్టింపుగానే ఉన్నాయి. ఉచితంగా అందుబాటులో ఉన్నా.. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు గర్భిణులకు బ్లడ్ గ్రూపింగ్, హెచ్ఐవీ, బ్లడ్ షుగర్, హైపటైటిస్–బీ, యూరిన్, టీబీ పరీక్షలతో పాటు డెంగీ, ప్లేట్లేట్ కౌంట్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ లాంటి ఇతర కీలక వ్యాధుల నిర్ధారణకు అవసరమైన పరీక్షలు ప్రాథమిక, అర్బన్ ప్రైమరీ ఆరోగ్య కేంద్రాల్లోనే నిర్వహిస్తుంటారు. డెంగీ పరీక్ష కోసం పీహెచ్‌సీల్లోనే రక్త నమూనాలు సేకరించి ‘ఎలిసా’ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి పంపిస్తారు. 24 గంటల్లోపు పరీక్ష చేసి రోగికి సమాచారం అందేలా చర్యలూ తీసుకున్నారు. ఇష్టారీతిన ఫీజుల వసూళ్లు.. ఉమ్మడి జిల్లాలో గడిచిన ఆరేళ్లు పరిశీలిస్తే 1,538 డెంగీ, 816 మలేరియా, 670 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. 2017–19 మధ్య డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించి 80 శాతం కేసులు నమోదు కావడం విశేషం. ప్రాణాంతకమైన ఈ రోగాలకు సంబంధించి విధిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇది కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి బిల్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ధరల పట్టికను సంబంధిత ప్రైవేట్ ల్యాబ్‌ల్లో తప్పనిసరిగా ప్రదర్శనకు ఉంచాలి. అయితే అధికారిక పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. పైగా ప్రశ్నించిన రోగుల పట్ల దురుసుగా వ్యవహరించడం, గంటల తరబడి వేచి ఉండేలా చేసి ఇబ్బందులు గురి చేస్తుంటారు. టైఫాయిడ్, మలేరియా లాంటి పరీక్షలకు రూ.180 నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తారు. అయితే ఈ పరీక్షలకు రూ.500 నుంచి రూ.600 వరకూ తీసుకుంటూ రోగుల జేబులు కొల్లగొట్టడం విమర్శలకు దారి తీస్తోంది. అనుమతి లేని ల్యాబ్‌లపై చర్యలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ల్యాబ్‌లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడినట్లు తేలితే అనుమతులున్నా ల్యాబ్‌లను సీజ్ చేస్తాం. – డాక్టర్ ఓబులు, జిల్లా మలేరియా అధికారి, అనంతపురం ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర విష జ్వరాల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీని ఉపేక్షించబోం. – డాక్టర్ విశ్వనాథయ్య, డీఎంహెచ్ఓ (చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు ) -
సెల్‌ఫోన్ స్వాబ్‌తో కరోనా నిర్ధారణ పరీక్షలు!
కరోనా నిర్ధారణ కోసం ఓ పుల్లలాంటి పరికరంతో ముక్కులోంచి స్వాబ్ సేకరించి, దాని సహాయంతో కరోనా ఉందని తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన ప్రక్రియ. అందుకే కరోనా నిర్ధారణను మరింత తేలికగా చేయడానికి పూనుకున్నారు ఇంగ్లండ్‌కు పరిశోధకులు. ఓ వ్యక్తి ఉపయోగించే సెల్‌ఫోన్ సహాయం తో తనకు కరోనా ఉందో లేదో తెలుసుకునే ప్రక్రియను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు ఇంగ్లండ్‌కు చెందిన ’యూనివర్సిటీ కాలేజ్ లండన్’ శాస్త్రవేత్తలు. ప్రతి వ్యక్తీ తాను మొబైల్ మాట్లాడుతున్నప్పుడు వదిలే గాలి ఫోన్‌కు అంటుకుంటుంది. పుల్ల సహాయంతో సెల్‌ఫోన్‌ను రుద్దడం ద్వారా సేకరించిన స్వాబ్‌తో మరింత తేలిగ్గా... అంటే ముక్కులో పుల్లలు దూర్చి ఇబ్బంది పెట్టకుండానే కరోనా వైరస్ నిర్ధారణ చేయవచ్చునంటున్నారు. ఇది ర్యాపిడ్ టెస్ట్‌కు ఓ ప్రత్యామ్నాయంగా ఉండగలదని పేర్కొంటున్నారు. ఇలా ఫోన్ స్వాబ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసినప్పుడు అది దాదాపుగా 81%కి పైగా నమ్మకమైనదిగానూ చెబుతున్నారు. అంతేకాదు... ఈ ప్రక్రియతో వ్యాధి నిర్ధారణ కోసం ఖర్చు కేవలం 5 పౌండ్లకు మించదని, ఆర్థికంగానూ ఇది మరింత మంచి మార్గమని చెబుతున్నారు. ‘‘ముక్కునుంచి తీసుకునే చేసే (నేసల్ స్వాబ్) పరీక్షే కోవిడ్ నిర్ధారణకు ఓ గోల్డ్ స్టాండర్డ్. కానీ పెద్ద పెద్ద సమూహాల్లో త్వరగా నిర్ధారణ పరీక్షలు అవసరమైనప్పుడు మాస్ టెస్టింగ్ కోసం ఈ ‘ఫోన్ స్వాబ్’ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. ‘‘మనం ఫోన్లో మాట్లాడుతూ ఉండటం, అలాగే దాన్ని ముట్టుకోవడం వల్ల ఒకవేళ మనలో వైరస్ ఉంటే... వాటిని ఫోన్ స్వాబ్ ద్వారా సేకరించి పరీక్షించడం వల్ల నమ్మకమైన ఫలితాలే వస్తాయి. దాంతో అటు పరీక్షలకు అయ్యే ఖర్చులూ తగ్గుతాయి. ఫలితాలు వేగంగానూ వస్తాయి ’’ అంటున్నారు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ రోడ్రిగో యంగ్. ఇంకా చెప్పాలంటే చిలీలోని డయాగ్నోసిస్ బయోటెక్ అనే సంస్థ ఈ పరీక్షలను నిర్వహిస్తూ ఉండగా, దక్షిణ అమెరికాలోని కొన్ని స్కూళ్లలోనూ ఎక్కువ సంఖ్యలో పెద్ద పెద్ద సమూహాల్లో భారీగా పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పటికే వీటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
కరోనా వైద్యపరీక్షలు.. వివరాలు
ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇందుకోసం కోవిడ్ వ్యాధి నిర్ధారణకు రకరకాల పరీక్షలు అవసరమవుతున్నాయి. దాంతో కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్న వారంతా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లూ, ఆర్టీపీసీఆర్ పరీక్షలు, సీటీ స్కాన్ వంటి రకరకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. ఏయే పరీక్షలు ఎందుకు ఉపయోగపడతాయో, వాటిని ఏ సమయంలో చేయించాలో తెలుసుకోవడంతో పాటు... ఆయా పరీక్షల ప్రత్యేకతలు, ప్రాధాన్యాలు... అవి మాత్రమే తెలియజేసే కొన్ని ప్రత్యేకమైన సంగతులు, కొన్ని వైద్య పరీక్షలలోని స్కోర్లు, ఆ అంకెలతో తెలిసివచ్చే వివరాలూ, వ్యాధి తీవ్రత వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఉపయోగపడేదే ఈ సమగ్ర కథనం. తొలుత ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ గురించి... కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఇది చాలా త్వరగా నిర్వహించగలిగిన వైద్య పరీక్ష. పరీక్ష ఫలితాలూ వేగంగా వస్తాయి. ఫలితాలు కొన్నిసార్లు నెగెటివ్ సూచించినా... రోగిలో మాత్రం లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. అంటే ఫాల్స్ నెగెటివ్స్, ఫాల్స్ పాజిటివ్స్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. దాంతో ఫలితాల కోణంలో చూసినప్పుడు ఇది పూర్తిగా ఆధారపడదగిన పరీక్ష కాకపోవచ్చు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ గురించి... రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్‌కు సంక్షిప్తరూపమే ‘ఆర్టీపీసీఆర్’ పరీక్ష. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంటే ఆర్టీపీసీఆర్ ఫలితాలు 48 – 72 గంటలు కూడా పడుతున్నాయి. సీటీ స్కాన్ ఇటీవల ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు, ఆర్టీపీసీఆర్ పరీక్షల కంటే సీటీ స్కాన్‌ను ఎక్కువగా డాక్టర్లు విశ్వసిస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఓ వ్యక్తికి కరోనా ఇన్ఫెక్షన్ సోకాక లక్షణాలు ఏవీ లేకుండా వ్యాధి దానంతట అదే తగ్గిపోతే అతడికి దాదాపుగా ఎలాంటి ప్రమాదమూ ఉండకపోవచ్చు. కానీ ఒక్కోసారి రోగిలో ఏ లక్షణాలూ బయటకు కనిపించకపోయినా... ప్రాథమిక పరీక్షలు అనదగిన ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్లలో నెగెటివ్, (ఒక్కోసారి పాజిటివ్) వచ్చినా... ఊపిరితిత్తుల్లో వ్యాధి కరోనా వైరస్ కారణంగా వచ్చిన కోవిడ్–19 యేనా, కాదా అన్న విషయం ఇదమిత్థంగా తెలియకపోవచ్చు. వ్యాధి ఒకవేళ ఊపిరితిత్తులను ప్రభావితం చేసినట్లయితే అందులోని కోరాడ్ స్కోర్‌ను బట్టి అది కరోనా వైరస్ కారణంగా వచ్చిన వ్యాధియేనా... కాదా అన్నది డాక్టర్లు తెలుసుకుంటారు. అలా కోవిడ్‌ను నిర్ధారణ చేసే సీటీస్కాన్ పరీక్ష గురించి విపులంగా తెలుసుకుందాం. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అనే మాటకు సంక్షిప్తరూపమే సీటీ స్కాన్. ఈ పరీక్షలో రేడియేషన్ సహాయంతో ఛాతీని పూర్తిగా స్కాన్ చేస్తారు. ఛాతీలో ఏవిధమైన సమస్య ఉన్నా సులువుగా తెలుసుకోవచ్చు. ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధారణకు ఎక్స్–రే కన్నా ఎన్నో రెట్లు వివరంగా తెలిపే సామర్థ్యం సీటీ స్కాన్ పరీక్షకు ఉంది. కరోనా వచ్చినవాళ్లకు సీటీ స్కాన్ ఎప్పుడు? కరోనా వచ్చిన వాళ్లకు సీటీ స్కాన్ ఎప్పుడు చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం. వైద్య విషయాలపై విపరీతంగా పెరిగిపోయిన శ్రద్ధతో... వైద్య నిపుణులు సూచించకపోయినప్పటికీ ఇటీవల చాలామంది లక్షణాలు కనిపించిన మొదటిరోజే... తమంతట తామే నిర్ణయం తీసుకుని సీటీస్కాన్ చేయించుకుంటున్నారు. అలా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. కరోనా వచ్చిన మొదటిరోజునే వ్యాధి ఊపిరితిత్తుల్లోకి చేరదు. వ్యాధి ఊపిరితిత్తుల్లోకి చేరడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధి పడుతుంది. వ్యాధి కొంతమందిలో అసలు ఊపిరితిత్తుల వరకు కూడా చేరదు. అందుకే కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలైన తర్వాత ఐదు రోజుల వరకు లక్షణాలు తగ్గకుండా అలాగే కొనసాగుతున్నప్పుడు మాత్రమే సీటీ స్కాన్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు రావడం, ఆయాసం రావడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతే... ఇక సీటీ స్కాన్ చేయించాల్సిన అవసరమే ఉండదు. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటైనా ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత కూడా కొనసాగితే అప్పుడు తప్పక సీటీ స్కాన్ చేయించుకుని, డాక్టర్‌కు చూపాలి. వాసన, రుచి తెలియకపోయినా పర్లేదు. ఆ లక్షణాల కోసం మాత్రం సీటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టమయ్యే విషయం ఏమిటంటే... లక్షణాలు తగ్గకుండా కొనసాగుతున్న సందర్భాల్లో... అవి మొదలైన ఐదో రోజు తర్వాత సీటీ స్కాన్ చేయించుకోవాలన్నమాట. వ్యాధి తీవ్రత తెలిసేదెలా? మరి వ్యాధి తీవ్రత ఇంత ఉందంటూ చెప్పడానికి సీటీ స్కాన్‌తో అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉందనే సమాధానమే వస్తుంది. అయితే వ్యాధి తీవ్రతను చెప్పడానికి సీటీ స్కాన్‌లో వేరే విధానాన్ని అవలంబిస్తారు. దీన్ని సీటీ సివియారిటీ స్కోర్‌గా పిలుస్తారు. ఇది రెండు సిస్టమ్స్‌లో ఉంటుంది. ఒక సిస్టమ్‌లో ఊపిరితిత్తులను 5 భాగాలుగా పరిగణించి రిపోర్ట్ ఇస్తారు. ఇంకో సిస్టమ్‌లో ఊపిరితిత్తులను 20 భాగాలుగా విభజించి, స్కోర్ ఇస్తారు. మొదటి సిస్టమ్‌లో మొత్తం స్కోరు గరిష్టంగా 25 భాగాలు ఉంటుంది. దాంతో రోగి తీవ్రతను బట్టి 1/25 మొదలుకొని 25/25 వరకు స్కోర్ ఇస్తూ వ్యాధి తీవ్రతను సూచిస్తారు. ఇక రెండో సిస్టమ్‌లో మొత్తం స్కోరు 40 ఉంటుంది. కాబట్టి పేషెంట్ రిపోర్ట్ 1/40 నుంచి మొదలుకొని తీవ్రత ఆధారంగా 40/40 వరకు ఇచ్చే అవకాశం ఉంది. సివియారిటీ (తీవ్రత) తెలిపే స్కోరే కీలకం సీటీస్కాన్ రిపోర్టులో అత్యంత కీలకమైన భాగమే ఈ ‘సీటీ సివియారిటీ స్కోరు’. సీటీ సివియారిటీ స్కోరు అధికంగా ఉన్నట్లయితే జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా సీటీ సివియారిటీ స్కోర్ తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే జబ్బు తీవ్రత తక్కువగా ఉన్నట్లు అవగతమవుతుంది. కొన్ని రిపోర్టులలో సీటీ సివియారిటీ స్కోర్‌కు బదులుగా ఊపిరితిత్తులు ఎంత శాతం ఇన్ఫెక్ట్ అయ్యాయనే విషయాన్ని రిపోర్ట్ చేస్తారు. ఇది కూడా వ్యాధి తీవ్రతను సూచించే కీలకమైన అంశమే. ఇదే సీటీస్కాన్లోని కోవిడ్ రిపోర్ట్స్‌లో ‘సీటీ’ అనే మరో నంబరు కూడా మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. అయితే ఇది సీటీ స్కాన్‌లో కాకుండా ఆర్టీపీసీఆర్ రిపోర్టులో కనిపిస్తుంది. ‘సీటీ’ అంటే ‘సైకిల్ థ్రెషోల్డ్’ అని అర్థం. సైకిల్ థ్రెషోల్డ్ గురించి తెలుసుకోవాలంటే ముదుగా మనం ఆర్టీపీసీఆర్ ఏవిధంగా చేస్తారు అనేది తెలుసుకోవాలి. ఆర్టీపీసీఆర్ ఎలా చేస్తారంటే... ఆర్టీపీసీఆర్ అనే పరీక్షలో గొంతులోనుంచి తీసిన స్వాబ్ (ఒక రకంగా చెప్పాలంటే అక్కడి శాంపిల్) నుంచి వైరస్ తాలూకు ఆర్ఎన్ఏ ను విడదీస్తారు. ఈ ఆర్ఎన్ఏ ని ఉత్ప్రేరకాల సహాయంతో మరింతగా విస్తరించేలా (ఆంప్లిఫికేషన్) చేస్తారు. ఈ ఆంప్లిఫికేషన్ అనేది సైకిల్స్ (పరిభ్రమణాల)లో ఉంటుంది. ఎన్ని పరిభ్రమణాల (సైకిల్స్) తర్వాత ఈ వైరస్‌ను గుర్తిస్తున్నామో... ఆ నంబరును ‘సైకిల్ థ్రెషోల్డ్’ అంటారు. అంటే... కేవలం తక్కువ పరిభ్రమణాల తర్వాతనే వైరస్ కనబడినట్లయితే... వైరస్ దేహంలో చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్లు అర్థం. అలా కాకుండా చాలా ఎక్కువ భ్రమణాల (సైకిల్స్) తర్వాత వైరస్ కనిపిస్తే... దాని మోతాదు దేహంలో చాలా తక్కువ గా ఉందని అర్థం. ఇక 35 భ్రమణాల తర్వాత కూడా వైరస్ ను కనుగొనకపోతే అప్పుడు దేహంలో వైరస్ లేదని అర్థం. అలాంటి సందర్భాల్లో ఫలితం ‘నెగిటివ్’ వచ్చినట్లుగా చెప్పవచ్చు. కేవలం 25 సైకిల్స్ కంటే తక్కువ ఆంప్లిఫికేషన్స్తో వైరస్ కనబడట్లుగా అయితే ఎక్కువ మోతాదులో దేహంలో వైరస్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) మార్గదర్శకాల ప్రకారం సైకిల్ థ్రెషోల్డ్స్ను వ్యాధి నిర్ధారణకు ఉపయోగించుకోవాలి తప్ప... వ్యాధి తీవ్రత ను నిర్ధారణ చేయడానికి కాదు. ఎందుకంటే ఈ సైకిల్ థ్రెషోల్డ్ వల్ల మనకు తెలుస్తున్న వ్యాధి తీవ్రతకూ... నిజానికి రోగిలో కనిపించే తీవ్రతకూ (క్లినికల్ మానిఫెస్టేషన్స్)కూ సంబంధం ఉండటం లేదు. అందుకే తీవ్రత సూచించడానికి దీన్ని పరిగణనలోకి తీసుకోకూడదంటోంది ఐసీఎమ్ఆర్. ఇటీ కరోనా వైరస్ కారణంగా వచ్చే కోవిడ్–19 వ్యాధిని నిర్ధారణ చేయడానికి ఉపయోగిస్తున్న వైద్య పరీక్షలపై స్థూలంగా అవగాహన కల్పించుకోడానికి ఉపయోగపడే అంశాలు. వీటిని కేవలం మన అవగాహన కోసం చదివి తెలుసుకోవాలి తప్ప... వీటి ఆధారంగా సాధారణ ప్రజలు విశ్లేషణలు చేయడం సరికాదు. ఎందుకంటే వైద్యులు ఆ పని కోసం సాధారణ ప్రజల (లే మెన్)కు తెలియని మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సీటీ స్కాన్‌లో కనిపించే నంబర్లు... వాటి ప్రాధాన్యత సీటీస్కాన్ రిపోర్టులో మనకు రెండు రకాల నంబర్లు కనిపిస్తాయి. మొదటి నంబరు కోరాడ్ నంబరు. అంటే ‘కోవిడ్–19 రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్’ అనే మాటకు ఇది సంక్షిప్త రూపం అన్నమాట. ఈ నంబరు సహాయంతో కోవిడ్ ఉందా లేదా అని చెప్పడానికి ప్రయత్నం చేయడం సాధ్యమవుతుంది. అయితే కోవిడ్ తీవ్రతను ఈ నంబరు సూచించదు. ఈ కోరాడ్ సిస్టమ్‌లో మనకు 0 నుంచి 6 వరకు అంకెలు కనబడతాయి. అవి వేటిని సూచిస్తాయో వివరంగా చూద్దాం. ►కోరాడ్ – 0 అంటే స్కాన్ సరిగా రాలేదని అర్థం. అంటే సాంకేతిక సమస్య వల్ల స్కాన్ సరిగా రాలేదని మనకు తెలుస్తుంది. ►కోరాడ్ – 1 అంటే స్కాన్ సరిగా వచ్చింది. కానీ అది కోవిడ్ ఖచ్చితంగా కాదు. అంటే ఊపిరితిత్తుల్లో ఏ విధమైన ఇన్ఫెక్షన్ లేదు అనడానికి సూచన. కేవలం కరోనా వైరస్ మాత్రకాదు.. మిగతా ఏ రకమైన వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేవు అని అర్థం. ►కోరాడ్ – 2 అంటే అంటే స్కాన్‌లో కోవిడ్ జబ్బు ఉండే అవకాశం చాలా తక్కువ అని అర్థం. అయితే ఈ కేటగిరీలో వేరే ఇన్ఫెక్షన్స్ ఊపిరితిత్తుల్లో ఉండి ఉండవచ్చు. ఉదాహరణకు బ్రాంకైటిస్ లేదా బ్రాంకో నిమోనియా లాంటివి ఉండే అవకాశం ఉందనడానికి సూచన. ►కోరాడ్ – 3 అంటే అది కోవిడ్ అయితే కావచ్చు లేదా కాకపోవచ్చు కూడా. ►కోరాడ్ – 4 అంటే కోవిడ్ అయ్యేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఇంకా కొన్ని వేరై వైరల్ నిమోనియా కూడా అయి ఉండవచ్చేమో అనేదానికి ఇది సూచన. ►కోరాడ్ – 5 అంటే ఇది దాదాపుగా కచ్చితంగా కోవిడ్–19 తాలూకు నిమోనియానే కావచ్చనేందుకు సూచన. ►కోరాడ్ – 6 అంటే సీటీ స్కాన్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్స్ పూర్తిగా పాజిటివ్ అని అర్థం. అంటే ఈ కోరాడ్ –6 కేటగిరీ ప్రకారం అది పూర్తిగా కోవిడ్ అవునా, కాదా అని చెప్పడానికి వీలవుతుంది. అంతే తప్ప అది కోవిడ్ తీవ్రతకు సూచన కానే కాదు. ►అందుకే కోరాడ్స్ క్యాటగిరీ – 5 ఉంది కాబట్టి అడ్మిట్ చేస్తున్నాం అని చెప్పడం సరికాదు. ఇది కోవిడ్ డయాగ్నసిస్ (వ్యాధి నిర్ధారణకు) సూచనే తప్ప... వ్యాధి తీవ్రతకు సూచన కానేకాదన్న విషయం తెలుసుకోవాలి. ►వ్యాధి తీవ్రతను సూచించేందుకు ఈ కోరాడ్ అనే విధానం ఎంతమాత్రమూ సరిపోదు. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
ప్రభుత్వ పరిధిలోనే రోగ నిర్ధారణ పరీక్షలు
గతం: ఏదో కంపెనీ రావడం పీపీపీ కింద పరీక్షలు చేస్తున్నామని చెప్పడం, ఫ్రాంచైజీల్లో పరీక్షలు చేశామనడం.. డాష్‌బోర్డులో ఇష్టారాజ్యంగా అప్లోడ్ చేసుకోవడం.. ప్రస్తుతం: ప్రభుత్వ పరిధిలోనే పరీక్షలు జరగాలి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబొరేటరీలు బాగుపడాలి.. సామాన్యులు, పేదలు ప్రతి ఒక్కరికీ మెరుగైన రోగ నిర్ధారణ పరీక్షలు జరగాలి.. దీనికి ఎంతైనా ఫరవాలేదు.. ఇదీ ఇప్పటి ప్రభుత్వ ఉద్దేశం. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ పరిధిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత నలుగురు సభ్యులతో కమిటీ నియమించి, పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. పలువురు వైద్యనిపుణుల అభిప్రాయాలతో పాటు, సుజాతారావు కమిటీ సూచనల మేరకు రాష్ట్రంలో 14 నుంచి 134 పరీక్షల వరకు ప్రభుత్వ పరిధిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ల్యాబొరేటరీల ఉన్నతీకరణ ► రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తపరీక్షలకు అవసరమైన పరికరాలు సమకూరుస్తారు. ► ల్యాబొరేటరీల్లో పాథాలజీ, హిస్టోపాథాలజీ, మైక్రోబయాలజీ పరీక్షలు చేస్తారు. ల్యాబ్ పరికరాల కొనుగోలుకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తారు. ► కొనుగోళ్లను ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్షిస్తుంది. ► నిర్ధారణ పరీక్షలకు అవసరమైన రసాయనాలు (రీఏజెంట్స్) కొరత లేకుండా చూస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 10 శాతం బయట నుంచి కొనుగోలు చేయవచ్చు. ► ర్యాపిడ్ డయాగ్నిస్టిక్స్ టెస్ట్ కిట్లు కూడా ప్రతి ఆస్పత్రిలో అందుబాటులో ఉంచుతారు.పరీక్ష ఫలితాలను రోగి మొబైల్ నంబరుకు మెస్సేజ్ రూపంలో పంపుతారు. ► ఇన్వెంట్రీ మేనేజ్మెంట్ అంటే నిర్ధారణ పరీక్షలు చేసిన ప్రతి రోగికి సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు. మూడు పెద్ద ల్యాబ్‌ల ఏర్పాటు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో అతిపెద్ద ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్కటి రూ.25 కోట్లతో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో వీటిని నిర్మిస్తారు. ఒక్కో ల్యాబ్‌లో రోజుకు 10 వేల పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. ఇక మన ఆస్పత్రుల్లోనే.. అన్ని రోగ నిర్ధారణ పరీక్షలు సొంతంగానే చేపడుతున్నాం. రోజుకు 10 వేల టెస్టులు జరిగే మూడు మేజర్ ల్యాబ్‌లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత మిగతా జిల్లాల్లో ఏర్పాటు చేస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ -
కరోనా పరీక్షలు.. మూడు రెట్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా నిర్ధారణ పరీక్షల్లో వైద్య,ఆరోగ్యశాఖ దూసుకెళుతోంది. మొదట్లో కాస్తంత నెమ్మదిగా జరి గినా ఇప్పుడు స్పీడు పెంచింది. ఒక్క నెలలోనే 3 రెట్లకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించింది. దీనికోసం గ్రామస్థాయి వరకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు శ్రీకారం చుట్టింది. పల్లెల్లో జ్వర బాధితు లను గుర్తిస్తూ అనుమానితులను పట్టుకొచ్చి కరోనా పరీక్షలు చేయిస్తోంది. పీహెచ్సీ మొదలు హైదరా బాద్‌లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కరోనా పరీక్షలు విరివిగా జరుగుతున్నాయి. మరోవైపు మొబైల్ టెస్టుల కోసం బస్సులను ఏర్పాటు చేసి శాంపిళ్లను తీసుకొని పరీక్షలు చేస్తున్నారు. వచ్చే నెలలో 15 లక్షల యాంటిజెన్ టెస్టులు ఈ నెల రోజుల్లోనే రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,076 చోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు, 16 చోట్ల ఆర్టీ–పీసీఆర్ విధానంలో టెస్టులు జరుగు తున్నాయి. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో 31 చోట్ల పరీక్షలు చేస్తున్నారు. ఇలా భారీగా టెస్టులు చేయడంతోపాటు అదేస్థాయిలో కేసులూ వెలుగు చూస్తున్నాయి. గత నెల రోజుల్లోనే మూడు రెట్లకు పైగా కరోనా పరీక్షలు రాష్ట్రంలో నిర్వహించారు. అంతేకాదు ఒక్కరోజులో చేసే పరీక్షల సామర్థ్యం కూడా అదేస్థాయిలో పెరిగింది. వచ్చే నెలలో 15 లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాటిని ఇప్పటికే కొనుగోలు చేసింది. విడతల వారీగా కిట్లు రాష్ట్రానికి చేరుకుంటాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు రోజుకు 10 వేల వరకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో వచ్చే నెలలో 18 లక్షల వరకు పరీక్షలు చేసే సామర్థ్యాన్ని ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. పది లక్షల జనాభాకు 32,439 పరీక్షలు... రాష్ట్రంలో గురువారం నాటికి ప్రతీ పది లక్షల జనాభాకు 32,439 పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. మున్ముందు పది లక్షల్లో 50 వేల మందికి పరీక్షలు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపింది. అందుకే ఇంకా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రజల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఉదాహరణకు రెండుమూడు రోజులుగా హైదరాబాద్ ఉప్పుగూడ పీహెచ్సీ వైద్య సిబ్బంది నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారికి పరీక్షలు చేస్తున్నారు. కరోనా మెడికల్ క్యాంపులు నిర్వహించడం రాష్ట్రంలోనే మొదటిసారి అని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎండీ హెప్సీబా, డాక్టర్ రాగిణి వైద్య బృందం స్థానిక బస్టాప్‌లు, మార్కెట్లలో క్యాంపులు నిర్వహించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వచ్చే నెల గ్రామాల్లోనూ మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. తద్వారా వచ్చే నెలనాటికి రాష్ట్రంలో వైరస్‌ను తగ్గుముఖం పట్టించాలన్న కృతనిశ్చయంతో ఉంది. –––––––––––––––––––––––––– గత నెల 27 నాటికి రాష్ట్రంలో కరోనా పరీక్షలు: 3,79,081 ఈ నెల 27వ తేదీ నాటికి మొత్తం టెస్టులు: 12,04,343 గత నెల 27న చేసిన కరోనా పరీక్షలు: 21,839 ఈ నెల 27న చేసిన టెస్టులు: 61,863 శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ కేంద్రంలో కరోనా అనుమానిత మహిళ నుంచి శాంపిల్ సేకరిస్తున్న వైద్య సిబ్బంది -
ఇక రూ.400 లకే కరోనా పరీక్షలు!
న్యూఢిల్లీ: అతి తక్కువ ఖర్చుతో మహమ్మారి కరోనా వైరస్‌ను నిర్ధారించే పరికరాన్ని తయారు చేశామని ఐఐటీ ఖరగ్‌పూర్ శనివారం వెల్లడించింది. తమ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంతో ఒక్కో టెస్టు చేయడానికి కేవలం రూ.400 మాత్రమే ఖర్చవుతుందని, గంటలో ఫలితం తేలిపోతుందని పేర్కొంది. భారీ ఖర్చుతో కూడుకున్న ఆర్టీ-పీసీఆర్ పరీక్షలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని పరికరం తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లోని కచ్చితత్వం పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంలో ఉందని తెలిపింది. రూ.2000 ధర కలిగిన తమ పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంతో ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలు వైరస్ ఉనికి తెలుసుకుని జాగ్రత్త పడొచ్చునని తెలిపారు. ఈ పోర్టబుల్ పరికరంతో ఎంతోమందికి పరీక్షలు చేయొచ్చునని, ప్రతి టెస్టు తర్వాత ఒక పేపర్ కాట్రిడ్జ్ మారిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పరీక్ష విధానాల ధరల కంటే ఇదే అతి తక్కువ అని శాస్త్రవేత్తలు తెలిపారు. పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరం తయారీ, వ్యాపార పరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ధర నిర్ణయించామని తెలిపారు. (చదవండి: కరోనా రోగులపై చార్జీల బాదుడు : షాక్) కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ఇదొక గొప్ప ప్రగతి అని పరికరం తయారీలో కృషి చేసిన ఐఐటీ ఖరగ్‌పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి, స్కూల్ ఆఫ్ బయో సైన్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అరిందమ్ మోండల్ తెలిపారు. ఈ పరికరం స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో జన్యు విశ్లేషణ చేసి ఫలితాలు వెల్లడిస్తుంని తెలిపారు. తమ పరికరానికి సంబంధించిన లేబొరేటరీ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు. (బాబ్రీ మసీదు కూల్చివేత.. తీర్పు ఎలా ఉన్నా పర్లేదు) -
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ రికార్డు..
సాక్షి,అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో కరోనా టెస్టుల ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 90 టెస్టుల సామర్ధ్యంతో మొదలుపెట్టి 24వేల టెస్టులు చేసే స్థాయికి వచ్చామని పేర్కొన్నారు.సీఎం జగన్ ఆదేశాలతో పూర్తి స్థాయిలో టెస్టులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. (కోవిడ్‌కు హైదరాబాద్ ఇంజెక్షన్ రెడీ) రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6.76 లక్షలకు పైగా టెస్టులు చేశామన్నారు.10 లక్షల మందికి సగటున 12,675 మందికి కరోనా టెస్టులు నిర్వహించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని గుర్తించి క్వారంటైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘వాలంటీర్లు, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటి సర్వే చేశాం. సర్వే ద్వారా అస్వస్థతతో ఉన్నవారిని గుర్తించి టెస్టులు చేస్తున్నామని’ జవహర్‌రెడ్డి వెల్లడించారు. (ఏపీలో కొత్తగా 477 కరోనా కేసులు) -
‘తొలి’ పరీక్షతో తప్పుడు ఫలితాలు!
వాషింగ్టన్: కరోనా వైరస్ సోకిన తొలినాళ్లలోనే పరీక్షలు నిర్వహిస్తే వారికి వ్యాధి సోకనట్లు తప్పుడు ఫలితాలు రావచ్చని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. లక్షణాలు కనిపించాక మూడు రోజులకు పరీక్షలు చేయడం మేలని అధ్యయనం సూచించింది. అధ్యయనంలో భాగంగా తాము 1330 మంది రోగుల నమూనాలను విశ్లేషించామని, ఆసుపత్రిలో చేరిన రోగులతోపాటు పలు వర్గాల వారు ఇందులో ఉన్నారని లారెన్ కౌసిర్కా అనే శాస్త్రవేత్త తెలిపారు. ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ ఫలితాలు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన సమయం ఆధారంగా తాము పరీక్షల ఫలితం నెగటివ్ వచ్చేందుకు ఉన్న అవకాశాలను లెక్కించామని తెలిపారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించేటప్పుడు ముక్కు, గొంతుల్లోని ద్రవాల నమూనాలు సేకరించడంతోపాటు లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి అన్నదీ నమోదు చేస్తారని ఈ సమాచారం ద్వారా తాము వైరస్ సోకిన తరువాత నాలుగు రోజులకు పరీక్షలు చేస్తే 67 శాతం నెగటివ్ ఫలితాలు రావచ్చునని అంచనా వేసినట్లు వివరించారు. కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ వైరస్ ఉన్నట్లుగానే భావించి చికిత్స అందించాలని సూచించారు. కరోనా పరీక్షల్లోని ఈ లోటును రోగులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు. జూలైలో మోడెర్నా కోవిడ్ టీకా పరీక్షలు కోవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన వ్యాక్సిన్‌ను జూలైలో భారీగా ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడనున్నట్లు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా ప్రకటించాయి. జూలైలో 30 వేల మంది వలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించి చూస్తామని, ఇందుకు అవసరమైన డోసులను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచామని తెలిపాయి. పెద్దల్లో ఎలా పనిచేస్తుందో చూడటమే కీలకమైన ఈ ప్రయోగ ఉద్దేశం. మార్చిలో 45 మంది వలంటీర్లపై ప్రారంభ ప్రయోగం ఫలితాలు అందాల్సి ఉంది. -
8 కేటగిరీల వారికే కరోనా టెస్టులు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ఎవరికి చేయాలనే దానిపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పరిస్థితిని బట్టి ఇప్పటివరకూ నాలుగు దఫాలుగా మార్గదర్శకాలు ఇచ్చిన ఐసీఎంఆర్ సోమవారం ఐదోసారి సవరించిన గైడ్‌లైన్స్‌ను ఇచ్చింది. ఇందులో భాగంగా 8 రకాల కేటగిరీల వాళ్లకు విధిగా ఆర్టీ–పీసీఆర్ (రియల్ టైమ్ పల్మనరీ చైన్ రియాక్షన్) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను అనుసరించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. 8 కేటగిరీల్లో ఎవరెవరు? ► ఐఎల్ఐ (ఫ్లూ లక్షణాలు ఉన్న) వాళ్లకు.. వ్యక్తిగతంగా గానీ, అంతర్జాతీయ ప్రయాణం చేసిన వారికి(14 రోజుల్లో). ► కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయిన ఐఎల్ఐ లక్షణాలు ఉన్నవారికి. ► ఆస్పత్రుల్లో పనిచేస్తూ ఐఎల్ఐ లక్షణాలున్న వారు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో సంబంధం ఉన్నవారు. ► తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్)తో బాధపడుతున్నవారు. ► ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోయినా(అసింప్టమాటిక్) హైరిస్క్ పాజిటివ్ కేసులతో సంబంధం ఉన్నవారు లేదా టెస్టు చేసిన తర్వాత కరోనాగా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయినవారు. æ హాట్స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లలో వైరస్ లక్షణాలున్న అందరికీ. ► ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందుతూ ఐఎల్ఐ లక్షణాలు కనిపించిన వారికి. ► ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో జ్వరం లేదా జలుబు లక్షణాలున్నా... ఐఎల్ఐ లక్షణాలు కనిపించిన వారికి. æ కరోనా నిర్ధారణ పరీక్ష చేయలేదన్న కారణంతో ప్రసవాలు లాంటి అత్యవసర సేవలను వాయిదా వేయరాదు. -
కర్ణాటకలో పరీక్షలు తక్కువే
బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే.. కర్ణాటకలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య తక్కువగా ఉందని ఓ ఆంగ్ల పత్రిక పరిశీలనలో తేలింది. ప్రతి 10 లక్షల మందికి కర్ణాటకలో 182.3 పరీక్షలు మాత్రమే జరుగుతుండగా, కేరళలో ఆ సంఖ్య 483.1, తమిళనాడులో 285, ఆంధ్రప్రదేశ్‌లో 217.5గా ఉంది. తెలంగాణ రాష్ట్ర గణాంకాలు అందుబాటులో లేవని ఆ పత్రిక పేర్కొంది. చైనా నుంచి రావాల్సిన టెస్టింగ్ కిట్లు ఇంకా రాకపోవడం వల్ల కర్ణాటకలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే, తమ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచామని కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీన 415 పరీక్షలు జరపగా, ఏప్రిల్ 16న 1,241 పరీక్షలు జరిపామన్నారు. కాగా, చైనా నుంచి దాదాపు లక్ష టెస్టింగ్ కిట్లు ఆదివారంనాటికల్లా రాష్ట్రానికి చేరుకునే అవకాశముందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ అంటున్నారు. -
ఐదు నిమిషాల్లోనే కరోనా టెస్ట్!
కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ వ్యాధిని నిర్ధారించే ‘‘రోగ నిర్ధారణ పరీక్ష కిట్’’ను ఆవిష్కరించినట్లు అబాట్ ల్యాబొరేటరీస్ శుక్రవారం ప్రకటించింది. ID NOW COVID&19 అని పిలిచే ఈ పరీక్షతో అనుమానిత వ్యక్తులకు వ్యాధి సోకిందా లేదా అనే విషయాన్ని 5 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. తాజాగా అమెరికా ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) దీనికి అనుమతులిచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ పరీక్షలను అన్ని ఫిజీషియన్స్ ఆఫీసులు, అత్యవసర సంరక్షణ క్లినిక్‌లు, హాస్పిటల్లో సులభంగా జరపవచ్చని పేర్కొంది. ప్రపంచదేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ అమెరికాలో తీవ్రరూపం దాల్చింది. ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానికులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు. వేలాదిగా వస్తున్న ప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయలేక వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అబాట్ ల్యాబొరే టరీస్ కిట్‌కు యూఎస్ఎఫ్డీఏ తన అత్యవసర అధికారాలను వినియోగించి ఈ కిట్‌కు వేగంగా అనుమతులిచ్చింది. సోమవారం నుంచి అందుబా టులోకి! వచ్చే వారం సోమవారం నుంచి పరీక్షలను ప్రారంభించే యోచనలో ఉన్నామని, రోజుకు 50 వేల వరకు పరీక్షలను జరిపే అవకాశం ఉంటుందని అబాట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి ID NOW COVID&19 పరీక్ష అమెరికాకు మాత్రమే పరిమితమవుతుంది. అవసరాన్ని బట్టి భారత్ సహా ఇతర దేశాలకు అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది. ‘‘ఇది అత్యుత్తమైన ముందడుగు. 5 నిమిషాల్లోనే పాజిటివ్ ఫలితాన్ని, 13 నిమిషాల్లో నెగిటివ్ ఫలితాన్ని పొందవచ్చు. ప్రస్తుత పరీక్షలకు 1–2 రోజుల సమయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువే అవుతోంది. మా కిట్‌తో ఈ సమస్య తగ్గుతుంది’’ అని అబాట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ ఫ్రీల్స్ చెప్పారు. -
ఈసారి డెంగీతో డేంజరస్ డబుల్ ధమాకా!..
సాధారణంగా షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తుంటాయి. చిత్రం ఏమిటంటే... అటాంటి డబుల్‌ధమాకానే ఈ సారి ఈ సీజన్లో ఈ దోమ కూడా ఇస్తోంది. రెండు జబ్బులనూ వ్యాప్తి చేయగల ఈ దోమ కావడం వల్ల ఇది డెంగీనీ, చికన్గున్యాను కలిసి డెంజరస్ డబుల్ ధమాకా ఆఫర్ ఇస్తోంది. డెంగీ మళ్లీ విజృభించింది. టైగర్ దోమ తన పంజా విసిరి ఇరు రాష్ట్రాలనిప్పుడు అల్లకల్లోలం చేసేస్తోంది. డెంగీ వైరస్‌ను ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వ్యాప్తి చేసే విషయం తెలిసిందే కదా. ఈ దోమనే వాడుక భాషలో టైగర్ మస్కిటో అని కూడా అంటారు. డెంగీను వ్యాప్తి చేసే ఇదే దోమ ఇప్పుడు చికన్గున్యాను కూడా తెస్తోంది. మిక్స్డ్ ఇన్ఫెక్షన్ జ్వరాలుగా ఈ సీజన్లో ఈ వ్యాధులు వస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే డెంగీపైనా, ఈ మిక్స్డ్ ఇన్ఫెక్షన్పైన అవగాహన పెంచుకోడాల్సిన అవసరం ఉంది. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. నిజానికి డెంగీ కూడా చాలా రకాల వైరల్ జ్వరాల్లాగే తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) వ్యాధి. కానీ కొంతమంది వ్యాధిగ్రస్తుల్లో వారి ప్లేట్లెట్లు ప్రమాదకర స్థాయి కంటే కిందికి పడిపోతాయి. దాంతో అది చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటివారి విషయంలో మాత్రం చాలా అప్రమత్తత అవసరం. అది మినహా మిగతా అందరికీ ఇది లక్షణాలకు చేసే వైద్యచికిత్స (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్)తోనే తగ్గిపోతుంది. కాకపోతే రోగి ప్రమాదకరమైన పరిస్థితిల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక ప్లేట్లెట్లు పడిపోయిన కారణంగా రోగిలోని అంతర్గత అవయవాల్లోకి రక్తస్రావమయ్యే పరిస్థితి రోగికి వచ్చినప్పుడు మాత్రం అలాంటి వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. అలాంటి కేసులు మినహాయిస్తే డెంగీ అనేది మనం అనుకున్నంత ప్రమాదకరం కాదని గుర్తిస్తే, దాని గురించి ఉన్న అపోహలతోనూ, వ్యాధి పట్ల ఉన్న దురభిప్రాయాలతో కలిగే ఆందోళన తగ్గుతుంది. డెంగీలో రకాలు డెంగీలో మూడు రకాలు ఉన్నాయి. అవి... 1 ఎలాంటి హెచ్చరికలూ చూపకుండా వచ్చే సాధారణ డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) 2 కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు చూపుతూ వచ్చే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) 3 తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) లక్షణాలు ►హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా కనిపించే డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : ఈ తరహా డెంగీ వచ్చిన వారు సాధారణంగా డెంగీ విస్తృతంగా వస్తున్న ప్రాంతంలో నివసిస్తున్న వారై ఉంటారు. వైద్యపరిభాషలో ఇలా డెంగీ విస్తృతంగా ఉన్న ప్రాంతాలను ఎండెమిక్ ప్రాంతాలుగా చెబుతుంటారు. ఇలాంటి చోట్ల ఉన్న వారిలో జ్వరం, వికారం/వాంతులు, ఒళ్లంతా నొప్పులు (జనరలైజ్డ్ బాడీ పెయిన్స్), ఒంటి మీద ర్యాష్ వంటి బయటి లక్షణాలు కనిపిస్తాయి. వీరికి టార్నికేట్ అనే పరీక్ష చేస్తారు. దీంతో పాటు సాధారణ రక్తప్రరీక్ష చేసినప్పుడు డెంగీ వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్తకణాల సంఖ్య బాగా తక్కువగా కనిపిస్తుంది. ►హెచ్చరికలతో కనిపించే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : పై లక్షణాలతో పాటు పొట్టలో నొప్పి, ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ప్లూరా అనే పొరలో లేదా పొట్టలో నీరు చేరడం కొందరిలో పొట్టలోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం అవుతుండటం, రోగి అస్థిమితంగా ఉండటం, రక్తపరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలకూ, మొత్తం రక్తం పరిమాణానికి ఉన్న నిష్పత్తి కౌంట్ పెరగడంతో పాటు ప్లేట్లెట్స్ సంఖ్య విపరీతంగా పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) కేసుల్లో : అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కారణంగా రోగి తీవ్రమైన షాక్‌కు గురవుతాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి (పల్మునరీ ఎడిమాతో) శ్వాసప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్రమైన రక్తస్రావం కారణంగా రోగి స్పృహకోల్పోవడం లేదా పాక్షికంగానే స్పృహలో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతర్గత అవయవాలు తమ విధులు నిర్వహించడంలో విఫలం అవుతాయి. అంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనే కండిషన్ ఏర్పడి చాలా కీలకమైన అవయవాలు పనిచేయకుండా మొరాయిస్తాయి. ►మిక్స్డ్ ఇన్ఫెక్షన్లో భాగంగా చికన్గున్యాతో పాటు వస్తే... అలాంటప్పుడు మరింత ఎక్కువగా ఎముకలు, కీళ్ల నొప్పులు (జాయింట్ పెయిన్స్) ఉంటాయి. డెంగీలో కంటే మిక్స్డ్ ఇన్ఫెక్షన్లో ఈ నొప్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. డెంగీలో మరింత ప్రమాదకరమైన మరికొన్ని లక్షణాలివీ... ►ప్లేట్ లెట్స్ తక్కువైన కారణాన అంతర్గత అవయవాలలోకి రక్తస్రావం అయ్యే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితితో పాటు మరికొన్ని సందర్భాల్లో కొన్ని ఇతర లక్షణాలూ రోగుల్లో కనిపిస్తుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది ఒంట్లో నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్ డీహైడ్రేషన్). ►కొందరిలో కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. హెమటోక్రిట్ పెరుగుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టదు. రక్తపోటు పడిపోతుంది. లివర్ ఎన్లార్జ్ అయి డ్యామేజ్ అయ్యే ప్రమాదమూ ఉంటుంది. హార్ట్‌బీటింగ్ నిమిషానికి 60 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చు. బ్లీడింగ్, ఫిట్స్ వల్ల మెదడు దెబ్బతినే (బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే) ప్రమాదమూ ఉంది. మన వ్యాధినిరోధక వ్యవస్థ (పూర్తి ఇమ్యూన్ సిస్టమే) డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ►గుండె స్పందనలు (హార్ట్‌బీట్) 60 కంటే తక్కువకు పడిపోవడం అన్నది చాలా ప్రమాదకరమైన సూచన. రోగికి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంటెన్సిక్ కేర్‌లో ఉంచాల్సిన అవసరం ఏర్పడవచ్చు. నివారణే ఎంతో మేలు అన్ని వ్యాధుల లాగే డెంగీ విషయంలోనూ చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. డెంగ్యూ వచ్చేందుకు దోహదపడే టైగర్‌దోమ రాత్రిపూట కాకుండా పట్టపగలే కుడుతుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తపడాలి. వీలైతే వారంలో ఏదో ఒకరోజు ఇంటిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి. ►ఇంట్లోని మూలల్లో.. చీకటి ప్రదేశంలో, చల్లని ప్రదేశాల్లో ఎడిస్ ఎజిపై్ట అవాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. అయితే అదే సమయంలో బయటి నుంచి దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించుకోడానికి తలుపులకు, కిటికీలకు మెష్ అమర్చుకోవడం చాలా మంచిది. ►ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి ప్రదేశాల్లో మనకు తెలియకుండానే నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. అందుకే ఇంటి పరిసరాల్లో ఉండే ఇలాంటి వస్తువుల పట్ల అప్రమత్తత అవసరం. ఇంట్లో వాడని డ్రమ్ములు, బ్యారెల్స్ మొదలైన వాటిని బోర్లించి పెట్టడం మంచిది. అలాగే వాడని టైర్లను తడిలేకుండా చేసి ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిపై్ట గుడ్లు పెట్టకుండా నివారించ వచ్చు. ►ఇది పెద్దగా ఎత్తులకు ఎగరలేదు. అందుకే కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు తొడుక్కోవడం చాలా రక్షణ ఇస్తుంది. అలాగే చేతుల విషయంలోనూ ఫుల్‌స్లీవ్ మంచివి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా షార్ట్స్ లాంటి వాటికి బదులుగా ఒంటిని నిండుగా కప్పిచేసే దుస్తులనే ధరించాలి. కాళ్లనూ కవర్చేసే పైజామాలు, రాత్రిపూట కూడా సాక్స్ వేసుకుని నిద్రించడం మంచిది. ►ఏడిస్ ఈజిపై్ట దోమలు ముదురు రంగులకు తేలిగ్గా ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. ►దోమలను దూరంగా తరిమివేసే మస్కిటోరిపలెంట్స్ వాడటం మేలు. పగలు కూడా మస్కిటో రిపల్లెంట్స్ వాడవచ్చు. (పికారిటిన్ లేదా ఆయిల్ ఆఫ్ లెమన్ యూకలిప్టస్ లేదా ఐఆర్3535... కంపోజిషన్లోని ఈ మూడింటిలో ఏది ఉన్నా ఆ రిపల్లెంట్స్ వాడవచ్చు. ఈ మస్కిటో రిపల్లెంట్స్ ప్రతి 4 – 6 గంటలకు ఒకసారి శరీరంపై బట్టలు కప్పని భాగాల్లో స్ప్రే చేసుకోవాలి. అయితే ముఖం మీద స్ప్రే చేసుకునే సమయంలో ఇవి కళ్ల దగ్గర స్ప్రే కాకుండా జాగ్రత్త పడాలి. వ్యాక్సిన్ అందుబాటులో ఉంది... అయితే ? ఇప్పుడు డెంగీకి టీకా (వ్యాక్సినేషన్) అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు ఈ టీకాను గతంలో డెంగీ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండోసారి డెంగీ రావడం చాలా ప్రమాదకరం కాబట్టి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని నివారించేందుకు ఈ టీకా తోడ్పడుతుంది. అంటే అంతర్గత అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం అయి రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. సాధారణ డెంగీ నివారణకు దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రమాదకర పరిస్థితులకు ముందస్తు సంకేతాలివి ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, నలుపు రంగులో మలవిసర్జనమవుతున్నా, ముక్కులోంచి కానీ, చిగుర్ల్లలోంచి కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అలాగే ఒంటి మీద (చర్మం కింద) రక్తపు మచ్చల్లాంటివి కనిపిస్తే అది డెంగ్యూకు ముందస్తు స్థితి అన్నమాట. ఇలాంటి మచ్చలనే వైద్యపరిభాషలో ‘పిటేకియే’ అంటారు. దీన్ని బట్టి డెంగీని గుర్తించవచ్చు. మొదటి సారి కంటే... తర్వాతి వాటితోనే మరింత డేంజర్ సాధారణంగా మొదటిసారి వచ్చే డెంగీ కంటే... ఒకసారి వచ్చి తగ్గాక మళ్లీ వస్తే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే... డెంగీని సంక్రమింపజేసే వైరస్‌లో నాలుగు రకాలున్నాయి. అదే రకం వైరస్ మరోసారి వస్తే అది ప్రమాదకరం కాదు. కాని... ఒకసారి వ్యాధికి గురైన వాళ్లలో మరోసారి ఇంకోరకమైన డెంగీ వైరస్ వచ్చినప్పుడు అది మరింత తీవ్రరూపంలో కనిపిస్తుంది. అందుకే మొదటిసారి కంటే ఆ తర్వాత వచ్చేవి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. చికిత్స... డెంగీ అనేది వైరస్ కారణంగా వచ్చే వ్యాధి కాబట్టి దీనికి నిర్దిష్టంగా మందులేమీ ఉండవు. అందువల్ల కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంటారు. అంటే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందునుంచే నోటిద్వారా లవణాలతో కూడిన ద్రవాహారం (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్– ఓఆర్ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి షాక్‌లోకి వెళుతుంటే అప్పుడు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల నుంచి 15 వేలు అంతకంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి మరీ తక్కువకు ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంటే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది. వాటిని ఎప్పుడు ఎక్కించాలన్న అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగీ ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా గర్భిణీల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగీ కావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. ఆ సాధారణ మందులు...డెంగీ రోగులకు ఎంతో ప్రమాదం సాధారణ జ్వరం వచ్చిన వారికి ఇచ్చినట్లుగా డెంగీ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను మరింత పెంచుకున్నట్టే. ఇది చాలా ప్రమాదకరం కాబట్టే ఈ జాగ్రత్త పాటించాలి. అయితే గుండెజబ్బులు ఉన్నవారు ఆస్పిరిన్ మామూలుగానే వాడుతుంటారు. ఇలాంటివారు డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తాన్ని పలచబార్చే మందులు వాడకూడదు. ఇది మరింత ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోడాల్సిన విషయం. ►ప్లేట్లెట్లు తగ్గుతున్నప్పుడు ప్రతి రోజూ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష రోజుకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి సమయాల్లో ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు బాగా నీరసంగా ఉన్నా... దాంతో పాటు రక్తపోటు (బీపీ) పడిపోతూ ఉన్నా వెంటనే హాస్పిటల్లో చేరడం అవసరం. డెంగీ లక్షణాలు కనిపిస్తే యాంటీబయాటిక్స్ వద్దు చాలా మంది గ్రామీణ డాక్టర్లు డెంగీ లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్ మందులు ఉపయోగిస్తుంటారు. అయితే డెంగీ రోగికి జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. ఇలా మందుల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గతే అది అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. ఫలితంగా మందులే ప్రమాదకరం కావచ్చు. డాక్టర్ల విచక్షణ, సలహా మేరకే ఇతర మందులు కూడా ఇక మనం వాడే చాలారకాల ఇతర మందులు సైతం ప్లేట్లెట్ కౌంట్‌ను తగ్గించే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ర్యానిటడిన్, సెఫలోస్పోరిన్, క్యాప్టప్రిల్, ఏసీ ఇన్హిబిటార్స్, బ్రూఫెన్, డైక్లోఫినాక్, యాస్పిరిన్ వంటి అనేక మందులు ప్లేట్లెట్ కౌంట్‌ను తగ్గించడం లేదా ప్లేట్లెట్ ఫంక్షన్‌ను ప్రభావితం చేయడం చేస్తాయి. అందుకే మరీ అత్యవసరం అయితే తప్ప డెంగీ లక్షణాలు కనిపిస్తే వారికి యాంటీబయాటిక్స్‌తో పాటు ఇతర రకాల మందులు వాడటం సరికాదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే వాడాలి. డెంగీ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ ఉండదు. కొందరిలో మినహాయించి అది అంతరిలోనూ ప్రమాదకరం కాదు. అందుకే ఎప్పటికప్పుడు తమ ప్లేట్లెట్ల కౌంట్‌ను పరిశీలిస్తూ... నయమయ్యే వరకు అప్రమత్తంగా ఉంటే చాలు. నిర్ధారణ పరీక్షలు ►సీబీపీ ప్రతి 24 గంటలకు ఒకసారి చేయాలి. ►డెంగీ నిర్ధారణ కోసం డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం కావచ్చు. ►డెంగీ ఐజీఎమ్ అనే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చే సమయం కూడా ఎక్కువే కాబట్టి అవి వచ్చే వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. పైగా దీనికి చేసే చికిత్స కూడా లక్షణాలను బట్టి చేసేదే కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఇప్పుడు మరింత అధునాతనమైన నిర్ధారణ పరీక్ష ఇప్పుడు అత్యంత అధునాతమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. అదే ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష. అయితే ఇది పెద్ద పెద్ద మెడికల్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్లేట్లెట్లను ఎప్పుడు, ఎంత పరిమాణంలో ఎక్కించాలో తెలుసుకోడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్లకు సంబంధించిన కచ్చితమైన వివరాలతో పాటు శరీరంలో ప్లేట్లెట్ల ఉత్పత్తికి తోడ్పడే ఎముకలోని భాగమైన బోన్‌మ్యారో పనితీరు కూడా ఈ పరీక్షతో తెలుస్తుంది. అంతేకాకుండా ప్లేట్లెట్లు వృద్ధి చెందుతాయా, లేదా, ఒకవేళ ప్లేట్లెట్లు ఎక్కించడం ఎంతమేరకు అవసరం... లాంటి చికిత్సకు ఉపకరించే ఎన్నో విషయాలు ఈ పరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఆ మేరకు ప్లేట్లెట్స్ మార్పిడి, చికిత్స విధానాన్ని అవలంబిస్తారు. ఒకవేళ బోన్‌మ్యారోలో లోపం ఉంటే పైపై చికిత్సలను ఆపేసి, ప్రధానమైన మూలాల్లోకి వెళ్లి మెరుగైన చికిత్సను సకాలంలో అందించి, పేషెంట్ ప్రాణాలను కాపాడతారు. ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం రోగులందరికీ ఉండదు ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే... డెంగీకి గురైన ప్రతి పేషెంట్‌కీ ప్లేట్లెట్ల మార్పిడి అవసరం ఉండదు. కేవలం ప్రమాదకరమైన స్థాయిలో ప్లేట్లెట్లు పడిపోయిన వారికి మాత్రమే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనే ఈ చికిత్స చేస్తారు. మిక్స్డ్ ఇన్ఫెక్షన్తో ఈసారి మరింత ప్రత్యేకం...! ఈసారి వస్తున్న డెంగీకి మరో ప్రత్యేకత ఉంది. ఈ సీజన్లో వస్తున్న వైరల్ జ్వరాల్లో డెంగీతో పాటు చికన్‌గున్యా ఫీవర్స్ కలిసి వస్తున్నాయి. అంటే ఒకరకంగా చెప్పాలంటే ‘మిక్సిడ్ ఇన్ఫెక్షన్’లాగా వస్తోంది. సాధారణంగానే డెంగీలో ఎముకల నొప్పి ఉంటుంది. పైగా దీనితో పాటు చికన్‌గున్యా తోడవ్వడంతో ఎముకల్లో నొప్పి మరింత తీవ్రస్థాయిలో ఉంటోంది. ఒకవేళ అది మిక్స్డ్ ఇన్ఫెక్షన్ అయితే.. డెంగీకి ఇచ్చే చికిత్సతో పాటు ప్రతి ఆరుగంటలకు ఒకసారి పార్సిటమాల్ టాబ్లెట్ ఇవ్వాలి. దీనివల్ల జ్వరం, నొప్పులు రెండూ తగ్గుతాయి. అదే కేవలం డెంగీకి అయితే ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి పారసిటమాల్ ఇస్తారు. మూడు రోజులు మాత్రం ఇచ్చి ఆ తర్వాత ఆపేస్తారు. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ పెరిగి డెంగీ నుంచి కోలుకున్న తర్వాత చికన్‌గున్యాకు అవసరమైన చికిత్స ఇస్తారు. ఎందుకంటే చికన్గున్యాతో వచ్చే నొప్పులు నెలల తరబడి ఉంటాయి కాబట్టి నొప్పులు తగ్గడానికి అవసరమైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఇంటర్నల్ మెడిసిన్ – ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేటు దందా
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రైవేటు ఆస్పత్రుల్లో తొమ్మిది నెలలపాటు ఓపీ ఫీజులు, పరీక్షల పేరుతో చేస్తున్న దోపిడీని తట్టుకోలేక ప్రభుత్వాస్పత్రులకు వస్తున్న పేద, దిగువ మధ్య తరగతి గర్భిణులను ఇక్కడ తిష్టవేసిన రాబందులు పీక్కుతింటున్నాయి. ఓపీ ఫీజు నుంచి పరీక్షలు, మందులన్నీ ఉచితంగా లభిస్తాయన్న ఆశతో ఓపీ రాయించుకునేందుకు, ఆ తర్వాత వైద్యం, స్కానింగ్ చేయించుకునేందుకు కడుపులో బిడ్డను మోస్తూ గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్న కాబోయే తల్లుల వద్ద రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాస్పత్రి మాతాశిశు విభాగంలోని ల్యాబ్ సిబ్బంది డబ్బులు గుంజుతున్నారు. అన్ని పరీక్షలూ ఉచితంగా చేయాల్సి ఉన్నా హెపటైటిస్ సి వైరస్ (హెచ్‌సీవీ) వ్యాధి నిర్ధారణ పరీక్ష ఇక్కడ చేయడానికి లేదంటూ, బయట ప్రైవేటు ల్యాబుల్లో చేయించుకోవాలంటూ ఒక్కొక్కరి వద్ద రూ.250 వసూలు చేస్తున్నారు. ల్యాబ్‌లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది సుభాష్తోపాటుఏటీసీ సెంటర్లోని సిబ్బంది ఈ దందాకు పాల్పడుతున్నారు. మభ్యపెట్టి.. మాయ చేస్తూ... జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రధాన భవనంలో వివిధ రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. దాని పక్కనే రెండేళ్ల క్రితం నిర్మించిన మాతాశిశు విభాగంలో గర్భిణులు, పిల్లలకు వైద్యం చేస్తున్నారు. పాత భవనంలో ప్రధాన ల్యాబ్‌తోపాటు, మెడ్‌ఆల్ సాంపిల్స్ సేకరణ కేంద్రం ఉన్నాయి. మాతాశిశు విభాగ భవనంలోనూ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రం ఉంది. ఇక్కడ గర్భిణులు, పిల్లలకు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. గర్భిణులకు అవసరమైన పలు పరీక్షలు డాక్టర్లు రాస్తుండగా అందులో హెచ్‌సీవీ పరీక్ష ఇక్కడ చేయడంలేదని, బయట చేయించుకోవాలంటూ ల్యాబ్‌లో పని చేస్తున్న సుభాష్ అనే ఉద్యోగి గర్భిణులకు చెబుతున్నారు. రక్త నమూనాలను సేకరించిన తర్వాత ఆస్పత్రి భవనం పక్కనే జిరాక్స్ పాయింట్ అనే బోర్డు ఉన్న గది వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఆ పరీక్షకు ఇక్కడ తీసిన రక్త నమూనాలనే పంపిస్తామని, అక్కడ మళ్లీ ఇవ్వాల్సిన పనిలేదని చెబుతూ కిట్లు తెచ్చి ఇక్కడే పరీక్షలు చేస్తున్నారు. జిరాక్స్ పాయింట్ అనే బోర్డు ఉన్నగదిలోని వ్యక్తి గర్భిణుల వద్ద డాక్టర్ రాసిన ఓపీ తీసుకుని వారి పేరు నమోదు చేసుకుంటున్నారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు లోపల పరీక్షలతోపాటు ఇది కూడా ఇస్తామని, వచ్చేటప్పుడు రూ.250 తీసుకురావాలని చెబుతున్నారు. నెల వసూళ్ల మొత్తం రూ.4 లక్షలు... ఈ ఆస్పత్రికి ఏజెన్సీతోపాటు రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా గర్భిణులు వస్తున్నారు. రోజుకు ఓపీ సరాసరి 200 దాటుతోంది. ఇందులో ప్రతిరోజూ సరాసరి 50 మందికిపైనే పరీక్షలు రాస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరికీ హెచ్‌సీవీ పరీక్ష తప్పనిసరి. ఈ పరీక్షను పాత భవనంలోని ప్రధాన ల్యాబ్‌లో చేస్తున్నారు. అయినా ప్రభుత్వాస్పత్రిలో ఈ పరీక్ష చేయడంలేదంటూ గర్భిణుల వద్ద రూ.250 చొప్పున తీసుకుంటున్నారు. రూ.250 చొప్పున రోజుకు రూ.12,500 మాతాశిశు విభాగంలోని ల్యాబ్‌లో ఉంటున్న సుభాష్ బృందం దోపిడీ చేస్తోంది. పేదల వద్ద నెలకు దాదాపు రూ.4 లక్షలు ఈ బృందం దోచుకుంటోంది. రెండేళ్లుగా ఈ దందా సాగుతోందని ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. గతంలో రెండుసార్లు ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు హెచ్చరికలతో వదిలేశారు. గత నెలాఖరున ఆర్ఎంవో లక్ష్మీపతికి ఫిర్యాదులు రావడంతో తనిఖీ చేయగా బండారం బట్టబయలైంది. స్థానిక పోలీస్ ఔట్‌పోస్టులో మౌఖికంగా ఫిర్యాదు చేసిన ఆర్ఎంవో ఆ తర్వాత మిన్నకుండిపోయారని సమాచారం. ఔట్‌పోస్టులో ఆరా తీయగా ఆర్ఎంవో రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని, మౌఖికంగా ల్యాబ్‌లోని సుభాష్ చేసిన దందా చెప్పారని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి గర్భిణుల వద్ద ల్యాబ్ సిబ్బంది చేస్తున్న దోపిడీని ఇప్పటికైనా నిలువరించాలని పేద ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు. అక్కడ లేదని ఇక్కడకు పంపారు ఆస్పత్రిలోపల రక్తం తీసుకున్నారు. ఒక పరీక్ష ఇక్కడ లేదని చెప్పి పక్కనే జిరాక్స్ పాయింట్ వద్దకు వెళ్లాలని చెప్పారు. ఇక్కడ మళ్లీ రక్తం ఇవ్వాల్సిన పనిలేదని, ఇక్కడ తీసిన రక్తం వారికి పంపిస్తామంటున్నారు. జిరాక్స్ బోర్డు వద్ద ఉన్న రూములోని వ్యక్తి ఓపీ తీసుకుని మా పేరు రాసుకున్నారు. రేపు ఆ పరీక్షలతోపాటు ఇది కూడా ఇస్తామని, వచ్చేటప్పుడు రూ.250 పట్టుకురమ్మన్నారు. నేను రావాల్సిన అవసరంలేదని, ఎవరినైనా పంపినా ఇస్తామని చెప్పారు.– లీలావతి, గర్భిణి, రాజమహేంద్రవరం -
వికలాంగులంటే ఇంత నిర్లక్ష్యమా?
* ఆడ, మగ తేడాలేకుండా ఆరుబయటే నిర్ధారణ పరీక్షలు * సదరం క్యాంపులో ఓ వైద్యుడి నిర్వాకం నిజామాబాద్: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్ధారణ పరీక్షల కోసం సదరం క్యాంపునకు వచ్చిన వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చిన వారిని రేపు మాపు అంటూ వైద్యాధికారులు తిప్పుకుంటున్నారు. సోమవారం నిర్వహించిన సదరం శిబిరంలో ఓ వైద్యుడు ఆడ, మగ తేడా లేకుండా ఆరుబయటే వికలాంగ నిర్ధారణ పరీక్షలు జరిపారు. పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక గదులున్నా ఆరు బయటే నిర్వహించడం విమర్శలకు తావి స్తోంది. ప్రభుత్వం అందించే పింఛన్, ఇతర పథకాల్లో లబ్ధి పొందేందుకు సదరం సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో జిల్లా నలుమూలల నుంచి వికలాంగులు ప్రతి శుక్రవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంపునకు వస్తారు. శుక్రవారం నిర్వహించాల్సిన శిబిరం సోమవారానికి వాయిదా వేశారు. వైద్యుల రాక కోసం గంటల తరబడి క్యూలో వేచి చూశారు. అయితే ఉదయమే రావాల్సిన ఆర్థోపెడిక్ వైద్యుడు మధ్యాహ్న సమయంలో వచ్చి కేవలం 20 నిమిషాల పాటే పరీక్షలు నిర్వహించాడు. సమయం లేదంటూ ఆడ, మగ తేడా లేకుండా ఆరబయటే పరీక్షలు చేయడంతో వారు డీఆర్డీఏ పీడీకి ఫిర్యాదు చేశారు. సదరం సర్టిఫికెట్ల కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన తమ పట్ల వైద్యాధికారులు చిన్నచూపు చూస్తున్నారంటూ వికలాంగులు వాపోయారు. శిబిరంలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు పట్టింకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
చిరునవ్వులు చిగురుల కోసం!
పెరియోడాంటల్ సమస్యలు పంటి కింద లేత గులాబీ రంగులో కనిపించే భాగాన్ని తెలుగులో మనం చిగురు అంటాం. కానీ ఇంగ్లిష్ వాళ్లు దాన్నే ‘గమ్’ అంటారు. బహుశా మనకు కనిపించే పన్ను... చిగురుకు అతికినట్లు ఉంటుందని గమ్ అన్నారేమో తెలియదుగానీ... పన్ను కాస్తా తెల్లటి మల్లెలా, ఒక పువ్వులా పూసినందుకేమో, అది ఆవిర్భవించిన స్థానాన్ని మనం చిగురు అంటాం. మన భావుకతకు తోడవుతూ... ఆ చిగుర్లు మంచి రంగులో ఆరోగ్యకరంగా ఉంటే అందాన్ని ఇనుమడింపజేస్తాయి. కానీ సహజ స్వభావరీత్యా చిగురెంత మెత్తటి తత్వం కలదంటే... దానికి జబ్బు చేసినా సరే... నొప్పి తెలియనివ్వదు. దంతాల గురించి కనీసం కొద్దో గొప్పో అవగాహన ఉంటుందేమోగానీ, చిగుర్ల గురించీ, దానికి వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలిసింది చాలా తక్కువ. అలాంటి చిగుర్లపై అవగాహన కలిగించి, చిరునవ్వు మొలిపించటం కోసమే ఈ ప్రత్యేక కథనం. చిగుర్లు అంటే... తెల్లగా బయటకు కనిపించే పంటిలో ముఖ్యమైన నాలుగు భాగాలుంటాయి. అవి... మొదటిది పంటిపై ఉండే ఎనామెల్ పొర. రెండోది దాని కింద ఉండే డెంటిన్. ఆ కింద పంటికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలూ, నరాల చివరలు ఉండే భాగం. డెంటిన్ కింద ఉండే రక్తనాళాలు, నరాల చివరి భాగాలను పల్ప్ అంటారు. వాటన్నిటి కింద ఉండే భాగం పంటి ఎముక. ఈ నాలుగూ ఆరోగ్యంగా ఉంటే పన్ను ఆరోగ్యంగా ఉన్నట్లే. అయితే ఈ నాలుగు భాగాలూ పైకి కనిపిస్తునందున వాటన్నింటినీ కలిపి క్రౌన్ అంటారు. వాటి కింద చిగుర్లలోకి దూసుకుపోయినట్లుగా పంటి వేర్లు (రూట్స్) ఉంటాయి. పైన క్రౌన్, కింద రూట్స్ కలిసే చోటును ‘నెక్’ అంటారు. ఈ నెక్ సరిగ్గా పంటి చిగుర్లలో ఇమిడి ఉంటుందన్నమాట. చెట్టు వేళ్లు నేలలోకి బలంగా పాతుకుపోయినట్లే... క్రౌన్ వేర్లు (రూట్స్) గులాబీరంగు చిగుర్లలోకి బలంగా దిగబడిపోయి ఉంటాయి. ఇది స్థూలంగా పన్ను నిర్మాణం. పలువరసను ముందు నుంచి చూసేప్పుడు పంటి మీదికి వచ్చినట్లుగా ఉండటంతోపాటు కొన్ని చోట్ల కాస్త కిందుగా ఒక రంపపు వరసలా అనిపించే చిగుర్ల అంచును ‘గమ్‌లైన్’ అంటారు. ఈ గమ్‌లైన్ కింద లేత గులాబీ రంగు నుంచి కాస్త ముదురు రంగుతో పాటు కొందరిలో ఒకింత నలుపు రంగుతో ఉండేవే చిగుర్లు. ఈ చిగురు సముదాయం మొత్తాన్ని కలుపుకొని ‘పెరియొడాంటియమ్’ అంటారు. చిగుర్లు పంటిని ఎలా పట్టి ఉంచుతాయి? చిగురు కణజాలం అన్నది అనేక కనెక్టివ్ కణజాలపు కట్టల (బండిల్స్)ను కలిగి ఉంటుంది. ఈ కనెక్టివ్ కణజాలపు కట్టలన్నీ పంటిని చుట్టుకుపోయినట్లుగా ఉంటాయి. దాంతో పన్ను ఈ కణజాలంలో ఇమిడిపోయినట్లుగా ఉంటుంది. ‘పెరియోడాంటల్ లిగమెంట్స్’ అనే అనేక పొరల (ఫైబర్స్) నిర్మాణాలు పలువరసను ఈ కణజాలంలో చుట్టి ఉంచేలా చేస్తాయి. పంటి కింద ఉండే వేర్లు (రూట్స్) అనే నిర్మాణాలు దవడ ఎముకలోని ఖాళీజాగాలో గట్టిగా ఇమిడిపోయి ఉంటాయి. రూట్స్ ఇమిడే ఈ దవడ ఎముకలోని సాకెట్ వంటి నిర్మాణాన్ని ‘ఆల్వియొలార్ సాకెట్’ అంటారు. ఈ సాకెట్లలో పలువరస గట్టిగా అమరిపోయి ఇంత నమిలినా, కొరికినా పళ్లను గట్టిగా పట్టి ఉంచుతుంది. పళ్లు లేని పుర్రెను పరిశీలనగా చూసినప్పుడు మనకు దవడలోని ఈ ‘ఆల్వియొలార్ సాకెట్స్’ అనే ఖాళీలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఖాళీలలోకి పంటి వేళ్లు (రూట్స్), చిగుర్ల పై భాగంలోకి పళ్లు పెరుగుతాయి. గులాబి రంగులో కనిపించే ఈ చిగుర్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అని కూడా అంటారు. చిగుర్ల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చిగురు వరస (గమ్‌లైన్)ను పరిశీలించడం. చిగురు వరస కిందికి దిగినట్లుగా ఉండటం. క్లినికల్ పరిశీలనలో ఒక్కోసారి నోటి ద్వారా వచ్చే దుర్వాసన (హ్యాలిటోసిస్) ద్వారా చిగుర్ల వ్యాధి ఉన్నట్లు తెలుసుకోవచ్చు. అన్ని పళ్లకు ఎక్స్-రే (ఆర్థోప్యాంటమోగ్రామ్) తీయించడం ద్వారా చిగుర్ల వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. జింజివైటిస్ అంటే ఏమిటి? లేత గులాబి రంగులో ఆరోగ్యంగా మిసమిసలాడుతూ మెరుస్తుండే చిగుర్లు ఒకింత ఎర్రబారి, వాచినట్లుగా కనిపిస్తే దాన్ని జింజివైటిస్‌గా పేర్కొనవచ్చు. చాలా సందర్భాల్లో చిగుర్లకు వచ్చే వ్యాధుల వల్ల నొప్పి ఉండదు. కాబట్టి జింజివైటిస్‌ను గుర్తించడం ఒకింత కష్టం. కానీ చిగుర్ల వ్యాధి జింజివైటిస్ దశలో ఉన్నప్పుడే దానికి చికిత్స తీసుకోవడం మంచిది. జింజివైటిస్ ముదిరితే...? జింజివైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది దీర్ఘకాలంలో పెరియోడాంటైటిస్‌కు దారి తీస్తుంది. పెరియోడాంటైటిస్ను గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి... చిగుర్లలో పుండ్లు పడటం, దంతాల మధ్య గ్యాప్ పెరగడం, దంతాలు వదులు కావడం వంటి లక్షణాలతో పెరియాడాంటైటిస్ను తెలుసుకోవచ్చు. చిగుర్ల వ్యాధులు... లక్షణాలు సాధారణంగా చిగుర్ల వ్యాధులకు తొలి దశల్లో నొప్పి అంతగా తెలియదు. ఆ తర్వాత నొప్పి కూడా ఉండవచ్చు. దాంతోపాటు కనిపించే మరికొన్ని లక్షణాలివి... ► నోటి దుర్వాసన (హ్యాలిటోసిస్) చిగుర్లు ఎర్రబారడం, చిగుర్ల వాపు, ఉబ్బినట్లుగా కనిపించడం. ► ముట్టుకుంటే జివ్వుమనడం (టెండర్నెస్) చిగుర్ల నుంచి రక్తస్రావం (బ్లీడింగ్) ►నమిలినప్పుడు నొప్పిగా అనిపించడం ► పళ్లు వదులైనట్లుగా స్పష్టంగా తెలియడం, పళ్ల మధ్య సందులు ఏర్పడటం. ► పంటికి పైకి పాకినట్లుగా ఉండే చిగురు అంచులు క్రమంగా కిందికి దిగజారడం ► (రిసీడింగ్ గమ్స్ / లాంగర్ అప్పియరెన్స్ ఆఫ్ టీత్) చిగుర్ల వ్యాధులు ఎలా వస్తాయి...? చిగుర్ల వ్యాధులకు అనేక కారణాలు ఉన్నా... ప్రధానంగా చిగురు పంటిని కలిసి ఉండే గమ్‌లైన్ వద్ద గార (ప్లాక్) పేరుకోవడం ద్వారా చిగురు వ్యాధి మొదలవుతుంది. ఈ గారలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. కానీ ఈ బ్యాక్టీరియా చాలావరకు ప్రమాదరహితమైనవే. మనం క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో బ్రష్ చేసుకుంటూ ఉంటే చిగుర్ల అంచున ఉండే ఈ ప్లాక్ తొలగిపోతుంటుంది. పళ్ల మధ్యన, బ్రషింగ్‌కు వీలు కాని చోట పేరుకునే ప్లాక్‌ను టై్వన్ దారం వంటి మందపాటి దారంతో శుభ్రం చేసుకోవాలి. దీన్నే ఫ్లాసింగ్ అంటారు. అయితే మనం రోజూ సక్రమంగా బ్రష్ చేసుకోకపోతే ఈ గార పెరుగుతూ పోతుంది. తొలిదశలో కేవలం బ్రషింగ్తోనే తొలగిపోయే ఈ గార క్రమంగా బలపడిపోతుంది. అప్పుడు దీన్ని తొలగించాలంటే దంతవైద్యుల పరికరాల సహాయంతో స్కేలింగ్ చేయించాల్సి ఉంటుంది. అప్పటికీ దాన్ని తొలగించకపోతే... బ్యాక్టీరియా పేరుకుపోయి అది చిగుర్లను తినేస్తూ ఉంటుంది. అప్పుడు మన గమ్‌లైన్ కిందికి దిగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ దశలో తప్పనిసరిగా పంటి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యంగానే ఉన్నాయని గుర్తించడం ఎలా? చిగుర్లు ఎల్లప్పుడూ లేత గులాబి రంగులో ఆరోగ్యంగా ఒకింత నిగారింపుతో కూడిన మెరుపుతో కనిపిస్తుంటాయి. కొందరిలో ఈ గులాబి రంగు చిగుర్లు కాస్తా ఎర్రగా వాచి, ఉబ్బినట్లుగా కనిపించవచ్చు. ఒక్కోసారి కొందరిలో బ్రష్ చేసుకుంటుంటే చిగుర్ల నుంచి రక్తం రావచ్చు. అలా జరిగితే అది చిగుర్ల వ్యాధి (జింజివైటిస్)కి లక్షణంగా పరిగణించాలి. అయితే ఒక్కోసారి మన టూత్‌బ్రష్ చిగురును బలంగా తగలడం వల్ల ఒక్కోసారి కొద్దిగా రక్తస్రావం అయి, చిగురు ఎర్రగా మారి, నొప్పిగా ఉంటుంది. ఇలాంటి గాయం ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉంటూ, బ్రష్ తగలకపోయినా రక్తస్రావం అవుతుంటే మాత్రం దాన్ని చిగురు వ్యాధిగా పరిగణించాలి. పెరిగే వయసుతోచిగుర్లు తరుగుతాయా? నిజానికి వయసు పెరగడం వల్ల చిగుర్లు క్రమంగా తరిగిపోతాయనీ, దాంతో పళ్ల మధ్య సందులు ఏర్పడటం, పళ్లు వదులు కావడం, ఈ వదులైన పళ్లు ఏదో ఒక దశలో రాలిపోవడం మామూలే అని చాలా మంది అపోహ. అందుకే వయసు పైబడ్డవారిలో పళ్లు రాలుతుంటాయని అందరూ అనుకుంటారు. కానీ పెరిగే వయసుకూ, తరిగే చిగుర్లకూ (గమ్లైన్కూ) సంబంధం లేదు. చిగుర్లు క్రమంగా కిందికి తగ్గుతూ పళ్ల మధ్య సందులు పెరుగుతున్నాయంటే అది చిగుర్ల వ్యాధి కారణంగానే కానీ... పెరిగే వయసు వల్ల కాదు. అందువల్ల పళ్ల మధ్య సందులు వస్తున్నప్పుడు విధిగా పంటి డాక్టర్‌కు చూపించాలి. పెరిగే వయసు వల్ల అది సహజమేనంటూ సరిపెట్టుకోకూడదు. సరైన దంతచికిత్స చేయించుకుంటూ, సక్రమమైన రీతిలో పళ్లను రక్షించుకుంటూ ఉంటే ఎంత వయసు పైబడినా పళ్లు ఊడిపోవు... సరికదా... జీవితాంతం గట్టిగా చిగుర్లను అంటిపెట్టుకునే ఉంటాయి. అయితే చాలామందిలో వయసు పెరుగుతున్నప్పుడు వారి శరీరంలోని మిగతా కణాల్లాగే నోటిలోని కణజాలం కూడా కొన్ని మార్పులు వస్తాయి. దాంతో నోటిలో ఊరే లాలాజలం పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా చిగుర్లు కాస్త బలహీనం కావచ్చు. కొందరిలో అవి ఎర్రగా మారి మంట (ఇన్ఫ్లమేషన్) రావచ్చు. మరికొంరదిలో చిగుర్ల నుంచి రక్తస్రావం కూడా కావచ్చు. ఈ సమస్యలన్నింటికీ సరైన సమయంలో వైద్యచికిత్స తీసుకోవడమే మంచి మార్గం. అలా చేస్తే... జీవితాంతం పళ్లూ, చిగుర్లూ ఆరోగ్యంగానే ఉంటాయి. చిగుర్ల వ్యాధులు... గుండెకూ సమస్యలే! చిగుర్ల వ్యాధులకు తోడ్పడే బ్యాక్టీరియా సాధారణంగా ఒక్కోసారి రక్తప్రవాహంలో కలిసిపోయి గుండెకూ చేరవచ్చు. మామూలుగా పంటికి వచ్చే సమస్యల కంటే చిగుర్లకు వచ్చే బ్యాక్టీరియల్ సమస్యలే గుండెకు వేగంగా చేరతాయి. ఎందుకంటే పంటికి జరిగే రక్తప్రసరణ లోపలి పల్ప్ నుంచి జరుగుతుంది. కానీ చిగుర్లకు నేరుగా సన్నటి రక్తనాళాల ద్వారా రక్తప్రసరణ జరుగుతుంటుంది. అందుకే చిగుర్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా గుండెపైపొరకు (పెరీకార్డియమ్)కు చేరే అవకాశాలు చాలా ఎక్కువ. అంతేకాదు ఒక్కోసారి ఇదే పరిస్థితి మెదడుకు సంభవిస్తే స్ట్రోక్ (పక్షవాతం), డిమెన్షియా కూడా వచ్చే అవకాశాలుంటాయి. అందుకే పంటి ఆరోగ్యంతో పాటు, చిగుర్ల ఆరోగ్యాన్నీ కాపాడుకోవడం చాలా అవసరం. చివరగా... మనం మనలోని అన్ని జీవకణాలకు ఆహారాన్ని, పోషకాలను అందించడానికి భోజనం చేయడం అతి ముఖ్యం. ఈ కార్యకలాపానికి తోడ్పడే తొలి అవయవాలు పళ్లు. వాటిని పట్టి ఉంచేవి చిగుర్లు. అందుకే మన శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే మన నోటి ఆరోగ్యం (ఓరల్ క్యావిటీ హైజీన్) బాగుండాలి. అందుకే ప్రతి ఆర్నెల్లకోసారి తప్పనిసరిగా మీ పంటి డాక్టర్‌ను కలిసి మీ పళ్ల ఆరోగ్యాన్ని పరీక్షింపజేసుకుని, క్లీనింగ్ (స్కేలింగ్) ద్వారా గార తొలగించుకోవడం వంటి చర్యలు తీసుకోవడం ఎంతో మేలు. చిగురుకు వచ్చిన సమస్యను బట్టి స్కేలింగ్, క్యూరటాజ్, సమస్య తీవ్రతను బట్టి ఫ్లాప్ శస్త్రచికిత్స వంటి చికిత్సలు చేయాల్సి ఉంటుంది - నిర్వహణ: యాసీన్ పొగతాగేవారూ... చిగుర్ల ఆరోగ్యం! ఆరోగ్యవంతులతో పోలిస్తే, పొగతాగే అలవాటు ఉన్నవారిలో చిగుర్ల వ్యాధి రావడానికి ఈ అలవాటు మరింత ఎక్కువగా దోహదం చేస్తుంది. ఎందుకంటే మామూలు వ్యక్తులతో పాటు వీరిలోనూ పళ్లపై పాచి పేరుకుంటుంది. కానీ పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆ పాచి చాలా త్వరగా గారలా మారే అవకాశం ఉంటుంది. పైగా పొగతాగే అలవాటు కారణంగా వారి పళ్లలోని పల్ప్ నుంచి పంటికి పోషకాలు అందే వేగం మందగిస్తుంది. ఈ కారణంగా చిగుళ్ళుకూ, పళ్లకూ రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా పొగతాగేవారిలో చిగుర్ల వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. గార ఏర్పడే వేగం కూడా ఎక్కువే. చిగుర్ల రంగు మారుతుందా? పొగాకును వాడే కొందరిలో చిగుర్ల రంగుమారవచ్చు. పొగాకు నమలడం, పొగతాగడం వంటి దురలవాట్లు ఏమీ లేనప్పుడు కూడా... చిగుళ్ల రంగు మారితే... అది కూడా ఇటీవలే మారి ఉంటే ఒకసారి పూర్తిస్థాయి ఆరోగ్యపరీక్షలు చేయించాల్సి ఉంటుంది. చాలామందిలో వారిలో ఉండే మెలనిన్ పిగ్మెంట్ పాళ్లను బట్టి చర్మం రంగు వేర్వేరుగా ఉన్నట్లే చిగుర్ల రంగు కూడా వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా చిగుర్లు లేత గులాబిరంగులో ఉంటాయి. అయితే ఒక్కోసారి శరీరంలో రంగును ఇచ్చే పిగ్మెంట్‌లో అసమతౌల్యత వల్ల చిగుర్ల రంగు కూడా మారవచ్చు. మన చిగుర్లు ఏ రంగులో ఉంటాయన్న అంశం మన జన్యువుల ఆధారంగా పుట్టుక సమయంలోనే నిర్ణయమవుతుంది. అందుకే చిగుళ్ల రంగు వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. చిగుర్ల రంగును మార్చడానికి ఎలాంటి చికిత్సా అవసరం లేదు. అయితే కొందరు తమ చిగుర్లు చాలా నల్లగా ఉన్నాయనీ, నవ్వినప్పుడు అవి అసహ్యంగా కనిపిస్తున్నాయంటూ ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ఇలా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన వారికి ముదురు రంగు (డార్క్ కలర్)లో ఉండే చిగుళ్ల పైపొరను చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించి దాని కింద గులాబి రంగులో ఉండే పొరను పైకి వచ్చేలా చేయవచ్చు. అయితే సదరు వ్యక్తుల్లో సహజంగా ఉండే ఒంటిరంగు (పిగ్మెంటేషన్) పాళ్లను బట్టి ఈ లేత చిగుర్ల రంగు తాత్కాలికంగా మాత్రమే ఉండి మళ్లీ ముదురు రంగుకు మారుతుంది. ఇలా శస్త్రచికిత్స తర్వాత చిగుర్లకు ఆ రంగు ఎంత కాలం ఉంటుందన్నది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. ఇటీవల చిగుళ్ల రంగు మార్చే శస్త్రచికిత్సను లేజర్ సాయంతో కూడా చేయడం సాధ్యమే. గర్భవతులు... చిగుర్లు చిగుర్ల ఆరోగ్యం దెబ్బతింటే అది మామూలు వ్యక్తుల్లో కేవలం నోటి ఆరోగ్యంపైనే ప్రభావం చూపవచ్చు. కానీ ఇటీవలి అధ్యయాన ప్రకారం పెరియోడాంటిస్ (ఒక రకం చిగుళ్ల వ్యాధి) - డయాబెటిస్, గుండె సమస్యల వంటి తీవ్రమైన జబ్బులకూ దారితీయవచ్చుని తెలిసింది. ఇక కొందరు మహిళల్లో చిగుర్ల సమస్యలు వస్తే అది నెలలు నిండకముందే ప్రసవానికి (ప్రీ-మెచ్యుర్ లేబర్) దారితీయవచ్చు. చిగుర్ల సమస్యలు మాటిమాటికీ వస్తున్నవారు వెంటనే డెంటిస్ట్‌ను కలవాలి. -
స్మార్ట్‌ఫోన్ = డాక్టర్
హ్యూస్టన్: మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఇకపై మీ దగ్గర డాక్టర్ కూడా ఉన్నట్లే... మాట్లాడుకోడానికి, ఫొటోలు తీసుకోడానికే కాదు రోగనిర్ధారణ పరీక్షలు చేసే కొత్త రకం స్మార్ట్ఫోన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ఇప్పటికే హ్యూస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేశారు. బాక్టీరియా, వైరస్ల వల్ల వ్యాపించే రోగాలను కూడా ఈ కొత్త రకం ఫోన్ గుర్తించగలదు. ఇందుకు సంబంధించి వివిధ పరికరాలను స్మార్ట్‌ఫోన్‌లో అమర్చుతారు. ఇవి జబ్బుపడిన వ్యక్తికి వచ్చిన రోగాన్ని గుర్తించి స్మార్ట్‌ఫోన్‌కు వివరాలు అందిస్తాయి. హ్యూస్టన్ వర్సిటీకి చెందిన జిమింగ్ బావో, రిచర్డ్ విల్సన్‌లు ఈ కొత్త రకం స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధిపరిచారు.