కరోనా నిర్ధారణ కోసం ఓ పుల్లలాంటి పరికరంతో ముక్కులోంచి స్వాబ్ సేకరించి, దాని సహాయంతో కరోనా ఉందని తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన ప్రక్రియ. అందుకే కరోనా నిర్ధారణను మరింత తేలికగా చేయడానికి పూనుకున్నారు ఇంగ్లండ్‌కు పరిశోధకులు. ఓ వ్యక్తి ఉపయోగించే సెల్‌ఫోన్ సహాయం తో తనకు కరోనా ఉందో లేదో తెలుసుకునే ప్రక్రియను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు ఇంగ్లండ్‌కు చెందిన ’యూనివర్సిటీ కాలేజ్ లండన్’ శాస్త్రవేత్తలు.
ప్రతి వ్యక్తీ తాను మొబైల్ మాట్లాడుతున్నప్పుడు వదిలే గాలి ఫోన్‌కు అంటుకుంటుంది. పుల్ల సహాయంతో సెల్‌ఫోన్‌ను రుద్దడం ద్వారా సేకరించిన స్వాబ్‌తో మరింత తేలిగ్గా... అంటే ముక్కులో పుల్లలు దూర్చి ఇబ్బంది పెట్టకుండానే కరోనా వైరస్ నిర్ధారణ చేయవచ్చునంటున్నారు. ఇది ర్యాపిడ్ టెస్ట్‌కు ఓ ప్రత్యామ్నాయంగా ఉండగలదని పేర్కొంటున్నారు. ఇలా ఫోన్ స్వాబ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసినప్పుడు అది దాదాపుగా 81%కి పైగా నమ్మకమైనదిగానూ చెబుతున్నారు. అంతేకాదు... ఈ ప్రక్రియతో వ్యాధి నిర్ధారణ కోసం ఖర్చు కేవలం 5 పౌండ్లకు మించదని, ఆర్థికంగానూ ఇది మరింత మంచి మార్గమని చెబుతున్నారు.
‘‘ముక్కునుంచి తీసుకునే చేసే (నేసల్ స్వాబ్) పరీక్షే కోవిడ్ నిర్ధారణకు ఓ గోల్డ్ స్టాండర్డ్. కానీ పెద్ద పెద్ద సమూహాల్లో త్వరగా నిర్ధారణ పరీక్షలు అవసరమైనప్పుడు మాస్ టెస్టింగ్ కోసం ఈ ‘ఫోన్ స్వాబ్’ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. ‘‘మనం ఫోన్‌లో మాట్లాడుతూ ఉండటం, అలాగే దాన్ని ముట్టుకోవడం వల్ల ఒకవేళ మనలో వైరస్ ఉంటే... వాటిని ఫోన్ స్వాబ్ ద్వారా సేకరించి పరీక్షించడం వల్ల నమ్మకమైన ఫలితాలే వస్తాయి. దాంతో అటు పరీక్షలకు అయ్యే ఖర్చులూ తగ్గుతాయి. ఫలితాలు వేగంగానూ వస్తాయి ’’ అంటున్నారు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ రోడ్రిగో యంగ్. ఇంకా చెప్పాలంటే చిలీలోని డయాగ్నోసిస్ బయోటెక్ అనే సంస్థ ఈ పరీక్షలను నిర్వహిస్తూ ఉండగా, దక్షిణ అమెరికాలోని కొన్ని స్కూళ్లలోనూ ఎక్కువ సంఖ్యలో పెద్ద పెద్ద సమూహాల్లో భారీగా పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పటికే వీటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment