University of London
-
మామా.. చందమామా మరింత దూరమా?
చంద్రునితో భూమికి అవినాభావ సంబంధం. భూమికి ఉపగ్రహమైతే మనకేమో ఏకంగా చంద‘మామ’. భూమిపైనా, మనిషితో పాటు జంతుజాలం మీదా చంద్రుని ప్రభావమూ అంతా ఇంతా కాదు. సముద్రంలో ఆటుపోట్లు మొదలుకుని అనేకానేక విషయాల్లో ఆ ప్రభావం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. భూమిపై ప్రాణం ఆవిర్భావానికి చంద్రుడే కారణమన్న సిద్ధాంతమూ ఉంది. మన రోజువారీ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసే పలు కీలక వాతావరణ వ్యవస్థల్లో కూడా భూమి చుట్టూ చంద్రుని కక్ష్య తాలూకు నిర్మితి కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. అలాంటి చంద్రుడు భూమిపై రోజు తాలూకు నిడివి రోజురోజుకూ పెరిగేందుకు కూడా ప్రధాన కారణమట...! చాలాకాలం క్రితం. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. భూమ్మీద రోజు నిడివి ఎంతుండేదో తెలుసా? ఇప్పుడున్న దాంట్లో దాదాపు సగమే! సరిగ్గా చెప్పాలంటే 13 గంటల కంటే కాస్త తక్కువ!! అప్పట్నుంచీ అది క్రమంగా పెరుగుతూ ఇప్పటికి 24 గంటలకు చేరింది. ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉందట! చంద్రుడు క్రమంగా భూమికి దూరంగా జరుగుతుండటమే ఇందుకు కారణమని సైంటిస్టులు తేల్చారు!! భూమికి చంద్రుడు దూరంగా జరుగుతున్న తీరును శాస్త్ర పరిభాషలో ల్యూనార్ రిసెషన్గా పిలుస్తారు. ఇది ఎంతన్నది అపోలో మిషన్లలో భాగస్వాములైన ఆస్ట్రోనాట్లు ఇటీవల దీన్ని కచ్చితంగా లెక్కించారు. చంద్రుడు భూమికి ఏటా 3.8 సెంటీమీటర్ల మేరకు దూరంగా జరుగుతున్నట్టు తేల్చారు. అందువల్లే భూమిపై రోజు నిడివి అత్యంత స్వల్ప పరిమాణంలో పెరుగుతూ వస్తోందట. మహాసముద్రాలతో, అలలతో చంద్రుని సంబంధమే ఇందుకు ప్రధాన కారణమని యూనివర్సిటీ ఆఫ్ లండన్ రాయల్ హోలోవేలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ వాల్టాం చెబుతున్నారు. ఆయన భూమి, చంద్రుని మధ్య సంబంధంపై చిరకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ‘‘ఇటు భూమి, అటు చంద్రుడు ఎవరి కక్ష్యలో వారు తిరిగే క్రమంలో చంద్రుని ఆకర్షణ వల్ల మహాసముద్రాల్లో ఆటుపోట్లు (అలల్లో హెచ్చు, తగ్గులు) సంభవిస్తూ ఉంటాయి. సదు అలల ఒత్తిడి భూ భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్ప పరిమాణంలో తగ్గిస్తుంటుంది. అలా తగ్గిన శక్తిని చంద్రుడు తన కోణీయ గతి కారణంగా గ్రహిస్తుంటాడు. తద్వారా చంద్రుడు నిరంతరం హెచ్చు కక్ష్యలోకి మారుతూ ఉంటాడు. మరో మాటల్లో చెప్పాలంటే భూమి నుంచి దూరంగా జరుగుతూ ఉంటాడన్నమాట’’ అని ఆయన వివరించారు. అప్పట్లో రోజుకు రెండు సూర్యోదయాలు ‘‘అప్పట్లో, అంటే ఓ 350 కోట్ల ఏళ్ల క్రితం ఇప్పటి రోజు నిడివిలో ఏకంగా రెండేసి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు జరిగేవి! ఎందుకంటే రోజుకు 12 గంటలకు అటూ ఇటుగా మాత్రమే ఉండేవి. ఈ నిడివి క్రమంగా పెరుగుతూ వచ్చింది, వస్తోంది’’ అని జర్మనీలోని ఫ్రెడరిక్ షిల్లర్ యూనివర్సిటీ జెనాలో జియోఫిజిసిస్టుగా చేస్తున్న టామ్ ఈలెన్ఫెల్డ్ వివరించారు. మరో విశేషం ఏమిటంటే, భూమికి చంద్రుడు దూరం జరుగుతున్న వేగం కూడా ఎప్పుడూ స్థిరంగా లేదు. అది నిత్యం మారుతూ వస్తోందట. ఉదాహరణకు 60 కోట్ల ఏళ్ల కింద చూసుకుంటే ఆ వేగం ఇప్పటికి రెట్టింపుండేదట. అంటే అప్పుడు చంద్రుడు భూమికి ఏటా సగటున 7 సెంటీమీటర్లు దూరం జరిగేవాడట! అలాగే ఈ వేగంలో భవిష్యత్తులో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని ఈలెన్ఫెల్డ్ చెబుతున్నారు. ‘‘మహాసముద్రాల, ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రపు పరిమాణమే ఇందుకు కారణం కావచ్చు. అది గనక ఇప్పుడున్న దానికంటే కాస్త సన్నగా గానీ, వెడల్పుగా గానీ ఉంటే మూన్ రిసెషన్ వేగంలో పెద్దగా మార్పులుండేవి కావని నా అభిప్రాయం’’ అని చెప్పారాయన. కొసమెరుపు: ఏదెలా ఉన్నా, చంద్రుడు మాత్రం భూమికి ఎప్పటికీ శాశ్వతంగా దూరమైపోడంటూ సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు! ‘‘అలా జరిగేందుకు కనీసం మరో 500 నుంచి 1,000 కోట్ల ఏళ్లు పట్టొచ్చు. కానీ అంతకు చాలాముందే సౌర కుటుంబమంతటికీ మహారాజ పోషకుడైన సూర్యుడే లేకుండా పోతాడు! సూర్యునితో పాటే భూమి, మొత్తం సౌరకుటుంబమే ఆనవాలు లేకుండా పోతాయి’’ అంటూ వారు చమత్కరించారు!! శతాబ్దానికి 1.09 మిల్లీ సెకను పెరుగుతున్న రోజు... చంద్రుడు క్రమంగా దూరం జరుగుతున్న కారణంగా భూమిపై రోజు నిడివి క్రీస్తుశకం 1,600 నుంచి ప్రతి శతాబ్దానికి సగటున 1.09 మిల్లీసెకన్ల మేరకు పెరుగుతూ వస్తోందని తాజా విశ్లేషణలు తేల్చాయి. ఇది 1.78 మిల్లీసెకన్లని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చూట్టానికి మిల్లీసెకన్లే అయినా, 450 కోట్ల భూ పరిణామ క్రమంలో రోజు తాలూకు నిడివిని ఇది ఊహాతీతంగా పెంచిందని సైంటిస్టులు అంటున్నారు. చంద్రుడు ఒకప్పుడు భూమికి ఇప్పటికంటే చాలా చాలా దగ్గరగా ఉండేవాడని ఇప్పటికే నిరూపితం కావడమే ఇందుకు రుజువని చెబుతున్నారు. ఉదాహరణకు చంద్రుడు ప్రస్తుతం భూమికి 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల ఏళ్ల కింద ఈ దూరం కేవలం 1,70,000 మైళ్లే ఉండేదని పలు అధ్యయనాల్లో తేలింది! ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్1758ఎస్ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉన్నాయి. నాసా తాలూకు చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాలూకు జర్నల్ మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అదర్ సైడ్: స్టూడెంట్ నంబర్‌వన్
‘టైమెక్కడ ఉంది’ అని చీటికిమాటికి అంటే టైమ్ చిన్నబుచ్చుకుంటుందట. ‘టైమ్ నాతోనే ఉంటుంది’ అనుకుంటే బలాన్ని ఇస్తుందట. సినీ నిర్మాత, ఇంటీరియర్ డిజైనర్, కాలమిస్ట్, పుస్తక రచయిత్రి, గృహిణిగా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్న ట్వింకిల్ ఖన్నా మరోసారి స్టూడెంట్‌గా మారబోతోంది. ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ చేయడానికి రెడీ అవుతోంది... ‘అమ్మా, నీకు ట్వింకిల్ అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగింది నాలుగేళ్ల కూతురు. ‘నేను లిటిల్స్టార్ని కాబట్టి’ అని జవాబు చెప్పింది ట్వింకిల్. ఇది విని కూతురు నవ్వేసింది. ఇంట్లోనే కాదు పుస్తక ప్రపంచంలో కూడా నవ్వుల వెన్నెల కురిపిస్తుంది ట్వింకిల్‌ఖన్నా. కథానాయికగా మాత్రమే కాదు కాలమిస్ట్, పుస్తక రచయిత్రిగా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ట్వింకిల్ రాసిన ‘మిసెస్ ఫన్నీబోన్స్’ పుస్తకం బెస్ట్ సెల్లర్ చార్ట్‌లో నెంబర్‌వన్‌గా నిలిచింది. ‘అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న పుస్తకం ఇది’ అని ప్రశంసించారు పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఎడిటర్ ఇన్ చీఫ్ మిలీ ఐశ్వర్య. మరో పుస్తకం ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ‘హైయెస్ట్–సెల్లింగ్ ఫిమేల్ ఆథర్’ సింహాసనంలో తనను కూర్చోబెట్టింది. నవ్వించడం ఎంత కష్టమో, నవ్వించడం ద్వారా వచ్చే కష్టాలు కూడా అంతే కష్టమని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది ట్వింకిల్‌కు. ‘నన్ను ఉద్దేశించే రాసింది’ అని ఎంతోమంది భుజాలు తడుముకునేవారు! వినోదమాధ్యమాలు ఎన్ని పెరిగినప్పటికీ, ఇప్పటికీ పుస్తకాలు అంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం. మనసు బాగలేనప్పుడు, ఉత్సాహం కావాలనుకున్నప్పుడు ట్వింకిల్ పుస్తకప్రపంచంలోకి వెళుతుంది. ప్రతి పుస్తకం ఒక నేస్తం అవుతుంది. తనలో కొత్త ఎనర్జీ, ఉత్సాహం వస్తాయి. ‘మహిళా రచయితలకు ఎదురయ్యే సవాలు ఏమిటి?’ అనే ప్రశ్నకు– ‘రచన గురించి ఆలోచించే క్రమంలో తనదైన ఊహాప్రపంచంలో, రకరకాల క్యారెక్టర్ల మధ్య ఉండాల్సి వస్తుంది. ఇదే సమయంలో వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఇంటిపనులు, పిల్లల బాధ్యత చూసుకోవాల్సి ఉంటుంది. రెండిటినీ సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు’ అంటుంది ట్వింకిల్. రచయిత్రిగా ట్వింకిల్ ఖన్నాకు బోలెడు పేరు వచ్చింది. ఈ దశలో ‘నాకు రాయడం వచ్చేసింది. ఏమీ నేర్చుకోనక్కర్లేదు’ అనుకుంటారు చాలామంది. అయితే ట్వింకిల్ అలా అనుకోవడం లేదు. ‘నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంటుంది. అందుకే క్రియేటివ్ రైటింగ్‌లో శిక్షణ పొందడానికి ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లోకి స్టూడెంట్‌గా అడుగుపెట్టబోతుంది. ‘మరోసారి స్టూడెంట్‌గా మారుతున్నందుకు సంతోషంగా ఉంది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను. చిన్నప్పటిలాగే శ్రద్ధగా క్లాసులు వినబోతున్నాను. నోట్స్ రాసుకోబోతున్నాను’ అంటూ అభిమానులతో తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ట్వింకిల్. దీంతోపాటు హుషారెత్తించే, ఉత్సాహంతో జంప్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. నిజానికి ఆ వీడియోలో ట్వింకిల్‌ఖన్నా కనిపించడం లేదు. చదువు దాహంతో ఉన్న ఒక సిన్సియర్ స్టూడెంట్ కనిపిస్తుంది. ‘నేర్చుకోవాలనే తపన మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తుంది! -
ప్రొస్టేట్ క్యాన్సర్‌పై నానో కత్తి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మగవారికి ప్రొస్టేట్ క్యాన్సర్ శాపంగా పరిణమిస్తోంది. దీన్ని గుర్తించిన తర్వాత రేడియో థెరపీ లేదా ఆపరేషన్ చేసి ప్రొస్టేట్ గ్రంధిని తొలగించడమనే మార్గాలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా దీన్ని పూర్తిగా నిర్మూలించే సరికొత్త చికిత్సా విధానంపై డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంటలోపు పూర్తయ్యే ఈ చికిత్స ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నయం చేస్తుందంటున్నారు. ఈ చికిత్సలో మందులకు లొంగని కణతులపైకి ఎలక్ట్రిక్ తరంగాలను పంపి వాటిని నాశనం చేస్తారు. ‘నానో నైఫ్’గా పిలిచే ఈ సరికొత్త చికిత్సా విధానం చాలా సులువైనదని, సైడ్ ఎఫెక్టులు చాలా స్వల్పమని యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ సర్జన్లు చెప్పారు. నిజానికి ఈ నానో నైఫ్ చికి త్సను ఇప్పటికే లివర్, క్లోమ క్యాన్సర్లలో వాడుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌పై దీన్ని తొలిసారి వాడినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఏమిటీ నానో నైఫ్.. ఈ ట్రీట్మెంట్ పేరు నానో నైఫ్ కానీ, నిజంగా చికిత్సలో నైఫ్ (కత్తి) వాడరు. చర్మం ద్వారా ఒక సూదిని పంపి ఆల్ట్రాసౌండ్స్ను ఉపయోగించి కణతులను (ట్యూమర్లు) గుర్తిస్తారు. అనంతరం ఆ కణితి చుట్టూ నాలుగు సూదులు గుచ్చుతారు. వీటి ద్వారా నానో నైఫ్ మిషన్ ఎలక్ట్రిక్ తరంగాలను పంపుతుంది. ఈ తరంగాలు కణతుల్లోని కణాలపై ఉండే త్వచాన్ని ధ్వంసం చేస్తాయి. దీంతో ఆ కణుతులు నాశనం అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ 45–60 నిమిషాల్లో పూర్తవుతుంది. లకి‡్ష్యత కణుతులపైకి కరెంట్ తరంగాలను పంపి నిర్వీర్యం చేసే ఈ పద్దతిని ఇర్రివర్సబుల్ ఎలక్ట్రోపోరేషన్ అంటారు. దీనివల్ల కణతులకు చుట్టుపక్కల కణజాలంపై పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుంది. సాంకేతికత సాధించిన విజయాల్లో ఇది ఒకటని ఈ ఆపరేషన్ తొలిసారి నిర్వహించిన డాక్టర్ ఆలిస్టర్ గ్రే అభిప్రాయపడ్డారు. ముదిరితే కానీ తెలియదు.. మగవారిలో మూత్రాశయం దిగువన ఉండే ప్రొస్టేట్ గ్రంధిలో కణజాలం అదుపుతప్పి పెరగడాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సంభవించే క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో, పురుషుల్లో ఈ క్యాన్సర్ అంతే ప్రమాదకారిగా మారింది. ఏటా లక్షలమంది దీని బారినపడి మరణిస్తున్నారు. ఇతర క్యాన్సర్లలో కనిపించినట్లు ఈ క్యాన్సర్ సోకగానే లక్షణాలు కనిపించవు. దీంతో చాలామందిలో ఇది సోకిన విషయం చివరి దశలో కానీ బయటపడదు. మూత్ర విసర్జనలో ఇబ్బంది అనిపిస్తే డాక్టర్లు ప్రొస్టేట్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. బయాప్సీ ద్వారా ఈ క్యాన్సర్‌ను నిర్ధారిస్తారు. రేడియోథెరపీ నిర్వహించడం, ఆపరేషన్‌తో కణుతులను తొలగించడం వంటి చికిత్సామార్గాలున్నాయి. అయితే వీటితో సైడ్ ఎఫెక్టులు ఎక్కువ. ఇండియాలో ఏడాదికి సుమారు లక్షకుపైగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 85 శాతం కేసులు 3, 4వ దశల్లో మాత్రమే గుర్తించడం జరుగుతోంది. ఇది సోకడానికి నిర్దిష్ఠ కారణాలు తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేనివారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం ద్వారా ఇది రాకుండా నివారించవచ్చు. – నేషనల్ డెస్క్,సాక్షి -
సెల్‌ఫోన్ స్వాబ్‌తో కరోనా నిర్ధారణ పరీక్షలు!
కరోనా నిర్ధారణ కోసం ఓ పుల్లలాంటి పరికరంతో ముక్కులోంచి స్వాబ్ సేకరించి, దాని సహాయంతో కరోనా ఉందని తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన ప్రక్రియ. అందుకే కరోనా నిర్ధారణను మరింత తేలికగా చేయడానికి పూనుకున్నారు ఇంగ్లండ్‌కు పరిశోధకులు. ఓ వ్యక్తి ఉపయోగించే సెల్‌ఫోన్ సహాయం తో తనకు కరోనా ఉందో లేదో తెలుసుకునే ప్రక్రియను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారు ఇంగ్లండ్‌కు చెందిన ’యూనివర్సిటీ కాలేజ్ లండన్’ శాస్త్రవేత్తలు. ప్రతి వ్యక్తీ తాను మొబైల్ మాట్లాడుతున్నప్పుడు వదిలే గాలి ఫోన్‌కు అంటుకుంటుంది. పుల్ల సహాయంతో సెల్‌ఫోన్‌ను రుద్దడం ద్వారా సేకరించిన స్వాబ్‌తో మరింత తేలిగ్గా... అంటే ముక్కులో పుల్లలు దూర్చి ఇబ్బంది పెట్టకుండానే కరోనా వైరస్ నిర్ధారణ చేయవచ్చునంటున్నారు. ఇది ర్యాపిడ్ టెస్ట్‌కు ఓ ప్రత్యామ్నాయంగా ఉండగలదని పేర్కొంటున్నారు. ఇలా ఫోన్ స్వాబ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసినప్పుడు అది దాదాపుగా 81%కి పైగా నమ్మకమైనదిగానూ చెబుతున్నారు. అంతేకాదు... ఈ ప్రక్రియతో వ్యాధి నిర్ధారణ కోసం ఖర్చు కేవలం 5 పౌండ్లకు మించదని, ఆర్థికంగానూ ఇది మరింత మంచి మార్గమని చెబుతున్నారు. ‘‘ముక్కునుంచి తీసుకునే చేసే (నేసల్ స్వాబ్) పరీక్షే కోవిడ్ నిర్ధారణకు ఓ గోల్డ్ స్టాండర్డ్. కానీ పెద్ద పెద్ద సమూహాల్లో త్వరగా నిర్ధారణ పరీక్షలు అవసరమైనప్పుడు మాస్ టెస్టింగ్ కోసం ఈ ‘ఫోన్ స్వాబ్’ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. ‘‘మనం ఫోన్లో మాట్లాడుతూ ఉండటం, అలాగే దాన్ని ముట్టుకోవడం వల్ల ఒకవేళ మనలో వైరస్ ఉంటే... వాటిని ఫోన్ స్వాబ్ ద్వారా సేకరించి పరీక్షించడం వల్ల నమ్మకమైన ఫలితాలే వస్తాయి. దాంతో అటు పరీక్షలకు అయ్యే ఖర్చులూ తగ్గుతాయి. ఫలితాలు వేగంగానూ వస్తాయి ’’ అంటున్నారు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ రోడ్రిగో యంగ్. ఇంకా చెప్పాలంటే చిలీలోని డయాగ్నోసిస్ బయోటెక్ అనే సంస్థ ఈ పరీక్షలను నిర్వహిస్తూ ఉండగా, దక్షిణ అమెరికాలోని కొన్ని స్కూళ్లలోనూ ఎక్కువ సంఖ్యలో పెద్ద పెద్ద సమూహాల్లో భారీగా పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పటికే వీటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారా..!
లండన్: పొగతాగడం (స్మోకింగ్) పలు వ్యాధులకు దారితీస్తుందని అందరికీ తెలిసిందే. జీర్ణాశయం వాపు లాంటి పలు సమస్యలు స్మోకింగ్ వల్ల ఎదురవుతాయి. పొగతాగడం బాగా అలవాటున్న వారికి ఈ వ్యసనాన్ని మానుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే స్మోకింగ్ చేసేవాళ్లు ప్రతిరోజు కొద్దిసేపు రన్నింగ్ చేస్తే ఆ అలవాటు నుంచి బయడపడే అవకాశం ఉందంటున్నారు లండన్ నిపుణులు. సెయింట్ జార్జ్ యూనివర్శిటీ ఆఫ్ లండన్‌కు చెందిన కొందరు రీసెర్చర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ అలెక్సిస్ బెయిలీ అనే రీసెర్చర్ తన బృందంతో స్మోకింగ్ పై చేసిన పరిశోధన ఫలితాలను బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీలో ప్రచురించారు. ప్రతిరోజు కొద్దిదూరం పరుగెడితే పొగతాగాలన్న ఆలోచన వారిలో తగ్గిపోతుందన్నారు. రీసెర్చర్ల బృందం కొన్ని ఎలుకలపై నికోటిన్ ను ప్రయోగించి చూశారు. ఆ ఎలుకలలో కొన్నింటిని పరుగెత్తించడం, వ్యాయామం చేయించడం లాంటి పనులు చేయించి చూడగా వాటిలో నికోటిన్ ప్రభావం చాలా మేరకు తగ్గినట్లు గుర్తించారు. మనుషుల్లో అయితే ఎక్కువ సమయం వ్యాయామం చేయడం లాంటి శారీరక శ్రమ కలిగించే పనుల కంటే కాసేపు పరుగెత్తే వారిలో నికోటిన్ ప్రభావం తగ్గి, ధూమపానానికి దూరంగా ఉండాలని స్మోకర్స్ భావిస్తారని లండన్ నిపుణుల బృందం వెల్లడించింది. -
టిమ్ నోబెల్!
జెండర్ సైన్స్ కొందరి మాటల్ని సరదాగా తీసుకోవాలి. కానీ సీరియస్‌గా డిస్కస్ చేయాలి. టిమ్ హంట్ పెద్ద మనిషి. వయసు 73 ఏళ్లు కాబట్టి పెద్ద మనిషి. నోబెల్ ప్రైజ్ విన్నర్ (2001) కాబట్టి పెద్ద మనిషి. తన కామెంట్స్‌కి ఆడవాళ్లు నొచ్చుకోవడంతో క్షమాపణ చెప్పాడు కాబట్టి పెద్ద మనిషి. అక్కడితో చేతులు దులిపేసుకోకుండా లండన్ యూనివర్సిటీలో తన ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు కాబట్టి పెద్ద మనిషి. గత ఏడాది జూన్ 8న సియోల్‌లో ఓ కాన్ఫరెన్స్‌లో ప్రసంగిస్తున్నారు టిమ్ హంట్. దేశదేశాల శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధులు శ్రద్ధగా వింటున్నారు. అలా వింటున్నవారిలో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్లంతా లేబరేటరీల్లో పెద్ద పెద్ద పరిశోధనా విధానాలను నేర్చుకుంటున్న చిన్న చిన్న అమ్మాయిలు. టిమ్‌కి వారిని చూసి ముచ్చటేసిందో లేక కఠినమైన తన స్పీచ్‌ని సరళంగా మార్చదలచుకున్నారో గానీ అకస్మాత్తుగా టాపిక్‌ని అమ్మాయిలపైకి తిప్పేశారు! ‘‘గాళ్స్‌తో ఉన్న ఇబ్బంది గురించి మీకిప్పుడు చెప్పాలి. వాళ్లు గనక ల్యాబ్‌లో ఉంటే మూడు పరిణామాలు సంభవిస్తాయి. మీరు వాళ్లతో ప్రేమలో పడిపోతారు. తర్వాత వాళ్లు మీతో ప్రేమలో పడతారు. ఆ తర్వాత వాళ్లను మీరు ఒక మాట అన్నప్పుడు వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు’’. ఒక్కసారిగా నవ్వులు. కానీ అక్కడికి సుమారు తొమ్మిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఆ మాటను తేలిగ్గా తీసుకోలేక పోయింది. టిమ్ అక్కడ ఆనరరీ ప్రొఫెసర్. అంత మాట అన్నాక ఇక ఆ వ్యక్తి... అతడెంత పెద్దవాడైనా... అక్కడ పని చేయడానికి లేదు. ఎందుకంటే... శాస్త్ర పరిశోధనా రంగంలో స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు కల్పించిన తొలి ఇంగ్లండ్ యూనివర్సిటీ అది. ఆ సంగతి టిమ్‌కి తెలుసు. అందుకే వెళ్లిపొమ్మని అనకుండానే, బయటికి వచ్చేశాడు. టిమ్ హంట్ మీద ట్వీట్ల దాడి మొదలైంది! టిమ్ కామెంట్లో ‘డిస్ట్రాక్టింగ్లీ సెక్సీ’ అని అర్థం వచ్చే భావం ఉంది. డిస్ట్రాక్టింగ్లీ సెక్సీ అంటే... ‘ధ్యాస మరల్చేంత మోహనంగా’ అని. దాన్ని పట్టుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా లేబరేటరీలలో పనిచేస్తున్న యంగ్ ఉమెన్ సైంటిస్టులంతా. వారిలో అన్ని రంగాల వాళ్లూ ఉన్నారు. ఆర్కియాలజిస్ట్‌లు, బయోకెమిస్టులు, మేథమెటీషియన్లు, కంప్యూటర్ కోడింగ్ నిపుణులు.. ఇంకా జియాలజిస్టులు. టిమ్‌పై ఒక్కొక్కరి విరుపులు ఒక్కోలా ఉన్నాయి. వాటన్నిటి అర్థం ఒక్కటే. ‘మా పనిలో మేము ఇష్టంగానో, చచ్చేచావుగానో నిమగ్నమై ఉంటే మీకు సెక్సీగా ఎలా కనిపిస్తున్నామయ్యా పెద్దమనిషీ!’ అని. ఇక్కడితో ఈ ఇష్యూ కట్ చేద్దాం. మగువలు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా మగవాళ్లకు అందంగానే కనిపి స్తారేమో! అది మగాళ్ల ప్రాబ్లం. టిమ్ హంట్‌ని కూడా ఆయన కర్మకు ఆయన్ని వదిలిపెట్టేయాలి.. ఉద్యోగం పోవడం కర్మ అని ఆయన అనుకున్నా, అనుకోకున్నా! ఒకందుకు మాత్రం టిమ్‌కు ప్రత్యేక ధన్యవాద సమర్పణ చేయాలి. ల్యాబుల్లో ఆడవాళ్లు డిస్టర్బ్ చేస్తారు అన్నాడు కానీ, ఆడవాళ్లు ల్యాబుల్లో ఉద్యోగాలకు పనికిరారు అనలేదు. ఫిజిక్స్‌లో ఈ ఏడాది నోబెల్ విజేతలుగా ఇద్దరు మగవాళ్ల పేర్లను నోబెల్ కమిటీ ప్రకటించగానే, గత 53 ఏళ్లలో ఒక్క మహిళా సైంటిస్టుకు కూడా ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్ రాలేదన్న పాయింట్‌ని ‘వాషింగ్టన్ పోస్ట్’ లేవనెత్తింది. నోబెల్ ప్రారంభం అయిన 1901 నుంచి 2015 వరకు మొత్తం 885 మంది వ్యక్తులకు, 26 సంస్థలకు నోబెల్ ప్రైజులు వచ్చాయి. అందులో మహిళలకు వచ్చినవి 49 ప్రైజులు మాత్రమే. మేరీ క్యూరీకి రెండుసార్లు నోబెల్ వచ్చింది కాబట్టి 48 మాత్రమే అనుకోవాలి. వీటిలోనూ ఎక్కువగా శాంతి ప్రైజులు, సాహిత్యం ప్రైజులే. స్త్రీల పట్ల వివక్ష అన్ని రంగాల్లో ఉన్నట్లే శాస్త్రరంగంలోనూ ఉంది. నోబెల్ ప్రైజు ఇవ్వలేదని వివక్ష అనడం కాదు. నోబెల్ వరకు వెళ్లే దారి పొడవున్నా ఉన్న వివక్ష గురించే ఇక్కడ మాట్లాడ్డం. టిమ్ హంట్ లాంటి వాళ్లు సరదాగా కామెంట్ చేసినా, అందులోని నిజాలను సీరియస్‌గా తీసుకుని మహిళా సైంటిస్టులను నిరుత్సాహపరిచే పరిస్థితులను ఎక్కడికక్కడ చక్కదిద్దితే నోబెల్‌కు నిండుదనం వస్తుంది. ఈ ఏడాది ఒక్క మహిళకూ నోబెల్ రాలేదు! వెరా రూబిన్‌కు కచ్చితంగా ఇచ్చి ఉండాల్సింది అని వాషింగ్టన్ పోస్ట్ అభిప్రాయపడింది. వెరా రూబిన్ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త. డార్క్ మేటర్ (కృష్ణ పదార్థం)కి ఆమె సాక్ష్యాధారాలను కనుగొన్న తొలి సైంటిస్ట్. వయసు 88 ఏళ్లు. ‘‘ఈ వయసులో ఆమెకు నోబెల్ ఇవ్వకపోతే ఇక ఎప్పటికీ ఇవ్వలేని పరిస్థితి రావచ్చు. ఎందుకంటే.. మరణానంతరం నోబెల్ ఇవ్వరు కదా’’ అని కూడా ఆ పత్రిక వ్యాఖ్యానించింది. మాధవ్ శింగరాజు