‘టైమెక్కడ ఉంది’ అని చీటికిమాటికి అంటే టైమ్ చిన్నబుచ్చుకుంటుందట. ‘టైమ్ నాతోనే ఉంటుంది’ అనుకుంటే బలాన్ని ఇస్తుందట. సినీ నిర్మాత, ఇంటీరియర్ డిజైనర్, కాలమిస్ట్, పుస్తక రచయిత్రి, గృహిణిగా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్న ట్వింకిల్ ఖన్నా మరోసారి స్టూడెంట్‌గా మారబోతోంది.
‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ చేయడానికి రెడీ అవుతోంది...
‘అమ్మా, నీకు ట్వింకిల్ అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగింది నాలుగేళ్ల కూతురు.
‘నేను లిటిల్‌స్టార్‌ని కాబట్టి’ అని జవాబు చెప్పింది ట్వింకిల్.
ఇది విని కూతురు నవ్వేసింది.
ఇంట్లోనే కాదు పుస్తక ప్రపంచంలో కూడా నవ్వుల వెన్నెల కురిపిస్తుంది ట్వింకిల్‌ఖన్నా. కథానాయికగా మాత్రమే కాదు కాలమిస్ట్, పుస్తక రచయిత్రిగా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ట్వింకిల్ రాసిన ‘మిసెస్ ఫన్నీబోన్స్’ పుస్తకం బెస్ట్ సెల్లర్ చార్ట్‌లో నెంబర్‌వన్‌గా నిలిచింది.
‘అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న పుస్తకం ఇది’ అని ప్రశంసించారు పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఎడిటర్ ఇన్ చీఫ్ మిలీ ఐశ్వర్య.
మరో పుస్తకం ‘పైజామాస్ ఆర్ ఫర్‌గివింగ్’ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ‘హైయెస్ట్–సెల్లింగ్ ఫిమేల్ ఆథర్’ సింహాసనంలో తనను కూర్చోబెట్టింది.
నవ్వించడం ఎంత కష్టమో, నవ్వించడం ద్వారా వచ్చే కష్టాలు కూడా అంతే కష్టమని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది ట్వింకిల్‌కు. ‘నన్ను ఉద్దేశించే రాసింది’ అని ఎంతోమంది భుజాలు తడుముకునేవారు!
వినోదమాధ్యమాలు ఎన్ని పెరిగినప్పటికీ, ఇప్పటికీ పుస్తకాలు అంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం. మనసు బాగలేనప్పుడు, ఉత్సాహం కావాలనుకున్నప్పుడు ట్వింకిల్ పుస్తకప్రపంచంలోకి వెళుతుంది. ప్రతి పుస్తకం ఒక నేస్తం అవుతుంది.
తనలో కొత్త ఎనర్జీ, ఉత్సాహం వస్తాయి.
‘మహిళా రచయితలకు ఎదురయ్యే సవాలు ఏమిటి?’ అనే ప్రశ్నకు–
‘రచన గురించి ఆలోచించే క్రమంలో తనదైన ఊహాప్రపంచంలో, రకరకాల క్యారెక్టర్ల మధ్య ఉండాల్సి వస్తుంది. ఇదే సమయంలో వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఇంటిపనులు, పిల్లల బాధ్యత చూసుకోవాల్సి ఉంటుంది. రెండిటినీ సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు’ అంటుంది ట్వింకిల్.
రచయిత్రిగా ట్వింకిల్ ఖన్నాకు బోలెడు పేరు వచ్చింది. ఈ దశలో ‘నాకు రాయడం వచ్చేసింది. ఏమీ నేర్చుకోనక్కర్లేదు’ అనుకుంటారు చాలామంది. అయితే ట్వింకిల్ అలా అనుకోవడం లేదు.
‘నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంటుంది.
అందుకే క్రియేటివ్ రైటింగ్‌లో శిక్షణ పొందడానికి ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లోకి స్టూడెంట్‌గా అడుగుపెట్టబోతుంది.
‘మరోసారి స్టూడెంట్‌గా మారుతున్నందుకు సంతోషంగా ఉంది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను. చిన్నప్పటిలాగే శ్రద్ధగా క్లాసులు వినబోతున్నాను. నోట్స్ రాసుకోబోతున్నాను’ అంటూ అభిమానులతో తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ట్వింకిల్.
దీంతోపాటు హుషారెత్తించే, ఉత్సాహంతో జంప్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
నిజానికి ఆ వీడియోలో ట్వింకిల్‌ఖన్నా కనిపించడం లేదు. చదువు దాహంతో ఉన్న ఒక సిన్సియర్ స్టూడెంట్ కనిపిస్తుంది.
‘నేర్చుకోవాలనే తపన మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తుంది!
అదర్ సైడ్: స్టూడెంట్ నంబర్‌వన్
Published Fri, Sep 23 2022 12:41 AM | Last Updated on Fri, Sep 23 2022 12:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment