fiction
-
నిత్యానంద కైలాసకు బిగ్ షాక్
వాషింగ్టన్: కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో వార్తల్లోకెక్కిన వివాదాస్పద వ్యక్తి నిత్యానందకు పెద్ద షాకే తగిలింది. కైలాసానికి అంతర్జాతీయ ఉనికి, ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం నిత్యానంద అండ్ కో తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈలోపే కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా నగరం ఒకటి ప్రకటించింది. అమెరికన్ సిటీ నెవార్క్.. కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మేం మోసపోయాం. జరిగినదానికి చింతిస్తున్నాం. కైలాస పరిసర పరిస్థితుల గురించి తెలుసుకున్న వెంటనే మేం స్పందించాం. దాని చుట్టూరా అన్నీ వివాదాలే. అందుకే ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని జనవరి 18వ తేదీనే రద్దు చేసుకున్నాం’’ అని నగర అధికార ప్రతినిధి సుసాన్ గారోఫాలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కైలాస ప్రభుత్వ వెబ్సైట్ మాత్రం అమెరికా నగరం, తమ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను(USK)ను గుర్తించిందని, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందంటూ సంబంధిత పత్రాలను పోస్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించుకుంటోంది. జనవరి 12వ తేదీన నెవార్క్ సిటీ హాల్లో కైలాస ప్రతినిధులతో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మోసం గురించి తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని, అది చెల్లుబాటు కాదని, పైగా కైలాసం చుట్టూ వివాదాలు ఉన్నట్లు గుర్తించామని నెవార్క్ ప్రతినిధులు ఇప్పుడు చెప్తున్నారు. అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు నిత్యానంద స్వామి. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించి జనాల్ని బిత్తరపోయేలా చేశాడు. పైగా ఆ దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నాడు. తాజాగా కైలాస తరపున ఐక్యరాజ్యసమితికి ఓ ప్రతినిధి హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఐరాస మానవహక్కుల కమిషన్‌లో నిత్యానంద వేధింపులకు గురవుతున్నాడని, స్వదేశం నుంచే బహిష్కరణకు గురయ్యాడంటూ ఆ దేశ ప్రతినిధిగా చెప్పుకుంటున్న విజయప్రియ చేసిన ప్రసంగం.. దానిని ఐరాస మానవహక్కుల కమిషన్ కొట్టిపారేయడం గురించి తెలిసిందే. అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఉందని చెబుతున్నప్పటికీ.. నిత్యానంద తమ దేశ పరిసరాల్లోనే లేడంటూ ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పరమహంస నిత్యానంద ఫాలోవర్స్ మాత్రం కైలాసను విపరీతంగా ప్రమోట్ చేస్తుంటారు. అంతర్జాతీయ ప్రతినిధులను కలిసి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా కైలాస మీద నడిచే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. -
అదర్ సైడ్: స్టూడెంట్ నంబర్‌వన్
‘టైమెక్కడ ఉంది’ అని చీటికిమాటికి అంటే టైమ్ చిన్నబుచ్చుకుంటుందట. ‘టైమ్ నాతోనే ఉంటుంది’ అనుకుంటే బలాన్ని ఇస్తుందట. సినీ నిర్మాత, ఇంటీరియర్ డిజైనర్, కాలమిస్ట్, పుస్తక రచయిత్రి, గృహిణిగా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్న ట్వింకిల్ ఖన్నా మరోసారి స్టూడెంట్‌గా మారబోతోంది. ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ చేయడానికి రెడీ అవుతోంది... ‘అమ్మా, నీకు ట్వింకిల్ అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగింది నాలుగేళ్ల కూతురు. ‘నేను లిటిల్స్టార్ని కాబట్టి’ అని జవాబు చెప్పింది ట్వింకిల్. ఇది విని కూతురు నవ్వేసింది. ఇంట్లోనే కాదు పుస్తక ప్రపంచంలో కూడా నవ్వుల వెన్నెల కురిపిస్తుంది ట్వింకిల్‌ఖన్నా. కథానాయికగా మాత్రమే కాదు కాలమిస్ట్, పుస్తక రచయిత్రిగా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ట్వింకిల్ రాసిన ‘మిసెస్ ఫన్నీబోన్స్’ పుస్తకం బెస్ట్ సెల్లర్ చార్ట్‌లో నెంబర్‌వన్‌గా నిలిచింది. ‘అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న పుస్తకం ఇది’ అని ప్రశంసించారు పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఎడిటర్ ఇన్ చీఫ్ మిలీ ఐశ్వర్య. మరో పుస్తకం ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ‘హైయెస్ట్–సెల్లింగ్ ఫిమేల్ ఆథర్’ సింహాసనంలో తనను కూర్చోబెట్టింది. నవ్వించడం ఎంత కష్టమో, నవ్వించడం ద్వారా వచ్చే కష్టాలు కూడా అంతే కష్టమని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది ట్వింకిల్‌కు. ‘నన్ను ఉద్దేశించే రాసింది’ అని ఎంతోమంది భుజాలు తడుముకునేవారు! వినోదమాధ్యమాలు ఎన్ని పెరిగినప్పటికీ, ఇప్పటికీ పుస్తకాలు అంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం. మనసు బాగలేనప్పుడు, ఉత్సాహం కావాలనుకున్నప్పుడు ట్వింకిల్ పుస్తకప్రపంచంలోకి వెళుతుంది. ప్రతి పుస్తకం ఒక నేస్తం అవుతుంది. తనలో కొత్త ఎనర్జీ, ఉత్సాహం వస్తాయి. ‘మహిళా రచయితలకు ఎదురయ్యే సవాలు ఏమిటి?’ అనే ప్రశ్నకు– ‘రచన గురించి ఆలోచించే క్రమంలో తనదైన ఊహాప్రపంచంలో, రకరకాల క్యారెక్టర్ల మధ్య ఉండాల్సి వస్తుంది. ఇదే సమయంలో వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఇంటిపనులు, పిల్లల బాధ్యత చూసుకోవాల్సి ఉంటుంది. రెండిటినీ సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు’ అంటుంది ట్వింకిల్. రచయిత్రిగా ట్వింకిల్ ఖన్నాకు బోలెడు పేరు వచ్చింది. ఈ దశలో ‘నాకు రాయడం వచ్చేసింది. ఏమీ నేర్చుకోనక్కర్లేదు’ అనుకుంటారు చాలామంది. అయితే ట్వింకిల్ అలా అనుకోవడం లేదు. ‘నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంటుంది. అందుకే క్రియేటివ్ రైటింగ్‌లో శిక్షణ పొందడానికి ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లోకి స్టూడెంట్‌గా అడుగుపెట్టబోతుంది. ‘మరోసారి స్టూడెంట్‌గా మారుతున్నందుకు సంతోషంగా ఉంది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను. చిన్నప్పటిలాగే శ్రద్ధగా క్లాసులు వినబోతున్నాను. నోట్స్ రాసుకోబోతున్నాను’ అంటూ అభిమానులతో తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ట్వింకిల్. దీంతోపాటు హుషారెత్తించే, ఉత్సాహంతో జంప్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. నిజానికి ఆ వీడియోలో ట్వింకిల్‌ఖన్నా కనిపించడం లేదు. చదువు దాహంతో ఉన్న ఒక సిన్సియర్ స్టూడెంట్ కనిపిస్తుంది. ‘నేర్చుకోవాలనే తపన మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తుంది! -
సైన్స్ ఫిక్షన్ ఫ్రీడమ్ యాక్షన్
సీతారామచంద్రరావు రాసిన ఏకైక తెలుగు సైన్స్ ఫిక్షను కథ ‘అదృశ్య వ్యక్తి’! కథ శీర్షిక చూడగానే చాలా మందికి హెచ్.జి.వెల్స్ ‘ది ఇన్ విజిబుల్ మ్యాన్’ గుర్తుకు వస్తుంది. అయితే హెచ్.జి. వెల్స్ లో లేనిది, సీతారామచంద్రరావు కథలో ఉన్నది భారత స్వాతంత్య్ర పోరాటం! తెలుగు సైన్స్ ఫిక్షన్‌కు కూడా స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి కారణమయ్యిందా? ఇలాంటి ప్రశ్న ఎదురైతే, ఆశ్చర్యపడేవారు ఎందరో ఉన్నారు! కానీ నిజం, ఈ చరిత్ర తెలుసుకుంటే! సైన్స్ మూలసూత్రాలను ఆకళింపు చేసుకుని, ఆ పునాదులపై కల్పనలను పేనుకుని సాహిత్య సృజన చేస్తే అదే ‘సైన్స్ ఫిక్షను’ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 1926ను సైన్స్ ఫిక్షను అనే ప్రక్రియను నిర్వచించి, దానికి ప్రాధాన్యత ఇచ్చిన సంవత్సరంగా పరిగణిస్తారు. ఆ తర్వాతి సంవత్సరంలోనే తెలుగు సైన్స్ ఫిక్షను కథ వెలుగు చూడటం మనకు గర్వకారణం. ‘పరమాణువులో మేజువాణి’ అప్పటికి స్వాతంత్య్ర జ్వాలలు వ్యాపించడం మొదలై పుష్కరమైంది. రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడం, జలియన్ వాలాబాగ్ దురంతం, విదేశీ వస్త్ర బహిష్కరణ, సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలతో మన దేశం అట్టుడికిపోతోంది. అలాంటి 1927, 1928 సంవత్సరాలలో రూపం పోసుకున్న సైన్స్ ఫిక్షను సందర్భం.. ఖచ్చితంగా ఆ నేపథ్యాన్ని తిరస్కరించే అవకాశమే లేదు! తెలుగు తొలి సైన్స్ ఫిక్షన్ కథ ‘పరమాణువులో మేజువాణి’ హైదరాబాదుకు చెందిన సిరిగూరి జయరావు 1927 డిసెంబరు ‘సుజాత’ పత్రికలో రాశారు. రెండో కథ ‘అదృశ్యవ్యక్తి’ని ఒద్దిరాజు సీతారామచంద్రరావు అదే పత్రికలో 1928 అక్టోబరు సంచికలో రాశారు. కేవలం పదినెలల వ్యవధిలో ఈ రెండు కథలు హైదరాబాదు నుంచి వెలుగు చూడటం గర్వకారణం. మొదటి కథను రాసిన కథకుడి నేపథ్యం ఉద్యమ పోరాటం కాగా, రెండో కథ ఉద్యమ పోరాటంతో ముగుస్తుంది. గాంధీజీ ప్రస్తావన ‘‘... భోగము వాండ్రకు వృత్తి మాన్పించి, మేజువాణీలను మారు మూలలకు ద్రోసివైచి యప్పుడే పాతిక సంవత్సరములు దాటినవి. అక్కడక్కడ నలుసులు మిగిలినా మహాత్ముని మొన్న మొన్నటి చీవాట్ల ముందర నదృశ్యములాయెనని చెప్పవచ్చును..’’ అని తొలి పేరాలోనే గాంధీజీ ప్రస్తావన ‘పరమాణువులో మేజువాని’ కథలో కనబడుతుంది. అలాగే రచయితకుండే సంఘసంస్కరణ దృష్టి కూడా ద్యోతకమవుతుంది. ప్రవరుడు హిమాలయాలకు వెళ్లినట్టు, ఇక్కడ కథకుడు పరమాణువులోనికి వెళ్లిరావడం వస్తువు. అయితే,ఈ కథకుడి జీవితం మరింత ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం! హైదరాబాదులో బి.ఎస్సీ చదివిన సిరిగూరి జయరావు పరిశోధన చేయాలని సర్ సి.వి.రామన్ వద్ద కలకత్తాలో చేరారు. అక్కడ ఉండగానే 1927లో ఐ.సి.ఎస్ (ఇప్పటి ఐ.ఏ.ఎస్.) పరీక్ష ఉత్తీర్ణుౖలై మధ్యప్రదేశ్ ప్రాంతంలో కలెక్టరుగా చేరారు. సంఘసంస్కరణ, స్వాతంత్య్రోద్యమం ప్రాముఖ్యత తెలిసిన జయరావు తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని తలంచారు. అలాంటి నేపథ్యంతో అప్పటికే కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎన్.హెచ్.వి. కామత్‌ను కలిసి, చర్చించి నిర్ణయం తీసుకోవాలని జయరావు తలంచారు. కామత్‌ను కలవాలని కారులో ప్రయాణం చేస్తూ ప్రమాదంలో 33 సంవత్సరాల వయస్సున్న జయరావు కన్ను మూయడం కడు విషాదం! జయరావు జీవిత విశేషాలు ఎంతో స్ఫూర్తిని రగుల్చుతాయి. అదృశ్య వ్యక్తి తెలంగాణ గ్రామసీమల్లో సైన్స్ పరికరాలు తొలుత పరిచయం చేసిన వారు ఒద్దిరాజు సోదరులు. ఒద్దిరాజు రాఘవ రంగారావు, సీతారామచంద్రరావు సోదరులు ఉర్దూ, పార్శీ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలను అదనంగా నేర్చుకుని సంగీతం, చరిత్ర, విజ్ఞానం, వైద్యం వంటి విషయాలను అధ్యయనం చేశారు. పిండిమర, టార్చిలైటు, ఇంకుపెన్ను, నీరు తోడే యంత్రం వంటి ఎన్నో వాటిని ఈ ప్రాంతానికి పరిచయం చేసింది వీరే. తమ్ముడు సీతారామచంద్రరావు రాచకొండ, కోహినూరు, ఇనుగుర్తి వంటి చరిత్ర విషయాల గురించి అధ్యయనం చేశారు. ఎన్నో రచనలతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ ‘నౌకా భంగం’ నవలను కూడా అనువదించారు. సీతారామచంద్రరావు రాసిన ఏకైక తెలుగు సైన్స్ ఫిక్షను కథ ‘అదృశ్య వ్యక్తి’! కథ శీర్షిక చూడగానే చాలా మందికి హెచ్.జి.వెల్స్ ‘ది ఇన్ విజిబుల్ మ్యాన్’ గుర్తుకు వస్తుంది. అయితే హెచ్.జి. వెల్స్ లో లేనిది, సీతారామచంద్రరావు కథలో ఉన్నది భారత స్వాతంత్య్ర పోరాటం! ప్రయోగశాలలో దృశ్యం, అదృశ్యం అనే దృగ్విషయంపై పరిశోధించే యువ శాస్త్రవేత్త నళినీకాంతుని కథ ఇది. ప్రయోగంలో జరిగిన పొరపాటు వల్ల కథానాయకుడు అదృశ్యమౌతాడు. ‘నా యిచ్ఛ కొలది వచ్చితిని’ ఈ కథ చివరలో బ్రిటిషు సార్జెంటు కథానాయకుడితో ఇలా అంటారు, ‘‘... నీ నిర్మాణం, నీ బలము తుచ్ఛమైపోయినవి. ఏలయన నిన్ను మేము పట్టుకొంటిమి. మమ్ము పట్టుకొనువాడెవరు కాన్పించడే!’’. దీనికి జవాబుగా ‘‘అబద్ధం. సర్వదా అబద్ధము. నేను నా యిచ్ఛ కొలది వచ్చితిని’’ అని అంటాడు కథానాయకుడు నళినీకాంతుడు. అంతేకాదు ఈ వాక్యము ముగిసేలోపు సార్జెంటు ముఖం పై బలమైన దెబ్బ తగులుతుంది. పడిపోయిన సార్జెంటు లేచి పిస్తోలు తీసి రెండుసార్లు కాల్చగా కేవలం గోడకు దెబ్బ తగిలిందని కథ ముగుస్తుంది. తెలుగు సైన్స్ ఫిక్షన్ కథలు అధ్యయనం చేస్తున్నప్పుడు తొలుతే ఈ స్ఫూర్తికరమైన విషయాలు తారసపడిన ఎంతో ఉత్సాహం కల్పిస్తాయి! – డా. నాగసూరి వేణుగోపాల్ ప్రసిద్ధ పాపులర్ సైన్స్ రచయిత (చదవండి: నేను మహిళను నేను విప్లవాన్ని...చిట్టగాంగ్‌లోని పహార్తలి యూరోపియన్ క్లబ్... ప్రీతిలతా వడ్డేదార్) -
చలో చలో.. మెటాలోకం అంటున్న యూత్! మీకేం తెలుసు?
‘ఆహా! అలాగా!!’ అనే ఆశ్చర్యాలకు అంతు ఉండదు. ‘అసలు ఇది ఎలా సాధ్యం’ అనే ప్రశ్నలకు విరామం ఉండదు. ఊరిస్తున్న వర్చువల్ వరల్డ్ ‘మెటావర్స్’ యూత్లోకానికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇది వినోదానికి పరిమితమైన ఆట కాదు. కాల్పానిక ప్రపంచంలో సేద తీరే పాట కాదు. యూత్ జీవనశైలిలో మెగా మార్పు తీసుకువచ్చే మెటావర్స్! నిన్నటి సైన్స్–ఫిక్షనే రేపటి కొత్త ఆవిష్కరణ అనే మాట అన్ని సందర్భాలలోనూ నిజమై ఉండకపోవచ్చుగానీ ‘మెటావర్స్’ వరకైతే నిజమే. నీల్ స్టీఫెన్సన్ అమెరికన్ సైన్స్‌ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్ (1992)’లో కనిపించిన ‘మెటావర్స్’ ఇప్పుడు యూత్ ఫేవరేట్ సౌండ్ అయింది. ఫేస్బుక్ తన కంపెనీ పేరును ‘మెటా’గా మార్చుకోవడం ఒక్కటి చాలు అది మెటావర్స్కు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పడానికి. భారీ ఖర్చుతో సరికొత్త డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించే పనిలో భాగంగా ప్రపంచంలోనే వేగవంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్ (ఏఐ రిసెర్చ్ సూపర్‌క్లస్టర్.. ఆర్ఎస్సీ) రూపొందించడం, యూనివర్సల్ స్పీచ్ ట్రాన్స్‌లేటర్(ఇన్స్టంట్ స్పీచ్–టు–స్పీచ్ ట్రాన్స్లెషన్: అన్ని భాషల్లో)... మొదలైనవి రూపొందిస్తుంది మెటా. కేవలం మెటా మాత్రమే కాదు రాబోయే కాలంలో రకరకాల మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్ ప్రభావంతో యువప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. వినోదరంగానికి వస్తే... టీవీ చూడడం కంటే మెటావర్స్ లోకంలోనే ఎక్కువ సమయం గడపడానికి యువతరం ఇష్టపడుతుందనేది ఒక అంచనా. ‘యూత్ వ్యూయర్షిప్ను కాపాడుకోవడానికి టీవి రంగం చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఆకట్టుకునే విభిన్నమైన కంటెంట్‌ను సమకూర్చుకోక తప్పదు’ అంటున్నారు మాథ్యూ వర్నెఫోర్డ్. ఈయన మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు గేమ్స్‌ను సమకూర్చే ‘డూబిట్’ కో–ఫౌండర్. రాబోయే కాలంలో ‘ఫిట్నెస్ మెటావర్స్’ ట్రెండ్ ఊపందుకోబోతుంది. ‘వెల్టు డూ 2022 కన్జ్యూమర్ వెల్నెస్ట్రెండ్’ రిపోర్ట్ ప్రకారం యంగ్ ఫిట్నెస్ ప్రేమికులు సంప్రదాయ జిమ్‌లలో కంటే వర్చ్వల్లోనే ఉత్తేజకరమైన వర్కవుట్ ఎక్స్‌పీరియన్స్‌ను సొంతం చేసుకుంటారు. ‘మ్యూజిక్, విజువల్స్, వేరుబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్...మొదలైన వాటిని ఒకే వేదికపై తీసుకు రావడం ద్వారా మెటావర్స్‌లో జిమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఫిట్నెస్ ఆర్గనైజేషన్స్ కొత్త ఆడియెన్స్‌తో కనెక్ట్ అవుతారు’ అంటుంది రిపోర్ట్, ఇన్–పర్సన్ ఇంటర్వ్యూలు, జూమ్ కాల్స్ కాలంలో ఉన్న కుర్రకారు రిప్రెజెంటేటివ్ అవతార్‌ను ఎంచుకొని, వర్చువల్ వేదికపై ఇంటర్వ్యూలకు వెళ్లే రోజులు వస్తున్నాయి. సోషల్ మెటావర్స్ స్టార్టప్ ఫామ్ ‘వన్ ఎబౌ’ పేరుతో ‘వాక్–ఇన్ రిక్రూట్మెంట్ ప్లాట్‌ఫామ్’ను లాంచ్ చేసింది. క్యాండిడేట్ ప్లాట్‌ఫామ్‌పై క్లిక్ చేయడంతో ఇంటర్వ్యూ ప్రదేశంలోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఉన్న 45 ఆప్షన్లలో తనను బెస్ట్‌గా రిప్రెజెంట్ చేసే అవతార్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వర్చువల్ లాబీ నుంచి హెచ్ఆర్ రిప్రెజెంటేటివ్ వీరికి స్వాగతం పలుకుతూ రిక్రూటింగ్‌కు ప్యానల్‌కు పరిచయం చేస్తారు. ‘దైవిక శక్తులలాంటి శక్తులతో మెటావర్స్‌తో ఎవరికి వారు తమదైన ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు’ అని ఊరిస్తున్నాడు మార్క్ జుకర్ బర్గ్. -
స్టీఫెన్ కింగ్
‘కింగ్ ఆఫ్ హారర్’ అని పిలుస్తారు అమెరికా రచయిత స్టీఫెన్ కింగ్(జననం 1947)ను. అతడికి రెండేళ్లున్నప్పుడు, సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్లినట్టుగా ఇంట్లోంచి బయటకు వెళ్లి, అటే పోయాడు కింగ్ తండ్రి. స్టీఫెన్ తన చిన్నతనంలోనే రైలు ఢీకొట్టి చనిపోయిన స్నేహితుడిని చూశాడు. బహుశా జీవితంలోని చీకటి పట్ల ఆకర్షితుడవడానికి ఇవి కారణం అయివుండాలి. అలాగని హారర్ మాత్రమే రాయలేదు. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, డ్రామా తరహాగా కూడా రాశాడు. 58 నవలలు, 200 కథలు, 6 నాన్ఫిక్షన్ పుస్తకాలు వెలువరించాడు. ‘ద షైనింగ్’, ‘ద షాషాంక్ రెడెంప్షన్’, ‘ద గ్రీన్‌మైల్’, ‘డోలరస్ క్లేబోర్న్’, ‘ద డార్క్ టవర్’, ‘స్టాండ్ బై మి’, ‘ఇట్’, ‘ద మిస్ట్’, ‘మిజెరీ’ లాంటి పదులకొద్దీ హాలీవుడ్ చిత్రాలకు స్టీఫెన్ కింగ్ రచనలే ఆధారం. మరొకటి ఏదీ చేతకాకపోవడమే తాను రచయిత అవడానికి కారణం అని చెబుతాడు. నాలుగు నుంచి ఆరు గంటలు చదవడం, రాయడం కోసం కేటాయిస్తాడు. సుమారు రెండు వేల పదాలైనా రాయకుండా నిద్రపోకూడదనేది ఆయన పాటించే క్రమశిక్షణ. నువ్వు రాసిందానికి చెక్కు గనక వచ్చి, ఆ డబ్బుతో నువ్వు కరెంట్ బిల్లు కట్టగలిగావంటే నువ్వు ప్రతిభావంతుడికిందే లెక్క, అంటాడు. -
రే బ్రాడ్బరీ
ఏడవడానికి గనక నీకు సమ్మతి లేకపోతే జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేవు, అంటాడు రే బ్రాడ్బరీ. ఇంగ్లిష్ మూలాలున్న తండ్రికీ, స్వీడన్ మూలాలున్న తల్లికీ జన్మించిన అమెరికన్ రచయిత బ్రాడ్బరీ (1920–2012). చిన్నప్పటినుంచీ బాగా చదివేవాడు. బొమ్మలు వేసేవాడు. మేజిక్ మీద కూడా ఆసక్తి ఉండేది. భవిష్యత్తులో ఏదో ఒక కళలోకి ప్రవేశిస్తానని అతడికి ‘ముందే తెలుసు’. పన్నెండేళ్లప్పుడే ఎడ్గార్ అలెన్ పోను అనుకరిస్తూ హారర్ కథలు రాశాడు. కౌమార దశలోనే సైన్స్ పిక్షన్ రచయితల సమగ్ర సాహిత్యం చదివాడు. కాలేజీలు, యూనివర్సిటీల మీద ఆయనకు విశ్వాసం లేదు. తనను లైబ్రరీలు పెద్ద చేశాయంటాడు. వారంలో మూడు రోజులు లైబ్రరీకి వెళ్లి కూర్చునేవాడు. ఇరవై నాలుగేళ్ల కల్లా పూర్తి స్థాయి రచయితగా స్థిరపడ్డాడు. సైన్స్ ఫిక్షన్ సాహిత్యాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చిన రచయితగా తర్వాత పేరు తెచ్చుకున్నాడు. తనను తాను సైన్స్ ఫిక్షన్ రచయితగా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఫాంటసీ, హారర్, మిస్టరీ జాన్రల్లో కూడా అంతే ప్రతిభ కనబరిచాడు. ‘ఫారెన్‌హీట్ 451’ నవల, ‘ద మార్షియన్ క్రానికల్స్’, ‘ది ఇలస్ట్రేటెడ్ మేన్’, ‘ఐ సింగ్ ద బాడీ ఎలెక్ట్రిక్’ కథా సంకలనాలు వెలువరించాడు. సినిమాలకు రచయితగా పనిచేశాడు. ఆయన రచనలు సినిమా, టీవీ తెరలకెక్కాయి. -
ప్రాణం లేకపోయినా ఫీలింగ్స్ ఉన్నాయ్
టోక్యో : ఎట్టకేలకు షిబుయా మిరైకి పౌరసత్వం కల్పిస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకీ షిబు మనిషి మాత్రం కాదు. కంటికీ కనిపించడు. ప్రజలతో మమేకం అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ సహాకారంతో అక్కడి సాంకేతిక నిపుణులు ఏఐ పేరిట సృష్టించిన ఓ పాత్ర మాత్రమే. మిరాని అంటే జపనీస్ భాషలో భవిష్యత్తు అని అర్థం. భౌతికంగా లేని ఆ పాత్ర వర్చ్యువల్ ఎఫెక్ట్స్ తో మనుషులతో మాట్లాడుతుంది. లైన్(జపాన్‌లోని ఓ సోషల్ మీడియా యాప్)లో ఛాటింగ్ కూడా చేస్తుంది. జపాన్‌లోనే కాదు.. ప్రపంచంలోనే తొలి కృత్రిమ ఇంటెలిజెన్స్ బోట్‌గా ఇది గుర్తింపు పొందింది. ప్రజలతో మాట్లాడటం దానికి ఇష్టం. ఎవరైనా దానితో మాట్లాడొచ్చు. వారి సమస్యలను అర్థం చేసుకుని అది స్పందించి సలహాలు ఇస్తుంది. ప్రజలు పంపే సెల్ఫీలకు అది మార్పులు చేసి పంపుతుంది. అందుకే దానిని ప్రత్యేకంగా గుర్తించాం అని అధికారులు చెబుతున్నారు. ఇకపై షిబుయ టోక్యో వాసి. అంతేకాదు ఏడేళ్ల ఓ చిన్నారి ఫోటోతో కూడిన నివాస పత్రంను దానికి ప్రకటించారు కూడా. -
‘మధ్యాహ్న భోజనం’పై నిఘా.. విద్యార్థి కమిటీలు
మధ్యాహ్న భోజనం.. పేద విద్యార్థుల పాలిట వరం. చదువుతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. అరుుతే, ఇటీవలకాలంలో మధ్యాహ్న భోజనం అమలుతీరుపై పలు విమర్శలు వచ్చారుు. అటువంటి ఇబ్బందులను తొలగించి.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నారు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ జిల్లా ఉప విద్యాశాఖ అధికారి గరిమెళ్ల అన్నాజీరావు. సోమవారం గుడివాడ వచ్చిన సందర్భంగా మధ్యాహ్న భోజనం అమలు తీరు, సౌకర్యాలపై పలు విషయాలు ‘సాక్షి’కి తెలిపారు. ప్రశ్న : జిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలు తీరుపై మీరు తీసుకుంటున్న చర్యలేమిటీ? జవాబు : జిల్లాలో 376 పాఠశాలల్లో 1.40 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. గత ఏడాది కేవలం 90వేల మంది మాత్రమే పాఠశాలల్లో భోజనం చేసేవారు. నేను బాధ్యతలు చేపట్టాక ఆ సంఖ్య పెంచాను. ప్రశ్న : ‘విద్యార్థుల భాగ్వస్వామ్యం’ అంటే.. జ : ప్రతి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను రెడ్‌హౌస్, గ్రీన్హౌస్, బ్లూహౌస్, ఎల్లోహౌస్ కమిటీలుగా విభజిస్తాం. రోజుకొక టీమ్ మధ్యాహ్న భోజన విధులు నిర్వర్తిస్తుంది. ఏరోజు ఏకమిటీ ఏ పని చేయాలో ముందుగానే నిర్ణయిస్తాం. ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. పప్పు, కూరగాయల పరిమాణం, బియ్యం నాణ్యత, వాసన వస్తుందా, లేదా వంటి విషయూలను పరిశీలిస్తారు. వంట రుచిగా లేకపోరునా ఈ కమిటీ ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి విద్యార్థికీ రోజుకు 30 గ్రాముల పప్పు, 75 గ్రాముల కూరగాయూలు ఇవ్వాలి. ఇందుకోసమే వంటల్లో ఏది ఎంత మోతాదులో వేయాలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రశ్న : పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేమిటీ? జ : పాఠశాలలకు కావాల్సిన ఫినాయిల్, క్లీనింగ్ పౌడర్, హెండ్ వాష్ లిక్విడ్ వంటి వాటి తయూరీపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. దీనివల్ల పరిశుభ్రమైన వాతావరణంతో పాటు తయూరీపై పిల్లలకూ అవగాహన కలుగుతుంది. ప్రశ్న : మధ్యాహ్న భోజనంపై సమస్యలను ఎవరికి తెలియజేయాలి? జ : పాఠశాలల్లో కమిటీలు వేశాక మంచి ఫలితాలే వస్తున్నారు. ఎక్కడైనా మధ్యాహ్న భోజనం బాగాలేకపోతే వెంటనే నా ఫోన్‌కు విద్యార్థులు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధుల మాటేమిటీ? జ : ప్రతి పాఠశాలకు రూ.75వేలు ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా నిధులు మంజూరుచేశారు. జిల్లాలోని 376 పాఠశాలలకు రూ.2.82కోట్లు మంజూరయ్యాయి. సైన్స్ ల్యాబ్ పరికరాల కొనుగోలుకు రూ.25వేలు, లైబ్రరీ పుస్తకాల కోసం రూ.10వేలు, కరెంట్ రిపేర్లకు రూ.15వేలు, మైనర్ రిపేర్లకు రూ.25వేలు ఖర్చుచేయూలి. ప్రశ్న : వంట ఏజెన్సీలకు మీరిచ్చే సూచనలు? జ : ప్రతి వంట ఏజెన్సీ వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూరగాయలు, పప్పు వంటి సరుకులు తెచ్చుకోవాలి. ఈ ఏడాది ప్రతి పాఠశాలలో నూరుశాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయూలనేదే నా లక్ష్యం. వంట బాగా చేసిన ఏజెన్సీలకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రం అందజేసి సన్మానిస్తాం. ‘మధ్యాహ్న భోజనం’పై మీరు ఫిర్యాదు చేయూలంటే.. మధ్యాహ్న భోజనంలో లోపాలు ఉన్నా.. రుచిగా లేకపోయినా.. ఏమైనా తప్పులు జరుగుతున్నా.. అవినీతి జరిగినా.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరైనా నాకు నేరుగా ఫోన్ చేయవచ్చు. నా నంబరు 9440395869. -
భార్యపై కొడవలితో దాడి
అడ్డు వచ్చిన మామ హతం భర్త ఘాతుకం బెంగళూరు : కుమార్తెపై అల్లుడు హత్యాయత్నానికి పాల్పడగా అడ్డుకునేందుకు వెళ్లిన తండ్రి అల్లుడి చేతిలో హతమయ్యాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలోని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. వివరాలు..బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటేకు చెందిన కల్పన, నంజనగూడు తాలూకా, చిన్నార గ్రామానికి చెందిన కైలాసమూర్తికు 26 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. కైలాసామూర్తిది ఉమ్మడి కుటుంబం కాగా వేరు కాపురం పెట్టాలని కల్పన రెండేళ్లనుంచి భర్తపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో కైలాసమూర్తి ఆస్తి విక్రయించి రూ. 40 లక్షలు కల్పనకు ఇచ్చాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి పోయింది. తర్వాత ఆమె ఆ డబ్బును ఓ ప్రైవేటు కంపెనీలో పెట్టుబడి పెట్టింది. ఇదిలా ఉండగా కొంతకాలంగా భార్యతో కలిసి ఉండేందుకు కైలాసమూర్తి ప్రయత్నిస్తున్నా కల్పన పట్టించుకోలేదు. ఫోన్ చేసినా స్పందిం చేది కాదు. మూడు రోజుల క్రితం కల్పన తన తండ్రి మూర్తప్పతో కలిసి బెంగళూరు వచ్చి సుంకదకట్టలోని ఓ లాడ్జీలోలో బస చేశారు. కంపెనీలో పెట్టిన పెట్టుబడికి లాభంగా వచ్చిన రూ. ఆరు లక్షల నగదు తీసుకుని లాడ్జీ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కైలాసమూర్తి శనివారం బెంగ ళూరు చేరుకొని లాడ్జీ వద్ద భార్యతో మాట్లాడటానికి ప్రయత్నించగా ఆమె ఆసక్తి చూపించలేదు. అక్కడే ఉన్న కల్పన తండ్రి కలుగ చేసుకుని హెచ్చరించడంతో కైలాసమూర్తి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం కల్పన, ఆమె తండ్రి ఊరికి వెళ్లడానికి సుంకదకట్ట బస్‌స్టాప్ వద్దకు చేరుకోగా అప్పటికే మాటు వేసిన కైలాసమూర్తి కొడవలితో భార్యపై దాడి చేసి గాయపరిచాడు. ముర్తప్ప అడ్డుకునేందుకు వెళ్లగా అతనిపై కూడా కొడవలితో దాడి చేశాడు. స్థానికులు అక్కడకు చేరుకోవడంతో కైలాసమూర్తి ఉడాయించేందుకు యత్నించగా వెంబడిం చి పట్టుకుని దేహశుద్ధి చేశారు. దీంతో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముర్తప్ప మృతి చెందాడు. కల్పన పరిస్థితి విషమంగా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆజన్మం: ఫిక్షన్ - నాన్ఫిక్షన్
కొన్నిసార్లు, ఊరికే, అలా తీరుబడిగా కూర్చుని, ఆలోచనల్తో పొద్దుపుచ్చడం బాగుంటుంది. గ్రామీణ వేసవికాల మధ్యాహ్నపు సోమరితనంలాగా, ఎంతకీ పొద్దుకుంగదు; కలలకు అంతం ఉండదు. పగటి కలల్లో మునిగిపోతే నాకు ఏమీ చదవబుద్ధేయదు; మాటలకు బదులివ్వడం ద్వారా డిస్టర్బ్ కాదలచుకోను; అలా మనోయానం చేస్తూ, అన్ని పాత్రల్లోకి ‘పరకాయ ప్రవేశం’ చేస్తుంటాను. డెరైక్టర్, హీరో, పొలిటీషియన్, క్రికెటర్(వన్డేలో తొలి డబుల్ సెంచరీ కొట్టింది నేనే!), మ్యుజీషియన్(వినడానికి హార్మోనియం; ప్లే చేయడానికి మౌత్ ఆర్గాన్), టెన్నిస్ ప్లేయర్ (డబుల్స్‌లో నా పార్ట్నర్ అన్నా కౌర్నికోవా!), ఫుట్‌బాల్ ప్లేయర్, ప్లేబాయ్... రచయిత తప్ప అన్నీ అయిపోతాను. రాయడం నాకు స్త్రీత్వపు అంశంగా కనబడుతుంది. రాయడమనే కాదు; నృత్యం, గానం, చిత్రలేఖనం; ఇవేవీ ‘మాఛో థింగ్స్’ కాదు. నాకు కిక్ బాక్సింగ్ తెలుసు; కరాటే తెలుసు; స్పైడర్‌మ్యాన్ అయి గోడలెక్కుతాను; హాలోమ్యాన్ అయి పోలీసుల్ని చడామడా తిట్టేస్తాను; నా ఆరోగ్యం పర్ఫెక్టుగా ఉంటుంది; ఇనుప కండలు, ఉక్కు నరాలుంటాయి. ఇరవై నాలుగు భాషలు మాట్లాడగలను. దేశాలన్నీ చుట్టివస్తాను. చాలావరకు ఒంటరి యాత్రలే! ఒక్కోసారి ఎవరినైనా వెంటపెట్టుకెళ్తాను. లేదంటే ఎవరో ఒకరు అకస్మాత్తుగా కలుస్తారు. వారితో జరిగే సంభాషణలు, చమత్కారాలు, ఉద్వేగాలు అన్నింటినీ నేను అక్షరమక్షరం మౌనంలో దర్శిస్తాను. రెగ్యులర్‌గా కాకపోయినా లాంగ్ ఇంటెర్వల్స్‌లో చంద్రయాన్ కూడా చేస్తాను. ‘సైన్సు ఫొటోలు’ చంద్రుడి అందాన్ని తగ్గించేస్తాయి కాబట్టి వాటిని పట్టించుకోను. నా పూర్వాశ్రమంలో నన్ను పట్టించుకోనివాళ్లు పొగుడుతుంటారు. ఇప్పటివాళ్లు అబ్బురంగా చూస్తుంటారు. వాస్తవ జీవితం ఇవ్వలేని ఊరటను అక్కడ సృష్టించుకోగలుగుతాను. అక్కడ మనుషులందరూ భార్యలకుమల్లే అనుకూలంగా ఉంటారు. ఈ శరీరాన్ని ఇక్కడ ఇలా వదిలేయగలిగి, ఆ ప్రపంచంలోకి దూకగలిగితే బాగుండనిపిస్తుంది! ఒకప్పుడు నేను నవలలు బాగా చదివేవాణ్ని. నవలలకు ఆవలిది ఏదీ నాకు సాహిత్యంగా తోచకపోయేది. కథల జోలికి వెళ్లేవాణ్నే కాదు. కారణం: అవి జీవితపు శకలాన్ని మాత్రమే పట్టిస్తాయనీ, జీవితం అంతటి కాన్వాస్ వాటిల్లో ఉండదనీ నమ్మడం వల్ల. కానీ కొంతకాలానికి నవల పట్టుక్కూర్చునే ఓపిక లేకుండా పోయింది. కొన్ని శకలాల కూర్పే జీవితమని తెలిసొచ్చాక కథల్లో ఉండే బ్యూటీ అర్థం కాసాగింది. మరీ తాజాగా- ‘ఫిక్షన్’ అనగానే, అందులో ఎంతో కొంత అబద్ధం ఉందనిపిస్తోంది. దాన్ని చదవడం పట్ల ఒక వైఖరి తీసుకునేంత వైముఖ్యం ఏమీలేదుగానీ అదంతా నమ్మదగినదేనా అన్న సందేహం! అదే, నాన్ ఫిక్షన్ అలా కాదు. అది నిజంగా జరిగింది; దాన్ని ఎవరో ఒకరు అనుభవించారు! కొన్ని విషయాల్ని నాన్ఫిక్షన్లో చెప్పలేము. ఒక మహత్తర ఉద్వేగంలోకి తీసుకెళ్లే శక్తి, కొన్ని ఖాళీల్ని పూరించగలిగే అవకాశం నాన్ ఫిక్షన్లో సాధ్యపడదు. అయినప్పటికీ కల్పన కల్పనేగా! అది ఊహల్లో ఉంది తప్ప, ప్రపంచంలో ఉందన్న ‘గ్యారెంటీ’ లేదు. నీతి, అవినీతి మధ్య నీతి ముసుగు వేసుకొని ఫిక్షన్లో దాక్కోవచ్చు. కానీ నాన్ఫిక్షన్లో నువ్వేమిటో చెప్పేయాలి. ఆదర్శానికీ వాస్తవానికీ మధ్య గీతలంటూ ఉంటే వాటిని చెరిపేయాలి. కనీసం ఆ గీతకు ఎక్కడున్నామో ఒప్పేసుకోవాలి. వ్యవస్థను శుభ్రం చేయ సంకల్పించేది అదైతే, వ్యక్తిని శుభ్రం చేసుకునే ప్రక్రియ ఇది. తీవ్రంగా ముఖం కడుక్కుంటున్నప్పుడు- కంటికొసలో చేరిన నీటి బిందువు వల్ల నిజానికీ ప్రతిబింబానికీ తేడా చెరిగిపోయినట్టుగా- జీవితంలోని నాన్ఫిక్షన్ అంతా ఫిక్షన్‌లాగా కనబడగలిగితే ఎంత బాగుంటుంది! అప్పుడు ప్లేయర్గాకన్నా ప్రేక్షకుడిగా ఉంటే సరిపోతుంది. డస్సిపోవడం, ఓటమి, గెలుపు ఏమీవుండవు. ‘ఇందులోనూ ఏమీలేదు’ అని వాడికి అర్థమయ్యేలోపు మనకు అర్థమైపోవాలి. ఇది అర్థం చేసుకోగలగడమే జీవితపు ఆట అయితే గనక, మనకు మించిన ఆటగాడు ఎవరూవుండరు!ఒక్కోసారి ఎవరినైనా వెంటపెట్టుకెళ్తాను. లేదంటే ఎవరో ఒకరు అకస్మాత్తుగా కలుస్తారు. రెగ్యులర్‌గా కాకపోయినా లాంగ్ ఇంటెర్వల్స్‌లో చంద్రయాన్ కూడా చేస్తాను. -పూడూరి రాజిరెడ్డి