స్టీఫెన్ కింగ్
‘కింగ్ ఆఫ్ హారర్’ అని పిలుస్తారు అమెరికా రచయిత స్టీఫెన్ కింగ్(జననం 1947)ను. అతడికి రెండేళ్లున్నప్పుడు, సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్లినట్టుగా ఇంట్లోంచి బయటకు వెళ్లి, అటే పోయాడు కింగ్ తండ్రి. స్టీఫెన్ తన చిన్నతనంలోనే రైలు ఢీకొట్టి చనిపోయిన స్నేహితుడిని చూశాడు. బహుశా జీవితంలోని చీకటి పట్ల ఆకర్షితుడవడానికి ఇవి కారణం అయివుండాలి. అలాగని హారర్ మాత్రమే రాయలేదు. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, డ్రామా తరహాగా కూడా రాశాడు. 58 నవలలు, 200 కథలు, 6 నాన్‌ఫిక్షన్ పుస్తకాలు వెలువరించాడు. ‘ద షైనింగ్’, ‘ద షాషాంక్ రెడెంప్షన్’, ‘ద గ్రీన్‌మైల్’, ‘డోలరస్ క్లేబోర్న్’, ‘ద డార్క్ టవర్’, ‘స్టాండ్ బై మి’, ‘ఇట్’, ‘ద మిస్ట్’, ‘మిజెరీ’ లాంటి పదులకొద్దీ హాలీవుడ్ చిత్రాలకు స్టీఫెన్ కింగ్ రచనలే ఆధారం. మరొకటి ఏదీ చేతకాకపోవడమే తాను రచయిత అవడానికి కారణం అని చెబుతాడు. నాలుగు నుంచి ఆరు గంటలు చదవడం, రాయడం కోసం కేటాయిస్తాడు. సుమారు రెండు వేల పదాలైనా రాయకుండా నిద్రపోకూడదనేది ఆయన పాటించే క్రమశిక్షణ. నువ్వు రాసిందానికి చెక్కు గనక వచ్చి, ఆ డబ్బుతో నువ్వు కరెంట్ బిల్లు కట్టగలిగావంటే నువ్వు ప్రతిభావంతుడికిందే లెక్క, అంటాడు.
Comments
Please login to add a commentAdd a comment