అతడు కింగ్, ఆమె క్వీన్..!
నీ వల్లే... నీ వల్లే...
స్టీఫెన్‌కింగ్... ఆంగ్లభాషను సుసంపన్నం చేసిన రచయితల్లో ఒకరు. ప్రధానంగా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలను బేస్ చేసుకొని సామాజికమైన అంశాల గురించి, మనుషుల మనస్తత్వాల గురించి అద్భుతమైన స్థాయి రచనలను ఆవిష్కరించిన రచయిత కింగ్. ఆయన రచనల్లో అద్భుతమైన స్ఫూర్తి ఉంటుందని అంటారు అభిమానులు. కింగ్ రచనల్లోనే కాదు, ఆయన జీవితంలో కూడా కావాల్సినంత స్ఫూర్తి ఉంది. భార్య తబితతో కలసి సాగిస్తున్న దాంపత్యంలో కూడా ఎంతో స్ఫూర్తి ఉంది. ఒక మగాడి ఔన్నత్యాన్ని ప్రపంచమంతా ప్రశ్నించినా అండగా నిలబడగలిగేది భార్య మాత్రమే అనే విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు కింగ్, తబితలు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన కింగ్... లాండ్రీ వ్యాన్‌లో పనిచేసేవాడు. కింగ్ సంపాదన చాలక తబిత కూలి పనులు చేసేది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కింగ్ రచనా వ్యాసంగాన్ని వదులుకోలేదు. కానీ పబ్లిషర్స్ నుంచి వచ్చే ప్రతిస్పందనలు నిరుత్సాహపరిచేవి.
అమెరికాలో నవలలకు మంచి క్రేజ్ ఉన్న ఆ రోజుల్లో కూడా ఏ ఒక్క పబ్లిషరూ కింగ్ రచనలను ప్రచురించడానికి ముందుకు రాలేదు. పబ్లిషర్స్ వెనక్కు పంపిన మ్యాన్యూస్క్రిప్ట్‌లను చూసి కింగ్ విసుగెత్తిపోయేవాడు. అలాంటప్పుడు అతడిని ఊరడించే బాధ్యతను తీసుకొంది తబిత. నవల తిరిగివచ్చినప్పుడల్లా భార్య అతడి పాలిట పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్ అయింది. ఒకసారి తిరిగి వచ్చిన నవలను రోడ్డు మీదున్న చెత్తకుండీ దగ్గర పడేశాడు కింగ్. తబిత తెల్లారాక చెత్తకుండీ దగ్గర ఉన్న నవలను తెచ్చి ‘పట్టు వదలవద్దని’ బోధించింది. ఆమె ఇచ్చిన ప్రేరణతో కింగ్ మళ్లీ కలం చేతబట్టాడు. ఈసారి పబ్లిషర్ నుంచి 50 వేల డాలర్ల చెక్ వచ్చింది! ఆ నవలే ‘కేరీ’. 1976లో పబ్లిష్ అయిన ఈ నవల సినిమాగా కోట్ల డాలర్లు వసూలు చేసింది. తబిత భర్తను రచయితగా తీర్చిదిద్దుకొంది. అతడిని ‘కింగ్’ గా నిలిపిన క్వీన్ ఆమె!
- జీవన్